ఉత్తమ పోషకాహారం@ ఇంటిపంట!
ఇది కెనడాలోని టొరొంటో నగరంలో ఆకాశ హర్మ్యంపైన సాగవుతున్న ‘ఇంటిపంట’ల దృశ్యం. ఉత్తర అమెరికా నగరాల్లో రూఫ్‌టాప్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. భవంతుల రూపశిల్పులు రూఫ్‌టాప్ గార్డెన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడం విశేషం. స్థానికంగా పండించిన ఆహారాన్నే తినాలనే స్పృహ నగరవాసుల్లో పెరుగుతున్నకొద్దీ టైలన్నీ కిచెన్ గార్డెన్లతో నిండిపోతున్నాయి. భవంతులే కాదు స్టార్ హోటళ్లు కూడా ఇంటిపంటలపై ఆసక్తి చూపుతున్నాయి. కస్టమర్లకు ఔషధ విలువలున్న తాజా ఆహారాన్ని అందిస్తున్నాయి. టొరొంటోలోని చరిత్రాత్మక ఫెయిర్‌మోన్ట్ రాయల్ యోర్క్ హోటల్ చీఫ్ చెఫ్ కొల్లిన్ థార్న్‌టన్ రోజూ తమ అతిథులకు వడ్డించడానికి టై మీదికొచ్చి తాజా ఆకుకూరలను కత్తిరిస్తుంటారు. ‘పంటను నా చేతులతో కత్తిరించి.. గంట గడవకముందే వండి వడ్డించడం’ ఎంతో ఉత్సాహకరంగా ఉంద’ని అంటున్నారు. సేంద్రియ ఇంటిపంటల నుంచి వచ్చే ఆహారోత్పత్తులను అత్యధిక నాణ్యమైనవిగా తాము పరిగణిస్తున్నామని నార్త్ అమెరికాకు చెందిన గ్రీన్ రూఫ్స్ ఫర్ హెల్దీ సిటీస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు స్టీవెన్ పెక్ అంటున్నారు. ‘నగరాల్లో ఇంటిపంటలపై ఆసక్తిని పెంచుతున్న ఈ ధోరణి వ్యవసాయదారుల పనిలో గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నట్లుగా ఉంది. అంతేకాకుండా, ఆహారోత్పత్తి ప్రక్రియలో నగరవాసులు తమ వంతు పాత్రను పోషిస్తున్నట్లుగా కూడా ఉందని’ అని న్యూయార్క్‌లో అర్బన్ అగ్రికల్చర్ కన్సల్టెంట్ హెన్ర గోర్డొన్ స్మిత్ అన్నారు.
‘మా తరానికి ప్రకృతితో సంబంధం తెగిపోయింది. ప్రకృతితో తిరిగి మమేకం కావడానికి తిరిగి గ్రామాలకు వెళ్లక్కర్లేదు. నగరాల్లో మేడలపైనే ఇంటిపంటలు పండించుకుంటే చాల’ని స్మిత్ వ్యాఖ్యానించారు. టైల మీద గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసి వాణిజ్య సరళిలో సలాడ్ లీవ్స్, ఆకుకూరలు, టమాటోలు.. సాగు చేసే అర్బన్ అగ్రికల్చర్ సంస్థలు సయితం ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. మహానగరాల్లో మేడలపైన ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు ఒక హాబీగానో, పచ్చదనం కోసమనో మాత్రమే కాకుండా ఔషధ విలువలు కలిగిన ఉత్తమ పోషకాహారానికి ముఖ్య అందుబాటు వనరుగా గుర్తింపు పొందుతుండడం శుభసూచకం.