పుట్టగొడుగుల సాగు
సేంద్రియ కూరగాయల కన్నా సులభం
గ్రీన్‌హౌస్‌లో ఏడాది పొడవునా పెంచుకోవచ్చు శుభారంభానికి ఇదే తరుణం
టై మీద ఆకుకూరలు, కూరగాయలే కాదు పౌష్టికాహారమైన పుట్టగొడుగులను కూడా సేంద్రియ పద్ధతుల్లో నిక్షేపంగా పెంచుకోవచ్చు. పుట్టగొడుగుల సాగు కష్టమేమో అనుకోకండి. నిజానికి కూరగాయలకన్నా వీటిని పెంచడమే సులభం అంటున్నారు పవిత్ర ప్రియదర్శిని.
‘ఇంటిపంట’ ఫేస్‌బుక్ గ్రూప్ సభ్యురాలైన పవిత్ర కోయంబత్తూరు నివాసి. రసాయనాలు వాడి పెంచిన పుట్టగొడుగులు కొని తినడం ఇష్టం లేక.. తన ఇంటిపైనే చిన్న గ్రీన్‌హౌస్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతుల్లో పుట్టగొడుగులు పెంచుతున్నారామె.. ‘కాస్త మనసు పెట్టి ప్రణాళికతో పనిచేస్తే చాలు.. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇంటిపట్టునే పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చు. ఇంటర్‌నెట్ ద్వారా అధ్యయనం చేసిన జ్ఞానంతో.. ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించా. బటన్ పుట్టగొడుగుల కంటే ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచడం తేలిక...’ అంటున్నారామె. తెల్ల, లేత ఎరుపు పుట్టగొడుగులను ఆమె పెంచుతుండడం విశేషం.
టైపై సేంద్రియ పుట్టగొడుగుల పెంపకానికి కావాల్సినవి
1. వరి గడ్డి 2. ఆయిస్టర్ మష్రూమ్ స్పాన్(విత్తనం) 3. ప్లాస్టిక్ బ్యాగ్‌లు
గడ్డి బ్యాగ్‌ల తయారీ ఇలా...
వరి గడ్డిని చిన్న ముక్కలు చేయాలి. వాటిని పెద్ద పాత్రలో వేసి నీరుపోసి మూతపెట్టి.. చిన్న మంట మీద గంట సేపు ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత న్యూస్‌పేపర్ నేలపై పరచి.. దానిపై గడ్డిని వేసి.. నీరు పూర్తిగా కారిపోయే వరకు ఆరబెట్టాలి. ప్లాస్టిక్ బ్యాగ్‌లు తీసుకొని 3 అంగుళాల ఎత్తు వరకు గడ్డిని నొక్కి పెట్టాలి. గుప్పెడు స్పాన్‌ను తీసుకొని.. గడ్డి బ్యాగ్ అంచుల్లో వేయండి. ఆపైన 2 అంగుళాల మందాన మళ్లీ గడ్డిని నింపండి. గడ్డిపైన అంచుల్లో మళ్లీ స్పాన్ వేయండి... ఈ విధంగా 3 పొరలుగా వేయండి. చివ రన గడ్డి పొర వేసి ప్లాస్టిక్ బ్యాగ్ మూతిని బిగుతుగా కట్టేయాలి.ప్లాస్టిక్ బ్యాగ్‌పైన, చుట్టూతా, అడుగున కొన్ని బెజ్జాలు పెడితే గడ్డికి గాలి తగులుతుంది.
పుట్టగొడుగుల పెంపకం ఇలా...
మీ ఇంట్లో ఒక మూలన చీకటిగా, చల్లగా ఉండే చోటులో.. అది కాంక్రీటు షెల్ఫ్ కావచ్చు, కప్‌బోర్డు కావచ్చు లేదా మంచం కింద పెట్టె కావచ్చు.దాని శుభ్రం చేసి, దాని లోపల అంతటా డెటాల్ నీటితో శుభ్రం చేసి.. తడి ఆరనివ్వండి. గడ్డి బ్యాగ్‌లను అందులో పెట్టి... నల్లని వస్త్రం లేదా గోనెసంచితో కప్పండి.వాతావరణం వేడిగా ఉన్నట్లయితే.. ఆ వస్త్రం లేదా గోనెసంచిపై రోజుకు రెండుసార్లు నీటిని చిలకరించి తడిగా ఉండేలా చూడండి. 3,4 రోజుల్లో స్పాన్ ఉన్న చోట తెల్లని బూజులాంటిది(మైసీలియం) కనిపిస్తుంది. బ్యాగ్‌లో ఏమైనా ఆకుపచ్చని బుడిపెల్లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయేమో చూడండి. అలాంటివి ఉంటే చెడిపోయినట్లు లెక్క. అటువంటి బ్యాగ్‌ను తీసి పక్కకు పెట్టేసి.. ఆకుపచ్చగా ఉన్న చోట బ్యాగును కత్తిరించి చిటికెడు ఉప్పును చల్లండి. అంతా సవ్యంగా ఉంటే.. 2 వారాల్లో బ్యాగ్ మొత్తం తెల్లగా పొరతో నిండిపోతుంది.
అప్పుడు బ్యాగులను బయటకు తీసి, శుభ్రమైన కత్తి మొనతో బ్యాగ్‌పై ఎక్స్ ఆకారంలో గాట్లు పెట్టి.. ఇంట్లోనే నీడపట్టున కొంచెం వెలుతురుగా ఉండే చోట పెట్టాలి. రోజుకు 3-5 సార్లు నీటిని చిలకరించాలి.నేనైతే మేడ మీద గ్రీన్ షేడ్‌నెట్‌తో షెడ్డు వేశాను. షెడ్డులో ముందువైపు చాలా ఖాళీ వదిలేసి, ఒక మూలకు గ్రీన్‌షేడ్‌నెట్‌తో చిన్న గదిలాగా ఏర్పాటు చేశాను. దాని పైన, బయటి వైపు కొబ్బరి ఆకులు కప్పాను. లోపల గోనె సంచులను వేలాడదీశాను. గోనె సంచులను చల్లదనం కోసం మధ్యాహ్న వేళల్లో నీటితో తడుపుతూ ఉంటాను.
బ్యాగ్‌లకు గాట్లు పెట్టిన చోట్ల బుడిపెలు పెరుగుతూ ఉంటాయి. అవి తేమ ఆరిపోకుండా రోజుకు 5 సార్లు నీటిని చల్లుతుండాలి. 3 నుంచి 5 రోజుల్లో ఈ బుడిపెలు పుట్టగొడుగులుగా విస్తరిస్తాయి.{Xన్‌హౌస్‌లో 28-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. వేడి వాతావరణంలోనూ పుట్టగొడుగులు పెంచవచ్చు. గ్రీన్‌హౌస్‌లో నేల మీద ఇసుకపోసి తడుపుతూ ఉంటే చల్లగా ఉంటుంది.
పుట్టగొడుగుల అంచులు కిందికి వంగి ఉండగానే.. కోసి కూరవండుకుంటే రుచిగా ఉంటాయి. ముదిరితే అంచులు పైకి ముడుచుకుంటాయి. అప్పుడు రుచి తగ్గుతుంది. పుట్టగొడుగుల పెంపకంలో పరిశుభ్రత చాలా ముఖ్యం. పుట్టగొడుగుల పెంపకం ప్రారంభానికి అనువైనది శీతాకాలమే. ఇంకెందుకు ఆలస్యం..!(పుట్టగొడుగుల పెంపకంపై సందేహాలుంటే పవిత్ర ప్రియదర్శిను 099941 20017 నంబరులో ఏ రోజైనా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆంగ్లంలో మాత్రమే సంప్రదించగలరు.)
- సేకరణ: ఇంటిపంట డెస్క్