ఇంటిపంట’ స్ఫూర్తితో... మేడపైనే పండ్లు, కూరగాయలు!
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గృహిణి రేణుక తమ మేడపైన పచ్చని ఫుడ్ ఫారెస్ట్‌ను సృష్టించారు. వ్యవసాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న ఆమె ‘ఇంటిపంట’ స్ఫూర్తితో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ ప్రారంభించారు. తమ కుటుంబం కోసం ఆరోగ్యదాయకమైన పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. అప్పుడప్పుడూ ఇరుగు పొరుగు వారికీ రుచిచూపిస్తున్నారు. ఈ టై తోటను మెచ్చిన ‘చిన్న పిచ్చుక’ అందులోనే ఓ బుజ్జి గూడు కట్టుకుని.. సంతానం వృద్ధి చేసుకుంది!
ఆదిలాబాద్‌లోని ద్వారకానగర్‌లో వ్యాపారి అరుణ్‌కుమార్ ఖత్రి (9849267774), రేణుక ఖత్రి కుటుంబం మూడంతస్తుల సొంత భవనంలో నివాసం ఉంటోంది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని గృహిణిగా జీవనం కొనసాగిస్తున్న రేణుకకు పూల మొక్కలంటే ఇష్టం. అయితే, నాలుగేళ్ల క్రితం ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ చదివిన తర్వాత ఆమె దృష్టి సేంద్రియ ఇంటిపంటల వైపు మళ్లింది. హైదరాబాద్ కల్యాణ్‌నగర్‌కు చెందిన వేగేశ్న రామరాజు గారి టై గార్డెన్‌పై కథనం చదివి.. స్వయంగా వెళ్లి చూసి స్ఫూర్తి పొందానని ఆమె తెలిపారు. అప్పటి నుంచి తమ మేడ మీద సేంద్రియ పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. ‘ఇంటిపంట’ కాలమ్ అందిస్తున్న మెలకువలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. కాంక్రీటు మేడల మధ్య వీరి టై పచ్చగా అలరారుతోంది.
100 చదరపు గజాల టైపై 25 ప్లాస్టిక్ డ్రమ్ములు, 40 మట్టి కుండీలు ఏర్పాటు చేసి రేణుక నిక్షేపంగా ఇంటిపంటలు పండిస్తున్నారు. నల్లమట్టి, ఎర్రమట్టి, ఆవు పేడ ఎరువు, వరిపొట్టు, వేపపిండి, వర్మీకంపోస్టుతో కూడిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. సీతాఫలం, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, అల్లనేరేడు, ఉసిరి, సపోట, మామిడి, రేగు తదితర 15 రకాల పండ్ల చెట్లతోపాటు వివిధ కూరగాయ మొక్కలు, ఔషధ, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. రెండేళ్లుగా సొంత పండ్లు, సొంత కూరగాయలపైనే ఎక్కువగా వాడుతున్నామని రేణుక వివరించారు. వంటింటి వ్యర్థాలతో తయారైన కంపోస్టుతోపాటు జీవామృతాన్ని సొంతంగా తయారు చేసి కిచెన్ గార్డెన్‌కు 15 రోజులకోసారి వాడుతున్నారు.
నాటు విత్తనాలతోనే టమోటా, గోరుచిక్కుడు, మిరప, చిక్కుడు, బీర, కాకర, వంగ, బెండ, చేమగడ్డ, మునగ, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఇతర ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తమ ఇంటిపంటను అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుకీ పంచుతున్నారు. భర్త సహాయ సహకారాల్లేకుండా ఇంటిపంటల సాగు సాధ్యమయ్యేది కాదని, ఆయన తోడ్పాటుతోనే హైదారాబాద్, కడియం నర్సరీల నుంచి కోరుకున్న మొక్కలు తెప్పించుకుంటున్నానన్నారు రేణుక. సంధ్యా సమయాల్లో టై తోట పక్షుల కిలకిలారావాలతో సందడిగా ఉంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తూ మానసికోల్లాసాన్ని కలిగిస్తోందన్నారు రేణుక. గత ఏడాది నాగమల్లి చెట్టుపై చిన్న పిచ్చుకలు గూడు పెట్టడం.. మూడు పిల్లల్ని చేయడం.. తమ ‘ఇంటిపంట’లో మరువలేని మధుర జ్ఞాపకంగా మిగిలిందని ఆమె తృప్తిగా చెప్పారు.
- కొండా శ్రీనివాస్, ఆదిలాబాద్