ఇక ద్రోన్ల శకం! | The dronla era! | Sakshi
Sakshi News home page

ఇక ద్రోన్ల శకం!

Published Wed, Dec 3 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

The dronla era!

పంటల స్థితిగతులపై తాజా సమాచారాన్ని చప్పున తెలుసుకునేందుకు అత్యాధునిక ద్రోన్‌లను వినియోగించడం సంపన్న దేశాల్లోనే కాదు.. మన దేశంలోనూ ప్రారంభమైంది. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్లాంట్‌పెథాలజీ విభాగం అద్దె పద్ధతిన ద్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. చిన్న విమానం మాదిరిగా ఉండి గాలిలో ఎగురుతూ నిర్దేశిత పనిని చక్కబెట్టే ఈ పరికరాన్ని ద్రోన్ లేదా క్వాట్రా క్యాఫ్టర్ అని అంటారు. వేరుశెనగ వంటి చిన్న పంటల నుంచి కొబ్బరి, వక్క, కాఫీ వంటి ఉద్యాన తోటలకు చీడపీడలేమైనా సోకాయా? తీవ్రత ఎలా ఉంది? వంటి విషయాలను తక్కువ సమయంలో తెలుసుకోవచ్చని విశ్వవిద్యాలయం చెబుతోంది.


45 నిమిషాలు చార్జ్ చేస్తే ఈ పరికరం 20 నిమిషాల పాటు గాలిలో ఎగరగలుగుతుంది. గంటకు ఒక ఎకరా విస్తీర్ణంలోని పంటల పరిస్థితిని పరిశీలించవచ్చు. దీనికి అమర్చి ఉండే కెమెరా పంటను వీడియో తీసి  ఎప్పటికప్పుడు పంపిస్తుంది. ఆ దృశ్యాలను కంప్యూటర్‌లో చూస్తూ పరిస్థితిని అంచనా వేయవచ్చు. విస్తారంగా కొబ్బరి, వక్క, సరుగుడు వంటి తోటలు సాగు చేసే రైతులకు.. వ్యవసాయ పరిశోధన, విస్తరణ  సేవలకు ద్రోన్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా ఈ ద్రోన్‌ను నియంత్రించవచ్చు. అతివృష్టి, అనావృష్టి వంటి సందర్భాల్లో పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి, రైతులు అప్పటికప్పుడు అనుసరించదగిన వ్యవసాయ సూచనలు, సలహాలివ్వడానికి.. బాధిత రైతులను త్వరితగతిన ఆదుకోవడానికి కూడా ద్రోన్ ఉపకరిస్తుందని చెబుతున్నారు. దీనికి రోజుకు అద్దె రూ. పది వేలు! ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు రైతులు దీని సేవలు వినియోగించుకున్నారట. మరిన్ని వివరాలకు: బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్లాంట్‌పెథాలజీ విభాగాన్ని సంప్రదించవచ్చు. ఫొన్: 080 23330153, 23636826
 
- సజ్జేంద్ర కిషోర్, సాక్షి, బెంగళూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement