మూడేళ్లుగా ఆకుకూరలు కొనలేదు!
18 అడుగుల మడిలో ఇంటిపంటల సాగు
ఈ ఫొటోలో ఉన్న ఆకుపచ్చని ఇటుకల మడి.. ఒక చిన్న కుటుంబానికి సరిపడా ఆకుకూరలు అందిస్తోంది. 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు.. అంతా కలిపితే 18 చదరపు అడుగుల నేల. అయితేనేం.. ఈ చిన్న మడిలోనే కేతిరెడ్డి విజయశ్రీ(98495 27445) ముగ్గురితో కూడిన తమ కుటుంబానికి సరిపడా సేంద్రియ ఆకుకూరలు పండిస్తున్నారు. భర్త కృపాకర్‌రెడ్డి ఇంటిపంటల సాగులో ఆమెకు సహకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని కల్యాణ్‌పురిలో తాము అద్దెకుంటున్న ఇంటి ముందున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఇటుకలతో చిన్న మడిని ఏర్పాటు చేసుకున్నారు. మెంతికూర, దుంప బచ్చలికూర, గోంగూర, పాలకూర, పుదీనా, వామాకు, కొత్తిమీర.. పెంచుతున్నారు. వీటితోపాటు కాకర, బీర తీగలను కుండీల్లో సాగు చేస్తున్నారు.
మూడొంతులు ఎర్రమట్టి, ఒక వంతు పుట్ట మన్ను, ఒక వంతు పశువుల ఎరువును కలిపి తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొదట్లో ఎర్రమట్టి ఒక్కటే ఉపయోగించటంతో మొక్కలు సరిగ్గా ఎదగలేదని.. పుట్టమట్టి, పశువుల పేడ కలిపిన తర్వాత ఏపుగా పెరుగుతున్నాయని విజయశ్రీ వివరించారు. ‘గత మూడేళ్లుగా మేం ఏనాడూ ఆకుకూరలు కొనలేదు. అతి తక్కువ స్థలమే కావటంతో ఇంటి యజమానులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పురుగులు, వాటి గుడ్లు కనిపిస్తే చేతులతోనే తీసివేస్తాను. రైతు కుటుంబంలో పుట్టి పెరట్లోనే ఆరోగ్యకరమైన ఆకుకూరలను పండించుకోవటం సంతృప్తిగా ఉందంటున్నారు విజయశ్రీ.