vagulu
-
ఖబ్రస్థాన్‌కు దారేది..?!
ఆదిలాబాద్: గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం మండలంలోని గూడ గ్రామ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన షేక్ అజీజ్ మరణించగా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. ఖబ్రస్థాన్‌కు వెళ్లే దారిలో వాగు ఉండడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా దాటి వెళ్లారు. ఏళ్లు గడిచినా గ్రామంలో కనీస సౌకర్యాలు కానరావడం లేదని, అంత్యక్రియలకు సైతం అవస్థలు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. -
మునిగిన మోరంచపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగు పోటెత్తడంతో.. కుందయ్యపల్లి గ్రామ సరిహద్దు నుంచి లక్ష్మారెడ్డిపల్లి వరకు సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పున వరద ప్రవహించింది. మధ్యలో ఉన్న మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. గ్రామంలోని 280 ఇళ్లలోని సుమారు వెయ్యి మంది సమీపంలోని భవనాలపైకి ఎక్కి తడుచుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇద్దరు వరద నీటి నుంచి తప్పించుకునేందుకు చెట్టుపైకి ఎక్కి కూర్చుండిపోయారు. వరదలో గ్రామానికి చెందిన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గంగడి సరోజన, గడ్డం మహాలక్ష్మి, మరికొందరు గల్లంతయ్యారు. బోట్ల సాయంతో కొందరిని రక్షించారు. సాయంత్రానికి వరద తగ్గింది. ఇక బాధితులను కాపాడేందుకు వచ్చిన రెండు హెలికాప్టర్లు.. చిట్యాల మండలంలో మోరంచవాగులో చిక్కుకున్న అస్సాం, జార్ఖండ్‌లకు చెందిన ఆరుగురు బ్రిడ్జి నిర్మాణ కార్మికులను కాపాడి ఒడ్డుకు చేర్చాయి. ♦ పెద్దవంగర మండలం పొచంపల్లి ఎర్రకుంట చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. కొంపల్లి, మహబూబ్‌పల్లి గ్రామాల మధ్య కాలువలో కొట్టుకుపోయి జోగు సంజీవ్ అనే వ్యక్తి చనిపోయాడు. ♦ ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం మారేడుగొండ చెరువుకు గురువారం తెల్లవారుజామున 3 చోట్ల గండిపడటంతో పక్కనే నివసించే బండ సారయ్య, ఆయన భార్య, తల్లి వరదలో కొట్టుకుపోయారు. సారయ్య మృతదేహం లభ్యమైనా మిగతా వారి ఆచూకీ దొరకలేదు. ♦ హనుమకొండ జిల్లా కన్నారం గ్రామానికి చెందిన పొన్నాల మహేందర్ (32) కన్నారం చెరువు మత్తడి నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. ♦ వరంగల్‌లోని 56వ డివిజన్ టీఎన్జీవోస్ కాలనీ–2కు చెందిన గట్టు రాజు(37) వరదలో గల్లంతయ్యాడు. -
కాడిజోల కట్టి... వాగు దాటి
టేకులపల్లి: ఉప్పొంగుతున్న వాగులు.. వంకలు.. ఏజెన్సీవాసుల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. అనారోగ్యం పాలైనా.. ఎవరైనా చనిపోయినా వాగులు దాటించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కర్రకు దుప్పటి కట్టి కాడి జోలలా ఏర్పాటు చేసి శుక్రవారం ఓ మృతదేహాన్ని వాగు దాటించారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని మేళ్లమడుగుకు చెందిన వీసం లక్ష్మి(68), రామయ్యలకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. అప్పటి నుంచి వితంతు పెన్షన్ పై ఆధారపడి జీవిస్తోంది. శుక్రవారం గంగారం పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ తీసుకున్న లక్ష్మి ఫొటో దిగేందుకు గ్రామస్తులతో కలసి కొత్తగూడెం బయలుదేరి వెళ్లింది. అక్కడ ఫొటో దిగిన తర్వాత కొద్దిసేపటికే అనార్యోగంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఓ వాహనంలో లక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొని బయలుదేరారు. చింతోని చెలకవాగు వద్ద బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మాణం జరుగుతోంది. వాగు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓ కర్రకు దుప్పటి కట్టి అందులో మృతదేహం ఉంచి వాగు దాటించారు. ఆపై స్వగ్రామానికి తీసుకెళ్లారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేం దుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.