వైరల్
భారతీయ మహిళలకు కుర్తాలు ఇష్టమైన దుస్తులు. వృత్తిరీత్యా టీషర్ట్‌లు ధరించడం అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే ‘విమెన్స్ డే’ సందర్భంగా జొమాటో తన మహిళా డెలివరీ పార్టనర్లకు ఎర్ర కుర్తాలను బహూకరించింది. ఇకపై వారు డ్యూటీలో నచ్చిన టీ షర్ట్‌గాని, కుర్తా గాని ధరించవచ్చు. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్ యాడ్ ఇంటర్‌నెట్‌లో కుతూహలం రేపుతోంది.
జొమాటోలో దేశమంతా మూడున్నర లక్షల మంది డెలివరీ పార్టనర్లు ఉన్నారు. అంటే ఫుడ్ డెలివరీ చేసే బోయ్‌లు. వీరిలో స్త్రీలు కేవలం 1500 నుంచి 2000 మంది మాత్రమే ఉన్నారు. టూ వీలర్ మీద వేళకాని వేళలో తిరగాల్సి రావడం వల్ల ఇదొక ఛాలెంజింగ్ జాబ్ అయ్యింది మహిళలకు. అయినప్పటికీ సవాలుగా తీసుకుని వందల ఆర్డర్లు డెలివరీ చేస్తున్న జొమాటో మహిళలు ఉన్నారు. వృత్తిరీత్యా వారు టీషర్ట్ ధరించాల్సి ఉంటుంది. అది అందరికీ సౌకర్యం కాకపోవచ్చు.
అందుకే జొమాటో మొన్నటి విమెన్స్ డే రోజు కుర్తాలు బహూకరించింది. ‘మీ చాయిస్. మీరు టీషర్ట్ వేసుకోవచ్చు లేదంటే కుర్తాలు వేసుకోవచ్చు’ అని చెప్పింది. ఇందుకోసం ప్రమోషన్ యాడ్ చేస్తే మహిళా డెలివరీ పార్టనర్‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘జేబులున్న కుర్తా నాకు నచ్చింది’ అని ఒక మహిళ చెప్పింది. ‘ఫోటోలు బాగా తీయండి’ అని మరో మహిళ ఉత్సాహపడింది. ‘పదండి అందరం మనాలి వెళ్దాం’ అని మరో మహిళ ఉత్సాహ పరిచింది. కొత్త ఉపాధి మార్గంలో వెరవక నడిచే వీరందరినీ చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. దేశీయ దుస్తుల్లో బాగున్నారంటూ కితాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment