Delivery Woman
-
మై ఛాయిస్!
భారతీయ మహిళలకు కుర్తాలు ఇష్టమైన దుస్తులు. వృత్తిరీత్యా టీషర్ట్లు ధరించడం అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే ‘విమెన్స్ డే’ సందర్భంగా జొమాటో తన మహిళా డెలివరీ పార్టనర్లకు ఎర్ర కుర్తాలను బహూకరించింది. ఇకపై వారు డ్యూటీలో నచ్చిన టీ షర్ట్గాని, కుర్తా గాని ధరించవచ్చు. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్ యాడ్ ఇంటర్నెట్లో కుతూహలం రేపుతోంది. జొమాటోలో దేశమంతా మూడున్నర లక్షల మంది డెలివరీ పార్టనర్లు ఉన్నారు. అంటే ఫుడ్ డెలివరీ చేసే బోయ్‌లు. వీరిలో స్త్రీలు కేవలం 1500 నుంచి 2000 మంది మాత్రమే ఉన్నారు. టూ వీలర్ మీద వేళకాని వేళలో తిరగాల్సి రావడం వల్ల ఇదొక ఛాలెంజింగ్ జాబ్ అయ్యింది మహిళలకు. అయినప్పటికీ సవాలుగా తీసుకుని వందల ఆర్డర్లు డెలివరీ చేస్తున్న జొమాటో మహిళలు ఉన్నారు. వృత్తిరీత్యా వారు టీషర్ట్ ధరించాల్సి ఉంటుంది. అది అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే జొమాటో మొన్నటి విమెన్స్ డే రోజు కుర్తాలు బహూకరించింది. ‘మీ చాయిస్. మీరు టీషర్ట్ వేసుకోవచ్చు లేదంటే కుర్తాలు వేసుకోవచ్చు’ అని చెప్పింది. ఇందుకోసం ప్రమోషన్ యాడ్ చేస్తే మహిళా డెలివరీ పార్టనర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘జేబులున్న కుర్తా నాకు నచ్చింది’ అని ఒక మహిళ చెప్పింది. ‘ఫోటోలు బాగా తీయండి’ అని మరో మహిళ ఉత్సాహపడింది. ‘పదండి అందరం మనాలి వెళ్దాం’ అని మరో మహిళ ఉత్సాహ పరిచింది. కొత్త ఉపాధి మార్గంలో వెరవక నడిచే వీరందరినీ చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. దేశీయ దుస్తుల్లో బాగున్నారంటూ కితాబిచ్చారు. -
విమానంలో మహిళకు పురిటినొప్పులు.. డెలివరీ చేసిన పైలట్
విమానం గాల్లో ఉండగా పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు పైలెట్ డెలివరీ చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తైవాన్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న వీట్‌జెట్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఎంతో ధైర్యంగా. సమయస్పూర్తితో వ్యవహరించి గర్భిణీకి పురుడు పోసినపైలెట్ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాలు.. వీట్ జెట్‌కు చెందిన విమానం తైపీ(తైవాన్) నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వెళ్తోంది. విమానంలో ఓ గర్భిణి కూడా ఉంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో బాత్రూమ్లో ఇబ్బంది పడుతున్న ఆమెను గమనించిన సిబ్బంది విషయాన్ని పైలట్ జకరిన్ సరార్న్రక్స్కుల్కు తెలియజేశారు. విమానం ల్యాండింగ్‌కు కూడా సమయంలో ఉండడంతో డెలివరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కెప్టెన్ జకరిన్ తన బాధ్యతలను కో పైలట్‌కు అప్పగించి కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చాడు. విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అడిగాడు. కానీ సమయానికి వైద్యులు కూడా లేకపోవడంతో వేరే మార్గం లేక తానే రంగంలోకి దిగాడు. మొబైల్ ద్వారా వైద్యులను సంప్రదించి.. వారి సూచనలతో మహిళకు పురుడు పోశాడు. ఇదంతా గమనించిన విమానంలోని ప్రయాణికులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. క్లిష్ట సమయంలో ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించిన పైలెట్‌ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. అనంతరం విమానం ల్యాండ్ అయ్యాక తల్లి, శిశువును ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిడ్డకు ముద్దుగా స్కై బేబబీ’ అని పేరు పెట్టారు. మరోవైపు 18 ఏళ్లుగా పైలట్‌గా వ్యవహరిస్తున్న జాకరిన్ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపాడు. చదవండి: గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. అంతలోనే -
వాట్సాప్ కాల్ సాయంతో ప్రసవం
శ్రీనగర్: నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) సిబ్బంది వాట్సాప్ కాల్ సాయంతో సురక్షితంగా ప్రసవం చేసిన సంఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. కుప్వారా జిల్లాలోని కెరాన్ పీహెచ్‌సీకి నెలలు నిండి, నొప్పులు మొదలైన గర్భిణిని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. ఎక్లామ్‌ప్సియా, ఎపిసియోటోమీతో బాధపడుతున్న ఆమెకు ప్రసవం జరగడం కష్టతరంగా మారింది. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో హెలికాప్టర్లో జిల్లా ఆసుపత్రికి తరలించడం వీలు కాలేదు. దీంతో కెరాన్ పీహెచ్సీ డాక్టర్లు క్రాల్పొరాలోని జిల్లా ఉప ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఆఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పర్వేజ్ వాట్సాప్ కాల్లో సూచనలు ఇస్తుండగా, కెరాన్ పీహెచ్సీ వైద్యులు మహిళకు విజయవంతంగా ప్రసవం చేశారు. ఆడ శిశువు జన్మించిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. -
న్యూస్ మేకర్: జీవితం ఆమెతో ఫుట్‌బాల్ ఆడింది
మొన్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మన పురుషుల టీం కనిపించిందా? పురుషుల టీమ్‌ను తయారు చేసుకోలేని మనం స్త్రీల టీమ్‌ను మాత్రం ఏం పట్టించుకుంటాం? అసలు ఫుట్‌బాల్ ఆడే అమ్మాయిలకు మన దేశంలో ఏం మర్యాద, ప్రోత్సాహం ఉన్నాయి? కోల్కటా ఫుట్‌బాల్ క్రీడాకారిణి పౌలమి అధికారి ఒకప్పుడు దేశ జట్టులో ఆడింది. ఇప్పుడు? జరుగుబాటు కోసం జొమాటో డెలివరి గర్ల్‌గా పని చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఈమె జీవిత అవస్థ గురించి సోషల్ మీడియాలో, మీడియాలో ఆవేదన వ్యక్తం అవుతోంది. జొమాటో అని రాసి ఉన్న ఎర్రటి టీ షర్ట్ తొడుక్కుని కోల్కటాలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్న 24 ఏళ్ల పౌలమి అధికారి ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి అని ఎవరూ ఊహించరు. గత కొంతకాలంగా ఇల్లు గడవడానికి పౌలమి ఫుడ్ డెలివరీ చేస్తోంది. కోల్కటాకే చెందిన సంజుక్త చౌధురి అని ట్విటర్ యూజర్ పౌలమి గురించి చిన్న వీడియో తీసి ట్విటర్లో ఉంచడంతో గత రెండు మూడు రోజుల్లోనే చాలా రెస్పాన్స్‌లు వచ్చాయి. విస్తృతంగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి నిస్సహాయ స్థితిలో ఉండటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అబ్బాయి అనుకునేవారు కోల్‌కటాలోని బెహలా ప్రాంతంలో నివసించే పౌలమి బాల్యంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తుంటే మేనత్త పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచే పౌలమి ఫుట్‌బాల్ ఆడేది. అయితే అబ్బాయిలాగా కనిపించే పౌలమిని చూసి అందరూ అబ్బాయి అనుకుని ఆడించేవారు. ‘ఆ తర్వాత నేను అమ్మాయి అని తెలిశాక ఆటలో రానివ్వలేదు. అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడితే వారికి ఏ మర్యాద లేదు. నేను ఫుట్‌బాల్ మానేసి కొన్నాళ్లు హాకీ ఆడాను. అయితే మా ప్రాంతంలోని అనిత సర్కార్ అనే ఫుట్‌బాల్ కోచ్ నన్ను చూసి ఫుట్‌బాల్‌లో ట్రయినింగ్ ఇచ్చింది. నేను మంచి ప్లేయర్‌ని అయ్యాను’ అంటుంది పౌలమి. పదిహేను ఏళ్లు వచ్చేసరికే పౌలమి మంచి ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయ్యింది. దేశం తరఫున అండర్ 16 జట్టుకు ఎంపికయ్యి 2013లో జరిగిన అండర్ 16 ఛాంపియన్షిప్ కోసం శ్రీలంక వెళ్లి ఆడింది. అయితే ఆ సమయంలో తగిలిన గాయాల నుంచి కోలుకోవడం కష్టమైంది. ఇంటివాళ్లుగాని, క్రీడా సంస్థలుగాని సరైన వైద్యం, ఫిట్నెస్ ట్రయినింగ్ ఇప్పించకపోవడంతో వెనుకబడింది. మళ్లీ కోలుకుని 2016లో జరిగిన స్ట్రీట్ ‘హోమ్‌లెస్ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్’ కోసం దేశం తరఫున గ్లాస్గో వెళ్లి ఆడింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఫుట్‌బాల్ అసోసియేషన్ నుంచి ఎటువంటి మద్దతు, ప్రోత్సాహం లభించలేదు. వెంటాడిన పేదరికం 2017లో తండ్రి చేస్తున్న డ్రైవర్ ఉద్యోగం పోయింది. ఇంకో చెల్లెలు, తను తప్ప సంపాదనకు ఎవరూ లేరు. 2019 నాటికి బతకడం దుర్భరమైంది. ‘అప్పుడే నేను జొమాటోలో చేరారు. ఆ రోజుల్లో రోజుకు 500 సంపాదించేదాన్ని. లాక్డౌన్ ఎత్తేశాక చాలామంది ఈ ఉద్యోగంలోకి వచ్చారు. ఆర్డర్లు తక్కువ. పైగా నాకు సైకిల్ తప్ప బండి లేదు. దాంతో దగ్గరి ఆర్డర్లే తీసుకుంటాను. అందువల్ల రోజుకు 400 వస్తాయి. ఒక్కో ఆర్డర్ మీద 20 లేదా 30 రూపాయలు వస్తాయి. ఒక్కోసారి రోజుకు 300 రూపాయలకు మించి రావు. నాకు వేరే దారి లేదు... ఈ పని తప్ప’ అంది పౌలమి. రోజుకు 12 గంటలు పని చేస్తూ కూడా ఒక్కోసారి ఫుట్‌బాల్‌ను సాధన చేస్తుంటుంది పౌలమి. బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నదిగాని అది కూడా నత్తనడకన సాగుతున్నది. వెల్లువెత్తిన స్పందన పౌలమి కథనానికి స్పందన వెల్లువెత్తింది. దేశంలో ఫుట్‌బాల్ క్రీడాకారుల స్థితి ఆ మాటకొస్తే ఏ కొద్ది మందో తప్ప అందరు క్రీడాకారుల స్థితి ఇలాగే ఉందనే స్పందన వచ్చింది. ఫుట్‌బాల్ ఆటను ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ని కోట్ల మంది భారతీయులు ఉన్నా పురుషులలోగాని, స్త్రీలలోగాని ప్రపంచ దేశాలతో తలపడే మెరుగైన టీమ్‌లు తయారు కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ‘నాకు ఇప్పుడు కుదురైన ఉద్యోగం, ప్రాక్టీసు చేయడానికి మంచి స్పైక్స్ కావాలి’ అంటున్న పౌలమిలాంటి వారిని ఆ స్థితిలో ఉంచడం విషాదం. ఇప్పుడు వచ్చిన స్పందనతో ఆమెకు ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి. -
డెలివరీ గర్ల్స్
ఫుడ్ యాప్‌లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎంత దూరమైనా వెళ్లే సత్తా మగవారికే ఉందనుకునే ఈ రంగంలో ఇప్పుడు మగువలు తమ తెగువను చూపుతున్నారు. ఫుడ్ డెలివరీని ‘ఎనీ టైమ్’ అంటూ ఇంటింటి గడపకు చేర్చడానికి సిద్ధమయ్యారు. దీనికి ఉదాహరణగా ఇటీవల మన హైదరాబాద్‌లోనూ డెలివరీ గర్ల్స్ దూసుకువస్తున్నారు. మరికొందరు మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మొట్టమొదటి డెలివరీ గర్ల్ కరోనా కాలం ముగిసాక దేశంలో అక్కడక్కడా డెలివరీ గర్ల్స్ను కూడా చూస్తున్నాం. ఇందుకు వారి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ‘కాలం’ ఇచ్చిన సమాధానాన్ని ధైర్యంగా భుజానికెత్తుకుంటున్నారు. ఈ జాబితాలో దేశంలో మొదటిసారి కలకత్తా నుంచి రూపా చౌదరి డెలివరీ గర్ల్‌గా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా 2,000 మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్‌కి ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి స్విగ్గీ ప్రకటనకు రూపాదేవి ప్రేరణ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఫుడ్ డెలివరీలోనే కాదు గత ఫిబ్రవరిలో మొట్టమొదటి బైక్ టాక్సీ డ్రైవర్‌గానూ రూపా చౌదరి పేరొందింది. వైవాహిక జీవితం దెబ్బతినడం, తల్లితండ్రులు, సోదరి మరణించడం, పదేళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాన్ని ఎంచుకుంది రూప. గతంలో భర్త, కొడుకుతో కలిసి కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాత్‌లో నివాసం ఉండేది. మొదట్లో ఆర్థికలేమి ఇచ్చిన ధైర్యం ఇది. ‘పోరాడి నిలవగలను అనే స్థైర్యాన్ని ఈ జాబ్ ఇస్తోంది’ అని తెలిపే రూపా ఇటీవల మరో బైక్ టాక్సీ యాప్‌లో డ్రైవర్‌గా చేరింది. ఇ–కామర్స్ కంపెనీలకు డెలివరీ సేవలు.. దక్షిణ ఢిల్లీలోని ఇరుకైన పరిసరాల్లో ఉండే ప్రియాంక సచ్దేవ అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి ప్రతిరోజూ డెలివరీ ప్యాకేజ్‌లను ఇళ్లవద్ద అందజేస్తుంటుంది. ఆరేళ్ల క్రితమే కార్గో కంపెనీ నమ్మకమైన వారితో నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఉండాలనే లక్ష్యంతో నలుగురు మహిళా డెలివరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొన్న సామాజిక సంస్థగా గుర్తింపు పొందింది. పురుష ఆధిపత్య రంగంలోకి ప్రవేశించడానికి ఎక్కువమంది మహిళలను ప్రోత్సహించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది కార్గో. అంతేకాదు, పేద అమ్మాయిలను గుర్తించి, వారికి బైక్ డ్రైవింగ్, సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇచ్చి మరీ నియామకం చేసుకుంది. వీరు మూడేళ్ల పాటు తమ సేవలను అందించారు. మిల్క్ ఉమెన్ ఇటీవల నగరంలోని ఓ పాల డెయిరీ తమ సంస్థ ఉత్పత్తులను డెలివరీ చేయడానికి మహిళలను నియమించుకుంది. ‘మిల్క్ మెన్ కి మాత్రమే ఈ పదం ఎందుకు పరిమితం కావాలి. మగువలకూ ఈ పదం వర్తించేలా’ చేయాలనుకున్నాం అని వివరించారు డెయిరీ ఫార్మ్ నిర్వాహకులు. ‘ఒంటరిగా వెళ్లద్దు. చీకటిపడటంతోనే ఇంటికి చేరాలి...’ లాంటి మాటలన్నీ ఆడపిల్లలకు సహజంగా ఇంటి నుంచి వినిపించేవే. సమాజం నుంచి లైంగిక వేధింపుల ఘటనలు భయపెడుతూ ఉండేవే. అయితేనేం, అన్ని అడ్డుగోడలను ఛేదించగలమని తెగువ చూపుతున్న నేటి తరపు మగువలు దూసుకువస్తున్నారు. కష్టం నేర్పిన పాఠం కరోనా మహమ్మారి చేసిన యుద్ధం లో ఎందరో ఛాంపియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన మామిడిపెల్లి రచన ఒకరు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడానికి హైదరాబాద్ వచ్చిన రచన పై చదువుల కోసం ఎప్పుడూ కష్టపడేది. ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుకున్న రచన టీచర్ల సలహాతో హైదరాబాద్‌లోని హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులో చేరింది. బతుకు దెరువు కోసం ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూ వచ్చింది. తన ఖర్చులు పోను మిగతా మొత్తం తల్లితండ్రులకు పంపించేది. కరోనా తర్వాత ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ జాబ్‌కి అప్లై చేసి, ఉద్యోగాన్ని పొందింది. ఫుడ్ డెలివరీ చేస్తూ చదువును కొనసాగిస్తోంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు ఇప్పటిదాకా డెయిరీ ఫార్మ్స్ ఏవీ కూడా పాల ఉత్పత్తుల సరఫరాకు మహిళల్ని వినియోగించలేదు. మొదటిసారి ఈ రంగంలో డెలివరీ పార్ట్‌నర్స్‌గా మహిళల్ని పరిచయం చేయాలనుకున్నాం. ప్రస్తుతం ఏడుగురు మహిళలు మా సంస్థ తరపున రోజూ ఉదయం మిల్క్‌ను డెలివరీ చేస్తున్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కి పెంచనున్నాం. – కిషోర్ ఇందుకూరి, సిథ్స్ ఫార్మ్ డైరీ – నిర్మలారెడ్డి -
స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు!
గతంలో జొమాటో తన డెలివరీ విమెన్‌కు సంవత్సరంలో 10 రోజుల బహిష్టు సెలవు ప్రకటించింది. ఆ సెలవులకు జీతం స్పష్టత లేదు. కాని స్విగ్గీ తన డెలివరీ విమెన్‌కు ప్రతి నెల రెండు రోజుల వేతన సెలవు ప్రకటించింది. అసంఘటిత రంగాలలో ఎందరో స్త్రీలు డెయిలీ వేజెస్ మీద పని చేస్తున్నారు. వారికి బహిష్టు సమయంలో రెండు రోజుల వేతన సెలవు ఎందుకు ఇవ్వకూడదు? స్విగ్గీ చేసిన ఆలోచన ఎందుకు చేయకూడదు? ఇంట్లో పనిమనిషిని అందరూ పెట్టుకుంటారు. రోజుకు రెండుపూట్ల రమ్మంటారు కొందరు. ఒకపూట చాలంటారు కొందరు. రోజూ పని చేయిస్తారు కొందరు. ఆదివారం రానక్కర్లేదు అంటారు మరికొందరు. పనిమనిషి అప్పుడప్పుడు పనికి రాదు. పోనీలే అని మొత్తం జీతం ఇస్తారు కొందరు. రాని రోజులకు జీతం కట్ చేస్తారు ఇంకొందరు. రాని రోజులకే జీతం కట్ చేసేవాళ్లు ఆమె బహిష్టు సమయంలో నలతగా అనిపించో, నొప్పిగా అనిపించో, చిరాగ్గా ఉండో, నీరసం వల్లో పనికి రానంటే జీతం ఇస్తారా? కాని ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ ఇంటి యజమానురాలు ఏ ఆఫీస్‌లో అయినా పని చేస్తూ ఉంటే బహిష్టు సమయంలో సెలవు పెట్టుకుంటే ఆమె జీతం ఆమెకు వస్తుంది. కాని పనిమనిషికి రాదు. ఇది సబబా? పని మనిషి వరకూ అక్కర్లేదు. ఫ్యాక్టరీల్లో డెయిలీ లేబర్ ఉంటారు. భవన నిర్మాణరంగంలో స్త్రీలు ఉంటారు. బట్టల షోరూముల్లో, మాల్స్‌లో పని చేసే స్త్రీలు ఉంటారు. వీరందరికీ వారానికి సగం రోజు మాత్రమే సెలవు ఇచ్చేవారున్నారు. ఇక నెలలో ఏ రోజు రాకపోయినా ఆ రోజు జీతం కట్. వీరందరూ బహిష్టు సమయంలో కష్టమయ్యి సెలవు పెడితే ఆ రెండుమూడు రోజుల పాటు డబ్బు నష్టపోవాల్సిందే. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? కాని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ రెండు రోజుల క్రితం అందరి చూపు ఆకర్షించింది. దాదాపు 45 నగరాల్లో 45,000 హోటళ్ల నుంచి నెలకు 20 లక్షల ఆహార ఆర్డర్లు సరఫరా చేసే ఈ సంస్థకు దాదాపు లక్షన్నర మంది ఫుడ్ డెలివరీ పార్టనర్స్ (బాయ్స్/గర్ల్స్) ఉన్నారు. వారిలో 1000 మంది ఫుడ్ డెలివరీ విమెన్ ఉన్నారు. ఈ సంఖ్యను 2000కు పెంచాలని స్విగ్గీ అనుకుంది కాని కరోనా వల్ల ఆ భర్తీ మందగించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ తన ఫుడ్ డెలివరీ విమెన్‌కు నెలలో రెండు రోజుల వేతన సెలవును ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఆ రెండురోజులు వాళ్లు రెగ్యులర్‌గా కనిష్టంగా రోజువారీ ఎంత కమీషన్ పొందుతారో అంత కమీషన్ వారికి ఇస్తారు. ‘నాకు పిరియెడ్స్. రెండు రోజులు సెలవు కావాలి’ అని మా డెలివరీ విమెన్ అడిగితే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా వెంటనే మంజూరు చేసే సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం అని స్విగ్గీ వైస్‌ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) మిహిర్ షా ప్రకటించారు. ఆ రెండు రోజులకు జీతం కూడా ఇస్తాం అని ఆయన తెలియచేశారు. 2014లో బెంగళూరులో ఆరు మంది డెలివరీ బాయ్స్‌తో మొదలైన స్విగ్గీ అనతికాలంలో మహా సంస్థగా అవతరించింది. 2016లో పూణెలో మొదటి డెలివరీ ఉమన్ ఉద్యోగంలో చేరితే 2019లో చెన్నైలో ఆ తర్వాత ముంబైలో డెలివరీ పార్టనర్స్‌గా చేరడం మొదలెట్టి ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికిపైగా మారింది. ‘మా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. వారు దాని ద్వారా ఎమర్జన్సీ నంబర్‌కు కాల్ చేసే వీలు ఉంది. వారికి తక్షణం సహాయం కావాలంటే అందుతుంది. మేము వారి కోసం శుభ్రమైన టాయిలెట్లు కల్పిస్తున్నాము. షెల్ పెట్రోల్ బంకులతో ప్రత్యేకంగా చేసుకున్న ఏర్పాటు వల్ల మా డెలివరీ విమెన్ ఆ బంకుల్లోని టాయిలెట్లను ఉపయోగించుకోవచ్చు. డెలివరీ, ట్రావెల్ రంగాల్లో కేవలం బహిష్టు సమస్య వల్ల స్త్రీలు రాకుండా ఉండకూడదు. వారికి సౌకర్యాలు కల్పించాలి. అలాగే ఆ రోజులకు వేతన సెలవు ఇవ్వాలి’ అని స్విగ్గీ ప్రతినిధి ఒకరు అన్నారు. స్విగ్గీలో పని చేస్తున్న మహిళల్లో దాదాపు 90 శాతం మంది 45 ఏళ్ల లోపువారే. వీరిలో జీవితంలో తొలి సంపాదన స్విగ్గీతో మొదలెట్టిన వారు 24 శాతం మంది ఉన్నారు. తమకు వీలున్న టైమ్‌లోనే పని చేసే అవకాశం ఉండటంతో చేరుతున్నారు. చాలామంది తమ సంపాదన ఇంటి అద్దెకు, కరెంటు బిల్లుకు ఉపయోగిస్తున్నారు. కొంతమంది యువతులు చదువుకోవడానికి. ‘మహిళా డెలివరీ పార్టనర్స్‌కు వాహనాలు లేకపోతే వారి కోసం మా సంస్థ ఎలక్ట్రిక్ సైకిల్/బైక్‌లను అద్దెకు ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలతో మాట్లాడుతున్నాం’ అని కూడా స్విగ్గీ సంస్థ ప్రతినిధి అన్నారు. ప్రస్తుతం నగరాల్లో ఫుడ్ డెలివరీ సిబ్బంది తమ పెట్రోల్ ఖర్చులు పోను 20 వేల నుంచి 25 వేలు సంపాదిస్తున్నారు. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? -
ఆచారం పేరిట ఐదు రోజులుగా ఆరుబయటే బాలింత
నార్నూర్(గాదిగూడ): ఆచారం పేరిట ఓ గిరిజన బాలింతను ఐదురోజులుగా ఆరుబయటే ఉంచిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. గాదిగూడ మండ లం లొద్దిగూడకు చెందిన సిడాం లక్ష్మి అనే గర్భిణీ ఇదే మండలంలోని హీరాపూర్‌లో ఉన్న పుట్టింట్లో ఐదురోజుల క్రితం ప్రసవించింది. అయితే శిశువు బొడ్డు పేగు తెగే వరకు ఇంటి బయట ఎక్కడైనా ఉండాలనేది గిరిజనుల ఆచారం. దీంతో ఆమె శిశువుతో కలసి ఐదురోజులుగా సమీపంలోని పొలం వద్ద ఉంటోంది. శుక్రవారం గ్రామసందర్శనకు వెళ్లిన గాదిగూడ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం హెల్త్ ఎడ్యుకేట్ ఆఫీసర్ (హెచ్‌ఈవో) పవార్ రవీందర్ ఆమె అవస్థలను గమనించారు. వర్షం పడుతోందని, ఇంటి బయట ఉంటే తల్లికీ, బిడ్డకూ ప్రమాదమని గ్రామపెద్దలు, కుటుంబసభ్యులకు నచ్చజెప్పడంతో సమీపంలోని ఓ రేకుల షెడ్డులోకి వారిని తరలించారు. ఆరోగ్యం విషయంలో మూఢనమ్మకాలను వీడాలని హెచ్‌ఈవో సూచించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, ప్రతిరోజూ బాలింత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు. -
అబ్రకదబ్ర.. సెలబ్రిటీ అయిపోయింది!
న్యూయార్క్ : అమెజాన్ డెలివరీ మెన్ కావచ్చు.. ఉమెన్ కావచ్చు, వాళ్ల పని ఆర్డర్ చేసిన వస్తువులను క్షేమంగా కస్టమర్ ఇంటి దగ్గరకు చేర్చటం మాత్రమే.. కస్టమర్లు చెప్పినట్లు చేయటం కాదు. కానీ, అమెరికాకు చెందిన ఓ డెలివరీ ఉమన్ మాత్రం ఓ చిన్నపిల్లాడు కోరిన విధంగా వస్తువును డెలివరీ చేసి నెటిజన్ల మనసులు గెలుచుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, డెలావేర్కు చెందిన లిన్ డెబోరా స్టఫిరీ అనే మహిళ కొద్దిరోజుల కిత్రం తన కుమారుడి కోసం అమెజాన్‌లో ఓ వస్తువు ఆర్డర్ చేసింది. అయితే ఆ చిన్న పిల్లాడు తను చెప్పిన విధంగానే డెలివరీ చేయాలని ఆర్డర్ సందర్భంగా విన్నవించుకున్నాడు. దీంతో పిల్లాడి కోరికను కాదనలేకపోయిన ఓ డెలివరీ ఉమన్ చెప్పిన విధంగానే చేసింది. ( దొంగతనం చేసిన మరుసటి రోజే..) ఇంటి ముందు పార్శిల్ పెట్టి ‘‘ అబ్రకదబ్ర’’ అని గట్టిగా అరిచింది. అనంతరం పరిగెత్తుకుంటూ అక్కడినుంచి వచ్చి వ్యానులోకి ఎక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ ఆ డెలివరీ ఉమన్ మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ డెలివరీ చేసే ప్రతీ వ్యక్తి మన కోరికల్ని మన్నించరు... ఇది చూస్తుంటే నాకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి.. ఆమెకు ఎంప్లాయి ఆఫ్ ది మంత్ అవార్డు ఇవ్వండి’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( అందమైన జీవిత రహస్యం చెప్పిన సెహ్వాగ్ ) -
కాలు జారిపడి బాలింత మృతి
వరంగల్: వరంగల్ నగరంలోని సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆసుపత్రి బాత్రూమ్లోకి వెళ్లిన బాలింత ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మృతి చెందింది. దీంతో మృతిరాలి బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి బాత్రూమ్లు అపరిశుభ్రంగా ఉండడం వల్లే బాలింత మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. దీంతో ఆసుపత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతురాలు మంజుల స్వస్థలం తొర్రూర్ మండలం నాంచారి మదూరని ఆమె బంధువులు వెల్లడించారు.