అభివృద్ధి అంటే పక్క రాష్ట్రాలతో పోలికా?  | The country is proud of YSR free crop insurance scheme | Sakshi
Sakshi News home page

అభివృద్ధి అంటే పక్క రాష్ట్రాలతో పోలికా? 

Published Wed, Sep 6 2023 5:31 AM | Last Updated on Wed, Sep 6 2023 5:31 AM

The country is proud of YSR free crop insurance scheme - Sakshi

సాక్షి, అమరావతి : నిజాలతో పనిలేదు. వాస్తవాలు అసలే పట్టవు. కేవలం బురద జల్లడమే లక్ష్యం. అధికారంలో ఉన్నది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాబట్టి... ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా, ప్రజల్లో విష బీజాలు నాటేలా నిత్యం ఈనాడు పత్రికలో అబద్ధాలతో కథనాలు రాయడమే రామో­జీ­రావు పనిగా పెట్టుకున్నారు. ఏ రంగంలోనైనా అభివృద్ధిని అంచనా వేయాలంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది, ఏ మేరకు పురోగతి సాధించింది అని బేరీజు వేస్తారు. అలా చేస్తే గత సీఎం చంద్రబాబు బండారం బయటపడుతుంది. ఆయన రైతులకు చేసిన మోసాలు, అన్నదాతల పేరిట చేసిన అక్రమాలు బట్టబయల­వుతాయి.

ఇదే రామోజీ భయం. అందుకే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో బేరీజు వేస్తూ ఓ కథనం ఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధుతో ఏపీలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని పోలుస్తూ తలాతోక లేని ఓ పనికి మాలిన కథనాన్ని ప్రచురించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక విత్తు నుంచి పంట ఉత్పత్తుల అమ్మకం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

పలు పథకాలతో ఆర్థికంగ ఆదుకొంటూనే, సాగులో, పంట ఉత్పత్తుల అమ్మకాల వరకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా సహాయం చేస్తున్నారు. వీటన్నింటినీ విస్మరించి రామోజీ ఓ నేలబారు కథనాన్ని అల్లి, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. అసలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులకు కలుగుతున్న మేలును తెలుసుకుందాం..

బాబుకంటే మిన్నగా పెట్టుబడి సాయం
చంద్రబాబు అంటేనే వంచన.. చంద్రబాబు అంటేనే వెన్నుపోటు.. పట్టెడన్నం పెట్టే రైతునూ ఆయన వంచించిన తీరు నభూతో నభవిష్యతి. పీఎం కిసాన్‌తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.15 వేలు ఇస్తానని నమ్మబలికిన చంద్రబాబు.. 2018–19లో రెండు విడతల్లో రూ.4 వేల చొప్పున 46.76 లక్షల మందికి అందించిన సాయం రూ.2,440.29 కోట్లు. దాంట్లో అన్నదాత సుఖీభవ పథకం కింద బాబు ఇచ్చింది రూ.1,765 కోట్లు మాత్రమే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే నమ్మకం.

అందరికీ ఓ భరోసా. ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు అర్హత ఉన్న ప్రతి రైతుకూ ఇస్తామని వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోలో హామీ ఇవ్వగా.. దానికంటే ఎక్కువగా ఏటా రూ.13,500 చొప్పున నాలుగేళ్లకు బదులు ఐదేళ్ల పాటు రూ. 67,500 అన్నదాతకు అందిస్తున్నారు. అంటే రూ.17,500 అదనంగా ఇస్తున్నా­రు. భూ యజమానులకే కాదు.. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద కౌలు రైతులతో పాటు అటవీ, దేవదాయ భూ సాగు­దారులకు సైతం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 2019–20 నుంచి ఇప్పటివరకు ఏటా సగటున 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల లబ్ధి చేకూర్చారు.

ఇది రైతుకు మేలు కాదా? ఈ పోలిక ఎందుకు తేలేదు రామోజీ? 2023–24లో స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం జొన్న, రాగి, సజ్జ, అపరాలు, నూనె గింజలకు ఎకరాకు అయ్యే కనీస పెట్టుబడి రూ.13,000 ఉంటుంది. ఇందులో రైతు భరోసా సాయం రూ.13,500 ప్రభుత్వమే అందిస్తోంది. ఇతర పంటలకు అయ్యే పెట్టుబడిలో 80 శాతం ప్రభుత్వమే అందిస్తోంది. మరో వైపు ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనడమే కాకుండా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. ఇదంతా రైతుకు ఆదా అయ్యేదే. మొక్కజొన్న ఎకరాకు రూ.30 వేల నుండి రూ.45 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుండగా, బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వమే మంచి ధర ఇప్పిస్తోంది.

ధాన్యం సేకరణలో విప్లవాత్మక మార్పులు
ధాన్యం సేకరణలో దళారీ వ్యవస్థను, మిల్లర్ల జోక్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నివారించింది. ప్రస్తు­త ప్రభుత్వం 2019 నుంచి 2023 వరకు ఈ నాలు­గేళ్లలోనే  ఇప్పటివరకు 32,78,099 రైతుల నుంచి 3,10,69,061 టన్నుల ధాన్యాన్ని రూ.58,766 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. రైతులకు చెల్లించాల్సిన నగదును నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలోనే జమ చేస్తోంది. ధాన్యం కొనుగోలు గతంలో సేకరణ కేంద్రాలకే పరిమితమయ్యేది. అవికూడా అరకొర­గానే ఉండేవి. వీటి వరకు ధాన్యం తేవాల్సిన ఖర్చంతా రైతుదే. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా రైతు క్షేత్రం వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతు భాగస్వా­మ్యంతో ధాన్యం కొనుగోలు చేస్తోంది.

రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. సరిపడా సంచులు దొరక్క రైతులు ఇబ్బంది పడేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక వాటికి చెక్‌ పెట్టింది. ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, పీఏసీ­ఎస్‌లు కొరత లేకుండా గోనె సంచులను రైతులకు సమకూ రుస్తున్నాయి. గతంలో ఏ– గ్రేడ్, సాధారణ రకం అనే రెండు రకాలుగానే కొనే వారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ధాన్యం రకాల ప్రకారం గ్రేడెడ్‌ ఎంఎస్‌పీ ఇచ్చి కొంటోంది. ఇది రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంది. గతంలో రైతులు మిల్లుల వద్దకు వెళ్లి అక్కడే ధాన్యం కొలవాల్సి వచ్చేది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతులకు ఈ ఇబ్బందిని పూర్తిగా తొలగించింది.  రైతుల వద్దే తూకం సహా అన్ని రకాల కొలమానాలు పూర్తి చేసి అక్కడే రశీదు ఇస్తున్నారు. రశీదు వెనుక టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ఇస్తున్నారు. గతంలో రైతుల కు జీఎల్‌టీ (గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా) ఖర్చు లు అందేవి కావు. ఈ ప్రభుత్వం తొలిసారిగా ఈ ఖర్చులను రైతులకు అందిస్తోంది. తద్వారా క్వింటాలుకు కనీస మద్దతు ధరకు అదనంగా రూ.252 వరకూ రైతులకు లభిస్తోంది.

దేశంలోనే వినూత్నం‘‘ఈ–క్రాప్‌’’ బుకింగ్‌
దేశంలోనే తొలిసారి ఎలక్ట్రానిక్‌ క్రాపింగ్‌ (ఈ – క్రాప్‌) ద్వారా రైతుల కమతాలలో విత్తిన పంటలను డిజిటల్‌ పద్ధతిలో నమోదు చేయడాన్ని 2019 రబీలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ –క్రాప్‌లో వీఏఏ, వీహెచ్‌ఏ, వీఆర్‌ఏతో పాటు సాగు చేసే రైతుల వేలి ముద్రలు (ఈ కేవైసీ) నమోదు చేస్తున్నారు. ఇది పూర్తి కాగానే మొబైల్‌ ఫోన్లకు డిజిటల్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ çపంపిస్తున్నారు. పంటల వివరాల జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు.

ఈ క్రాప్‌ ప్రామాణికంగా రైతు సంక్షేమ పథకాలైన వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, కనీస మద్దతు ధరకు పంటల ఉత్పత్తుల కొనుగోలు వంటివి అమలు చేస్తున్నారు. నాణ్యత కలిగిన ఉత్పాదకాలను రైతులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా 13 జిల్లా, 147 నియోజకవర్గ స్థాయి అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రూ.115.57 కోట్లతో 127 నియోజకవర్గ ల్యాబ్‌లను ఇప్పటికే అందుబాటు­లోకి తెచ్చారు. గతంలో ఏటా సగటున 20 వేల నమూనాలు పరీక్షించగా.. ప్రస్తుతం ఏటా 50 వేల చొప్పున రెండేళ్లలో లక్ష నమూనాలను పరీక్షించారు. వీటిలో 11 వేల నమూనాలు రైతులు తీసుకొచ్చినవే.

ఆర్బీకేల ద్వారా రైతు ముంగిట సేవలు
రైతుకు మొక్కుబడిగా కొంత ఆర్థిక సహాయం అందించి గాలికి వదిలేయకుండా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలవా­లనే సంకల్పంతో గ్రామ సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఏర్పాటు చేసింది. 10,778 ఆర్బీకేల ద్వారా రైతాంగానికి వ్యవసాయ సాంకేతిక విజ్ఞానం, సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతుల ముంగిట్లోనే అందిస్తోంది.

విత్తనాలు, ఎరువుల సరఫరాలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2019 నుండి ఇప్పటివరకు 41.46 లక్షల క్వింటాళ్ళ విత్తనాలను రూ.1,208.60 కోట్ల రాయితీపై 70.87 లక్షల మందికి సరఫరా చేసింది. గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలను ప్రతి ఏటా అందిస్తోంది. నాణ్యమైన ఎరువులను కూడా రైతుల ముంగిట్లోకే అందించడం వల్ల ఒక బస్తాకి రూ.20 నుంచి రూ.30 వరకు హమాలీ, రవాణా ఖర్చును రైతులు ఆదా చేసుకోగలు­గుతున్నారు.

సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి ఖర్చు, నిర్వహణ భారం లేకుండా తక్కువ అద్దెకే వారికి కావల్సిన యంత్ర పరి­కరాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందుకోసం ఆర్బీకేలకు అనుసంధానంగా 10,936 గ్రామా­ల్లో రూ.1,052.42 కోట్ల విలువైన యంత్ర పరికరాలతో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చే­సింది. యంత్ర పరికరాలకు 40 శాతం రాయితీగా రూ.366.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

దేశానికే ఆదర్శంగా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్‌ కవరేజి ద్వారా బీమా రక్షణ కల్పిస్తోంది. రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా రూపాయి ప్రీమియంకే పంటల బీమా అమలు చేస్తున్నాయి. బాబు హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పంటల బీమా పరిహారం అందిస్తే.. ఈ నాలుగేళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా పరిహారం చెల్లించింది. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన రూ. 715.84 కోట్ల బకాయిలు కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది.

వైపరీత్యాల వేళ పంట నష్టపోయిన రైతులకు అదే పంట కాలం ముగిసేలోగా పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిటీ) అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. 22.85 లక్షల రైతులకు రూ.1,976.45 కోట్ల పంట నష్ట పరిహారం (పెట్టుబడి రాయితీ)ని అందించింది. అధిక, అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీపై సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తోంది.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రూ.లక్ష లోపు పంట రుణం తీసుకొని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు పూర్తి స్థాయిలో వడ్డీ రాయితీని రైతుల ఖాతాలోనే జమ చేస్తోంది. చంద్రబాబు హయాంలో 40.60 లక్షల మంది రైతులకు రూ.685 కోట్ల వడ్డీ రాయితీనిస్తే, ఈ నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం 73.88 లక్షల రైతులకు రూ.1,834.55 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి ) వడ్డీ రాయితీని అందించింది.

బాబు హయాంలో సగటున 153.95 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులొస్తే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 165.87 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ఇలా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే.. రామోజీ మాత్రం పక్క రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో పోలుస్తూ పొంతన లేని కధనాలు వండి వారుస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement