పొగాకుపైనా వితండవాదమేనా?  | Registration of Tobacco in e Crop | Sakshi
Sakshi News home page

పొగాకుపైనా వితండవాదమేనా? 

Published Tue, Dec 19 2023 4:58 AM | Last Updated on Tue, Dec 19 2023 4:58 AM

Registration of Tobacco in e Crop - Sakshi

సాక్షి, అమరావతి: రామోజీరావు, ఆయన విషపు­త్రిక ‘ఈనాడు’కు నిత్యం ఒకటే ఎజెండా.. ‘కుక్క­పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకనర్హం’ అన్నట్టు.. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడంలో రామోజీరావు వ్యవహారం కూడా ఇంతే. మోకాలికి, బోడి గుండుకు ముడివేసినట్టు ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి అంటగడతారు. తాజాగా పొగాకును ప్రభుత్వం పంటల బీమాలో చేర్చలే­దని.. ఈ–క్రాప్‌లో నమోదు కూడా చేయలేదని ఒక అబద్ధపు కథనంతో ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగారు. ‘పంటల బీమా లేదు.. ఈ–క్రాప్‌లో నమోదూ కాలేదు’ అంటూ ఒక విష కథనాన్ని సోమవారం ‘ఈనాడు’లో వండివార్చారు. దానిపై అసలు నిజాలు ఇవీ..

సాగు చేయాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి
పొగాకు.. వాణిజ్య పంట..పైగా నార్కోటిక్‌ ప్లాంట్‌. ఇదేమీ ఆహార పంటో, ఉద్యాన పంటో కాదు. అయినా సరే పొగాకుకు పంటల బీమా ఎందుకు వర్తింప చేయడం లేదంటూ ‘ఈనాడు’ వితండవాదం చేస్తోంది. పోనీ గత చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పొగాకు రైతునైనా ఆదుకుందా అంటే అదీ లేదు. ఈ నాలుగున్నరేళ్లలో పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొని ‘ఈనాడు’ విషప్రచారానికి ఒడిగడుతోంది.

రాష్ట్రంలో పొగాకు సాధారణ విస్తీర్ణం 2.10 లక్షల ఎకరాలు. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఉభయ­గోదావరి జిల్లాల్లో సాగవుతోంది. సాధారణంగా ఏటా ఎన్ని మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి చేయాలో? ఆ మేరకు ఎన్ని ఎకరాల్లో పంటసాగు చేయాలో కేంద్ర పొగాకు బోరుŠడ్‌ నిర్ణయిస్తుంది. అనుమతికి మించి సాగు చేసినా, అదనపు ఉత్పత్తి సాధించినా అమ్ముకోవాలంటే బోర్డు అనుమతులు తప్పనిసరి. అనుమతించిన విస్తీర్ణాన్ని బట్టి ఖరీఫ్‌లో 50 వేల టన్నులు, రబీలో లక్షన్నర టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. 

రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వమే కొనుగోలు..
కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా పొగాకు రేట్లు పతనమైన సంగతి తెలిసిందే. పొగాకు వాణిజ్య పంటయినప్పటికీ రైతులెవ్వరూ నష్టపోకూడదని చరిత్రలో తొలిసారి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోళ్లను చేపట్టింది. 2019–20 సీజన్‌లో ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా 1,29,31,590 కిలోలు కొనుగోలు చేసింది. సగటున కిలోకు రూ.81 చొప్పున 29,228 మంది రైతుల నుంచి రూ.128.65 కోట్లతో కొనుగోళ్లు చేప­ట్టింది. అత్యధికంగా 7.11 మిలియన్‌ కిలోల ఎన్‌­వోజీ గ్రేడ్, 4.37 మిలియన్‌ కిలోల ఎఫ్‌–05 గ్రేడ్‌ పొ­గాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. అంతేకాదు..ఈ నాలుగున్నరేళ్లలో వివిధ రకాల వైప­రీత్యాల వేళ అన్ని రకాల రైతులతోపాటే పొగాకు రైతులకూ నష్టపరిహారం చెల్లిస్తూనే వచ్చింది.

కొనసాగుతున్న ఈ–క్రాప్‌ నమోదు..
పొగాకు పంటకాలం.. 100–120 రోజులు. రబీ సీజన్‌లో అక్టోబర్‌లో సాగు చేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడమే కాకుండా చాలా చోట్ల నవంబర్‌ నాటికి కూడా సాగు ప్రారంభం కాలేదు. సాధారణంగా ఏ పంటయినా సరే పంట వేసిన నెల తర్వాత ఈ–క్రాప్‌లో నమోదు చేసి ఫొటో అప్లోడ్‌ చేస్తారు. ఇలా ఏటా నమోదు చేస్తున్నారు.

ప్రస్తుత రబీ సీజ­న్‌లో ఇప్పటికే 25 వేల ఎకరాల్లో సాగైన పొగాకు పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేశారు. అయితే పంట నమోదు మొదలు పెట్టిన కొద్ది కాలానికే వచ్చిన మి­చాంగ్‌ తుపాన్‌తో నీట మునిగిన ప్రాంతాల్లో నమోదు చేయడం కొంత కష్టతరంగా మారింది. దీంతో ఈ పంట బుకింగ్‌కు మినహాయింపునిచ్చారు. కాగా ఈ–క్రాప్‌ నమోదనేది ఇంకా కొనసాగుతూనే ఉంది.

నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు సిద్ధం..
కాగా కరువు ప్రభావిత మండలాల్లో 1,600 ఎకరాల్లో పొగాకు పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఆ మేరకు పంట నష్టపరిహారం(ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఇటీవల మిచాంగ్‌ తుపాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ప్రాథమికంగా 65 వేల ఎకరాల్లో పొగాకు పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు.

ప్రస్తుతం పంట నష్టం తుది అంచనాల రూపకల్పన కోసం ఎన్యుమరేషన్‌ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈ అంచనాలు కొలిక్కి వచ్చాక నిర్దేశించిన పరిహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. వాస్తవాలు ఇలా ఉంటే రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ‘ఈనాడు’ దుష్ప్రచారం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

దేశంలోనే బీమా ఎక్కడా లేదు..
రాష్ట్రంలో రైతులు సాగు చేసే దాదాపు అన్ని ప్రధాన పంటలకు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాను ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఖరీఫ్‌–2023లో 21 పంటలకు, రబీ–2023–24లో 17 పంటలకు బీమా వర్తింప చేస్తూ పూర్తి మార్గదర్శకాలతో నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. అయితే పొగాకు పంట ఆహార భద్రతకు సంబంధించిన పంట కాదు...పైగా వీటి ఉత్పత్తుల వినియోగంతో దుష్పరిణామాల కారణంగా ఈ పంటకు రాష్ట్రంలోనే కాదు..దేశంలోనూ మరెక్కడా బీమా లేదు. నార్కోటిక్‌ ప్లాంట్‌గా గుర్తించిన కారణంగా ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంబీఎంవై) ద్వారా నోటిఫై చేసిన పంటల జాబితాలోనూ పొగాకుకు చోటు దక్కలేదు. గతంలో మన రాష్ట్రంలో కూడా ఎప్పుడూ బీమా పథకం ద్వారా నోటిఫై చేసిన దాఖలాలు కూడా లేవు. 

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవతో పెనాల్టీ లేకుండా..
2022–23లో 2.04 లక్షల హెక్టార్లలో సాగుకు, 142 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలుకు కేంద్ర పొగాకు బోర్డు అనుమతినిచ్చింది. అయితే మాండూస్‌ తుపాన్‌తో అన్ని పంటలు దెబ్బతినడంతో రైతులంతా రేటు బాగుందని పొగాకు సాగు చేశారు. ఫలితంగా 172 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యింది. సాధారణంగా అనుమతికి మించి ఉత్పత్తి అయిన సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితులుంటే 5 శాతం పెనాల్టీతో కొనుగోలుకు కేంద్రం అనుమతినిస్తుంది. అలాంటిది సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవ చూపడంతో పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఆ మేరకు రైతులు పొగాకును అమ్ముకోగలిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement