Tekulapalli
-
విద్యార్థి ఉసురు తీసిన హెచ్ఎం
సాక్షి, టేకులపల్లి(ఖమ్మం): హెచ్ఎం తిట్టి అవమానించడంతో ఓ గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన టేకులపల్లి మండల పరిధిలోని కోయగూడెం ఆశ్రమపాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆళ్ళపల్లి మండలం కిచ్చెనపల్లికి చెందిన పాయం విజయ కుమారుడు సాయికిరణ్(15) కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మేనమామ సురేష్ ఇదే పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సాయికిరణ్‌ను తీసుకుని సురేష్ శనివారం మేడారంలో బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి తిరిగి సంపత్‌నగర్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో సంతోష్‌కుమార్ తన సోదరుడు సాయికిరణ్(15)ను పాఠశాలలో వదిలి వెళ్లాడు. వాచ్మెన్ గదిలోకి వెళ్తున్న విద్యార్థిని హెచ్ఎం బాదావత్ దేవాసింగ్ పిలిచి ఎక్కడి నుంచి వస్తున్నావని అడిగారు. శుభకార్యానికి వెళ్లొస్తున్నట్లు విద్యార్థి తెలిపాడు. అంతటితో ఆగని హెచ్ఎం పదో తరగతి చదువుతున్నావ్.. క్లాసులు ఎగ్గొట్టి ఊర్లు తిరుగుతావా... అంటూ మేనమామను, తల్లిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ కర్రతో చితకబాదాడు. దీంతో మనస్తాపం చెందిన సాయికిరణ్ పాఠశాల ఆవరణలోనే ఉన్న తన మావయ్య(వాచ్మెన్) గదిలోకి వెళ్ళి తలుపునకు గడి పెట్టుకున్నాడు. ఎంతకీ బయటకు రాలేదు. మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులు వెళ్ళి తలుపు కొడితే తీయలేదు. సాయంత్రం ఆరు గంటల సమయంలో వాచ్మెన్ బంధువు హాస్టల్‌కి వచ్చింది. సాయికిరణ్‌ను కలిసేందుకు గదికి వెళ్ళి తలుపు కొడితే మళ్ళీ అదే పరిస్థితి. అనుమానం వచ్చి వార్డెన్ విద్యార్థుల సహాయంతో వెంటిలేటర్ ద్వారా లోపలికి చూసేసరికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు. వెంటనే తలుపులు పగులగొట్టి కిందకు దింపారు. సీఐ బాణోతు రాజు, ఎస్ఐ ఇమ్మడి రాజ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. విద్యార్థి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లి రాకముందే విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం తరలించారు. కాగా సాయికిరణ్ తండ్రి రాంచందర్ నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు. సోదరు డు సంతోష్‌కుమార్ పాకాల కొత్తగూడెంలో ఇంటర్ చదువుతున్నాడు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మృతదేహాన్ని సందర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. మృతదేహాన్ని స్థానిక సర్పంచ్ పూనెం ఉమ, ఎంపీటీసీ జాల సంధ్య సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా హెచ్ఎం దేవాసింగ్ వివాదాస్పద వ్యక్తి అని, గతంలో రెండు సార్లు సస్పెన్షన్‌కు గురయ్యారని పలువురు పేర్కొంటున్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ: నలుగురు దుర్మరణం
సాక్షి, టేకులపల్లి: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి(తంగెళ్ల తండా వద్ద) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. ప్రయాణికులతో వెళ్తున్నఆటో ఆగి ఉండగా భారీ లారీ ఢీకొని దాని మీద నుంచి వెళ్లడంతో అది నుజ్జునుజ్జు అయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో మరొకరు మృతిచెందారు. ప్రమాద సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడి మృతి
టేకులపల్లి: రోడ్డు దాటుతున్న బాలుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తల నుజ్జు నుజ్జయి బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. టేకులపల్లి ఎస్ఐ తాటిపాముల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్యాతండాకు చెందిన బానోతు బిచ్చా, సక్రు దంపతుల కుమారుడైన జంపన్న (10) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. సోమవారం పాఠశాలకు సెలవు కావడంతో ఆటలాడుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమంలో గోదావరిఖని డిపోకు చెందిన భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బాలుడిని ఢీకొట్టింది. ఘటనలో బాలుడు ఎగిరి బస్సు వెనుక టైరు కింద పడ్డాడు. బాలుడి తల నుజ్జు నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. తమకు కొడుకు కావాలని ముగ్గురు కుమార్తెలు జన్మించిన తరువాత వేచి ఉన్న వీరికి సమ్మక్క సారలమ్మలను మొక్కుకున్న తరువాత కొడుకు జన్మించడంతో జంపన్న అని పేరుపెట్టుకున్నామని కన్నీరు పెట్టుకుంటూ రోదిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెండడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇల్లెందుకు తరలించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిశీ లించి బాలుడి మృతదేహాన్ని సందర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. -
కాడిజోల కట్టి... వాగు దాటి
టేకులపల్లి: ఉప్పొంగుతున్న వాగులు.. వంకలు.. ఏజెన్సీవాసుల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. అనారోగ్యం పాలైనా.. ఎవరైనా చనిపోయినా వాగులు దాటించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కర్రకు దుప్పటి కట్టి కాడి జోలలా ఏర్పాటు చేసి శుక్రవారం ఓ మృతదేహాన్ని వాగు దాటించారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని మేళ్లమడుగుకు చెందిన వీసం లక్ష్మి(68), రామయ్యలకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. అప్పటి నుంచి వితంతు పెన్షన్ పై ఆధారపడి జీవిస్తోంది. శుక్రవారం గంగారం పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ తీసుకున్న లక్ష్మి ఫొటో దిగేందుకు గ్రామస్తులతో కలసి కొత్తగూడెం బయలుదేరి వెళ్లింది. అక్కడ ఫొటో దిగిన తర్వాత కొద్దిసేపటికే అనార్యోగంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఓ వాహనంలో లక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొని బయలుదేరారు. చింతోని చెలకవాగు వద్ద బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మాణం జరుగుతోంది. వాగు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓ కర్రకు దుప్పటి కట్టి అందులో మృతదేహం ఉంచి వాగు దాటించారు. ఆపై స్వగ్రామానికి తీసుకెళ్లారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేం దుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వెయ్యి ఇస్తేనే వ్యవసాయ పట్టా!
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : పోడు వ్యవసాయ పట్టాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంటే రెవెన్యూ అధికారులు మాత్రం గిరిజనుల నుంచి అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన శనివారం మండలంలో వెలుగు చూసింది. మండల పరిధిలోని బోడు పంచాయతీ మొక్కంపాడు తండాకు, పెట్రాంచెలక స్టేజీ, పెట్రాంచెలక గ్రామాలకు చెందిన బాధిత గిరిజన రైతులు తెలిపిన వివరాల ప్రకారం..బోడు వీఆర్ఓ గజేందర్ ఒక్కో పోడు పట్టాకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాడని, డబ్బులు ఇచ్చినవారికి మాత్రమే పట్టా ఇస్తున్నాడని, లేకపోతే ఇవ్వడం లేదని వెల్లడించారు. ఇప్పటికే మూడు గ్రామాల్లో 150కి పైగా పట్టాలకు డబ్బులు వసూలుల చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. -
బాలికపై అత్యాచారం
- నిందితుడిపై నిర్భయ చట్టం టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేసిన సంఘటన టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి పంచాయతీలో గురువారం రాత్రి జరిగింది. బొమ్మనపల్లి పంచాయతీ బిల్లుడుతండా గ్రామానికి చెందిన బానోతు వీరన్న(20) అదే గ్రామానికి చెందిన బాలిక(15)పై గురువారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితరాలు ఫిర్యాదు మేరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెండు ఆటోలు ఢీ: ముగ్గురికి తీవ్రగాయాలు
టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. టేకులపల్లి నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న ఆటో, ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు నుంచి టేకులపల్లి వైపు వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ప్రసన్న, మల్లయ్య, కిషన్‌లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బద్దుతండాలో 144 సెక్షన్
టేకులపల్లి (ఖమ్మం) : టేకులపల్లి మండలం బద్దుతండాలో మంగళవారం 144 సెక్షన్ అమలు చేశారు. బద్దుతండా గ్రామంలో న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం నేతలపై రాయల వర్గం నేతల దాడుల నేపథ్యంలో గ్రామంలో 144 సెక్షన్ విధించడం జరిగింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
10 క్వింటాళ్ల పత్తి దగ్ధం
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) : షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇంట్లో నిల్వ చేసిన 30 క్వింటాళ్ల పత్తికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన టేకులపల్లి మండలం లచ్చతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు వెంటనే నీళ్లు చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. సుమారు 10 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని గుగులోత్ శంకర్ తెలిపారు. -
బిందువు..రైతు బంధువు..
టేకులపల్లి : బిందు సేద్యం ద్వారా సాగు చేపడితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని బిందు సేద్యం జిల్లా ఏపీడీ రావిలాల శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన రైతు వజ్జా రమేష్ పొలంలో బిందు సేద్యంను శనివారం ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా బిందు సే ద్యం పరికరాల ఉపయోగాలు, బిందు సేద్యం వల్ల కలిగే లాభాలపై రైతులకు ఆయన అవగాహన కల్పించారు. అనంతరం రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సమతుల నీరు, ఎరువులు బిందు సేద్యం ఉన్న అపోహలను రైతులు తొలగించుకోవాలని, ఇప్పటి వరకు కూడా రైతులు ‘పొలం నిండా నీరు పెట్టాం.. ఇక చాలు పంట బాగా పంట బాగా పండుతుంద’ని అనుకుంటున్నారని, కానీ మొక్కలకు కావాల్సింది సమతుల నీరు, ఎరువులు, తేమ అని అన్నారు. అలా కాకుండా మొక్కలకు విపరీతంగా నీరు పెట్టడం వల్ల భూమిలోని గాలి తగ్గుతుందని, దీంతో తేమ శాతం తగ్గి చీడపీడలు ఆశించి మొక్క ఎదుగుదల లోపిస్తుందని బిందు సేద్యం ఏపీడీ శ్రీనివాసరావు అన్నారు. బిందు సేద్యం వల్ల మొక్కకు ఎంత నీరు కావాలి, ఎంత ఎరువు కావాలో అంతే వేసే వెసులుబాటు ఉంటుందని, సమయం, నీరు, విద్యుత్, ఎరువులు ఆదా కావడమే కాకుండా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా రైతులు మైండ్ సెట్ మార్చుకుని బిందు సేద్యంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇంకా ఎన్నో ఉపయోగాలు మామూలు సాగుతో పోలిస్తే బిందు సేద్యం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన రైతులకు వివరించారు. విద్యుత్ కోతల నేపథ్యంలో రైతన్నలు రాత్రి పూట పొలాల్లో జాగరణ చేయాల్సిన అవసరం ఉండదని, బిందు సేద్యం వల్ల ప్రతీ మొక్కకు సమస్థాయిలో నీరందుతుందని అన్నారు. ఆకులు కూడా పొడిగా ఉండడంతో చీడపీడలు ఆశించే అవకాశం కూడా చాలా తక్కువని అన్నారు. మరోపక్క కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుందని అన్నారు. మొక్క మొక్కకు ఎరువులు, రసాయన మందులు చల్లాల్సిన పని ఉండదని, బిందు సేద్యానికి ఉపయోగించే పరికరమే ఈ పనులన్నీ చేస్తుందని అన్నారు. సాధారణ సాగులో నూటికి 60 శాతం ఎరువులు వృథా అవుతాయని, బిందు సేద్యంలో మాత్రం ఎరువులు వృథా కావని అన్నారు. దిగుబడులు అధికంగానే ఉంటాయని అన్నారు. బిందు సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం వందశాతం, ఇతరులకు 75 శాతం సబ్సిడీ ఇస్తోందని, ఇది అన్నదాతలకు మరింత లాభాన్ని ఇస్తుందని అన్నారు. చాలా గ్రామాల్లో వర్షాధార సాగు కావడంతో మొక్కలు సరిగా మొలకెత్తక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. జిల్లాలో బిందు సేద్యంతో చేపట్టిన పంటలు కళకళలాడుతున్నాయని అన్నారు. జిల్లాలో 2160 హెక్టార్లలో 2014 - 15 ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో 2160 హెక్టార్లలో బిందు సేద్యం చేపట్టేలా లక్ష్యం నిర్దేశించుకున్నామని ఏపీడీ శ్రీనివాసరావు అన్నారు. వీటిలో 1650 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్, 510 హెక్టార్లలో స్పింక్లర్ల ద్వారా బిందు సేద్యం సాగు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. గతేడాది 75 వేల ఎకరాల్లో బిందు సేద్యం సాగు చేపట్టారని, దీని ద్వారా 30 వేల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. అర్హులైన వారందరికీ సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు అందజేస్తున్నామని అన్నారు. ఎవరు అర్హులు ? ఐదు ఎకరాల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల వరకు పూర్తిగా ఉచితం. లక్ష దాటితే అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు 90 శాతం సబ్సిడీ. బిందు సేద్యం పరికరం కావాల్సిన రైతులు ఆధార్, బ్యాంకు ఖాతా, టైటిల్ డీడ్, ఇ పహాణీ, వీఆర్వో ధ్రువీకరించిన నక్షా జిరాక్స్ కాపీలతో ఏవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. గ్రామీణ స్థాయిలో సర్పంచ్, కార్యదర్శి , వీఆర్వో, సంతకాలు అయిన తర్వాత మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో, ఏఓలతో కూడిన కమిటీ ధ్రువీకరించిన తర్వాత దరఖాస్తులను ఏపీడీ కార్యాలయానికి పంపితే మంజూరు చేస్తారు. -
టేకులపల్లిలో భీమ్ సింగ్ కుటుంబానికి జగన్ ఓదార్పు