మహిళా రైతు కుటుంబాలకు అధికోష్ణంతో 8 శాతం, వరదలతో 3 శాతం ఎక్కువగా ఆదాయ నష్టం
ప్రపంచ సగటు ఉష్రోగ్రత 1 డిగ్రీ పెరిగితే.. పురుషులతో పోలిస్తే.. మహిళా రైతులకు 34 శాతం ఎక్కువ నష్టం!
భారత్ సహా 24 దేశాల్లో ఎఫ్.ఎ.ఓ. తాజా అధ్యయనం
'అధిక ఉష్ణోగ్రత, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినటం వల్ల గ్రామీణ రైతాంగం వ్యవసాయక ఆదాయాన్ని పెద్ద ఎత్తున నష్టపోతుంటారని మనకు తెలిసిందే. అయితే, ఇందులో ఏయే వర్గాల వారు ఎక్కువగా నష్టపోతున్నారన్నది ఆసక్తి కరమైన ప్రశ్న. ఈ దిశగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చేసిన తొట్టతొలి పరిశోధనలో మహిళలు, యువత సారధ్యంలోని రైతు కుటుంబాలకే ఎక్కువని తేలింది!'
పురుషాధిక్యతతో పాటు వాతావరణ మార్పులు తోడై విపత్తుల వేళ మహిళా రైతు కుటుంబాలకు అధికంగా ఆదాయ నష్టం కలిగిస్తున్నాయని ఈ అధ్యయనం తేల్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘అన్‌జస్ట్ క్లైమెట్’ శీర్షికతో ఎఫ్.ఎ.ఓ. ఈ నివేదికను వెలువరించింది. విపరీతమైన వాతావరణ సంఘటనలకు తట్టుకునే, ప్రతిస్పందించే సామర్థ్యంలో హెచ్చు తగ్గులే ఈ అసమానతకు కారణమని తేల్చింది.
భారత్ సహా 24 అల్పాదాయ, మధ్య తరహా ఆదాయ దేశాల్లో ఈ అధ్యయనం జరిగింది. ఈ దేశాల్లో 95 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే లక్ష గ్రామీణ కుటుంబాల నుంచి సామాజిక ఆర్థిక గణాంకాలను సేకరించి, గత 70 ఏళ్లలో విపత్తుల గణాంకాలతో పాటు విశ్లేషించారు.
వాతావరణ విపత్తుల వల్ల పురుషుల సారధ్యంలోని కుటుంబాల కంటే మహిళల నేతృత్వంలోని కుటుంబాలకు వ్యవసాయ ఆదాయ నష్టం ఎక్కువగా ఉందని ఒక కొత్త నివేదిక ఎత్తిచూపింది. పురుషులు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలతో పోల్చితే, మహిళలు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలు అధికోష్ణం ఒత్తిడి కారణంగా 8 శాతం, వరదల కారణంగా 3 శాతం ఎక్కువ నష్టాలను చవిచూస్తున్నాయి.
అదేవిధంగా, పురుషులు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాల్లోనూ.. పెద్దల నేతృత్వంలోని కుటుంబాలతో పోల్చితే 35 ఏళ్లు నిండని యువకుల నాయకత్వంలోని కుటుంబాలు ఎక్కువగా వ్యవసాయ ఆదాయం కోల్పోతున్నాయని ఎఫ్.ఎ.ఓ. గుర్తించింది. సామాజికంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న గ్రామీణ ప్రజలకు వాతావరణ సంక్షోభం ద్వారా ఎదురయ్యే సవాళ్ల ప్రభావం సంపద, లింగం, వయస్సు భేదాల కారణంగా ఎలా ఉందనే ఖచ్చితమైన ఆధారాలను అధ్యయనం వెలుగులోకి తెచ్చింది.
మహిళల నేతృత్వం వహించే కుటుంబాలకు అధిక వేడి వల్ల 83 డాలర్లు, వరదల కారణంగా 35 డాలర్ల మేరకు తలసరి నష్టం జరుగుతోంది. 24 దేశాల్లో మొత్తంగా అధిక వేడి వల్ల 3700 కోట్ల డాలర్లు, వరదల వల్ల 1600 కోట్ల డాలర్ల మేరకు నష్టం జరుగుతోందని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు కేవలం 1 డిగ్రీల సెల్షియస్ పెరిగితే, పురుషులతో పోలిస్తే మహిళా రైతులు తమ వ్యవసాయ ఆదాయంలో 34 శాతం ఎక్కువ నష్టాన్ని చవిచూస్తారు.
ఇవీ కారణాలు..
- మహిళా రైతులు కుటుంబ సభ్యుల సంరక్షణ, గృహ బాధ్యతలు వంటి అనేక వివక్షతతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అసమానత భారం, భూమిపై వారికి ఉండే పరిమిత హక్కులు, శ్రమపై నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించే ప్రతికూల పరిస్థితుల వల్ల మహిళా రైతులు వత్తిడికి గురవుతున్నారు.
- పంటల సాగులో మహిళా రైతులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్ల కారణంగా పంటల ఉత్పాదకతలో, స్త్రీ పురుషుల మధ్య వేతనాలలో వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగానే వాతావరణ సంక్షోభకాలాల్లో వీరు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటిని ప్రభుత్వాలు పరిష్కరించకపోతే, వాతావరణ సంక్షోభం వల్ల రాబోయే కాలంలో ఈ అంతరాలు బాగా పెరిగిపోతాయని ఎఫ్.ఎ.ఓ. హెచ్చరించింది.
- 68 దేశాల్లో వ్యవసాయ విధానాలను ఎఫ్.ఎ.ఓ. గత ఏడాది విశ్లేషించగా.. దాదాపు 80 శాతం విధానాల్లో మహిళలు, వాతావరణ మార్పుల ఊసే లేదు!
- వాతావరణ సంక్షోభకాలంలో గ్రామీణులకు రక్షణ కల్పించే పథకాలపై అధికంగా పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వాలకు ఎఫ్.ఎ.ఓ. సూచిస్తోంది.
ఇవి చదవండి: డాక్టర్ గీతారెడ్డి బోర: స్టార్టప్ దిశగా అంకురం!
Comments
Please login to add a commentAdd a comment