విజయవాడ ఏలూరు లాకుల వద్ద బిర్యానీ తింటున్న యువకులు
సాక్షి, విజయవాడ: విజయవాడ నగర యువత, చిన్నారులు బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. బిర్యానీతోపాటు, నాన్‌వెజ్ వంటకాలను తరచూ లాగించేస్తున్నారు. ఆహారంలో నూనె, కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో చిన్న వయసులోనూ ఊబకాయులుగా మారి అనారోగ్యం పాలవుతున్నారు. మరోవైపు మధ్య వయస్సు, వృద్ధులు సంప్రదాయ, ఆర్గానిక్ ఆహారానికి మళ్లుతున్నారు. దీంతో నగరంలో ఆర్గానిక్ స్టాళ్లు వెలుస్తున్నాయి.
నగరంలో బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిర్యానీ పాయింట్లు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నాయి. కాలు బయట పెట్టకుండా జుమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ సర్వీసుల ద్వారా ఇంటి వద్దకే వేడివేడిగా బిర్యానీ వచ్చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్న ఆహారంలో 90 శాతం నాన్ వెజ్ వంటకాలే ఉంటున్నాయి. ఇళ్లలో సైతం నూడిల్స్, బర్గర్లు వంటి వంటలను తయారు చేసుకుని లాగించేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం యువత, చిన్నారుల్లో ఊబకాయానికి దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చదవండి: కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు సన్మానం
విజయవాడ గాయత్రి నగర్‌లో ఏర్పాటైన ఆర్గానిక్ స్టోర్
ఒబెసిటీతో ప్రమాదం
ఇటీవల 26 ఏళ్ల యువకుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆస్పత్రిలో చేరాడు. ఊబకాయం వల్ల మెటబాలిజం దెబ్బతిని, నియంత్రణ లేని మధుమేహం, అధికరక్తపోటు కారణంగా అతను బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నప్పటి నుంచి అధిక కార్బోహైడ్రేడ్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా చాలా మంది ఊబకాయంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నవయస్సులో ఒబెసిటీ ఉన్న వారిలో మధ్య వయస్సు వచ్చేసరికి మధుమేహం, రక్తపోటు, డైస్టిపీడెమియా వంటి వ్యాధులబారిన పడే అవకాశం ఉంది. బిర్యానీలు అధికంగా లాగించే వారిలో 90 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఒబెసిటీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో కొల్రస్టాల్ గడ్డలు ఏర్పడి బ్రెయిన్‌స్ట్రోక్, హార్ట్ ఎటాక్ కూడా రావచ్చునని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
చదవండి: పుట్టింటి నుంచి అత్తింటి సారె తీసుకెళ్తూ..
ఇలా చేస్తే మేలు
విద్యార్థులకు పాఠాలతోపాటు యోగా, ధ్యానంపై రోజూ గంట శిక్షణ ఇవ్వాలి. ఇంట్లో చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. కనీసం రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి.
ఆర్గానిక్ ఆహారానికి గిరాకీ
మధ్య వయసు, వృద్ధుల ఆహార పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. 45 ఏళ్ల వయసు దాటిన వారు పాత తరం ఆహార పద్ధతులను మళ్లీ అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం నగరంలో ఆర్గానిక్ పంటలు, ఆహార పదార్థాల స్టాళ్లు వెలుస్తున్నాయి. ఆర్గానిక్ కూరగాయలు, చిరుధాన్యాలను ఇటీవల కాలంలో ఎక్కువగా భుజిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment