
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగు పోటెత్తడంతో.. కుందయ్యపల్లి గ్రామ సరిహద్దు నుంచి లక్ష్మారెడ్డిపల్లి వరకు సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పున వరద ప్రవహించింది. మధ్యలో ఉన్న మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. గ్రామంలోని 280 ఇళ్లలోని సుమారు వెయ్యి మంది సమీపంలోని భవనాలపైకి ఎక్కి తడుచుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇద్దరు వరద నీటి నుంచి తప్పించుకునేందుకు చెట్టుపైకి ఎక్కి కూర్చుండిపోయారు.
వరదలో గ్రామానికి చెందిన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గంగడి సరోజన, గడ్డం మహాలక్ష్మి, మరికొందరు గల్లంతయ్యారు. బోట్ల సాయంతో కొందరిని రక్షించారు. సాయంత్రానికి వరద తగ్గింది. ఇక బాధితులను కాపాడేందుకు వచ్చిన రెండు హెలికాప్టర్లు.. చిట్యాల మండలంలో మోరంచవాగులో చిక్కుకున్న అస్సాం, జార్ఖండ్‌లకు చెందిన ఆరుగురు బ్రిడ్జి నిర్మాణ కార్మికులను కాపాడి ఒడ్డుకు చేర్చాయి.
♦ పెద్దవంగర మండలం పొచంపల్లి ఎర్రకుంట చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. కొంపల్లి, మహబూబ్‌పల్లి గ్రామాల మధ్య కాలువలో కొట్టుకుపోయి జోగు సంజీవ్ అనే వ్యక్తి చనిపోయాడు.
♦ ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం మారేడుగొండ చెరువుకు గురువారం తెల్లవారుజామున 3 చోట్ల గండిపడటంతో పక్కనే నివసించే బండ సారయ్య, ఆయన భార్య, తల్లి వరదలో కొట్టుకుపోయారు. సారయ్య మృతదేహం లభ్యమైనా మిగతా వారి ఆచూకీ దొరకలేదు.
♦ హనుమకొండ జిల్లా కన్నారం గ్రామానికి చెందిన పొన్నాల మహేందర్ (32) కన్నారం చెరువు మత్తడి నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు.
♦ వరంగల్‌లోని 56వ డివిజన్ టీఎన్జీవోస్ కాలనీ–2కు చెందిన గట్టు రాజు(37) వరదలో గల్లంతయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment