ప్లీజ్...డోన్‌ట మిస్ యూజ్!
నా ఫోన్ పని చేయట్లేదు... ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వరూ...
మా వాళ్లకి ఒంట్లో బాగాలేదు... తొందరగా ఇంటికి వెళ్లాలి... కాస్త నా వర్క్ కూడా నువ్వు చేసిపెట్టు...
లిఫ్ట్ ప్లీజ్... తొందరగా వెళ్లాలి...
ప్లీజ్... ప్లీజ్...
నాలుగేళ్ల వారి నుంచి 40, 50 సంవత్సరాల వయసువారి వరకు
పైసా ఖర్చు లేకుండా...
అవతలి వారి మీద బతికేయడం... వారిని మిస్ యూజ్ చేసుకోవడం...
ఇదో ప్యాషన్... ఇదో కల్చర్!
సహాయం చేయడం అనే మనిషిలోని బలహీనతను వాడుకోవద్దంటున్నాడు హైదరాబాద్ వాసి... సాయి సత్యకృష్ణ
డెరైక్టర్స్ వాయిస్...
నేను బి.కామ్ చదివాను. కొంతకాలం ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. ప్రస్తుతం లఘుచిత్రాలు తీయడంలో బిజీగా ఉన్నాను. మా తల్లిదండ్రులు, అన్నయ్య నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 12 వేలు ఖర్చయ్యింది. నా స్నేహితుడే ఖర్చు భరించాడు. ఇందులో నటించినవారంతా నా స్నేహితులే. ఇది నా మొట్టమొదటి లఘుచిత్రం. నాకు సినిమా డెరైక్షన్ అంటే ఒక ప్యాషన్. మంచి చిత్రాలు తీయాలనేది నా కోరిక. కథలు రాయడం నా హాబీ. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇటువంటి తరుణంలో ఎంటర్‌టెయిన్‌మెంట్ కథలు తీయడం బాధ్యతారాహిత్యం. అందువల్ల నా వంతు కర్తవ్యంగా త్వరలో... నేటి ఆర్థికవ్యవస్థ మీద ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామనుకుంటున్నాను.
షార్ట్ స్టోరీ: ఈ చిత్రకథ ఇతరులకు సహాయం చేసే ఒక వ్యక్తి చుట్టూ నడుస్తుంది. తను చేసిన సహాయాన్ని అందరూ దుర్వినియోగం చేస్తుంటారు. దాంతో మనస్తాపానికి గురై, ఇకముందు ఎవ్వరికీ సహాయం చేయకూడదనుకుంటాడు. అయితే అలా చేయకపోవడం వల్ల ఒక అబ్బాయి చావుబతుకుల్లో ఉన్న తన తల్లితో ఆఖరి మాటలు మాట్లాడలేకపోతాడు. ఈ సంఘటనతో ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. అవతలి వారి ప్రవర్తనతో సంబంధం లేకుండా చేతనైనంత వరకు సాయం చేయాలని నిశ్చయించుకుంటాడు.
కామెంట్: కాన్సెప్ట్ చాలా మంచిది. అందరి జీవితంలోనూ ఇటువంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అందువల్లే ఈ లఘుచిత్రాన్ని అందరూ ఆదరించే అవకాశం ఉంది. కథ చాలా పకడ్బందీగా ఉంది. టేకింగ్, కెమెరా యాంగిల్స్, కథనం... అన్నీ బావున్నాయి. హీరోగా నటించిన వ్యక్తి తన నటనను మరికాస్త ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. నటించడంలో ఒకటి రెండుచోట్ల పట్టు లోపించినట్లు ఉంది. మొత్తం మీద అన్ని రకాలుగా ఈ లఘుచిత్రం బాగుందనే చెప్పాలి. ‘‘ఇఫ్ పాజిబుల్ హెల్ప్ అదర్స్... బట్ నెవర్ మిస్ యూజ్ ద హెల్ప్’’అనే సందేశంతో ముగించడంలో ఈ దర్శకుడికి సమాజం పట్ల ఉన్న బాధ్యత కనిపిస్తుంది. టైటిల్లో ‘యూజ్’ పడి ఆ తరవాత ‘మిస్’ అని పడటంలో కూడా మంచి సందేశాన్ని అందించాడు. సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించే వ్యక్తులు మాత్రమే ఇటువంటి చిత్రాలు తీయగలరని ఈ చిత్రం ద్వారా నిరూపించాడు. యువతకు మంచిసందేశాన్ని అందించిన ఈ దర్శకుడిని అభినందించాల్సిందే.
- డా. వైజయంతి