సేంద్రీయ ఆహారంతో కేన్సర్‌ ముప్పు తక్కువ! | Periodical research | Sakshi
Sakshi News home page

సేంద్రీయ ఆహారంతో కేన్సర్‌ ముప్పు తక్కువ!

Published Fri, Oct 26 2018 1:42 AM | Last Updated on Fri, Oct 26 2018 1:42 AM

Periodical research - Sakshi

సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే కేన్సర్‌ వచ్చే అవకాశాలు 25 శాతం వరకూ తగ్గుతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ అధ్యయనంలో దాదాపు 69 వేల మంది పాల్గొనగా.. నాన్‌ హాడ్జ్‌కిన్స్‌ లింఫోమా, మహిళల్లో రుత్రుస్రావం నిలిచిపోయిన తరువాత వచ్చే రొమ్ము కేన్సర్ల నిరోధానికి సేంద్రీయ ఆహారం ఒక మార్గమని తేల్చింది. మిగిలిన కేన్సర్ల విషయంలో దీని ప్రభావం లేదని కూడా స్పష్టం చేసింది. రసాయనిక పురుగుల మందుల అవశేషాలు ఆహారం ద్వారా శరీరంలోకి చేరకపోవడం కేన్సర్‌ నిరోధానికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తల అంచనా.

జీవనశైలి సంబంధిత ఇతర వ్యవహారాలనేవీ పరిగణలోకి తీసుకోకపోయినా.. అధ్యయనం జరిగింది ఐదేళ్ల పరిమిత కాలానిదైనప్పటికీ సేంద్రీయ ఆహారం ప్రాముఖ్యతను తెలిపేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని టాస్మానియా యూనివర్శిటీ శాస్త్రవేత్త రాజ్‌ ఈరీ తెలిపారు. అయితే ఈ అధ్యయనంపై కొంతమంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సేంద్రీయ ఆహారం పేరుతో సాధారణ కాయగూరలు, పండ్లు తినడం తగ్గిస్తారని ఫలితంగా అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే.. సేంద్రీయ ఆహారమన్న విషయాన్ని పట్టించుకోకుండా.. ఎక్కువ మొత్తంలో కాయగూరలు పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు.

ఆయుష్షు పెంచే కొత్త మందు...
వేర్వేరు వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్న మందులను కలిపి వాడటం ద్వారా సి.ఎలిగాన్స్‌ అనే సూక్ష్మజీవి జీవితకాలాన్ని రెట్టింపు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. మందుల ద్వారా ఇంత స్థాయిలో ఆయుష్షు పెంచడం ఇదే తొలిసారని అంచనా. మనుషుల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్టన్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాన్‌ గ్రూబర్‌ అంటున్నారు.

ఆయుష్షు పెంచేందుకు అవకాశమున్న అన్ని రకాల మందులను పరిశీలించిన తరువాత తాము యాంటీబయాటిక్‌ రిఫాంపిసిన్, రాపమైసిన్, మధుమేహానికి వాడే మెట్‌ఫార్మిన్‌లతోపాటు ఇంకో రెండు మందులపై పరిశోధనలు చేశామని చివరకు రిఫాంపిసిన్, రాపమైసిన్, అలటోనిన్‌లను సి.ఎలిగాన్స్‌పై ప్రయోగించామని వివరించారు. దీంతో సాధారణంగా ఇరవై రోజులపాటు బతికే సి.ఎలిగాన్స్‌ రెట్టింపు కాలం జీవించాయని తెలిపారు.

ప్రస్తుతానికి ఈ పరిశోధనలు ప్రాథమిక దశలో ఉన్నట్టే లెక్క అని.. ఈ మందుల కలయిక ఎలా పనిచేస్తుందో తెలుసుకున్న తరువాత మరిన్ని పరిశోధనలు చేస్తేగానీ వాటిని విస్తత వాడకానికి తేలేమని జాన్‌ వివరించారు. అంతేకాకుండా... ఆయుష్షు పెంచేందుకు మాత్రమే కాకుండా.. వయసుతోపాటు వచ్చే సమస్యలను నిలవరించేందుకు కూడా ఈ ప్రయోగాలను ఉపయోగించుకోవచ్చునని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement