Self Made
-
శ్రామికలోక శక్తిమంతులు
‘చీకటిని చూసి విచారించవద్దు. అదిగో చిరుదీపం’ అంటుంది ఆశావాదం. ‘ఏమీ లేదని బాధ పడవద్దు. నేనే నీ ఆయుధం, బలం’ అంటుంది ఆత్మవిశ్వాసం. ఆశావాదం వెల్లివిరిసే చోట ఆత్మవిశ్వాసం ఉంటుంది. జయంతి బురడ, రాణిమా దాస్, మలీషా ఖర్వాలకు ఘనమైన కుటుంబ నేపథ్యం లేదు. ‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించిన వీరు తమను తాము తీర్చిదిద్దుకుంటూ ‘హీరో’లుగా పేరు తెచ్చుకున్నారు. ఫోర్బ్స్ ఇండియా టాప్ సెల్ఫ్–మేడ్ ఉమెన్ 2024 (డబ్ల్యూ–పవర్ లీస్ట్)లో చోటు సాధించారు... గిరిజన గొంతుక గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసురావడానికి జర్నలిస్ట్ కావాలనుకుంది అడవి బిడ్డ జయంతి బురుడ. అయితే ఇంట్లో మాత్రం ‘చదివింది చాలు’ అనే మాట ఎప్పడూ వినిపించేది. దీంతో ఇంటిని విడిచిపెట్టి స్నేహితుల సహాయంతో ఒడిషా సెంట్రల్ యూనివర్శిటీలో జర్నలిజంలో డిగ్రీ చేసింది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోని సెర్పల్లి ఆమె స్వగ్రామం. 2015లో భువనేశ్వర్‌లోని కళింగ టీవీ న్యూస్ చానల్ రిపోర్టర్‌గా చేరిన జయంతి బురుడ జర్నలిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. తన రిపోర్టింగ్ టూర్లలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాల లేమిపై దృష్టి పెట్టడమే కాదు వాటి పరిష్కారానికి కూడా కృషి చేసింది. ఆడపిల్లల చదువు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 2018లో ‘బడా దీదీ యూనియన్’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టింది. ‘బడా దీదీ యూనియన్’ ద్వారా గిరిజన మహిళల కోసం ఎన్నో అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించింది. తమను వేధిస్తున్న సమస్యలపై గిరిజన మహిళలు ధైర్యంగా గొంతు విప్పలేకపోవడాన్ని జయంతి గ్రహించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, ధైర్యంగా గొంతు విప్పడానికి 2022లో ‘జంగిల్ రాణి’ పేరుతో వేదిక ప్రారంభించింది. ‘మన కథ– మన కోసం’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇది. మల్కన్‌గిరిలోని ఏడు బ్లాక్‌లకు చెందిన యాభై మంది గిరిజన మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నారు. స్క్రిప్ట్‌లు రాయడం, వీడియోలు చిత్రీకరించడం, ఎడిటింగ్....మొదలైవాటిని వీరికి నేర్పించింది బురుడ. సంస్కృతి నుంచి తాము ఎదుర్కోంటున్న సమస్యల వరకు చేతిలోని సెల్‌ఫోన్‌తో వీడియో స్టోరీలు చేస్తున్నారు గిరిజన మహిళలు. ఈ స్టోరీలను ‘జంగిల్ రాణి’ ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేస్తారు. గిరిజన సమాజానికి, అడవులు, జీవనవైవిధ్యానికి ఉన్న సంబంధానికి అద్దం పట్టే సహజ కథనాలు ఇవి. ఎంతోమంది సాధారణ మహిళలలో అసాధారణ ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఎంతో కృషి చేసింది జయంతి బురుడ. ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్ ‘ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్’గా పేరు సంపాదించిన మలీషా ఖర్వా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్–పవర్ 2024 జాబితాలో చోటు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్మన్తో కలిసి నటించిన తరువాత మలీషా జీవితం మారిపోయింది. ముంబైలోని ధారవి మురికివాడలో ఒక గుడిసెలో నివసిస్తున్న మలీషా రాబర్ట్ హాఫ్మన్ దృష్టిలో పడింది. ఆ అమ్మాయిలోని వెలుగేదో రాబర్ట్‌ను ఆకట్టుకుంది. ‘ఈ మట్టిలో మాణిక్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి’ అనుకున్నాడు. మోడల్, డ్యాన్సర్ కావాలన్న మలీషా కలను సాకారం చేసేందుకు తన వంతు సాయం అందించాడు. మలీషాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో 4,50,000 మంది ఫాలోవర్లు, 88,700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన మలీషా లగ్జరీ ఇండియన్ కాస్మోటిక్స్ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. పదహారు సంవత్సరాల మలీషా ఖర్వా మోడల్, కంటెట్ క్రియేటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘కల నిజం చేసుకోవడానికి పేదరికం ఎంతమాత్రం అడ్డు కాదు’ అని నిరూపించిన మలీషా ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అంగన్వాడీ అక్క దేశంలోని 23 లక్షల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ప్రతినిధిగా రాణిమా దాస్‌ను ఫోర్బ్స్ ఇండియా ‘ఉమెన్ పవర్ లిస్ట్ 2024’లో చోటు కోసం ఆల్ ఇండియా అంగన్ వాడీ వర్కర్ ఫెడరేషన్ నామినేట్ చేసింది. అస్సాంలో పరఖోవా గ్రామానికి చెందిన రాణిమా దాస్ ఎవరికి ఏ సమస్య వచ్చినా ‘నేను ఉన్నాను’ అంటూ ముందుకు వచ్చేది. సమస్యల పరిష్కారంతో పాటు మహిళలకు ఆరోగ్యానికి సంబంధించిన నలహాలు ఇవ్వడంలో మంచి పేరు తెచ్చుకుంది. అంకితభావం, నిబద్ధతతో వ్యవహరించే రాణిమాను ‘అక్కా’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. గత పదిహేడేళ్లుగా పిల్లలను బడిలో చేర్పించడం, గర్భిణి స్త్రీలకు సూచనలు...మొదలైన ఎన్నో విషయాల్లో కృషి చేస్తోంది రాణిమా దాస్. సలహాలు, సహాయం విషయంలో ముందు ఉన్నట్లే పోరాట విషయంలో ముందుంటుంది. అస్సాం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెండ్ అయిన రాణిమా దాస్ అంగన్వాడీ వర్కర్ల వేతన పెంపుదల కోసం పోరాటం చేసింది. అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడూ పోరాడతాం’ అంటున్న రాణిమా దాస్‌కు పోరాటం కొత్త కాదు. -
‘సెల్ఫ్–మేడ్’ కంపెనీలకు కేరాఫ్‌గా బెంగళూరు
ముంబై: స్వయం శక్తితో ఎదిగిన ఎంట్రప్రెన్యూర్ల (సెల్ఫ్–మేడ్) కంపెనీలు అత్యధికంగా బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఏకంగా 129 అత్యంత విలువైన దిగ్గజాలకు దేశీ సిలికాన్ వేలీ .. హబ్‌గా నిలుస్తోంది. ఈ విషయంలో ముంబై (78), గురుగ్రామ్ .. న్యూఢిల్లీ (49) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 200 సంస్థలతో హురున్ ఇండియా రపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వ్యాపార దిగ్గజం రాధాకిషన్ దవనీ ముంబైలో నెలకొల్పిన అవెన్యూ సూపర్మార్కెట్స్ (డీమార్ట్ మాతృ సంస్థ) రూ. 2.38 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్‌తో అగ్రస్థానంలో ఉంది. బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్.. బెంగళరులో నెలకొల్పిన ఫ్లిప్‌కార్ట్ రూ. 1.19 లక్షల కోట్ల విలువతో రెండో స్థానంలో ఉండగా, గురుగ్రామ్ కేంద్రంగా పని చేస్తున్న జొమాటో (వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్) రూ. 86,835 కోట్ల మార్కెట్ క్యాప్‌తో మూడో స్థానంలో నిల్చింది. లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలకూ ఈ జాబితాలో చోటు కల్పించామని, వాటి వేల్యుయేషన్లను ఇన్వెస్టర్లు తగ్గించిన పక్షంలో ఆ వివరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. మరిన్ని విశేషాలు.. లిస్టులో చోటు దక్కించుకున్న 200 కంపెనీలకు 405 మంది వ్యవస్థాపకులు ఉన్నారు. ఇవన్నీ 2000 సంవత్సరం తర్వాత ప్రారంభించినవే. వీటి మొత్తం విలువ రూ. 30 లక్షల కోట్లు. అత్యధిక సంఖ్యలో సంస్థలు (45) ఆర్థిక సేవల రంగంలో ఉన్నాయి. 30 కంపెనీలతో రిటైల్ రంగం, 26 సంస్థలతో హెల్త్‌కేర్ రంగం తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సొంత నిధులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నిధులతో (బూట్‌స్ట్రాప్) ఏర్పాటు చేసిన సంస్థలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఆ కోవకి చెందిన డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ జిరోధా 10వ స్థానంలో నిల్చింది. జాబితాలో ఇరవై మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లు ఉన్నారు. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నయ్యర్ అగ్రస్థానంలో నిల్చారు. వయస్సురీత్యా చూస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్ వ్యవస్థాపకుడైన 80 ఏళ్ల అశోక్ సూతా అత్యంత సీనియర్‌గా ఉండగా, జెప్టోకి చెందిన 21 సంవత్సరాల కైవల్య వోహ్రా అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నారు. -
అమెరికాలో శ్రీమంతురాళ్లు.. వీళ్ల సంపద ఎంతో తెలుసా?!
న్యూయార్క్: Forbes Among America's 100 Richest Self Made Women : అమెరికాలోని టాప్ 100 సంపన్న మహిళల్లో (స్వయంగా ఆర్జించిన) నలుగురు భారత సంతతి వనితలకు చోటు లభించింది. పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రా నూయి(67), అరిస్టా నెట్వర్క్స్ (కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ) ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్(62), సింటే (ఐటీ కన్సల్టెంగ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేతి(68), కన్‌ఫ్లూయెంట్ (క్లౌడ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నేహా నార్కడే (38) ఫోర్బ్స్ ‘అమెరికా సంపన్న మహిళల’జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి ఉమ్మడి సంపద 4.06 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33292 కోట్లు)గా ఉంది. 100 మంది మహిళలు ఉమ్మడిగా 124 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారని, ఏడాది క్రితంతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఫోర్బ్స్ తెలిపింది. జాబితాలో జయశ్రీ ఉల్లాల్ 2.4 బిలియన్ డాలర్ల సంపదతో 15వ ర్యాంకులో ఉన్నారు. ఉన్నత విద్యను అమెరికాలో అభ్యసించారు. నీర్జా సేతి 990 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. తన భర్తతో కలసి స్థాపించిన సింటెల్‌ను ఫ్రెంచ్ ఐటీ సంస్థ అటోస్ ఎస్ఈకి 3.4 బిలియన్ డాలర్లకు 2018లో విక్రయించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన తర్వాత ఆక్లాండ్ వర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. నార్కడే 520 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 38వ స్థానంలో ఉన్నారు. కన్ఫ్లూయెంట్లో ఆమెకు 6 శాతం వాటాలున్నాయి. మరొకరితో కలసి ఆసిలర్ పేరుతో కొత్త కంపెనీని 2023 మార్చిలో స్థాపించారు. ఇంద్రా నూయి 2019లో పెప్సీకో సీఈవోగా రిటైర్ అయ్యారు. 350 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 77వ స్థానంలో నిలిచారు. -
Neha Narkhede: టెక్నోస్టార్
పుణెలోని ఆ ఇంట్లో మరాఠీ, హిందీ పాటలతో పాటు పాఠాలు కూడా వినిపించేవి. అయితే అవి క్లాస్రూమ్ పాఠాలు కాదు. ఎన్నో రంగాలలో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన మహిళల గురించిన గెలుపు పాఠాలు. ఆ పాఠాలు వింటూ వింటూ ‘నేను కూడా సాధిస్తాను’ అన్నది చిన్నారి నేహ. అవును ఆమె సాధించింది! ఫోర్బ్స్ అమెరికా ‘రిచ్చెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్–2023’ జాబితాలో వివిధ రంగాలకు చెందిన వందమంది మహిళలకు చోటు దక్కింది. వీరిలో పదకొండు మంది నలభై ఏళ్ల వయసులోపు ఉన్నవారు. వారిలో ఒకరు 38 సంవత్సరాల టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ నేహ నర్ఖాడే.... మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగింది నేహ. ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తనకు కంప్యూటర్ కొనిచ్చారు. అప్పుడు టెక్నాలజీపై మొదలైన ప్రేమ అలా కొనసాగుతూనే ఉంది. టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త కొత్త విజయాలు సాధించేలా చేస్తూనే ఉంది. తన బలం ‘తల్లిదండ్రులు’ అని చెప్పుకుంటుంది నేహ. ‘మొదట చదువు విలువ గురించి చెప్పారు. చదువుపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఎంతోమంది మహిళా రోల్‌మోడల్స్ గురించి చెప్పేవారు. నువ్వు కూడా ఏదైనా సాధించాలి అంటూనే... యస్. నువ్వు సాధించగలవు అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించారు’ అంటుంది నేహ. పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో చదువుకున్న నేహ ... జార్జియా (యూఎస్)లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. జార్జియాలో చదువుకునే రోజుల్లో ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి అనే విషయంలో ఎంతోమంది స్నేహితులతో చర్చిస్తూ ఉండేది. ‘ఒరాకిల్’లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తొలి ఉద్యోగం చేసిన నేహ ఆ తరువాత ‘లింక్ట్ ఇన్’లో చేరింది. ఆ సమయంలో రకరకాల స్టార్టప్‌లు, వాటి విజయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘అపాచీ కాఫ్కా’ అనే ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. కంపెనీలు తమ డాటాతో వేగంగా యాక్సెస్ అయ్యే అవకాశాన్ని ఈ ప్లాట్‌ఫామ్ కల్పిస్తుంది. ‘ఎలాంటి జటిలమైన సమస్యను అయినా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి’ అనేది లక్ష్యంగా నిర్ణయించుకుంది. రెండు సంవత్సరాల తరువాత ‘కన్‌ఫ్లూయెంట్’ అనే ఫుల్–స్కేల్ డాటా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది నేహ. ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు ‘కన్‌ఫ్లూయెంట్’ నుంచి సేవలు పొందుతున్నాయి. కంపెనీకి సంబంధించి భాగస్వాములు, ఉద్యోగులను ఎంచుకోవడంలో నేహ అనుసరించే పద్ధతి ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘తెలివితేటలతో పాటు కష్టపడే స్వభావం ముఖ్యం. వీరితో ఐడియాలు షేర్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది అనిపించాలి. సమస్య తలెత్తినప్పుడు మెరుపు వేగంతో పరిష్కరించే సామర్థ్యం ఉండాలి’ నేహ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు స్టార్టప్ కల్చర్‌పై ఇప్పుడు ఉన్నంత అవగాహన లేదు. ప్రతి అడుగు ఆచితూచి వేసినా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుండేది. వెంటనే ఆ తప్పును దిద్దుకొని ముందుకు సాగేది. నేహా నర్ఖాడే విజయరహస్యం ఏమిటి? ‘వ్యూహాలు, ప్రతివ్యూహల సంగతి తరువాత. ఎంటర్ప్రెన్యూర్లకు తప్పనిసరిగా కావాల్సింది మానసిక బలం. ఆ బలం ఉంటే యుద్ధరంగంలో అడుగు ముందుకు వేయగలం. విజయాలు సాధించగలం. ఇది నా దారి... అంటూ పరుగెత్తడం కాదు. చుట్టూ ఏం జరుగుతుందో అనేదానిపై పరిశీలన దృష్టి ఉండాలి. మన తప్పుల నుంచీ కాదు ఇతరుల తప్పుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. టైమ్మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి’ అంటుంది నేహ. నేహ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు రోల్‌మోడల్, తన రోల్‌మోడల్ మాత్రం ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ‘నియో’ ఫౌండర్, సీయివో పద్మశ్రీ వారియర్. ‘రోల్‌మోడల్ స్థానంలో మనల్ని మనం చూసుకుంటే వారిలా విజయం సాధించడం కష్టం కాదు’ అంటుంది నేహ నర్ఖాడే. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి. – నేహ -
ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఇండో-అమెరికన్ మహిళలు!
ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు ఇండో- అమెరికన్ మహిళలు చోటు దక్కించుకున్నారు. భారతీయ మూలాలున్న మహిళలు ఆయా రంగాల్లో రాణించడమే కాదు.. దిగ్గజ సంస్థల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో నిలిచిన వారిలో జయశ్రీ ఉల్లాల్,నీర్జా సేథి,నేహా నార్ఖడే,ఇంద్ర నూయి,రేష్మా శెట్టిలు ఉన్నారు. జయశ్రీ ఉల్లాల్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో 15వ స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె అరిస్టా నెట్వర్క్స్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అరిస్టా నెట్వర్క్స్ కోఫౌండర్‌గా నీర్జా సేథి 24 ర్యాంకు దక్కించుకున్నారు. ఇక మాజీ పెప్సికో సీఈవోగా ఇంద్రా నూయి ఫోర్బ్స్ జాబితాలో 85వ స్థానం దక్కింది. జింగో బయోవర్క్స్ కో-ఫౌండర్‌గా ఉన్న రేష్మా శెట్టి ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. వారి ఆస్తులు ఎంతంటే ♦జయశ్రీ ఉల్లాల్ పోర్బ్స్ విడుదల చేసిన అమెరికాలో సెల్ఫ్ మేడ్ బిలియనిర్ల జాబితాలో 15వ స్థానం దక్కించుకున్న ఆమె..1.9 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచారు. 2018 నుంచి అరిస్టా నెట్వర్క్స్ సీఈవోగా పనిచేస్తున్న జయశ్రీ ఆ సంస్థలో 5శాతం వాటా ఉన్నారు. ♦ఫోర్బ్స్ విడుదల చేసిన మహిళా ధనవంతుల జాబితాలో 24వ స్థానాన్ని కైవసం చేసుకున్న నీర్జా సేథి టోటల్ నెట్ వర్త్ 1 బిలియన్ డాలర్లగా ఉంది.1980లలో అమెరికా మిచిగాన్ నగరం ట్రాయ్‌లో సొంత అపార్ట్ మెంట్లో భర్త భరత్ దేశాయ్‌తో కలిసి ప్రారంభ పెట్టుబడి 2వేల డాలర్లతో ఐటీ కన్సల్టింగ్, ఔట్ సోర్సింగ్ సంస్థ సింటెల్‌ను ప్రారంభించారని ఫోర్బ్స్ తన నివేదికలో పేర్కొంది. ♦సంస్థ కో-ఫౌండర్‌గా, మాజీ సీటీవోగా పనిచేస్తున్న నేహా నార్ఖడే 490 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ జాబితాలో 57వ స్థానాన్ని దక్కించుకున్నారు. పూణేకి చెందిన నేహా జార్జీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. ఆమె విద్యాభ్యాసం తర్వాత లింక్డిన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు. ♦మాజీ పెప్సికో సీఈవోగా ఉన్న ఇంద్రా నూయి 320 మిలియన్ల డాలర్లతో ఫోర్బ్స్ బిలియనిర్ల జాబితాలో 85వ స్థానం దక్కించుకున్నారు. ♦చివరిగా 220 మిలియన్ డాలర్లతో జింగో బయోవర్క్స్ కో-ఫౌండర్‌గా ఉన్న రేష్మా శెట్టి.. ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికా రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. 2009లో రేష్మా శెట్టి భర్త బ్యారీ కాంన్టాన్తో పాటు మరో నలుగురు భాగస్వాములతో కలిసి సింతటిక్ బయో టెక్నాలజీ కంపెనీ జింగో బయోవర్క్స్ను నెలకొల్పారు. -
40 ఏళ్లకే తరగనంత సంపద
న్యూఢిల్లీ: వయసులో ఉన్నప్పుడే వేలాది కోట్లు కూడబెట్టుకోవడం ఎలాగో.. ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40, అండర్ సెల్ఫ్‌మేడ్ రిచ్‌లిస్ట్ 2021’ను పరిశీలిస్తే తెలుస్తుంది. 40 ఏళ్లలోపే రూ.1,000 కోట్లకు పైగా సంపదను సమకూర్చుకున్న వ్యాపార విజేతలతో ఈ జాబితాను హురూన్ ఇండియా బుధవారం విడుదల చేసింది. భారత్‌లో జని్మంచిన వ్యాపారవేత్త, మీడియా డాట్ నెట్ వ్యవస్థాపకుడు, 39 ఏళ్ల దివ్యాంక్ తురాఖియా రూ.12,500 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత బ్రౌజర్‌స్టాక్ సహ వ్యవస్థాపకులు నకుల్‌అగర్వాల్(38), రితేష్ అరోరా(37), చెరో రూ.12,400 కోట్ల విలువతో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో మొత్తం 45 వ్యాపారవేత్తలకు స్థానం లభించింది. ఇందులో 42 మంది భారత్‌లో నివసిస్తున్నారు. జాబితాలో 31 మంది కొత్తవారే ఉన్నారు. ఇందులోనూ 30 మంది స్టార్టప్‌లతో సంపద సృష్టించుకున్నారు. బెంగళూరు ఎక్కువ మందికి ఆశ్రయమిచి్చంది. జాబితాలో 15 మంది ఈ నగరంలోనే నివసిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ 8 మంది, ముంబై 5, గురుగ్రామ్ 3, థానె ఇద్దరికి చొప్పున నివాస కేంద్రంగా ఉంది. సాఫ్ట్వేర్ అండ్ సేవలు (12 మంది), రవాణా అండ్ లాజిస్టిక్స్ (5 మంది), రిటైల్ (5 మంది), ఎంటర్టైన్మెంట్ (5 మంది), ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం నుంచి 5 మంది చొప్పున ఇందులో ఉన్నారు. డిస్కౌంట్ బ్రోకరేజీలో దిగ్గజంగా ఉన్న జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద రూ.11,100 కోట్లుగా ఉంది. భారత్ మొత్తం మీద సంపన్నుల్లో చూస్తే కామత్ కుటుంబం 63వ స్థానంలో ఉంది. 2021 సెపె్టంబర్ 15 నాటి గణాంకాలను ఈ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నారు. ఈకేఐ ఎనర్జీ వ్యవస్థాపకుడికీ చోటు.. ఇటీవలే ఐపీవోను విజయవంతంగా ముగించుకున్న ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకులు రికాంత్ పిట్టి (33), నిశాంత్ పిట్టి (35), ప్రశాంత్ పిట్టి (37) జాబితాలోకి చేరారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిన ఈకేఐ ఎనర్జీ వ్యవస్థాపకుడు మనీష్ కుమార్ దబ్‌కర (37) కూడా ఇందులో ఉన్నారు. ఈ జాబితాలోని సంపన్నులు అందరూ ఉమ్మడిగా రూ.1,65,600 కోట్లు కూడబెట్టుకున్నారు. గతేడాది జాబితాలో నిలిచిన వారి సంపదతో పోల్చి చూస్తే 286 శాతం వృద్ధి కనిపిస్తోంది. భారత్‌పేకు చెందిన 23 ఏళ్ల శశ్వత్ నక్రాని జాబితాలో అత్యంత పిన్న వయసు్కడిగా నిలవడం గమనార్హం. -
వెలుతురు చిత్రం
కళకు సామాజిక ప్రయోజనం ఉంటుందని నిరూపిస్తున్నాయి సత్యనారాయణ తీసిన డాక్యుమెంటరీలు... దూలం సత్యనారాయణకు నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు. అమ్మ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో టీకొట్టు నడిపేది. హైదరాబాద్‌కు వచ్చి ఐఐటికి ప్రిపేరవుతూ మనసొప్పక ట్రిపుల్ ఐటీ రాశాడు సత్యనారాయణ. సీటు వచ్చింది. బుర్ర లోపల తొలచే పురుగు చేర నివ్వలేదు. చెన్నై వెళ్లాడు. మల్టీమీడియా చేస్తూ బర్మా బజార్లో దొరికిన డాక్యుమెంటరీ డీవీడీలన్నిటినీ చూశాడు. తనను కదిలించే అంశాలు ప్రేక్షకులనూ కదిలించేలా డాక్యుమెంటరీలు తీయాలని సంకల్పించాడు. ఫలితం... ఎటువంటి శిక్షణ లేకుండా అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలను రూపొందించిన ఫిల్మ్‌మేకర్‌గా ఇండో-అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్ ప్రశంశలు, వివిధ అంతర్జాతీయ ఫిలిం సంస్థలకు న్యాయనిర్ణేతగా గౌరవం! మూడుపదులు నిండని ‘సెల్ఫ్ మేడ్’ సత్యనారాయణ గురించి... మేలు చేసిన మౌషిని వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ భూభాగాలు కలసిన ద్వీపసముదాయం సుందర్బన్. నాగరిక ప్రపంచం కాలుష్యపు వాయువుల విడుదలను తగ్గించకపోతే రాయల్ బెంగాల్ టైగర్ల పుట్టిల్లు అయిన ఆ అందమైన అటవీసముదాయం కొన్నేళ్లలో ముంపునకు గురయ్యే ప్రమాదంలో ఉంది. సుందర్బన్ ద్వీపంలో ‘మౌషిని’ గ్రామం గురించి విన్నాడు. కొద్దిపాటి వనరులతో అక్కడకు వెళ్లి, విద్యుత్ సౌకర్యంలేని వ్యథార్థజీవితాన్ని యథార్థంగా చిత్రీకరించాడు. 2008లో తాను రూపొందించిన ‘మౌషిని’ చిత్రం దేశవిదేశాల్లో ప్రశంసలు పొందింది. అంతకంటే ముఖ్యంగా ఆ చిత్రం కారణంగా ‘మౌషిని’ గ్రామానికి సోలార్ విద్యుత్ సౌకర్యం లభించింది. ‘రక్షిత’ చిత్రం! నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిన్ బాధిత గ్రామాలకు వెళ్లి, విషపూరిత భూగర్భజలాలను తాగడం వలన జీవితాలు ఛిద్రమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి 2010లో ‘డ్రెడ్‌ఫుల్ లైఫ్’ రూపొందించాడు. ఆయా ప్రాంతాల రాజకీయనాయకులపై ప్రజల తరఫున సూటి ప్రశ్నలను సంధించిన ఆ డాక్యుమెంటరీ అనేక స్వచ్ఛంద సంస్థలను ప్రభావితం చేసింది. 25 గ్రామాలకు రక్షిత నీటి పథకం అమలయ్యేందుకు దోహదం చేసింది. ఫిలిం మేకర్‌గా సత్యనారాయణ కృషిని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అభినందించింది. సిసిఐపి పథకంలో భాగంగా మంజూరైన స్కాలర్‌షిప్‌తో అరిజోనా-ఫీనిక్స్ యూనివర్సిటీల్లో దర్శకత్వ శాఖలో సత్యనారాయణ శిక్షణ పొందాడు. ఆఫ్ఘన్ మహిళలకు ‘రుబాబ్’! సంతూర్, వీణ వంటి వాద్యపరికరం రుబాబ్. హోదాకు సంబంధించిన వ్యక్తీకరణ ‘రుబాబ్’ అనే పదం రుబాబ్లోంచి వచ్చిందే. ఆఫ్ఘనిస్థాన్ కళాకారుడు కెవిన్కైస్ ఎస్సార్ రుబాబ్లో నిష్ణాతుడు. సితార్లో మన రవిశంకర్లా. సోవియట్, అమెరికన్ల ఆక్రమణలు, దురాక్రమణల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ సాంస్కృతిక జీవితం విచ్ఛిన్నమైంది. ‘రుబాబ్’ లాంటి పరికరాలు, కెవిన్కైస్ ఎస్సార్ వంటి సంగీతజ్ఞుల ప్రతిభ ప్రజల మరపులోకి వెళ్లాయి. సత్యనారాయణ ఆఫ్ఘనిస్థాన్ వెళ్లి ప్రతికూల పరిస్థితుల మధ్య ‘మై ఆఫ్ఘనిస్థాన్- అనార్ అనార్’ అనే డాక్యుమెంటరీని రూపొందించాడు. ఈ చిత్రం అవార్డులను, రివార్డులను పొందింది. ఈ డాక్యుమెంటరీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్ఘన్ మహిళల అభ్యున్నతికి వినియోగిస్తున్నారు. అయామ్ సత్యభామ! కథక్, భరతనాట్యం, ఒడిస్సీ తదితర భారతీయ శాస్త్రీయ నృత్యాలపై కృషి చేసిన లబ్ధప్రతిష్ఠులెన వ్యక్తులపై అనేక డాక్యుమెంటరీలు వచ్చాయి. కూచిపూడికి జీవితాలను అంకితం చేసిన వ్యక్తులపై డాక్యుమెంటరీలు లేని లోటును కేశవప్రసాద్ సహకారంతో వేదాంతం సత్యనారాయణ శర్మపై రూపొందించిన ‘అయామ్ సత్యభామ’ ద్వారా దూలం పూరించాడు. కూచిపూడి గ్రామానికి వెళ్లి అక్కడి సాధారణ ప్రజలను, వీధులను, ఆలయాలను చూపిస్తూ తనికెళ్ల భరణి ద్వారా సత్యనారాయణశర్మను ఇంటర్వ్యూ చేయిస్తూ రూపొందిన ఈ చిత్రాన్ని అట్లాంటాలోని మిడిల్ బే కాలేజ్‌లో, ఇతర విశ్వవిద్యాలయాల్లో ‘డాన్స్ అండ్ ఎంబడీడ్ నాలెడ్జ్ ఇన్ ఇండియా’ అనే సిలబస్‌లో భాగంగా చేర్చారు. ఇక ‘ఆహార్యం’ అనే డాక్యుమెంటరీని ఏ రిఫ్లెక్స్ తదితర అంతర్జాతీయ ఫిలిమ్ స్కూల్స్‌లో ప్రదర్శించారు. దూలం చిత్రాల క్లిప్పింగ్‌లను (http://vimeo.com)లలో చూడవచ్చు. - పున్నా కృష్ణమూర్తి