ఆత్మబలం
‘చీకటిని చూసి విచారించవద్దు. అదిగో చిరుదీపం’ అంటుంది ఆశావాదం. ‘ఏమీ లేదని బాధ పడవద్దు. నేనే నీ ఆయుధం, బలం’ అంటుంది ఆత్మవిశ్వాసం. ఆశావాదం వెల్లివిరిసే చోట ఆత్మవిశ్వాసం ఉంటుంది. జయంతి బురడ, రాణిమా దాస్, మలీషా ఖర్వాలకు ఘనమైన కుటుంబ నేపథ్యం లేదు. ‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించిన వీరు తమను తాము తీర్చిదిద్దుకుంటూ ‘హీరో’లుగా పేరు తెచ్చుకున్నారు. ఫోర్బ్స్ ఇండియా టాప్ సెల్ఫ్–మేడ్ ఉమెన్ 2024 (డబ్ల్యూ–పవర్ లీస్ట్)లో చోటు సాధించారు...
గిరిజన గొంతుక
గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసురావడానికి జర్నలిస్ట్ కావాలనుకుంది అడవి బిడ్డ జయంతి బురుడ. అయితే ఇంట్లో మాత్రం ‘చదివింది చాలు’ అనే మాట ఎప్పడూ వినిపించేది. దీంతో ఇంటిని విడిచిపెట్టి స్నేహితుల సహాయంతో ఒడిషా సెంట్రల్ యూనివర్శిటీలో జర్నలిజంలో డిగ్రీ చేసింది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోని సెర్పల్లి ఆమె స్వగ్రామం.
2015లో భువనేశ్వర్‌లోని కళింగ టీవీ న్యూస్ చానల్ రిపోర్టర్‌గా చేరిన జయంతి బురుడ జర్నలిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. తన రిపోర్టింగ్ టూర్‌లలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాల లేమిపై దృష్టి పెట్టడమే కాదు వాటి పరిష్కారానికి కూడా కృషి చేసింది. ఆడపిల్లల చదువు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 2018లో ‘బడా దీదీ యూనియన్’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టింది. ‘బడా దీదీ యూనియన్’ ద్వారా గిరిజన మహిళల కోసం ఎన్నో అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించింది.
తమను వేధిస్తున్న సమస్యలపై గిరిజన మహిళలు ధైర్యంగా గొంతు విప్పలేకపోవడాన్ని జయంతి గ్రహించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, ధైర్యంగా గొంతు విప్పడానికి 2022లో ‘జంగిల్ రాణి’ పేరుతో వేదిక ప్రారంభించింది. ‘మన కథ– మన కోసం’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇది.
మల్కన్‌గిరిలోని ఏడు బ్లాక్‌లకు చెందిన యాభై మంది గిరిజన మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నారు. స్క్రిప్ట్‌లు రాయడం, వీడియోలు చిత్రీకరించడం, ఎడిటింగ్....మొదలైవాటిని వీరికి నేర్పించింది బురుడ.
సంస్కృతి నుంచి తాము ఎదుర్కోంటున్న సమస్యల వరకు చేతిలోని సెల్‌ఫోన్‌తో వీడియో స్టోరీలు చేస్తున్నారు గిరిజన మహిళలు. ఈ స్టోరీలను ‘జంగిల్ రాణి’ ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేస్తారు. గిరిజన సమాజానికి, అడవులు, జీవనవైవిధ్యానికి ఉన్న సంబంధానికి అద్దం పట్టే సహజ కథనాలు ఇవి.
ఎంతోమంది సాధారణ మహిళలలో అసాధారణ ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఎంతో కృషి చేసింది జయంతి బురుడ.
ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్
‘ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్’గా పేరు సంపాదించిన మలీషా ఖర్వా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్–పవర్ 2024 జాబితాలో చోటు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్‌మన్‌తో కలిసి నటించిన తరువాత మలీషా జీవితం మారిపోయింది. ముంబైలోని ధారవి మురికివాడలో ఒక గుడిసెలో నివసిస్తున్న మలీషా రాబర్ట్ హాఫ్‌మన్ దృష్టిలో పడింది.
ఆ అమ్మాయిలోని వెలుగేదో రాబర్ట్‌ను ఆకట్టుకుంది. ‘ఈ మట్టిలో మాణిక్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి’ అనుకున్నాడు. మోడల్, డ్యాన్సర్ కావాలన్న మలీషా కలను సాకారం చేసేందుకు తన వంతు సాయం అందించాడు. మలీషాకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో 4,50,000 మంది ఫాలోవర్‌లు, 88,700 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన మలీషా లగ్జరీ ఇండియన్ కాస్మోటిక్స్ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. పదహారు సంవత్సరాల మలీషా ఖర్వా మోడల్, కంటెట్ క్రియేటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది.
‘కల నిజం చేసుకోవడానికి పేదరికం ఎంతమాత్రం అడ్డు కాదు’ అని నిరూపించిన మలీషా ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
అంగన్‌వాడీ అక్క
దేశంలోని 23 లక్షల అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్‌ల ప్రతినిధిగా రాణిమా దాస్‌ను ఫోర్బ్స్ ఇండియా ‘ఉమెన్ పవర్ లిస్ట్ 2024’లో చోటు కోసం ఆల్ ఇండియా అంగన్ వాడీ వర్కర్ ఫెడరేషన్ నామినేట్ చేసింది. అస్సాంలో పరఖోవా గ్రామానికి చెందిన రాణిమా దాస్ ఎవరికి ఏ సమస్య వచ్చినా ‘నేను ఉన్నాను’ అంటూ ముందుకు వచ్చేది. సమస్యల పరిష్కారంతో పాటు మహిళలకు ఆరోగ్యానికి సంబంధించిన నలహాలు ఇవ్వడంలో మంచి పేరు తెచ్చుకుంది.
అంకితభావం, నిబద్ధతతో వ్యవహరించే రాణిమాను ‘అక్కా’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. గత పదిహేడేళ్లుగా పిల్లలను బడిలో చేర్పించడం, గర్భిణి స్త్రీలకు సూచనలు...మొదలైన ఎన్నో విషయాల్లో కృషి చేస్తోంది రాణిమా దాస్. సలహాలు, సహాయం విషయంలో ముందు ఉన్నట్లే పోరాట విషయంలో ముందుంటుంది. అస్సాం అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెండ్ అయిన రాణిమా దాస్ అంగన్‌వాడీ వర్కర్‌ల వేతన పెంపుదల కోసం పోరాటం చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడూ పోరాడతాం’ అంటున్న రాణిమా దాస్‌కు పోరాటం కొత్త కాదు.
Comments
Please login to add a commentAdd a comment