సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిరప పంటకు ‘ఈనాడు తెగులు’ సోకింది. విత్తు నుంచి విక్రయం వరకు మిరప రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం ఆ పత్రిక అక్కసుకు కారణమైంది. మిరప పంటపై ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేసింది. ఎన్నడూ లేని విధంగా మిరప రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది.
ఆర్బీకేల ద్వారా విత్తనాన్ని అందించడమే కాకుండా, పెట్టుబడి తగ్గించేందుకు, నాణ్యత పెంచేందుకు శిక్షణ ఇస్తోంది. ఆర్థికంగా, మార్కెట్‌పరంగా రైతుకు తోడ్పాటునందిస్తోంది. ప్రభుత్వ చర్యల ఫలితంగా మిరపకు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. సాగు విస్తీర్ణమూ పెరుగుతోంది. వాస్తవాలు ఇలా ఉంటే మిరప రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు మరోసారి అవాస్తవాలతో ‘ఎర్ర బంగారానికి.. అప్పులే దిగుబడి’ అంటూ అబద్ధాలను అచ్చేసింది.
ఏటా పెరుగుతున్న సాగు
గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్, బాపట్ల, నరసరావుపేట జిల్లాల్లో మిరప అత్యధికంగా సాగవుతుంది. కోల్డ్ స్టోరేజి యూనిట్లతో పాటు గుంటూరు మిర్చి యార్డు, ఐటీసీ వంటి బహుళ జాతి సంస్థలూ మిర్చి కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తోంది. వీటి ఫలితంగా మిరప క్వింటా రూ. 20 వేలకు పైగా ధర పలుకుతోంది.
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మిరప పంటకు గడిచిన ఏడాదికన్నా అధికంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేసి అన్ని బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ మద్దతు, మంచి ధర కారణంగా ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇటీవల రాయలసీమ జిల్లాల్లో కూడా మిరప విస్తీర్ణం పెరుగుతోంది. అనంతపురం జిల్లాలో బాడిగ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు.
ఆర్బీకేల ద్వారా శిక్షణ
మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ కార్యక్రమాలను ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం, గుంటూరు లాంలోని మిరప పరిశోధన స్థానం, ఐఐహెచ్‌ఆర్, బెంగళూరు శాస్త్రవేత్తల సహకారంతో మిరపలో నల్లి నివారణకు చర్యలు చేపట్టారు. రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఐటీసీ వంటి సంస్థల సహకారంతో నారు నుంచి కాయ కోసి ఎండబెట్టే వరకు నాణ్యమైన మిరప దిగుబడి కోసం మొబైల్ యాప్ ద్వారా 3 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చారు.
విచక్షణ రహితంగా పురుగు మందుల వినియోగాన్ని నిరోధించేందుకు ఆర్బీకేల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. మిరప పంటకు సోకే థ్రిప్స్ నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. నల్లతామర, జెమిని వైరస్ తెగుళ్ల నివారణపై ప్రతి 15 రోజులకోసారి అవగాహన కల్పిస్తునారు.
మిరపలో అభ్యుదయ రైతుల అనుభవాలు, సూచనలను రైతు భరోసా చానల్‌లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మిగతావారికి తెలియజేస్తున్నారు. నాణ్యమైన నారు కోసం నర్సరీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ నర్సరీ చట్టం పగడ్బందీగా అమలు చేస్తున్నారు. షేడ్‌నెట్‌లలో మిరప నారు పెంపకం కోసం రైతులకు ఉద్యాన మిషన్ ద్వారా రాయితీలు అందిస్తున్నారు.
ఉచిత పంటల బీమా.. పెట్టుబడి రాయితీ
మిరప పంటను ఈ–క్రాపింగ్ చేసి, ఉచిత పంటల బీమా వర్తింపజేశారు. విపత్తుల్లో నష్టపోయిన మిరప రైతులకు అదే సీజన్‌లో పెట్టుబడి రాయితీ చెల్లిస్తున్నారు. మిరప పంటను వాతావరణ, దిగుబడి ఆధారిత పథకాల ద్వారా 2016 నుంచి వేర్వేరు జిల్లాల్లో నోటిఫై చేస్తున్నారు. అదే విధానాన్ని నేటికీ కొనసాగిస్తున్నారే తప్ప ఎలాంటి మార్పులు చేయలేదు.
పంట కోత ప్రయోగాల ఆధారంగా వాస్తవ దిగుబడులను లెక్కించి హామీ దిగుబడికన్నా తగ్గితే బీమా పరిహారం మళ్లీ సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తున్నారు. 2019–20 నుంచి ఇప్పటి వరకు 1,49,180మంది రైతులకు రూ.566.05 కోట్ల బీమా పరిహారం చెల్లించారు.
2022 ఖరీఫ్‌లో ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో దిగుబడి ఆధారిత పథకం కింద, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వాతావరణ ఆధారంగా నోటిఫై చేశారు. పంట కోత ప్రయోగాల ఫలితాల ఆధారంగా పరిహారం చెల్లించారు.
2023–24 సీజన్‌లో ఒకే రీతిలో పరిహారం లెక్కించేలా చర్యలు
2023–24 సీజన్‌లో కూడా మిరప పంటకు పంటల బీమా కవరేజ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాతావరణ, దిగుబడి ఆధారిత పథకాల ద్వారా ప్రస్తుతం అమలవుతున్న మిరప పంటను ఒకే విధంగా బీమా పథకంలో చేర్చేలా కొన్ని ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీలో పరిశీలించారు.
ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించి తగిన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం మిరప రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఈనాడు ప్రభుత్వంపై బురద జల్లేలా కథనాన్ని అల్లింది.
Comments
Please login to add a commentAdd a comment