భూమిచ్చారు సరే.. పెట్టుబడి ఖర్చేది.?
ఏడాది గడిచినా పెట్టుబడి ఇవ్వని సర్కారు
పంటల సాగుకు లబ్ధిదారుల పాట్లు
పట్టించుకోని అధికారులు
ఆదిలాబాద్ అర్బన్ : దళితబస్తీ పథకంలో భాగంగా ప్రభుత్వం నిరుపేద దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇచ్చింది. మొదటి ఏడాది పెట్టుబడి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్న భరోసాతో ఎకరాకు రూ.25 వేల వరకు అప్పు చేసి పంట సాగుచేశారు. భూములు పంపిణీ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా కార్పొరేషన్ కానీ, అధికారులు గానీ చిల్లిగవ్వ కూడా రుణం ఇవ్వలేదు. దీంతో అప్పులు ఏలా తీర్చాలో తెలియక లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో జైనథ్, ఆదిలాబాద్, బేల మండలాల్లోని 104 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 312 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోళ్లు చేసి పం పిణీ చేసింది. 2014–15లో జైనథ్ మండలం కాప్రి గ్రా మానికి చెందిన 24 మందికి భూములు పంపిణీ చేశారు. అప్పట్లో పంటలు వేసుకున్న 3 నెలలకు పెట్టుబడి ఖ ర్చులు చెల్లించడంతో లబ్ధిదారులు ఇబ్బందులుపడ్డారు. భూములిచ్చి పంట చేతికొచ్చే సమయంలో సాగుకు అయ్యే ఖర్చుఇచ్చారు. 2015–16 సంవత్సరంలో బేల మండలం బెదోడ గ్రామానికి చెందిన 10 మందికి, అదే మండలంలోని తోయగూడ గ్రామానికి 14 మందికి భూ పంపిణీ చేశారు.
జైనథ్ మండలం బాలాపూర్‌కుచెందిన 13 మందికి, దీపాయిగూడకు చెందిన 18 మందికి, మా ండగడకు చెందిన ఒకరికి, మాంగుర్లకు చెందిన ముగ్గురికి భూములిచ్చారు. 2016–17 యేడాదిలో ఆదిలాబాద్ మండలంలోని అర్లి(బి) గ్రామానికి చెందిన 11 మందికి భూమి పంపిణీ చేశారు. మూడు మండలాల్లో 70 మందికి గతేడాది వేసవిలో భూములు పంపిణీ చేశారు. దీంతో లబ్ధిదారులందరూ పంటలు వేసుకున్నారు. పంటలు సాగై దాదాపు 6 నెలలవుతున్నా ఇప్పటి వరకు మొదటి ఏడాది పెట్టుబడి రాకపోవడంతో అసహనంతో ఉన్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
పెట్టుబడి ఊసేత్తని ప్రభుత్వం
ప్రభుత్వం దళితబస్తీ ద్వారా పంపిణీ చేసిన భూములకు కార్పొరేషన్ ద్వారా సర్కారు సాగుకు అయ్యే ఖర్చు ఇవ్వాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మొదటి ఏడాది ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తామనడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పంటల వేసుకొని 6 నెలలు గడిచినా లబ్ధిదారుల చేతికి పెట్టుబడి రుణాలు అందకపోవడంతో ఆందోళన పడుతున్నారు. పెట్టుబడి ఖర్చు ఇంకెప్పుడు ఇస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల భూమిలో ప్రస్తుతం పత్తి, సోయా, జొన్న, కంది పంటలు సాగవుతున్నాయి. మండల వ్యవసాయ, రెవెన్యూ అధికారులు వచ్చి పంటలకు కావాల్సిన మొదటి ఏడాది పెట్టుబడి ఖర్చు కార్పొరేషన్ నుంచి ఇప్పిస్తామని చెప్పినా.. ఇంతవరకు దాని ఊసేత్తకపోవడం గమనార్హం. పంటలకు కావల్సిన పెట్టుబడి ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి తెచ్చామని, పెట్టుబడి ఖర్చు ప్రభుత్వ ఇస్తే.. ఖర్చు తీర్చే దారి దొరుకుతుందని లబ్ధిదారులు అంటున్నారు. త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ ఏడాది దిగుబడి అంతంతే..
దళితబస్తీ పథకం కింద పంపిణీ చేసిన భూ ముల్లో ఈ యేడాది దిగుబడి అంతంత మాత్రం గానే వచ్చింది. సోయా పంటను ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఎక్కువ మొత్తంలో సోయా వేసుకున్నప్పటికీ కురిసిన వర్షాలతో నష్టం వాటిల్లింది. ఇక, పత్తి పంట వేసుకున్న లబ్ధిదారులకు ఎకరాకు 4–5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇలా వచ్చిన దిగుబడి పంట ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. ఫలితంగా ఇన్ని రోజులు కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగించే లబ్ధిదారులు మొదటి ఏడాది పంట సాగు చేయడంతో కూలీ పనులకు వెళ్లేందుకు అస్కారం లేకుండా పోయింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నారు. మొదటి ఏడాది పెట్టుబడి ఖర్చు ప్రభుత్వ చెల్లించినట్లయితే సాగు ఖర్చు అప్పు తీర్చడం, రబీ సీజన్‌లో పంటలు వేసుకునేందుకు వీలుంటుందని లబ్ధిదారులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా పెట్టుబడి ఖర్చులు ఇవ్వాలని కోరుతున్నారు.