వర్గల్: వరికి బదులుగా కూరగాయ పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని గజ్వేల్ డివిజన్ ఉద్యాన అధికారి చక్రపాణి అన్నారు. ‘గడా’ వ్యవసాయ విభాగం ఓఎస్డీ అశోక్ కుమార్‌తో కలిసి మండల పరిధిలోని అంబర్‌పేటలో బుధవారం ఉద్యాన రైతులతో సమావేశం నిర్వహించారు. కూరగాయల సాగు, వివిధ ప్రభుత్వ పథకాలపై కర్షకులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారి మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా కూరగాయలు సాగు చేస్తే తక్కువ నీరు, తక్కువ వ్యవధిలో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందజేస్తోందని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తుల సాధన కోసం పందిరి నిర్మాణాలు, మల్చింగ్ ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. బొప్పాయి, అరటి లాంటి ఉద్యాన పంటల సాగుతో మంచి ఫలితాలు రాబట్టవచ్చని, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని వివరించారు.
రైతులు సంఘంగా ఏర్పడి కూరగాయల సాగుకు ముందుకు వస్తే వేసవిలో ఉద్యాన క్లస్టర్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. క్లస్టర్ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. గడా ఓఎస్డీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు బతకాలి, వ్యవసాయం బాగుండాలంటే గ్రామానికి వచ్చే ప్రతి అధికారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులతో రైతులు మమేకం కావాలన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో పల్లెబాట కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు కేశవరెడ్డి, కిష్టారెడ్డి, కుమార్, వెంకటేష్, మాణిక్యం, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.
కూరగాయల సాగే మేలు
Published Wed, Sep 24 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement