మట్టి లేకుండా సేంద్రియ ఇంటిపంటలు!
టై మీద, పెరట్లో మట్టి వాడకుండా హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే అవకాశం ఉంది. వీటితోపాటు మంచినీటి చేపలు లేదా అక్వేరియం చేపలను కూడా కలిపి ఆక్వాపోనిక్స్ పద్ధతిలో సాగు చేయవచ్చని స్వానుభవంతో చెబుతున్నారు డా. ఎన్‌ఎంకే సూరి.
బాల్కనీల్లో, టైల పైన, పెరట్లో మట్టి లేకుండానే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుకోవాలంటే సులువైన విధానం హైడ్రోపోనిక్స్. కొబ్బరి పొట్టులో వర్మీకంపోస్టు(2:1 నిష్పత్తిలో) కలిపి సేంద్రియ ఇంటిపంటగా రసాయన రహిత ఆహారాన్ని పెంచుకోగల అవకాశాలు మెండు. తక్కువ నీటి వసతి ఉన్న చోట ఈ పద్ధతి బాగా ఉపయోగ పడుతుంది.
ఆక్వాపోనిక్ పద్ధతి ద్వారానైతే.. ప్రత్యేకంగా నీరు పోయాల్సిన శ్రమ ఉండదు. అదనంగా చేపలు కూడా పెంచుకోవచ్చు. చేపలు పెంచుకోవడానికి అక్వేరియం ఒకటి ఏర్పాటు చేసుకొని, దానిలో నుంచి చేపల నీటిని పంపు ద్వారా మొక్కలకు అందేలా పైపు అమర్చుకోవాలి.
అక్వేరియంలో నీటిని మార్చే శ్రమ కూడా వద్దనుకుంటే, మొక్కలకు అందించిన నీటినే తిరిగి అక్వేరియంలోకి చేరేలా మరో పైపును అమర్చి నిరంతర నీటి ప్రవాహం జరిగే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. అక్వేరియం, మొక్కల కుండీలు, మోటారు పంపు, పైపులు ఏ సైజులో ఎట్లా ఉండాలి? అనేది మీరు ఎంపికచేసుకునే స్థలాన్ని బట్టి ఉంటుంది. తినడానికి పనికివచ్చే మంచినీటి కార్పు చేపలు లేదా అక్వేరియానికి పనికి వచ్చే ఆర్నమెంటల్ ఫిష్ గానీ, మన అవసరాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. మొక్కలను కుండీల్లో పెట్టుకోవచ్చు లేదా వీలైన సైజులో ఒక గ్రోటబ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో అక్వేరియం సామగ్రిని అమ్మే వారి వద్ద దొరికే స్టోన్స్(3/4‘)ను నింపుకొని.. ఆ టబ్‌లో ఆకుకూరలు, కూరగాయ మొక్కలను నాటుకోవచ్చు.
పోషకాలు అందేదెలా?
చేపల విసర్జితాలు కలిసే నీరే మొక్కలకు ప్రధాన పోషక వనరు. జీవామృతం లేదా వర్మీ వాష్ వంటి ద్రావణ ఎరువులను అదనంగా వాడొచ్చు. ఆకుకూరల మొక్కలకు వారానికోసారి, కూరగాయపంటలకు వారానికి రెండుసార్లు వాడాలి. సాధారణంగా చెరువుల్లో పెరిగే రోహు, తిలాపియా వంటి ఏ చేపలనైనా పెంచొచ్చు. ఇవి ఎదగడానికి 6-9 నెలల కాలం పడుతుంది. ట్యాంకు సైజు ఎంత పెద్దగా ఉంటే చేపలు అంత బాగా పెరుగుతాయి.
ఆక్వాపోనిక్స్‌ను ఇంటి పెరట్లో ఏర్పాటు చేసుకుంటే మంచిది. స్టెయిన్‌లెస్ స్టీల్ ఆక్వాపోనిక్స్ వ్యవస్థను ఇంట్లో పెట్టుకోవచ్చు. మా టై మీద ప్లాస్టిక్ ట్యాంకులలో 4’్ఠ4’్ఠ4’ ప్రయోగాత్మకంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించాను. దీన్ని 30’్ఠ20’ లకు విస్తరింపచేయబోతున్నాను. ఔత్సాహికులు చిన్న అక్వేరియం అంతటి పాత్రలను ఏర్పాటు చేసుకొని సేంద్రియ ఆక్వాపోనిక్స్ పద్ధతిలో అలవాటు చేసుకోవచ్చు. అక్వేరియం చేపలు, మొక్కల పెంపకం గురించి కొంత అవగాహన ఉన్న వారికి ఆక్వాపోనిక్స్ అంతగా కష్టమేమీ అనిపించదు. సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం.
- డా. ఎన్‌ఎంకే సూరి, నాగోల్, హైదరాబాద్