సేంద్రియ సేద్యంలో ఎకరానికి రూ. 30 వేలు
కర్ణాటక రాష్ట్రంలో సేంద్రియ సేద్యానికి పట్టుగొమ్మ అయిన బెర్మ గౌడ ఇటీవల అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పాతికేళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్న ఆయన భారతీయ సేంద్రియ రైతుల సంఘానికి రెండు దఫాలు అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2007లో ప్రతిష్టాత్మక రాజ్యోత్సవ పురస్కారంతో సత్కరించింది. ‘ధరిత్రి’ పేరిట సేంద్రియ రైతులతో ట్రస్టును ఏర్పాటు చేశారు. ట్రస్టు సభ్యులు పండించిన సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు విలువను జోడించడం.. సమంజసమైన ధరకు నేరుగా వినియోగదారులకుఅందించడంలో బెర్మ గౌడ విశేష కృషి చేశారు.
సేంద్రియ ఆహారం సామాన్యులకూ అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రెండు నెలల క్రితం చిరుధాన్యాలపై హైదరాబాద్‌లో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహించిన జాతీయ సదస్సులో బెర్మ గౌడ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ‘సాక్షి’తో తన సేద్యంపై కొద్దిసేపు సంభాషించారు. ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లోనే..
నా స్వగ్రామం కర్ణాటకలోని గదక్ జిల్లాలోని యలవర్తి. నాకు 8 ఎకరాల పొలం ఉంది. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. నీటి వసతి లేదు. సేద్యం అంతా వర్షాధారమే. కరువు ప్రాంతం. భూగర్భ జలం అంతా ఉప్పు మయం.
బోర్లు వేయలేదు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, పత్తి, మిరప, కూరగాయలు తదితర పంటలు పండిస్తాం. ప్రధాన పంటలతో పాటు కలిసి పెరిగే అంతర పంటలు సాగు చేయడం మాకు అలవాటు. దేశీ వంగడాలే వాడుతున్నాం. మా ప్రాంతంలో రసాయనిక ఎరువులు వాడే రైతులు కూడా అంతరపంటలు వేస్తుంటారు. జయధర్ అనే దేశీ పత్తి (దీనికి కొమ్మలు పెద్దగా రావు. నిటారుగా పెరుగుతుంది..)తోపాటు దేశీ బాడిగ మిరప వంగడం సాగు చేస్తున్నా.
శనగతోపాటు జొన్న, కందితోపాటు కొర్రలు, సజ్జలు.. ఇలా పొలంలో ఎక్కడ చూసినా కొన్ని పంటలు కలిపి పండించడం మా అలవాటు. 28 ఏళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నా. అయినా, సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకోలేదు. నమ్మకమే ముఖ్యం. ముంబైలోని సేంద్రియ దుకాణదారులకు 20 ఏళ్లుగా వ్యవసాయోత్పత్తులు సరఫరా చేస్తున్నా. నా దగ్గర రెండు వేరుశనగ వంగడాలున్నాయి. నిటారుగా పెరిగేది ఒకటి (ఎరెక్ట్ వెరైటీ. మూడున్నర నెలల్లో ఎకరానికి 4-6 క్వింటాళ్ల సేంద్రియ దిగుబడినిస్తుంది. దీనిలో కొర్ర, రాగులు, జీలకర్ర, ధనియాలు అంతరపంటలుగా వేస్తాం), చుట్టూ అల్లుకున్నట్లు పెరిగేది మరొకటి (స్ప్రెడింగ్ వెరైటీ. 5 నెలల పంట.
ఎకరానికి 6-7 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. దీంట్లో అంతరపంటల సాగు సాధ్యం కాదు. జీలకర్ర మొక్కలను గట్ల వెంట వేస్తాం). సేంద్రియ పొలాల్లోని పంటల జీవవవైవిధ్యం చీడపీడల బెడద 75% తగ్గుతుంది. కషాయాల పిచికారీ అవసరం కూడా లేదు. మా జిల్లాలోని 110 మంది సేంద్రియ రైతులతో ధరిత్రి అనే పేరుతో 1988లో ట్రస్టును ఏర్పాటు చేసుకున్నాం. పండించిన పంటలకు ఈ ట్రస్టు ద్వారా విలువను జోడించి.. వేరుశనగ నూనె, కందిపప్పు.. తదితర ఉత్పత్తులను స్థానిక ప్రజలతోపాటు ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో దుకాణదారులకు అమ్ముతున్నాం.
ఎకరానికి రూ. 25 వేల నుంచి 30 వేల వరకు నికరాదాయం పొందుతున్నాం. సంపన్నులకే కాకుండా పేదలకు కూడా సేంద్రియ ఆహారం అందించాలన్నది మా లక్ష్యం. అయితే, మా పంటను వినియోగదారుడికి చేర్చడానికి చాలా ఖర్చు చేయాల్సిరావటం పెద్ద అవరోధంగా మారింది. మా ట్రస్టులో సేంద్రియ రైతులకు అప్పుల బాధా లేదు.. ఆత్మహత్యలు అసలే లేవు.