టేకులపల్లి : బిందు సేద్యం ద్వారా సాగు చేపడితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని బిందు సేద్యం జిల్లా ఏపీడీ రావిలాల శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన రైతు వజ్జా రమేష్ పొలంలో బిందు సేద్యంను శనివారం ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా బిందు సే ద్యం పరికరాల ఉపయోగాలు, బిందు సేద్యం వల్ల కలిగే లాభాలపై రైతులకు ఆయన అవగాహన కల్పించారు. అనంతరం రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
సమతుల నీరు, ఎరువులు
బిందు సేద్యం ఉన్న అపోహలను రైతులు తొలగించుకోవాలని, ఇప్పటి వరకు కూడా రైతులు ‘పొలం నిండా నీరు పెట్టాం.. ఇక చాలు పంట బాగా పంట బాగా పండుతుంద’ని అనుకుంటున్నారని, కానీ మొక్కలకు కావాల్సింది సమతుల నీరు, ఎరువులు, తేమ అని అన్నారు. అలా కాకుండా మొక్కలకు విపరీతంగా నీరు పెట్టడం వల్ల భూమిలోని గాలి తగ్గుతుందని, దీంతో తేమ శాతం తగ్గి చీడపీడలు ఆశించి మొక్క ఎదుగుదల లోపిస్తుందని బిందు సేద్యం ఏపీడీ శ్రీనివాసరావు అన్నారు. బిందు సేద్యం వల్ల మొక్కకు ఎంత నీరు కావాలి, ఎంత ఎరువు కావాలో అంతే వేసే వెసులుబాటు ఉంటుందని, సమయం, నీరు, విద్యుత్, ఎరువులు ఆదా కావడమే కాకుండా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా రైతులు మైండ్ సెట్ మార్చుకుని బిందు సేద్యంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఇంకా ఎన్నో ఉపయోగాలు
మామూలు సాగుతో పోలిస్తే బిందు సేద్యం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన రైతులకు వివరించారు. విద్యుత్ కోతల నేపథ్యంలో రైతన్నలు రాత్రి పూట పొలాల్లో జాగరణ చేయాల్సిన అవసరం ఉండదని, బిందు సేద్యం వల్ల ప్రతీ మొక్కకు సమస్థాయిలో నీరందుతుందని అన్నారు. ఆకులు కూడా పొడిగా ఉండడంతో చీడపీడలు ఆశించే అవకాశం కూడా చాలా తక్కువని అన్నారు.
మరోపక్క కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుందని అన్నారు. మొక్క మొక్కకు ఎరువులు, రసాయన మందులు చల్లాల్సిన పని ఉండదని, బిందు సేద్యానికి ఉపయోగించే పరికరమే ఈ పనులన్నీ చేస్తుందని అన్నారు. సాధారణ సాగులో నూటికి 60 శాతం ఎరువులు వృథా అవుతాయని, బిందు సేద్యంలో మాత్రం ఎరువులు వృథా కావని అన్నారు. దిగుబడులు అధికంగానే ఉంటాయని అన్నారు. బిందు సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం వందశాతం, ఇతరులకు 75 శాతం సబ్సిడీ ఇస్తోందని, ఇది అన్నదాతలకు మరింత లాభాన్ని ఇస్తుందని అన్నారు. చాలా గ్రామాల్లో వర్షాధార సాగు కావడంతో మొక్కలు సరిగా మొలకెత్తక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. జిల్లాలో బిందు సేద్యంతో చేపట్టిన పంటలు కళకళలాడుతున్నాయని అన్నారు.
జిల్లాలో 2160 హెక్టార్లలో
2014 - 15 ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో 2160 హెక్టార్లలో బిందు సేద్యం చేపట్టేలా లక్ష్యం నిర్దేశించుకున్నామని ఏపీడీ శ్రీనివాసరావు అన్నారు. వీటిలో 1650 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్, 510 హెక్టార్లలో స్పింక్లర్ల ద్వారా బిందు సేద్యం సాగు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. గతేడాది 75 వేల ఎకరాల్లో బిందు సేద్యం సాగు చేపట్టారని, దీని ద్వారా 30 వేల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. అర్హులైన వారందరికీ సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు అందజేస్తున్నామని అన్నారు.
ఎవరు అర్హులు ?
ఐదు ఎకరాల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల వరకు పూర్తిగా ఉచితం. లక్ష దాటితే అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు 90 శాతం సబ్సిడీ. బిందు సేద్యం పరికరం కావాల్సిన రైతులు ఆధార్, బ్యాంకు ఖాతా, టైటిల్ డీడ్, ఇ పహాణీ, వీఆర్వో ధ్రువీకరించిన నక్షా జిరాక్స్ కాపీలతో ఏవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. గ్రామీణ స్థాయిలో సర్పంచ్, కార్యదర్శి , వీఆర్వో, సంతకాలు అయిన తర్వాత మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో, ఏఓలతో కూడిన కమిటీ ధ్రువీకరించిన తర్వాత దరఖాస్తులను ఏపీడీ కార్యాలయానికి పంపితే మంజూరు చేస్తారు.
బిందువు..రైతు బంధువు..
Published Mon, Sep 22 2014 2:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement