Documentaries
-
ఆకాశమంత ఆశ
ఆశావాది కంటే బలవంతుడు ఎవరూ లేరు.ఆశ అనే విత్తనమే చెట్టు అనే విజయానికి మూలం.పర్యావరణ స్పృహకు సంబంధించిన విషయాలను ప్రచారం చేస్తున్న డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ ఆకాష్ రానిసన్కు సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండోర్‌కు చెందిన 28 సంవత్సరాల ఆకాష్ ‘గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్’ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాడు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ అనే పుస్తకం రాశాడు... ఎనిమిది సంవత్సరాల క్రితం... వాతావరణ మార్పులకు సంబంధించిన ఆర్టికల్స్ చదివిన ఆకాష్ అక్కడితో ఆగిపోలేదు. ఈ టాపిక్కు సంబంధించి ఎన్నో యూనివర్శిటీలలో ఎన్నో కోర్సులు చేశాడు. ఫలితంగా వాతావరణ మార్పుల గురించి లోతుగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది.తాను తెలుసుకున్న విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని గట్టిగా అనుకున్నాడు.ఆకాష్లో ఉన్న బలం... ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా, ఆకట్టుకునేలా చెప్పడం. ఆ ప్రతిభ ఇప్పుడు ఉపయోగపడింది. ‘క్లైమెట్ చేంజ్’కు సంబంధించిన విషయాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడానికి ఆర్ట్ ఇన్స్టాలేషన్లు, డాక్యుమెంటరీలు, సోషల్ మీడియా కంటెంట్... ఇలా ఎన్నో దారుల్లో పయనించాడు. తాజాగా ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ పుస్తకం రాశాడు.‘గత పదిసంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు తిరిగాను. రుచికరమైన తిండి కోసమో, అద్భుత నిర్మాణాలను చూడడానికో నేను వెళ్లలేదు. ప్రకృతిని చూసి పరవశించడం కోసం తిరిగాను. ప్రకృతి పట్ల మన ఆరాధన ప్రకృతిని రక్షించుకోవాలనే బలమైన ఆకాంక్షకు కారణం అవుతుంది. పర్యావరణ సంరక్షణ కోసం నా వంతుగా ఏంచేయగలను? అందుకు నాలో ఉన్న నైపుణ్యాలు ఏమిటి? అనే దాని గురించి ఆలోచించాను. నా వంతుగా చేయడానికి ఎన్నో దారులు కనిపించాయి. అది సోషల్ మీడియాలో పర్యావరణ సంరక్షణ ప్రచారం కావచ్చు, పుస్తకం రాయడం కావచ్చు’ అంటాడు ఆకాష్.పుస్తకం రాయడానికి ముందు ఆకాష్‌కు అర్థమైన విషయం ఏమంటే, పర్యావరణ సంరక్షణకు సంబంధించిన సమాచారం చాలా ఎక్కువగా ΄ాశ్చాత్యదేశాలకు సంబంధించే ఉంది. మన దేశంలోని వాతావరణ పరిస్థితులకు అది ఉపయోగపడదు. దీంతో దేశీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని రాశాడు. కర్బన ఉద్గారాల నుంచి క్లైమెట్ ఎమర్జెన్సీ వరకు ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో చర్చించాడు. ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ కోసం పర్యావరణవేత్తలు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లతో సంభాషించాడు.గతంలో ఎన్నో మంచి విషయాలు, పద్ధతులు ఉండేవి, అయితే అవి కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిని మళ్లీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది అంటాడు ఆకాష్.‘ఇప్పుడు అన్నం మిగిలింది అంటే చెత్తబుట్టలో వేయడమే అన్నట్లుగా ఉంది. ఒకప్పుడు అలా కాదు రకరకాల దినుసులు కలిపి, వేడి చేసి మిగిలిన అన్నాన్ని వృథా కాకుండా చేసేవాళ్లు. చపాతీల విషయంలోనూ ఇంతే. ఈ ఆన్లైన్ ఫుడ్కాలంలో చిటికెలో ఏదైనా తినగలుగుతున్నాం. అయితే వృథా అవుతున్న ఆహారంపై మాత్రం బొత్తిగా దృష్టి పెట్టడం లేదు. ఒకవైపు తిండి దొరకక ఆకలితో అల్లాడే మనుషులు, మరోవైపు ఆహార వృథా గురించి పట్టించుకోని మనుషులు. ఇదొక వైరుధ్యం’ అంటాడు ఆకాష్.ఒక్క ఆహార రంగం మాత్రమే కాదు టెక్ట్స్‌టైల్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో ఇండస్ట్రీలలో జరిగే వృథాను, పర్యావరణ చేటును కళ్లకు కడతాడు ఆకాష్.‘ఇక అంతా అయిపోయినట్లేనా...రానున్నది విలయ విధ్వంస కాలమేనా!’ అనే నిరాశవాదంలోకి ఎప్పుడూ వెళ్లడు. ఎందుకంటే మినిమలిస్ట్ లైఫ్ స్టైల్‌ను గడుపుతున్న ఆకాష్ తనను తాను ‘ఐయామ్ ఏ క్లైమెట్ ఆప్టిమిస్ట్’ అని పరిచయం చేసుకుంటాడు. ‘మంచి పనుల ద్వారా మంచి కాలం వస్తుంది’ అని నమ్ముతాడు. -
ఎవరి కథ వారిదే
మన సినిమాల్లో ఆడవాళ్లను గయ్యాళి వారిగా పరిచయం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన సీన్లుంటాయి. వీధి కుళాయి దగ్గర పెద్ద నోరేసుకుని అరుస్తూ మిగిలిన అందరినీ హడలుగొడుతూ నీళ్లు పట్టుకునే సన్నివేశం కూడా ఆ కోవకు చెందినదే. అయితే అవన్నీ సమాజంలో ఉన్నవే. కానీ పైకి కనిపించే సంఘటనల వెనుక ఉన్న కారణాల జోలికి వెళ్లదు సినిమా. ఎందుకంటే ఆ చిత్రంలో ఆ పాత్ర పరిచయానికి అంతకంటే లోతుగా అధ్యయనం చేయాల్సిన పని ఉండదు. అలాగని మహిళను గయ్యాళిగా చూసే అభిప్రాయాన్ని సమాజం మెదడు నుంచి తుడిచేయకపోతే ఎలా? ఇదే పని చేస్తున్నారు ప్రియదర్శిని పళని. జీవిత రచన చెన్నైలో బ్లూ క్లబ్ పేరుతో ఒక మీడియా సంస్థ శ్రామిక వర్గ మహిళల కోసం పని చేస్తోంది. ప్రియదర్శిని ఆ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు. ఆమె చెన్నైలోని పెరుబాక్కమ్, తెదీర్ నగర్ వంటి ప్రదేశాలను సందర్శించి అనేక యదార్థ గాథలను డాక్యుమెంట్ చేస్తోంది. ఐదేళ్ల కిందట మొదలైన ఈ క్లబ్ ఇప్పటివరకు రెండు వందలకు పైగా మహిళల జీవితాలను వాళ్ల చేతనే గ్రంథస్థం చేయించింది. నిజానికి ఆ మహిళల్లో ఎవరూ కథ, కథనాల మధ్య తేడా తెలిసిన వాళ్లు కూడా కాదు. అయితే జీవితం నేర్పించినన్ని పాఠాలు మరే యూనివర్సిటీ కూడా నేర్పించలేదు. జీవితం ఇచ్చే శిక్షణ ముందు మిగిలిన శిక్షణలన్నీ దిగతుడుపే. ఇదే మాట చెబుతారు ప్రియదర్శిని. ఆమె అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీలలో శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. వాళ్లంతా ఏదో బడికి వెళ్లి చదవడం, రాయడం మాత్రమే నేర్చుకుని ఆ తర్వాత బతుకు పోరాటంలో భాగంగా పనుల్లో పడిపోయిన వాళ్లే. ఒక్కో మహిళను ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రోజులో చేసే పనులను చెప్పమన్నప్పుడు అందరూ చెప్పడం మొదలు పెట్టారు. పైకి దాదాపుగా అందరి జీవితం ఒకటే మూసలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే ఎవరి అగాధం వారిదే. ఆ అగాధాన్ని దాటి రావడానికి వాళ్లు పడే శ్రమ కూడా దేనికదే ప్రత్యేకం. వాళ్ల జీవితాలను రిపోర్టు చేయడానికి వచ్చిన ఏ రిపోర్టర్ అయినా మహా అయితే... వీధి చివర్లో నీళ్ల కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునే మహిళల దుస్థితిని దయనీయంగా కళ్లకు కట్టగలుగుతారేమో. నిజానికి ఆ బిందెడు నీళ్లు తీసుకెళ్లకపోతే ఇంట్లో ఆగిపోయే పనుల గురించి ఏకరువు పెట్టగలిగింది ఆ బాధను అనుభవిస్తున్న మహిళలే. నీళ్లు లేకుండా ఇంటికి వెళ్తే ఒక మహిళ ఇంట్లో భర్త చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది. మరో ఇంట్లో ఆ మహిళ బిడ్డకు స్నానం చేయించకుండా చెంబుడు నీటిలో వస్త్రాన్ని తడిపి ఒంటిని తుడిచి సరిపెట్టాల్సి వస్తుంది. మరో ఇంట్లో ముసలి వాళ్లు ఉంటారు. నీళ్లు లేకపోతే ఎలాగా అనే బెంగతో అదే విషయాన్ని పలుమార్లు తలుచుకుంటూ కోడలిని సతాయిస్తుంటారు. ఇంకో ఇంట్లో బిందెడు నీళ్లు లేని కారణంగా స్కూలుకెళ్లాల్సిన పిల్లలకు అన్నం వండి బాక్సు పెట్టడానికి కుదరదు. అవసరానికి పనికొస్తాయని దుస్తుల అడుగున దాచుకున్న చిల్లర డబ్బులను పిల్లలకిచ్చి ఏదైనా కొనుక్కుని తినమని స్కూలుకు పంపిస్తుందా తల్లి. నీటి కుళాయి తగవులాట వెనుక, ఆటోవాలాకిచ్చే చిల్లర దగ్గర గొడవ పడడం వెనుక ఇంతటి విషాదాలుంటాయి. ఆ కష్టాలను యథాతథంగా పేపర్ మీద రాయమంటుంది ప్రియదర్శిని. తమ రోజువారీ కార్యక్రమాలను చెప్పడం మొదలైనప్పటి నుంచే వారిలో ఆలోచన విస్తరిస్తోంది. ఇక రాయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ల దృష్టి కోణం మరింతగా విస్తరిస్తోందని చెబుతున్నారు ప్రియదర్శిని. శ్రామిక వర్గ మహిళలు తాము జీవిస్తున్న జీవితాన్ని విశ్లేషించడంతోపాటు అందుకు దారి తీసిన మూల కారణాలను కూడా అన్వేషించగలుగుతున్నారు. కొందరి విషయంలో అవి కుటుంబ పరమైన కారణలయి ఉంటున్నాయి. మరికొందరికి ఆ కారణాలు సామాజికపరమైనవి అయి ఉంటున్నాయి. ‘శ్రామిక వర్గ మహిళల కష్టాలను నేను చూసి రాయడంకంటే వాళ్ల చేత రాయించగలిగితే అసలు కారణాలు బయటకు వస్తాయనుకున్నాను. అది నిజమని నా ప్రయత్నంలో నిర్ధారణ అయింది’ అంటున్నారు ప్రియదర్శిని. -
నాలుగు నెలలు... 68 దశలు
2019 లోక్‌సభ ఎన్నికలు రెండు నెలల పాటు ఏడు దశల్లో జరుగుతున్నాయంటేనే ..అబ్బో..అంత టైమా...అనుకుంటున్నాం. అయితే, మన దేశంలో మొట్టమొదటి ఎన్నికలు ఏకంగా 68 దశల్లో నాలుగు నెలల పాటు జరిగాయి. 1951 అక్టోబరు నుంచి 1952,ఫిబ్రవరి వరకు ఆ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఎన్నికల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా 3000 సినిమా హాళ్లలో డాక్యుమెంటరీలు ప్రదర్శించారు. రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం ప్రతినిధులు కూడా ఇంటింటికీ తిరిగి ఓటు వేయమని ప్రజలకు చెప్పారు. మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి దేశంలో 85శాతం ప్రజలు నిరక్షరాస్యులు. అప్పుడున్న 40కోట్ల జనాభాలో కేవలం 15శాతం మందికి మాత్రమే ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వచ్చు. దాంతో ఓటర్లు రాజకీయ పార్టీల పేర్లను, అభ్యర్థ్ధుల పేర్లను చదవడం, గుర్తు పెట్టుకోవడం కష్టమని భావించిన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించాలని నిర్ణయించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి నాగలి దున్నుతున్న జోడెద్దుల గుర్తు వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ చిహ్నమైన హస్తం మొదటి ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్( నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పార్టీ) పార్టీకి దక్కింది. ఈ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేయడానికి 16వేల మందికిపైగా సిబ్బంది ఆరు నెలల పాటు ఇల్లిల్లూ తిరిగారు. తీరా ఓటర్ల జాబితా తయారయ్యాక పేరు లేని కారణంగా 28 లక్షల ఓటర్ల పేర్లను తొలగించాల్సి వచ్చింది. అప్పట్లో మహిళలు బయటివారికి తమ పేరు చెప్పేవారు కాదు. ఫలానా వారి భార్యననో, కూతురిననో, చెల్లెలిననో చెప్పడంతో సిబ్బంది అలాగే రాసుకోక తప్పలేదు. అలాంటి పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు,అభ్యర్థులకు ప్రచారం ఎలా చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. నెహ్రూ వంటి నేతలు బహిరంగ సభలు పెట్టి ఓట్లు అడిగేవారు.కొందరు ఇళ్లకు వెళ్లి అభ్యర్థించేవారు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ రోడ్లమీద తిరిగే ఆవుల ఒంటిపై ‘కాంగ్రెస్‌కు ఓటెయ్యండి’అని రాసేవారు. ఆ ఆవుల్ని ప్రజలు ఆసక్తిగా ఉత్సుకతతో చూసేవారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ప్రముఖుల్లో అంబేడ్కర్ ఒకరు. ఎస్సిలకు కేటాయించిన ఉత్తర మధ్య బొంబాయి నియోజకవర్గం నుంచి అంబేడ్కర్ పోటీ చేసి ఓడిపోయారు. -
మనం చూడని మనదేశం
చూడాలి.. తెలుసుకోవాలి.. వెలుగులోకి తేవాలి..స్ఫూర్తి చెందాలి.మనకు ఉన్నవన్నీ సవాళ్లే అనుకుంటే వీళ్ల జీవితాలు చూడాలి.. మనకు కనపడని దేశం ఇది..ఈ నెల పన్నెండున తెలంగాణ, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో జరిగిన ‘జై చండీరాం మెమోరియల్ సెకండ్ నేషనల్ కమ్యూనిటీ మీడియా ఫెస్టివల్’లో ప్రదర్శించిన డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్‌లో మనం చూడని.. మనకు తెలియని దేశం కనిపించింది. మచ్చుకు మూడు.. సాల్ట్ ఇన్ మై విలేజ్ సముద్రపు నీటితోనే కాదు.. కొండవారగా పారే నీటితోనూ ఉప్పు తయారవుతుంది. అదే నాగాలాండ్ కథ.. సాల్ట్ ఇన్ మై విలేజ్. 1960ల్లో నాగాలాండ్‌లో జరిగిన ఘర్షణ, హింస నుంచి బతికి బయటపడ్డ మహిళలు ఇలా ఉప్పును తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్హెక్ జిల్లాలోని మాతిక్రూ గ్రామంలోని ఆడవాళ్లకు ఇదే ప్రధాన ఆర్థిక వనరు. కొండ మీద నుంచి చిన్న చిన్న పాయలుగా పారుతున్న నీటిని వెదురు బుంగలు, క్యాన్లలో పట్టుకొని కడవల్లో పోసి కాస్తారు. నీరంతా మరిగి మరిగి... ఆవిరై అడుగున ఉప్పు తయారవుతుంది. వీటిని అచ్చులుగా చేసి (తాటి బెల్లంలా) చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో అమ్ముతారు. డబ్బుతోపాటు ఆరోగ్యం అనీ చెప్తారు దీన్ని తయారు చేసే స్త్రీలు. మరుగుతున్న ఈ నీటి ఆవిరిని పీల్చుకోవడం వల్ల జలుబు, దగ్గు, కొన్ని శ్వాసకోశ వ్యాధులూ నయమయ్యాయని అంటారు. అంతేకాదు, ఈ ఉప్పు కూడా ఆరోగ్యకరమే అని చెప్తారు. ఉప్పు తయారీతో అల్లుకుని ఉన్న ఆ మహిళల జీవన విధానాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ట్రేడింగ్ చైల్డ్‌హుడ్ ఛత్తీస్‌గఢ్‌లోని బరిమా గ్రామం. ఊళ్లో చాలా మంది పిల్లలు బాలకార్మికులే. పశువులు కాస్తూ, పొలాల్లో పనిచేస్తూ కనిపిస్తారు. వాళ్లందరి ఇంటర్వ్యూలతో ఆ ఊరి చిత్రాన్ని చూపించిన సినిమా ఇది. పేదరికం, వాటికి కారణమైన దేశ సామాజిక, రాజకీయ స్థితిగతులను పరోక్షంగా ప్రశ్నించిన ఈ ఫిల్మ్ పెద్దల బాధ్యతను గుర్తుచేస్తుంది. సమ్ఝౌతా.. సమ్ఝౌతా .. అంటే ఒప్పందం. ఎవరితో.. శవాలతో! అవును. ఇది ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ స్త్రీల జీవన చిత్రం. స్థానిక మీడియా చూసినా.. చదివినా.. బుందేల్‌ఖండ్‌లో ఒక్క నేర వార్త కూడా కనిపించదు. అసలక్కడ క్రైమ్ రేటే ఉండదు. మరి శవాలతో సమ్ఝౌతా ఏంటీ? అదే సినిమా! వరకట్నం వేధింపులు, వాటివల్ల ఆత్మహత్యలు, ఈవ్‌టీజింగ్‌లు, రేప్‌లు, హత్యలు.. ఏం జరిగినా బాధితుల తరపు కుటుంబ సభ్యులను పిలిచి నేరస్తుల కుటుంబ సభ్యులతో సమ్ఝౌతా కుదిరిస్తారు గ్రామ సర్పంచ్‌లు, పెద్దలు వగైరా! అవును, ఖాప్ పంచాయత్లే. నేరం ఎంత పెద్దదయినా సరే.. సమ్ఝౌతానే శరణ్యం. ఫిర్యాదులు నమోదు అవడానికి వీల్లేదు. విచారణ పేరుతో పోలీసులు ఆ ఊళ్లలోకి అడుగు పెట్టడానికి ఆస్కారం లేదు. అందుకే క్రైమ్ రిపోర్ట్‌లో... పోలీసుల వైపు కెమెరా పెడితే.. ‘‘ఫిర్యాదు రాదు.. ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఫిర్యాదు వస్తే... తప్పకుండా న్యాయం చేస్తాం’’ అంటారు. ఇదే సమ్ఝౌతా! చూస్తున్న వాళ్లకు షాక్. ‘సభ్య’ సమాజానికీ అశనిపాతం. ఇవన్నీ తీసినవి ఫిల్మ్‌మేకింగ్‌లో మాస్టర్స్ కాదు. కష్టాల బడిలో ఆరితేరిన వాళ్లు. ఆ డాక్యుమెంటరీల్లో వాళ్లు అనుభవించిన సమస్యలున్నాయి. అందుకే అవి మనసును తడి చేస్తాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించిన మహిళా రైతుల గురించి చెప్పుకోవాలి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర్లోని పస్తాపూర్‌కు చెందిన వాళ్లు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మ ఇంకా కొందరు మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందినవాళ్లు. తమలా సమస్యల సవాళ్లతో జీవితంలో నెగ్గుతున్న వాళ్లు.. వాళ్ల కోణంలో.. వాళ్లు చూసిన సమాజాన్ని కెమెరాలో బంధించి.. డాక్యుమెంటరీలుగా.. షార్ట్ఫిల్మ్స్గా తీస్తే.. ఎందరికో స్ఫూర్తిగా ఉంటుందని ఈ బాధ్యతను చేపట్టారు. దూరదర్శన్ తొలితరం ప్రొడ్యూసర్లలో ఒకరైన మహిళ.. జై చండీరాం. ఆమె జ్ఞాపకార్థం ‘జై చండీరాం మెమోరియల్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో 2017లో ప్రారంభించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుతున్నారు. ఇది రెండవ యేడాది. ఈ ఇద్దరూ బాల్యపు హక్కులు, ప్రత్యేకతలు, జ్ఞాపకాలు లేకుండా పెరిగారు. ‘రెలు’ కూడా వాళ్లకు అందమైన ఊహ. ఇప్పుడు ఫ్లయిట్లో ఈ ఫెస్టివల్‌కు వచ్చారు. ఆ మాటను మెరిసే కళ్లతో చెప్తారు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మకు .. వాళ్ల నాయకత్వంలోని ఇతర మహిళలకూ చదువురాదు. అయితేనేం బతుకు తెలిసిన జ్ఞానవంతులు. అందుకే షూటింగ్‌కి చెందిన హై యాంగిల్, లో యాంగిల్, ఐ లెవెల్ షాట్స్ వంటి సాంకేతిక భాషకు ప్రత్యామ్నాయంగా వీళ్లు కొత్తపరిభాషను ఏర్పాటు చేసుకున్నారు. గాయ్దోళ్ల షాట్, పటేల్ షాట్, సంఘం షాట్‌గా! వాటిని కాయిన్ చేసుకోవడానికి వారి ప్రాంతపు సంస్కృతి, సామాజిక పరిస్థితులే ప్రేరణ, కారణం. దొరతనానికి బానిసలు, ఆర్థికలేమి, నిర్వాసితులుగా వాళ్లు పడ్డ కష్టాలు, అనుభవించిన బాధల్లోంచి పుట్టిన పదాలు అవి. పటేల్ అంటే దొర.. ఎప్పుడూ తన ఎదుట నేల మీద కూర్చుని ఉన్న కూలీలతో కిందకు చూసే మాట్లాడ్తాడు కాబట్టి లో యాంగిల్ షాట్‌ను తమకు అర్థమయ్యేలా పటేల్ షాట్ అని పిలుచుకుంటున్నారు. హై యాంగిల్ షాట్ గాయ్దోళ్ల షాట్ ఎందుకు అయింది? గాయ్దోళ్లు అంటే వెట్టి కూలీలు. తమ ముందు నిలబడి ఉన్న దొరకు సమాధానం ఇవ్వాలంటే పైకి చూస్తూనే మాట్లాడాలి. ఆ సన్నివేశాన్నే వాళ్లు ఊహించుకుని హై యాంగిల్ షాట్‌కి ఆప్ట్ అయ్యేలా గాయ్దోళ్ల షాట్ అని నామకరణం చేసుకున్నారు. సంఘం షాట్.. సంఘం లేదా... సమావేశంలో వాళ్లంతా ఒకచోటే కూర్చుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటారు. ఎవ్వరూ తల ఎత్తాల్సిన అవసరం లేదు. తలదించాల్సిన అగత్యం లేదు. అందుకే ఐ లెవెల్ షాట్... సంఘం షాట్లా అనిపించింది వాళ్లకు. ఇది వాళ్లు కల్పించుకున్న స్పృహ.. తెచ్చుకున్న అవగాహన. దక్కన్ రేడియోతో తెలుగు రాష్ట్రాల్లో తొలి కమ్యూనిటీ రేడియోను, వీడియో కెమెరా ఆపరేటింగ్‌తో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్నూ తీస్తున్నారు. తమను చూసి నొసటితో వెక్కిరించిన నోళ్లకు తమ చేతలతో మర్యాద నేర్పుతున్నారు. లక్ష్మణ్ మూడి.. ‘ట్రేడింగ్ చైల్డ్‌హుడ్’ దర్శకుడు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న పెంచి పెద్ద చేశాడు. లక్ష్మణ్ కూడా ఒకప్పుడు బాలకార్మికుడే. తొమ్మిదో తరగతి వరకు చదివి ఆపేశాడు. పెద్దవాళ్లకు తెలియకుండా.. తెలిసిన పెద్దలను ఒప్పిస్తూ ఈ డాక్యుమెంటరీ తీశాడు. బాగా చదువుకోవాలనేది లక్ష్మణ్ ఆశయం. థెనిలో.. ‘సాల్ట్ ఇన్ మై విలేజ్’ డాక్యుమెంటరీ దర్శకురాలు. పదో తరగతితో చదువు ఆపేసింది ఆర్థిక స్తోమత లేక. ఆమె చేనేత కార్మికురాలు కూడా. ఇప్పటికే నాలుగు షార్ట్‌ఫిల్మ్స్ తీసింది. స్క్రీనింగ్ కోసం పలు ప్రాంతాలకు వెళ్లింది. ‘‘మంచి ఫిల్మ్ మేకర్ కావాలనుకుంటున్నా’’ అంటుంది. – సరస్వతి రమ -
లఘుచిత్రాలు.. సందేశాత్మక వృత్తాలు
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ముగిసిన షార్టఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు {పేక్షకులతో కిక్కిరిసిన కేయూ ఆడిటోరియం పోచమ్మ మైదాన్ : పదిహేను నిమిషాల నిడివితో తీసే లఘుచిత్రాలు.. మంచి సందేశాన్ని ఇచ్చే ఇతివృత్తాలని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. షార్టఫిల్మ్లు సమాజానికి ఎంతో దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు ఆదివారం ఘనం గా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ దయాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒక సినిమా చూసేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని, అదే యూ ట్యూబ్‌లో చాలా షార్ట్‌ఫిల్మ్‌లు చూడవచ్చని తెలిపారు. షార్టఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఐశ్వర్యాన్నిచ్చింది : విజయేంద్రప్రసాద్ బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడు తూ పశ్చిమ గోదావరి జిల్లాలో తాను పుట్టినప్పటికీ బతకడానికి హైదరాబాద్‌కు వచ్చానని.. ఈ ప్రాంతం తనకు ఐశ్వర్యాన్నిచ్చిందని చెప్పారు. ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ మహేంద్ర మాట్లాడుతూ 100కు పైగా వచ్చిన లఘుచిత్రాల్లో ఐదింటిని ఎంపిక చేయడం క ష్టంగా మారిందన్నారు. అంతర్జాతీయ లఘుచిత్రోత్సవంలో ప్రదర్శించిన ఫిల్మ్‌లలో విషయం బాగుంద ని... టెక్నికల్ పరంగా కొంత వెనక ంజలో ఉన్నాయన్నారు. కాగా, ముగింపు వేడుకలకు హాజరైన సినిమాహాల్ హీరో రాహుల్‌తోపాటు చిత్ర బృందం సందడి చేసింది. ఇదిలా ఉండగా, వేడుకల్లో రాధిక యాంకరిం గ్ ఆకట్టుకుంది. అంతర్జాతీయ లఘు చిత్రోత్సవ కమి టీ చైర్మన్ నాగేశ్వర్రావు, దర్శకుడు ప్రభాకర్ జైనీ, జ్యూరీ మెంబర్లు కేవీపీ మహేంద్ర, వాల్మీకి వడ్డేమాని, సైదా, కేఎల్.ప్రసాద్, పూర్ణచందర్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఆట పాట ముగింపు వేడుకల్లో భాగంగా సాయంత్రం 6:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రముఖ సినీ నేపథ్యగాయని కౌసల్య పాడిన ‘రామా రామా రామా నీలిమేఘ శ్యామ’, ‘గుమ్ గుమారే గుమ్గుమ్గుమ్’ పాటలు, చరణ్ డ్యాన్స్ గ్రూప్ చేపట్టిన నృత్యా లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కందిరీగ సినిమా హీరోయిన్ అక్ష మాట్లాడుతూ షార్ట్ఫిల్మ్లకు మంచి భవిష్యత్ ఉందన్నారు. అవార్డు విన్నర్స్ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో మూడు రోజుల్లో మొత్తం 118 లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఇందులో ఉత్తమ లఘుచి త్రంగా సీతావలోకనం, ఉత్తమ దర్శకుడిగా సీతావనలోకం లఘుచిత్రం డెరైక్టర్ వేణుమాదాల, ఉత్తమ మేల్ ఆర్టిస్టుగా చిచోర ఫిల్మ్ నటుడు ఆర్.సుమన్, ఉత్తమ ఫీమేల్ ఆర్టిస్టుగా అమ్మానాన్నకు ప్రేమతో లఘుచిత్రం నటి దివ్య, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ కొలంబస్ లఘుచిత్రం నటుడు గోపి, ఉత్తమ అంతర్జాతీయ చి త్రంగా చైనీస్ చిత్రం బస్ 44, స్పెషల్ జ్యూరీ-1 అవార్డును సీతారామరాజు లఘుచిత్రం నటుడు కరుణాకర్, స్పెషల్ జ్యూరీ-2 అవార్డును చదువు లఘుచిత్రం నటుడు లాలు గెలుచుకున్నారు. రెడ్డి కాదు మాదిగ... స్టేజీపైకి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌ను ఆహ్వానిస్తున్న సమయంలో యాంకర్ ఆయనను ‘దయాకర్‌రెడ్డి’ అంటూ సంబోధించారు. దీంతో కార్య క్రమానికి హాజరైన ప్రేక్షకులు దయాకర్‌రెడ్డి కాదు.. దయాకర్మాదిగ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు యాంకర్ సరిదిద్దుకొని దయాకర్ అని పిలు స్తూ ఆహ్వానించింది. -
డాక్యుమెంటరీలే నయమంటున్న అనురాగ్ కాశ్యప్
ఇటీవలి కాలంలో సినిమాల కంటే డాక్యుమెంటరీలే నయంగా ఉంటున్నాయని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ అంటున్నారు. దివంగత పాప్ గాయని అమీ వైన్హౌస్పై రూపొందించిన ‘అమీ’ డాక్యుమెంటరీని తిలకించిన తర్వాత కాశ్యప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కథాచిత్రాలతో పోలిస్తే, ఇటీవలి కాలంలో వస్తున్న డాక్యుమెంటరీలే ప్రభావశీలంగా ఉంటున్నాయని ఆయన అన్నారు. -
సిటీ టూర్.. ‘భంగ్’తో తీన్మార్
- నగరంపై డాక్యుమెంటరీస్ - యూ ట్యూబ్‌లో పెరుగుతున్న వీక్షకులు షార్ట్ ఫిల్మ్స్ ఎలాగైతే యువతకు ఫ్యాషన్‌గా మారుతున్నాయో.. నగరంలో కొంతమందికి డాక్యుమెంటరీస్ కూడా అలాగే హాబీగా మారిపోయాయి. వృత్తి వ్యాపకాలకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా.. తమ అభిరుచి మేరకు డాక్యుమెంటరీలు రూపొందించడంలో సిటీజనులు బిజీ అయిపోతున్నారు. సహజంగానే ఈ డాక్యుమెంటరీలు విభిన్న అంశాలపై, సామాజిక స్పృహ పెంచేలా రూపొందిస్తుండడం స్వాగతించదగిన పరిణామం. భాగ్యనగరంలో కేవలం హైటెక్ సిటీని చూస్తే సరిపోదు.. చార్మినార్‌ను చుట్టొచ్చినంత మాత్రాన అయిపోదు.. నాలుగొందల ఏళ్ల చరిత్ర ఒకవైపు. కొత్తపుంతలు తొక్కే ఆధునికత మరోవైపు. ఒక్క మాటలో చెప్పాలంటే భిన్న పరిణామాల మేలు కలయిక హైదరాబాద్. ఎన్ని చూసినా చూడాల్సినవి మిగిలే ఉన్నాయి అనిపించే ఈ సిటీలో తప్పకుండా చూడాల్సిన వి, చేయాల్సినవి... చెప్తూ నగరవాసి రాజ్‌కిషోర్ రూపొందించిన ‘టెన్ థింగ్స్ టు డు ఇన్ హైదరాబాద్’ యూట్యూబ్‌లో ఇప్పటికే లక్షల సంఖ్యలో వీక్షకుల్ని సాధించింది. అదే ఊపులో నగరంలో హోలీ టైమ్‌లో వినియోగించే ‘భంగు’ మీద కూడా మరో డాక్యుమెంట్‌ను తీసి అప్లోడ్ చేశాడీ యువ ఈవెంట్ మేనేజర్. ఈ రెండు డాక్యుమెంటరీల విశేషాలు.. ‘భంగ్’ భళా నగరంలో శివరాత్రి, హోలీ వేడుకల్లో భాగంగా చాలామంది ‘భంగ్’ భళా అంటారనేది తెలిసిందే. ఆ సమయంలో బేగంబజార్ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా లభించే ఈ భంగ్ అనే మత్తు పదార్థం.. విచిత్రమైన సంప్రదాయ సేవనంగా మారిపోయిందనే విషయాన్ని తెలియజేస్తూంది ఈ డాక్యమెంటరీ. అధికారికంగా షాపులు తెరచి మరీ ఈ భంగ్ను విక్రయించే విశేషాలను ఇది కళ్లకు కడుతుంది. హోలీ వేడుకల పరమార్థం తెలియకపోయినా, భంగ్ అనే మత్తు పదార్థం గురించి చెప్పమంటే ఉత్సాహం చూపే సిటీ యూత్‌ను మనం ఈ వీడియోలో కలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా భంగ్‌కు ఉన్న క్రేజ్, దక్షిణాదిలోనూ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వైనాన్ని వివరిస్తూ, దీనివల్ల కలిగే ఆరోగ్యపరమైన సమస్యలను వైద్యుల ద్వారా చెప్పించారు. సిటీని చుట్టేస్తూ.. నగరంలోని బేగంబజార్ దగ్గర ప్రారంభమై హలీమ్ రుచి చూస్తూ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ విశేషాల్ని ఈ డాక్యుమెంటరీ కళ్లకు కడుతుంది. నెక్లెస్‌రోడ్ సౌందర్యాన్ని వివరిస్తూ టాలీవుడ్ పై ఓ లుక్కేయిస్తుంది. లాడ్‌బజార్ గాజుల గలగలలు వినిపిస్తూ.. హుస్సేన్‌సాగర్‌లో కొలువైన బుద్ధుని చుట్టూ ప్రదిక్షణలు చేయిస్తుంది. గోల్కొండ చరిత్రకు సలామ్ చేస్తూ.. చార్మినార్ విశిష్టతను కళ్లకు కడుతుంది. చివరగా చవులూరించే హైదరాబాద్ బిర్యానీకి అగ్రతాంబూలం ఇస్తుంది. మోడల్ సాత్విక ఈ డాక్యుమెంటరీలో సమర్పకురాలిగా వ్యవహరించారు. ‘సీదా జావ్, ఆగే ఛే’ వంటి సిటీలో తరచుగా వినిపించే పదాలను, సినిమా స్టార్ల పట్ల ఉండే వ్యామోహాన్ని సైతం సరదాగా స్పర్శిస్తూ డాక్యుమెంటరీ సాగిపోతుంది. ‘ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఇమేజ్‌ని పెంచడం కోసం ఒక డాక్యుమెంటరీని.. యువత జీవితాల్లో భంగ్ వంటి మత్తుపదార్థాలు సంప్రదాయం పేరుతో తిష్టవేసిన వైనాన్ని వివరించడానికి మరో డాక్యుమెంటరీని తీశా’నంటారు రాజ్‌కిషోర్. మాదాపూర్‌లో నివసించే ఈయన వృత్తిరీత్యా ఈవెంట్ మేనేజర్. అయితే సహజంగా ఉన్న ఆసక్తితో ఫిల్మ్ అండ్ మీడియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చేశారు. రచయిత, దర్శకుడు, కెమెరా, ఎడిటర్ అన్నీ తనే అయి కేనన్ 5 డి కెమెరాతో ఈ డాక్యుమెంటరీలను రూపుకట్టానని చెప్పారు. -
‘నల్సార్’లో ఫిల్మ్ ఫెస్టివల్-15 షురూ..
శామీర్‌పేట్: నల్సార్లా యూనివర్సిటీలో చదువుతున్న ఎల్ఎల్బీ విద్యార్థులు శనివారం నల్సార్ ఫిల్మ్ ఫెస్టివల్-15 ని అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమితా దాండా హాజరై ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నల్సార్ ఆడిటోరియంలో ‘వెలైంట్ అండ్ కమ్యూనిటీ’ అనే అంశంతో రెండు లఘుచిత్రాలను ప్రదర్శించారు. బెంగాల్‌లోని నందీ గ్రామంలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనను ఆధారంగా చేసుకుని, వారి ఆత్మహత్యలకు కారణాలను వివరిస్తూ నిర్మించిన ‘ఇబాంగ్ బేవారిష్’ అనే బెంగాళి లఘుచిత్రంతోపాటు దేశంలో జనాభాతోపాటు చెత్త ఎలా పెరిగిపోతుందో వివరిస్తూ తీసిన రెండో చిత్రం ‘వేస్టింగ్’ అనే ఆంగ్ల లఘుచిత్రాలు ప్రదర్శించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూపించిన తీరు, చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతుండటంతో వాటివల్ల వచ్చే నష్టాలను, చెత్తను డంపింగ్ చేసే కార్మికుల జీవన విధానాలు వివరించే ఈ చిత్రాలు ఎంతగానో ఆకర్షించాయి. జనాభాతో పాటు చెత్తవల్ల రాబోయే తరానికి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వివరించే ఇతివృత్తంగా సాగే చిత్రం వెస్టింగ్ (ఆంగ్లం) అందరినీ ఆలోచింప చేసేలా ఉంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా లఘుచిత్రాల దర్శకులు దీబూలీనా (ఇబాంగ్ బేవరీష్ దర్శకులు), వేస్టింగ్ దర్శకులు అనిర్బిన్ దత్తా, టూపార్ట్ మూవీస్ దర్శకులు రూపేష్ కుమార్, నిర్వాహకులు ప్రతీ, దీపాంకర్, అద్రిచ, రాజు, వీణ సిద్దార్థ్, త్రీష్ తదితరులు పాల్గొన్నారు. మంచి వేదిక.. మూడు సంవత్సరాలుగా ‘నల్సార్’లో లఘుచిత్రాలను ప్రదర్శిస్తున్నాం. ప్రదర్శనలతోపాటు చిత్ర దర్శకులు, నటీనటులను పరిచయం చేస్తున్నాం. సమాజంలో వస్తున్న మార్పులకు తాము ఎలాంటి వి ధులు నిర్వహించాలో? అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నాం. ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనందంగా ఉంది. - ప్రతీ, నల్సార్ లా యూనివర్సిటీ, ఎల్ఎల్బీ, 4వ సంవత్సరం , ఫెస్టివల్ నిర్వాహకురాలు గర్వంగా ఉంది.. ఫిల్మ్ ఫెస్టివల్ అనగానే హీరో.. హీరోయి న్.. అనే నానుడికి దూరంగా సమాజంలో జరుగుతున్న మార్పులకు అద్దం పట్టేలా చిత్రప్రదర్శన జరుగుతుంది. ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టేలా లఘుచిత్రాలు నిర్మించడం, ఎలాంటి సదుపాయాలు కల్పించాలి.. తదితర అంశాలను చర్చించే వీలుకలిగింది. దీంట్లో భాగస్వాములుగా ఉన్నందుకు గర్వంగా ఉంది. - అద్రిజా, నల్సార్ లా విద్యార్థి, ఎల్ఎల్బీ, 4వ సంవత్సరం ఆనందంగా ఉంది.. సీనియర్లు అంటే ర్యాగింగ్ చేయడం వరకే ఉన్న ప్రస్తుత సమాజంలో ‘నల్సార్’లోని సీనియర్లు మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం ఆనందంగా ఉంది. సమాజంలోని మలినాలను తొలగించేందుకు మా వంతు సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా ముందుంటాం. - సిద్ధ్దార్థ్, ఎల్ఎల్బీ, మొదటి సంవత్సరం మా వంతు కృషి చేస్తున్నాం.. విద్యతోపాటు సమాజంలోని మార్పులను తెలుసుకునేందుకు ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి జీవితాలు గడుపుతున్నారు.. ప్రజల అలవాట్లు, వారు పడుతున్న కష్టాలను లఘుచిత్రాల ద్వారా తిలకించి, సమాజంలో వారికి తమవంతు సహాయం చేసేందుకు కృషిచేస్తాం. - దీపార్కర్, నల్సార్ విద్యార్థి, ఎల్ఎల్బీ, 4వ సంవత్సరం -
వెలుతురు చిత్రం
కళకు సామాజిక ప్రయోజనం ఉంటుందని నిరూపిస్తున్నాయి సత్యనారాయణ తీసిన డాక్యుమెంటరీలు... దూలం సత్యనారాయణకు నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు. అమ్మ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో టీకొట్టు నడిపేది. హైదరాబాద్‌కు వచ్చి ఐఐటికి ప్రిపేరవుతూ మనసొప్పక ట్రిపుల్ ఐటీ రాశాడు సత్యనారాయణ. సీటు వచ్చింది. బుర్ర లోపల తొలచే పురుగు చేర నివ్వలేదు. చెన్నై వెళ్లాడు. మల్టీమీడియా చేస్తూ బర్మా బజార్లో దొరికిన డాక్యుమెంటరీ డీవీడీలన్నిటినీ చూశాడు. తనను కదిలించే అంశాలు ప్రేక్షకులనూ కదిలించేలా డాక్యుమెంటరీలు తీయాలని సంకల్పించాడు. ఫలితం... ఎటువంటి శిక్షణ లేకుండా అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలను రూపొందించిన ఫిల్మ్‌మేకర్‌గా ఇండో-అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్ ప్రశంశలు, వివిధ అంతర్జాతీయ ఫిలిం సంస్థలకు న్యాయనిర్ణేతగా గౌరవం! మూడుపదులు నిండని ‘సెల్ఫ్ మేడ్’ సత్యనారాయణ గురించి... మేలు చేసిన మౌషిని వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ భూభాగాలు కలసిన ద్వీపసముదాయం సుందర్బన్. నాగరిక ప్రపంచం కాలుష్యపు వాయువుల విడుదలను తగ్గించకపోతే రాయల్ బెంగాల్ టైగర్ల పుట్టిల్లు అయిన ఆ అందమైన అటవీసముదాయం కొన్నేళ్లలో ముంపునకు గురయ్యే ప్రమాదంలో ఉంది. సుందర్బన్ ద్వీపంలో ‘మౌషిని’ గ్రామం గురించి విన్నాడు. కొద్దిపాటి వనరులతో అక్కడకు వెళ్లి, విద్యుత్ సౌకర్యంలేని వ్యథార్థజీవితాన్ని యథార్థంగా చిత్రీకరించాడు. 2008లో తాను రూపొందించిన ‘మౌషిని’ చిత్రం దేశవిదేశాల్లో ప్రశంసలు పొందింది. అంతకంటే ముఖ్యంగా ఆ చిత్రం కారణంగా ‘మౌషిని’ గ్రామానికి సోలార్ విద్యుత్ సౌకర్యం లభించింది. ‘రక్షిత’ చిత్రం! నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిన్ బాధిత గ్రామాలకు వెళ్లి, విషపూరిత భూగర్భజలాలను తాగడం వలన జీవితాలు ఛిద్రమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి 2010లో ‘డ్రెడ్‌ఫుల్ లైఫ్’ రూపొందించాడు. ఆయా ప్రాంతాల రాజకీయనాయకులపై ప్రజల తరఫున సూటి ప్రశ్నలను సంధించిన ఆ డాక్యుమెంటరీ అనేక స్వచ్ఛంద సంస్థలను ప్రభావితం చేసింది. 25 గ్రామాలకు రక్షిత నీటి పథకం అమలయ్యేందుకు దోహదం చేసింది. ఫిలిం మేకర్‌గా సత్యనారాయణ కృషిని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అభినందించింది. సిసిఐపి పథకంలో భాగంగా మంజూరైన స్కాలర్‌షిప్‌తో అరిజోనా-ఫీనిక్స్ యూనివర్సిటీల్లో దర్శకత్వ శాఖలో సత్యనారాయణ శిక్షణ పొందాడు. ఆఫ్ఘన్ మహిళలకు ‘రుబాబ్’! సంతూర్, వీణ వంటి వాద్యపరికరం రుబాబ్. హోదాకు సంబంధించిన వ్యక్తీకరణ ‘రుబాబ్’ అనే పదం రుబాబ్లోంచి వచ్చిందే. ఆఫ్ఘనిస్థాన్ కళాకారుడు కెవిన్కైస్ ఎస్సార్ రుబాబ్లో నిష్ణాతుడు. సితార్లో మన రవిశంకర్లా. సోవియట్, అమెరికన్ల ఆక్రమణలు, దురాక్రమణల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ సాంస్కృతిక జీవితం విచ్ఛిన్నమైంది. ‘రుబాబ్’ లాంటి పరికరాలు, కెవిన్కైస్ ఎస్సార్ వంటి సంగీతజ్ఞుల ప్రతిభ ప్రజల మరపులోకి వెళ్లాయి. సత్యనారాయణ ఆఫ్ఘనిస్థాన్ వెళ్లి ప్రతికూల పరిస్థితుల మధ్య ‘మై ఆఫ్ఘనిస్థాన్- అనార్ అనార్’ అనే డాక్యుమెంటరీని రూపొందించాడు. ఈ చిత్రం అవార్డులను, రివార్డులను పొందింది. ఈ డాక్యుమెంటరీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్ఘన్ మహిళల అభ్యున్నతికి వినియోగిస్తున్నారు. అయామ్ సత్యభామ! కథక్, భరతనాట్యం, ఒడిస్సీ తదితర భారతీయ శాస్త్రీయ నృత్యాలపై కృషి చేసిన లబ్ధప్రతిష్ఠులెన వ్యక్తులపై అనేక డాక్యుమెంటరీలు వచ్చాయి. కూచిపూడికి జీవితాలను అంకితం చేసిన వ్యక్తులపై డాక్యుమెంటరీలు లేని లోటును కేశవప్రసాద్ సహకారంతో వేదాంతం సత్యనారాయణ శర్మపై రూపొందించిన ‘అయామ్ సత్యభామ’ ద్వారా దూలం పూరించాడు. కూచిపూడి గ్రామానికి వెళ్లి అక్కడి సాధారణ ప్రజలను, వీధులను, ఆలయాలను చూపిస్తూ తనికెళ్ల భరణి ద్వారా సత్యనారాయణశర్మను ఇంటర్వ్యూ చేయిస్తూ రూపొందిన ఈ చిత్రాన్ని అట్లాంటాలోని మిడిల్ బే కాలేజ్‌లో, ఇతర విశ్వవిద్యాలయాల్లో ‘డాన్స్ అండ్ ఎంబడీడ్ నాలెడ్జ్ ఇన్ ఇండియా’ అనే సిలబస్‌లో భాగంగా చేర్చారు. ఇక ‘ఆహార్యం’ అనే డాక్యుమెంటరీని ఏ రిఫ్లెక్స్ తదితర అంతర్జాతీయ ఫిలిమ్ స్కూల్స్‌లో ప్రదర్శించారు. దూలం చిత్రాల క్లిప్పింగ్‌లను (http://vimeo.com)లలో చూడవచ్చు. - పున్నా కృష్ణమూర్తి -
ప్లీజ్...డోన్ట మిస్ యూజ్!
నా ఫోన్ పని చేయట్లేదు... ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వరూ... మా వాళ్లకి ఒంట్లో బాగాలేదు... తొందరగా ఇంటికి వెళ్లాలి... కాస్త నా వర్క్ కూడా నువ్వు చేసిపెట్టు... లిఫ్ట్ ప్లీజ్... తొందరగా వెళ్లాలి... ప్లీజ్... ప్లీజ్... నాలుగేళ్ల వారి నుంచి 40, 50 సంవత్సరాల వయసువారి వరకు పైసా ఖర్చు లేకుండా... అవతలి వారి మీద బతికేయడం... వారిని మిస్ యూజ్ చేసుకోవడం... ఇదో ప్యాషన్... ఇదో కల్చర్! సహాయం చేయడం అనే మనిషిలోని బలహీనతను వాడుకోవద్దంటున్నాడు హైదరాబాద్ వాసి... సాయి సత్యకృష్ణ డెరైక్టర్స్ వాయిస్... నేను బి.కామ్ చదివాను. కొంతకాలం ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. ప్రస్తుతం లఘుచిత్రాలు తీయడంలో బిజీగా ఉన్నాను. మా తల్లిదండ్రులు, అన్నయ్య నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 12 వేలు ఖర్చయ్యింది. నా స్నేహితుడే ఖర్చు భరించాడు. ఇందులో నటించినవారంతా నా స్నేహితులే. ఇది నా మొట్టమొదటి లఘుచిత్రం. నాకు సినిమా డెరైక్షన్ అంటే ఒక ప్యాషన్. మంచి చిత్రాలు తీయాలనేది నా కోరిక. కథలు రాయడం నా హాబీ. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇటువంటి తరుణంలో ఎంటర్టెయిన్మెంట్ కథలు తీయడం బాధ్యతారాహిత్యం. అందువల్ల నా వంతు కర్తవ్యంగా త్వరలో... నేటి ఆర్థికవ్యవస్థ మీద ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామనుకుంటున్నాను. షార్ట్ స్టోరీ: ఈ చిత్రకథ ఇతరులకు సహాయం చేసే ఒక వ్యక్తి చుట్టూ నడుస్తుంది. తను చేసిన సహాయాన్ని అందరూ దుర్వినియోగం చేస్తుంటారు. దాంతో మనస్తాపానికి గురై, ఇకముందు ఎవ్వరికీ సహాయం చేయకూడదనుకుంటాడు. అయితే అలా చేయకపోవడం వల్ల ఒక అబ్బాయి చావుబతుకుల్లో ఉన్న తన తల్లితో ఆఖరి మాటలు మాట్లాడలేకపోతాడు. ఈ సంఘటనతో ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. అవతలి వారి ప్రవర్తనతో సంబంధం లేకుండా చేతనైనంత వరకు సాయం చేయాలని నిశ్చయించుకుంటాడు. కామెంట్: కాన్సెప్ట్ చాలా మంచిది. అందరి జీవితంలోనూ ఇటువంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అందువల్లే ఈ లఘుచిత్రాన్ని అందరూ ఆదరించే అవకాశం ఉంది. కథ చాలా పకడ్బందీగా ఉంది. టేకింగ్, కెమెరా యాంగిల్స్, కథనం... అన్నీ బావున్నాయి. హీరోగా నటించిన వ్యక్తి తన నటనను మరికాస్త ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. నటించడంలో ఒకటి రెండుచోట్ల పట్టు లోపించినట్లు ఉంది. మొత్తం మీద అన్ని రకాలుగా ఈ లఘుచిత్రం బాగుందనే చెప్పాలి. ‘‘ఇఫ్ పాజిబుల్ హెల్ప్ అదర్స్... బట్ నెవర్ మిస్ యూజ్ ద హెల్ప్’’అనే సందేశంతో ముగించడంలో ఈ దర్శకుడికి సమాజం పట్ల ఉన్న బాధ్యత కనిపిస్తుంది. టైటిల్లో ‘యూజ్’ పడి ఆ తరవాత ‘మిస్’ అని పడటంలో కూడా మంచి సందేశాన్ని అందించాడు. సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించే వ్యక్తులు మాత్రమే ఇటువంటి చిత్రాలు తీయగలరని ఈ చిత్రం ద్వారా నిరూపించాడు. యువతకు మంచిసందేశాన్ని అందించిన ఈ దర్శకుడిని అభినందించాల్సిందే. - డా. వైజయంతి