సాక్షి, అమరావతి: పురుగు మందులు, రసాయనాలతో సేద్యం కారణంగా ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. పురుగు మందులు, రసాయనాల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి సేద్యంతో ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రంలో ఉద్యమ రూపంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. సామూహిక ప్రకృతి వ్యవసాయ నిర్వహణ ప్రాజెక్టు (ఏపీ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ నేచురల్ ఫామింగ్ – ఏపీసీఎన్‌ఎఫ్) కింద ఇప్పటికే రాష్ట్రంలో 3,730 పంచాయతీల్లో 4.78 లక్షల మంది రైతులు 5.06 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేపట్టారు. ప్రకృతి సాగుపై లోతైన పరిశోధనలు, పంటల సర్టిఫికేషన్‌కు వైఎస్సార్ జిల్లా పులివెందులలో అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తోంది. జర్మనీ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేస్తోన్న ఈ కేంద్రం కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్దమవుతోంది.
2031 నాటికి ప్రకృతి సేద్యంలో 60 లక్షల మంది రైతులు
రాష్ట్రంలో ప్రకృతి సాగు కోసం జర్మన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక చేయూతనిస్తోంది. 2031 నాటికి కనీసం 60 లక్షల మంది రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించడమే లక్ష్యంగా ఏపీసీఎన్‌ఎఫ్–కేఎఫ్‌డబ్ల్యూ (జర్మన్ బ్యాంకు) ప్రాజెక్టు కింద జర్మన్ ప్రభుత్వం రూ.785.90 కోట్లు (90 మిలియన్ యూరోలు) గ్రాంట్‌తో కూడిన ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 719 పంచాయతీల్లో ఐదేళ్ల (2020–25) పాటు అమలవుతుంది. తాజాగా విస్తృత స్థాయి పరిశోధనల కోసం ఇండో–జర్మన్ గ్లోబల్ సెంటర్ ఫర్ అగ్రోకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ (ఐజీజీసీఏఆర్‌ఎల్) ఏర్పాటుకు జర్మనీ ముందుకొచ్చింది.
ఇందుకోసం రూ.174 కోట్లు (20 మిలియన్ యూరోలు) గ్రాంట్ ఇస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘ప్రకృతి సాగు’పై పరిశోధనలకు ఏర్పాటవుతోన్న తొలి పరిశోధన కేంద్రం ఇదే. ఈ ప్రతిష్టాత్మక పరిశోధన కేంద్రానికి 60 ఎకరాల భూమితోపాటు భవనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. అంతర్జాతీయ స్థాయిలో కేఎఫ్‌డబ్ల్యూ, వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ సెంటర్ (ఐసీఆర్‌ఏఎఫ్), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ), అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (సీఐఆర్ ఏడీ), జీఐజెడ్‌లు భాగస్వాములవు తుండగా, కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు నీతి ఆయోగ్, భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్), రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యవసాయశాఖతో పాటు రైతుసాధికార సంస్థ, వ్యవసాయ వర్సిటీలు భాగస్వాములు కాబోతున్నాయి.
పరిశోధన కేంద్రం లక్ష్యాలు..
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తూ గ్రామీణ జీవనోపాధిని మెరుగుపర్చడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఇక్కడ శాస్త్రీయ పరిశోధనలు జరుగుతాయి. వాటి ఫలితాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాస్త్ర నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని పెంపొందిస్తారు. రానున్న ఐదేళ్లలో ఏపీతోపాటు దేశంలోని మరో ఐదు రాష్ట్రాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహించి, కనీసం 10 వేల మంది రైతులను శాస్త్రవేత్తలుగా మారుస్తారు. వెయ్యిమంది సాంకేతిక నిపుణులను తయారు చేయడం, లక్ష మందిని సర్టిఫైడ్ చాంపియన్ అభ్యాసకులుగా తీర్చిదిద్దడం ఈ కేంద్రం లక్ష్యాలు. పరిశోధనలను ఏప్రిల్‌లో ప్రారంభిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రపంచ దేశాలకు దిక్సూచిలా పరిశోధన కేంద్రం
మన రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సేద్యానికి ఆర్థిక చేయూతనిస్తోన్న జర్మనీ ప్రభుత్వం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. నవంబర్ నెలాఖరుకల్లా జర్మనీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు 2021–27 వరకు ఈ జర్మనీ సహకారమందిస్తుంది. ఇక్కడ జరిగే పరిశోధనలు ప్రకృతి సాగులో దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా దిక్సూచీగా మారనున్నాయి.
– టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ
Comments
Please login to add a commentAdd a comment