ప్రాణాంతక కేన్సర్ వ్యాధికి అందబాటులో ఉన్న చికిత్సల్లో కీమోథెరపీ ఒకటి. అయితే ఇది అందరిపై ఒకేలా ప్రభావం చూపదు. దీనికి కారణమేమిటా? అని సాల్క్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేయగా ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా కీమోథెరపీ ప్రభావం నుంచి కణాలను రక్షిస్తున్నట్లు ఈ పరిశోధనల ద్వారా తెలిసింది. కణాలు ఒత్తిడికి గురైనప్పుడు, వైరస్, బ్యాక్టీరియాల దాడికి లేదా రసాయనాల దాడికి గురైనప్పుడు మైటోకాండ్రియా స్పందిస్తుందని, ఎంటీడీఎన్‌ఏ పోగులను విడుదల చేసి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షాడెల్ తెలిపారు.
ఆ వెంటనే కొన్ని జన్యువులు రంగంలోకి దిగుతాయని కణ కేంద్రకం లోపల ఉన్న డీఎన్‌ఏకు రక్షణగా నిలుస్తాయని వివరించారు. దురదష్టవశాత్తూ ఈ ప్రక్రియ కేన్సర్ కణాలకూ వర్తిస్తూండటంతో కీమోథెరపీ పనిచేయకుండా పోతోందని చెప్పారు. ఎలుకలపై తాము జరిపిన ప్రయోగాల్లోనూ ఈ విషయం రుజువైందని అన్నారు. కీమో చికిత్స సమయంలో మైటోకాండ్రియల్ డీఎన్‌ఏ విడుదలను అడ్డుకుంటే చికిత్స సామర్థ్యాన్ని పెంచేందుకు అవకాశముంటుందని షాడెల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment