భారత్-అమెరికా సంబంధాలపై వ్యాఖ్యలు
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్‌మస్క్(Elon Musk) భారత్, అమెరికా సంబంధాలు సానుకూలంగా ఉన్నాయనే సంకేతాలిచ్చారు. ఇటీవల టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్(SpaceX) స్టార్‌బేస్ ఫెసిలిటీలో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి తన మద్దతును వ్యక్తం చేశారు.
ఆతిథ్యం(hosting)లో పాల్గొన్న ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) నేతృత్వంలోని ప్రతినిధుల బృందంలో ప్రశాంత్ రుయా (డైరెక్టర్ - ఎస్సార్ క్యాపిటల్), జయ్ కోటక్ (కోహెడ్ - కోటక్ 811), రితేష్ అగర్వాల్ (ఫౌండర్ & గ్రూప్ సీఈఓ-ఓయో), కళ్యాణ్ రామన్ (సీఈఓ - ఫ్లిప్‌కార్ట్), ఆర్యమన్ బిర్లా (డైరెక్టర్ - ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్), నీలేష్ వేద్ (ఛైర్మన్ - అప్పారెల్ గ్రూప్), ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి ఉన్నారు.
ఈ ఆతిథ్యంలో భాగంగా భారత పారిశ్రామికవేత్తలు స్పేస్ ఎక్స్ అత్యాధునిక సౌకర్యాలను సందర్శించారు. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫ్లైట్ 7 ప్రయోగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో అమెరికా, భారత్ మధ్య సహకారానికి ఉన్న అవకాశాలను మస్క్ నొక్కి చెప్పారు. ‘పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అమెరికా, భారత్ మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, అడ్డంకులను తగ్గించడానికి నేను అన్ని విధాలా అనుకూలం’ అని మస్క్ అన్నారు.
ఇదీ చదవండి: ఏఐ చిప్‌లపై అమెరికా ఆంక్షల ప్రభావం
ఐజీఎఫ్ వ్యవస్థాపకులు మనోజ్ లాడ్వా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘స్థిరమైన, సాంకేతిక ఆధారిత భవిష్యత్తును రూపొందించడంలో భారత్‌కు, ప్రపంచ మార్గదర్శకుల మధ్య సహకారం పెరుగుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం. డొనాల్డ్ ట్రంప్ త్వరలో అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న తరుణంలో అర్థవంతమైన చర్చలు మరింత ప్రాధాన్యతను ఇస్తాయి’ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీజీజీ) కో-ఛైర్మన్‌గా మస్క్‌ను ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment