కాడిజోల కట్టి... వాగు దాటి
టేకులపల్లి: ఉప్పొంగుతున్న వాగులు.. వంకలు.. ఏజెన్సీవాసుల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. అనారోగ్యం పాలైనా.. ఎవరైనా చనిపోయినా వాగులు దాటించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కర్రకు దుప్పటి కట్టి కాడి జోలలా ఏర్పాటు చేసి శుక్రవారం ఓ మృతదేహాన్ని వాగు దాటించారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని మేళ్లమడుగుకు చెందిన వీసం లక్ష్మి(68), రామయ్యలకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు.
భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. అప్పటి నుంచి వితంతు పెన్షన్ పై ఆధారపడి జీవిస్తోంది. శుక్రవారం గంగారం పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ తీసుకున్న లక్ష్మి ఫొటో దిగేందుకు గ్రామస్తులతో కలసి కొత్తగూడెం బయలుదేరి వెళ్లింది. అక్కడ ఫొటో దిగిన తర్వాత కొద్దిసేపటికే అనార్యోగంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఓ వాహనంలో లక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొని బయలుదేరారు. చింతోని చెలకవాగు వద్ద బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మాణం జరుగుతోంది.
వాగు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓ కర్రకు దుప్పటి కట్టి అందులో మృతదేహం ఉంచి వాగు దాటించారు. ఆపై స్వగ్రామానికి తీసుకెళ్లారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేం దుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.