నార్నూర్(గాదిగూడ): ఆచారం పేరిట ఓ గిరిజన బాలింతను ఐదురోజులుగా ఆరుబయటే ఉంచిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. గాదిగూడ మండ లం లొద్దిగూడకు చెందిన సిడాం లక్ష్మి అనే గర్భిణీ ఇదే మండలంలోని హీరాపూర్‌లో ఉన్న పుట్టింట్లో ఐదురోజుల క్రితం ప్రసవించింది. అయితే శిశువు బొడ్డు పేగు తెగే వరకు ఇంటి బయట ఎక్కడైనా ఉండాలనేది గిరిజనుల ఆచారం. దీంతో ఆమె శిశువుతో కలసి ఐదురోజులుగా సమీపంలోని పొలం వద్ద ఉంటోంది.
శుక్రవారం గ్రామసందర్శనకు వెళ్లిన గాదిగూడ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం హెల్త్ ఎడ్యుకేట్ ఆఫీసర్ (హెచ్‌ఈవో) పవార్ రవీందర్ ఆమె అవస్థలను గమనించారు. వర్షం పడుతోందని, ఇంటి బయట ఉంటే తల్లికీ, బిడ్డకూ ప్రమాదమని గ్రామపెద్దలు, కుటుంబసభ్యులకు నచ్చజెప్పడంతో సమీపంలోని ఓ రేకుల షెడ్డులోకి వారిని తరలించారు. ఆరోగ్యం విషయంలో మూఢనమ్మకాలను వీడాలని హెచ్‌ఈవో సూచించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, ప్రతిరోజూ బాలింత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment