ఆకుపచ్చని వాస్తవం..ప్రకృతి సేద్య జగత్తు!
నిరాశా నిస్పృహలు అలముకున్న రైతు జీవితానికి ఆశాదీపం ప్రకృతి సేద్యమని నిరూపిస్తున్నారు యువ రైతు జగదీశ్‌రెడ్డి. డబ్బు ధారపోసి రసాయనిక సేద్యం చేసి నష్టపోయిన చోటే.. ప్రకృతి సేద్యంలో విజయపతాక ఎగరేస్తున్నారు. అంతేకాదు.. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల్లో అధిక పోషక విలువలు ఉంటాయని అనేక వేదికల్లో ఎలుగెత్తి చాటుతున్నారు. సాటి రైతులను, సాగుపై ఆసక్తి ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులనూ ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు.
వరి, మామిడి, వేరుశనగ సాగులో రాణిస్తున్న చిత్తూరు జిల్లా రైతుప్రకృతి సేద్యంలో వరి సాగుతో ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం మామిడిలో పెరిగిన పంటకాలం వేరుశనగ పండించి..గానుగ నూనె విక్రయిస్తూ అధిక ఆదాయార్జన
ఉన్న కొద్దిపాటి బావి నీటినే పొదుపుగా వాడుకుంటూ 30 ఎకరాల్లో వరి, వేరుశనగ, మామిడి పంటలను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఎనమల జగదీశ్ రెడ్డి. గిర్ ఆవులు, కుందేళ్లు, పెరటి కోళ్లను కూడా పెంచుతున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపాళ్యం ఆయన స్వగ్రామం. 2012లో తిరుపతిలో పెట్టుబడి లేని ప్రకృతిసేద్యం పితామహుడు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరానికి హాజరైనప్పటి నుంచి జగదీశ్‌రెడ్డి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. పాలేకర్ శిక్షణ ఆయన సేద్య జీవితంలో గుణాత్మక మార్పునకు దోహదపడింది.
తొలి పంటలో 25 బస్తాల ధాన్యం దిగుబడి
జగదీశ్‌రెడ్డి పొలంలో వరి దిగుబడి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలి ఏడాది ఎకరాకు 25 బస్తాలు పండింది. ప్రస్తుతం 30కు పెరిగింది. ప్రస్తుతం ఐదెకరాల్లో అమన్ రకం వరిని సాగు చేస్తున్నారు. ముందుగా జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్ల గింజలు చల్లి.. నెల రోజులకు దమ్ములో కలియదున్నుతారు. విత్తనాన్ని బీజామృతంతో శుద్ధిచేస్తారు. సాళ్ల పద్ధతిలో నాట్లు వేస్తారు. కలుపును నివారించేందుకు సాళ్ల మధ్యలో కోనోవీడర్‌తో రెండు సార్లు దున్నుతారు. నెలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందించటంతో పాటు పైరుపై పిచికారీ చేస్తారు. నెలకోసారి నీమాస్త్రం పిచికారీ చేస్తారు. పంటను ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు ఆశించకపోతే ఇతర కషాయాలు వాడాల్సిన అవసరం రాలేదని జగదీశ్ రెడ్డి చెప్పారు.
ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం!
ధాన్యాన్ని నేరుగా విక్రయించకుండా బియ్యంగా మార్చి జగదీశ్‌రెడ్డి విక్రయిస్తున్నారు. రసాయన సేద్యంలో సాగు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే క్వింటాకు 60 కిలోల బియ్యం వస్తుండగా.. తన ధాన్యానికి క్వింటాకు 80–85 కిలోల బియ్యం వస్తున్నాయని ఆయన చెప్పారు. ఎకరాలో ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 16 క్వింటాళ్లకు పైగా బియ్యం దిగుబడి వస్తోందన్నారు. కిలో బియ్యాన్ని రూ. 55–70 చొప్పున సేంద్రియ ఉత్పత్తులు విక్రయించే షాపులు, ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. ఎకరాకు రూ. 90 వేల వరకు ఆదాయం లభిస్తోంది. దమ్ము, నాట్లు, కూలీలకు, ఎకరా వరి సాగుకు రూ. 10 వేల వరకు ఖర్చవుతోంది. ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం రైతుకు లభిస్తోంది. తమ ప్రాంతంలో రసాయన సేద్యం చేసిన రైతు ధాన్యాన్ని విక్రయిస్తే ఎకరాకు రూ. 45 వేలకు మించి ఆదాయం రావటంలేదన్నారు.
వేరుశనగ నూనె విక్రయం...
ఐదెకరాల్లో వేరుశనగను సాగు చేస్తున్నారు. నెలకోసారి జీవామృతం, నీమాస్త్రాలను పిచికారీ చేయటంతో పాటు సాగు నీటి ద్వారా అందిస్తారు. గింజ నాణ్యంగా ఉండి కాయలు తూకానికి వస్తున్నాయి. జగదీశ్‌రెడ్డి తాను పండించిన వేరుశనగ గింజల నుంచి నూనె తీసి విక్రయిస్తున్నారు. 20 కిలోల గింజలను గానుగ ఆడిస్తే 8 కిలోల నూనె లభిస్తుంది. నూనె లీటరు రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు.
మామిడిలో పెరిగిన పంటకాలం
జగదీశ్‌రెడ్డి 20 ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నారు. పంటకు పోషకాలను అందించేందుకు నెలకోసారి జీవామృతం... చీడపీడల నివారణకు దశపత్ర కషాయం, నీమాస్త్రాలను పిచికారీ చేస్తున్నారు. మామిడిలో సాధారణంగా జూన్ నెలతో కాపు పూర్తవుతుంది. కానీ జగదీశ్‌రెడ్డి మామిడి తోటలో మాత్రం జూన్ నెలమొత్తం కాపు కాయటం విశేషం. ప్రకృతిసేద్యంలో పండించిన బంగినపల్లి రకం కాయలను అమ్ముకోవటంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవటం లేదు కానీ తోతాపురి రకం మామిడి కాయలను విక్రయించటం కష్టమవుతున్నదన్నారు. తోటలో తోతాపురి రకం చెట్లను ఎక్కువగా సాగు చేయటం.. వాటిని మామిడి గుజ్జు పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ప్రకృతిసేద్యంలో పండించినా మార్కెట్లో మాత్రం సాధారణ ధరకే విక్రయించాల్సి రావటంతో తాము నష్టపోతున్నామని దీన్ని నివారించేందుకు కుటీర పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని జగదీశ్‌రెడ్డి కోరారు.
ప్రకృతి వ్యవసాయం రైతుకు ఆర్థిక భద్రత కల్పించడం గురించి, ఈ ఆహారోత్పత్తుల పోషక విలువలను గురించి తెలియజెప్పేందుకు అటు రైతులు, ఇటు వినియోగదారులకు కూడా ఆయన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన స్వగ్రామంలోని 30 మంది రైతులకు శిక్షణ ఇచ్చి ప్రకృతి సేద్యం చేపట్టే దిశగా ప్రోత్సíß స్తున్నారు. ఈ ఆహారోత్పత్తుల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూఢిల్లీ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా నేషనల్ న్యూట్రిషన్ అవార్డు.. ఏసియన్ అగ్రి ఫౌండేషన్ అవార్డులు వరించాయి. - గాండ్లపర్తి భరత్ రెడ్డి, సాక్షి, చిత్తూరు
నా కొడుకును రైతుగా చూడాలనుకుంటున్నా!
మన సాగు భూమికి మనం ధర్మకర్తలం మాత్రమే. పంటలు సాగు చేసుకొని జీవిస్తూనే.. భూమి సహజత్వాన్ని, సారాన్ని యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే. ఢిల్లీ తదితర నగరాల్లో పలువురు కేన్సర్ తదితర దీర్ఘ రోగులు నా ఆహారోత్పత్తులు వాడి ఉపశమనం పొందుతున్నారు. ఆరోగ్యకరమైన ప్రకృతి సేద్య ఆహారోత్పత్తులను ప్రజలకు అందిస్తున్నాననే సంతృప్తి ఉంది. నా కొడుకును కూడా ప్రకృతి వ్యవసాయదారుడిగానే చూడాలనుకుంటున్నా.
– ఎనమల జగదీశ్‌రెడ్డి (94400 44279), ప్రకృతి వ్యవసాయదారు, దండువారి పాళ్యం,బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా