భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తోంది. లక్షలాది మందికి ఈ రంగం జీవనోపాధిని అందిస్తోంది. అయితే వాతావరణ మార్పుల వల్ల పంటనష్టం పెరుగుతోంది. దాంతో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget 2025)లో సుస్థిర వ్యవసాయం దిశగా ప్రభుత్వం కేటాయింపులు పెంచాలి. వీటితో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవచ్చు. అధిక విలువలు కలిగిన పంటల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగేలా ప్రోత్సాహకాలు అందించవచ్చు. అన్నదాతలకు అనుకూలంగా ఉన్న సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు డిజిటల్ ఇంటిగ్రేషన్‌ను ప్రవేశపెట్టవచ్చు.
స్థితిస్థాపక వ్యవసాయం
వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయంలో కరవు, వరదలు, వడగాలులు వంటి తీవ్రమైన పరిస్థితులను తట్టుకునేలా కొత్త పద్ధతులపై ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి. కరవును తట్టుకునే విత్తనాలు, సమర్థవంతమైన నీటి యాజమాన్య వ్యవస్థలు, భూసార పరిరక్షణ పద్ధతుల వాడకంపై అవగాహన అందించాలి. పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాలు భూసారాన్ని పెంచడంతో పాటు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. సబ్సిడీలు, సాంకేతిక మద్దతును అందించడం ద్వారా ప్రభుత్వం స్థిరమైన పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించాలి.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు నమ్ముతున్నారు. ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరింత సాంకేతికతను ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, పీపీపీల సాయంతో అధునాతన వ్యవసాయ సాంకేతికతలు సృష్టించి వ్యవసాయ పరికరాలు, అధిక నాణ్యత విత్తనాల అభివృద్ధి, వాటి వ్యాప్తిని సులభతరం చేసేలా చూడాలి. ప్రైవేట్ కంపెనీలు కోల్డ్ స్టోరేజీ(Cold Storage) సౌకర్యాలు, రవాణా నెట్‌వర్క్‌లు వంటి గ్రామీణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వం సహకారం అందించాలి. ఈ విధానాలు వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని, లాభదాయకతను పెంచుతాయి.
అధిక విలువ కలిగిన పంటలు
వ్యవసాయ ఆదాయాన్ని మరింత వైవిధ్యంగా మార్చడానికి పండ్లు, కూరగాయలు(Vegetables), సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు వంటి అధిక విలువ కలిగిన పంటలపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. సాంప్రదాయ ప్రధాన పంటలతో పోలిస్తే ఈ పంటలకు తక్కువ నీరు, భూమి అవసరం అవుతుంది. దాంతోపాటు అధిక రాబడిని పొందే వీలుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ పంటల సాగు పెంచేందుకు రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, శిక్షణ అందించాలి. వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలపై పరిశోధనలు జరగాలి.
ఇదీ చదవండి: భారత పారిశ్రామికవేత్తలకు మస్క్ ఆతిథ్యం
డిజిటల్ ఇంటిగ్రేషన్
డిజిటల్ ఇంటిగ్రేషన్ వ్యవసాయ రంగానికి ఎంతో తోడ్పడుతుంది. డిజిటల్ సాధనాల ద్వారా ప్రభుత్వం రైతులకు రియల్ టైమ్ సమాచారాన్ని అందించే వీలుంది. ఉదాహరణకు, మొబైల్ యాప్‌ల ద్వారా వాతావరణ సూచనలు, తెగుళ్ల నియంత్రణ సలహాలు, మార్కెట్ ధరలను అందించవచ్చు. రైతులు ఈ సమాచారంతో అనువైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి సహాయపడుతాయి. ఇప్పటికీ చాలామంది రైతులు సాంకేతికతకు దూరంగా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచాలి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే అవకాశం ఉంటుంది. దళారులను తొలగించి రైతులకు మద్దతుగా నిలవాలి.
Comments
Please login to add a commentAdd a comment