కళకు సామాజిక ప్రయోజనం ఉంటుందని నిరూపిస్తున్నాయి సత్యనారాయణ తీసిన డాక్యుమెంటరీలు...
దూలం సత్యనారాయణకు నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు. అమ్మ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో టీకొట్టు నడిపేది. హైదరాబాద్‌కు వచ్చి ఐఐటికి ప్రిపేరవుతూ మనసొప్పక ట్రిపుల్ ఐటీ రాశాడు సత్యనారాయణ. సీటు వచ్చింది. బుర్ర లోపల తొలచే పురుగు చేర నివ్వలేదు. చెన్నై వెళ్లాడు. మల్టీమీడియా చేస్తూ బర్మా బజార్‌లో దొరికిన డాక్యుమెంటరీ డీవీడీలన్నిటినీ చూశాడు. తనను కదిలించే అంశాలు ప్రేక్షకులనూ కదిలించేలా డాక్యుమెంటరీలు తీయాలని సంకల్పించాడు. ఫలితం... ఎటువంటి శిక్షణ లేకుండా అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలను రూపొందించిన ఫిల్మ్‌మేకర్‌గా ఇండో-అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్ ప్రశంశలు, వివిధ అంతర్జాతీయ ఫిలిం సంస్థలకు న్యాయనిర్ణేతగా గౌరవం! మూడుపదులు నిండని ‘సెల్ఫ్ మేడ్’ సత్యనారాయణ గురించి...
మేలు చేసిన మౌషిని
వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ భూభాగాలు కలసిన ద్వీపసముదాయం సుందర్‌బన్. నాగరిక ప్రపంచం కాలుష్యపు వాయువుల విడుదలను తగ్గించకపోతే రాయల్ బెంగాల్ టైగర్ల పుట్టిల్లు అయిన ఆ అందమైన అటవీసముదాయం కొన్నేళ్లలో ముంపునకు గురయ్యే ప్రమాదంలో ఉంది. సుందర్‌బన్ ద్వీపంలో ‘మౌషిని’ గ్రామం గురించి విన్నాడు. కొద్దిపాటి వనరులతో అక్కడకు వెళ్లి, విద్యుత్ సౌకర్యంలేని వ్యథార్థజీవితాన్ని యథార్థంగా చిత్రీకరించాడు. 2008లో తాను రూపొందించిన ‘మౌషిని’ చిత్రం దేశవిదేశాల్లో ప్రశంసలు పొందింది. అంతకంటే ముఖ్యంగా ఆ చిత్రం కారణంగా ‘మౌషిని’ గ్రామానికి సోలార్ విద్యుత్ సౌకర్యం లభించింది.
‘రక్షిత’ చిత్రం!
నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిన్ బాధిత గ్రామాలకు వెళ్లి, విషపూరిత భూగర్భజలాలను తాగడం వలన జీవితాలు ఛిద్రమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి 2010లో ‘డ్రెడ్‌ఫుల్ లైఫ్’ రూపొందించాడు. ఆయా ప్రాంతాల రాజకీయనాయకులపై ప్రజల తరఫున సూటి ప్రశ్నలను సంధించిన ఆ డాక్యుమెంటరీ అనేక స్వచ్ఛంద సంస్థలను ప్రభావితం చేసింది. 25 గ్రామాలకు రక్షిత నీటి పథకం అమలయ్యేందుకు దోహదం చేసింది. ఫిలిం మేకర్‌గా సత్యనారాయణ కృషిని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అభినందించింది. సిసిఐపి పథకంలో భాగంగా మంజూరైన స్కాలర్‌షిప్‌తో అరిజోనా-ఫీనిక్స్ యూనివర్సిటీల్లో దర్శకత్వ శాఖలో సత్యనారాయణ శిక్షణ పొందాడు.
ఆఫ్ఘన్ మహిళలకు ‘రుబాబ్’!
సంతూర్, వీణ వంటి వాద్యపరికరం రుబాబ్. హోదాకు సంబంధించిన వ్యక్తీకరణ ‘రుబాబ్’ అనే పదం రుబాబ్‌లోంచి వచ్చిందే. ఆఫ్ఘనిస్థాన్ కళాకారుడు కెవిన్‌కైస్ ఎస్సార్ రుబాబ్‌లో నిష్ణాతుడు. సితార్‌లో మన రవిశంకర్‌లా. సోవియట్, అమెరికన్‌ల ఆక్రమణలు, దురాక్రమణల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ సాంస్కృతిక జీవితం విచ్ఛిన్నమైంది. ‘రుబాబ్’ లాంటి పరికరాలు, కెవిన్‌కైస్ ఎస్సార్ వంటి సంగీతజ్ఞుల ప్రతిభ ప్రజల మరపులోకి వెళ్లాయి. సత్యనారాయణ ఆఫ్ఘనిస్థాన్ వెళ్లి ప్రతికూల పరిస్థితుల మధ్య ‘మై ఆఫ్ఘనిస్థాన్- అనార్ అనార్’ అనే డాక్యుమెంటరీని రూపొందించాడు. ఈ చిత్రం అవార్డులను, రివార్డులను పొందింది. ఈ డాక్యుమెంటరీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్ఘన్ మహిళల అభ్యున్నతికి వినియోగిస్తున్నారు.
అయామ్ సత్యభామ!
కథక్, భరతనాట్యం, ఒడిస్సీ తదితర భారతీయ శాస్త్రీయ నృత్యాలపై కృషి చేసిన లబ్ధప్రతిష్ఠులెన వ్యక్తులపై అనేక డాక్యుమెంటరీలు వచ్చాయి. కూచిపూడికి జీవితాలను అంకితం చేసిన వ్యక్తులపై డాక్యుమెంటరీలు లేని లోటును కేశవప్రసాద్ సహకారంతో వేదాంతం సత్యనారాయణ శర్మపై రూపొందించిన ‘అయామ్ సత్యభామ’ ద్వారా దూలం పూరించాడు. కూచిపూడి గ్రామానికి వెళ్లి అక్కడి సాధారణ ప్రజలను, వీధులను, ఆలయాలను చూపిస్తూ తనికెళ్ల భరణి ద్వారా సత్యనారాయణశర్మను ఇంటర్వ్యూ చేయిస్తూ రూపొందిన ఈ చిత్రాన్ని అట్లాంటాలోని మిడిల్ బే కాలేజ్‌లో, ఇతర విశ్వవిద్యాలయాల్లో ‘డాన్స్ అండ్ ఎంబడీడ్ నాలెడ్జ్ ఇన్ ఇండియా’ అనే సిలబస్‌లో భాగంగా చేర్చారు. ఇక ‘ఆహార్యం’ అనే డాక్యుమెంటరీని ఏ రిఫ్లెక్స్ తదితర అంతర్జాతీయ ఫిలిమ్ స్కూల్స్‌లో ప్రదర్శించారు. దూలం చిత్రాల క్లిప్పింగ్‌లను (http://vimeo.com)లలో చూడవచ్చు.
- పున్నా కృష్ణమూర్తి