మన సినిమాల్లో ఆడవాళ్లను గయ్యాళి వారిగా పరిచయం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన సీన్లుంటాయి. వీధి కుళాయి దగ్గర పెద్ద నోరేసుకుని అరుస్తూ మిగిలిన అందరినీ హడలుగొడుతూ నీళ్లు పట్టుకునే సన్నివేశం కూడా ఆ కోవకు చెందినదే. అయితే అవన్నీ సమాజంలో ఉన్నవే. కానీ పైకి కనిపించే సంఘటనల వెనుక ఉన్న కారణాల జోలికి వెళ్లదు సినిమా. ఎందుకంటే ఆ చిత్రంలో ఆ పాత్ర పరిచయానికి అంతకంటే లోతుగా అధ్యయనం చేయాల్సిన పని ఉండదు. అలాగని మహిళను గయ్యాళిగా చూసే అభిప్రాయాన్ని సమాజం మెదడు నుంచి తుడిచేయకపోతే ఎలా? ఇదే పని చేస్తున్నారు ప్రియదర్శిని పళని.
జీవిత రచన
చెన్నైలో బ్లూ క్లబ్ పేరుతో ఒక మీడియా సంస్థ శ్రామిక వర్గ మహిళల కోసం పని చేస్తోంది. ప్రియదర్శిని ఆ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు. ఆమె చెన్నైలోని పెరుబాక్కమ్, తెదీర్ నగర్ వంటి ప్రదేశాలను సందర్శించి అనేక యదార్థ గాథలను డాక్యుమెంట్ చేస్తోంది. ఐదేళ్ల కిందట మొదలైన ఈ క్లబ్ ఇప్పటివరకు రెండు వందలకు పైగా మహిళల జీవితాలను వాళ్ల చేతనే గ్రంథస్థం చేయించింది. నిజానికి ఆ మహిళల్లో ఎవరూ కథ, కథనాల మధ్య తేడా తెలిసిన వాళ్లు కూడా కాదు. అయితే జీవితం నేర్పించినన్ని పాఠాలు మరే యూనివర్సిటీ కూడా నేర్పించలేదు. జీవితం ఇచ్చే శిక్షణ ముందు మిగిలిన శిక్షణలన్నీ దిగతుడుపే. ఇదే మాట చెబుతారు ప్రియదర్శిని. ఆమె అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీలలో శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. వాళ్లంతా ఏదో బడికి వెళ్లి చదవడం, రాయడం మాత్రమే నేర్చుకుని ఆ తర్వాత బతుకు పోరాటంలో భాగంగా పనుల్లో పడిపోయిన వాళ్లే. ఒక్కో మహిళను ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రోజులో చేసే పనులను చెప్పమన్నప్పుడు అందరూ చెప్పడం మొదలు పెట్టారు. పైకి దాదాపుగా అందరి జీవితం ఒకటే మూసలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే ఎవరి అగాధం వారిదే.
ఆ అగాధాన్ని దాటి రావడానికి వాళ్లు పడే శ్రమ కూడా దేనికదే ప్రత్యేకం. వాళ్ల జీవితాలను రిపోర్టు చేయడానికి వచ్చిన ఏ రిపోర్టర్ అయినా మహా అయితే... వీధి చివర్లో నీళ్ల కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునే మహిళల దుస్థితిని దయనీయంగా కళ్లకు కట్టగలుగుతారేమో. నిజానికి ఆ బిందెడు నీళ్లు తీసుకెళ్లకపోతే ఇంట్లో ఆగిపోయే పనుల గురించి ఏకరువు పెట్టగలిగింది ఆ బాధను అనుభవిస్తున్న మహిళలే. నీళ్లు లేకుండా ఇంటికి వెళ్తే ఒక మహిళ ఇంట్లో భర్త చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది. మరో ఇంట్లో ఆ మహిళ బిడ్డకు స్నానం చేయించకుండా చెంబుడు నీటిలో వస్త్రాన్ని తడిపి ఒంటిని తుడిచి సరిపెట్టాల్సి వస్తుంది. మరో ఇంట్లో ముసలి వాళ్లు ఉంటారు. నీళ్లు లేకపోతే ఎలాగా అనే బెంగతో అదే విషయాన్ని పలుమార్లు తలుచుకుంటూ కోడలిని సతాయిస్తుంటారు. ఇంకో ఇంట్లో బిందెడు నీళ్లు లేని కారణంగా స్కూలుకెళ్లాల్సిన పిల్లలకు అన్నం వండి బాక్సు పెట్టడానికి కుదరదు. అవసరానికి పనికొస్తాయని దుస్తుల అడుగున దాచుకున్న చిల్లర డబ్బులను పిల్లలకిచ్చి ఏదైనా కొనుక్కుని తినమని స్కూలుకు పంపిస్తుందా తల్లి.
నీటి కుళాయి తగవులాట వెనుక, ఆటోవాలాకిచ్చే చిల్లర దగ్గర గొడవ పడడం వెనుక ఇంతటి విషాదాలుంటాయి. ఆ కష్టాలను యథాతథంగా పేపర్ మీద రాయమంటుంది ప్రియదర్శిని. తమ రోజువారీ కార్యక్రమాలను చెప్పడం మొదలైనప్పటి నుంచే వారిలో ఆలోచన విస్తరిస్తోంది. ఇక రాయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ల దృష్టి కోణం మరింతగా విస్తరిస్తోందని చెబుతున్నారు ప్రియదర్శిని. శ్రామిక వర్గ మహిళలు తాము జీవిస్తున్న జీవితాన్ని విశ్లేషించడంతోపాటు అందుకు దారి తీసిన మూల కారణాలను కూడా అన్వేషించగలుగుతున్నారు. కొందరి విషయంలో అవి కుటుంబ పరమైన కారణలయి ఉంటున్నాయి. మరికొందరికి ఆ కారణాలు సామాజికపరమైనవి అయి ఉంటున్నాయి. ‘శ్రామిక వర్గ మహిళల కష్టాలను నేను చూసి రాయడంకంటే వాళ్ల చేత రాయించగలిగితే అసలు కారణాలు బయటకు వస్తాయనుకున్నాను. అది నిజమని నా ప్రయత్నంలో నిర్ధారణ అయింది’ అంటున్నారు ప్రియదర్శిని.
Comments
Please login to add a commentAdd a comment