చూడాలి.. తెలుసుకోవాలి.. వెలుగులోకి తేవాలి..స్ఫూర్తి చెందాలి.మనకు ఉన్నవన్నీ సవాళ్లే అనుకుంటే వీళ్ల జీవితాలు చూడాలి.. మనకు కనపడని దేశం ఇది..ఈ నెల పన్నెండున తెలంగాణ, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో జరిగిన ‘జై చండీరాం మెమోరియల్ సెకండ్ నేషనల్ కమ్యూనిటీ మీడియా ఫెస్టివల్’లో ప్రదర్శించిన డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్‌లో మనం చూడని.. మనకు తెలియని దేశం కనిపించింది. మచ్చుకు మూడు..
సాల్ట్ ఇన్ మై విలేజ్
సముద్రపు నీటితోనే కాదు.. కొండవారగా పారే నీటితోనూ ఉప్పు తయారవుతుంది. అదే నాగాలాండ్ కథ.. సాల్ట్ ఇన్ మై విలేజ్. 1960ల్లో నాగాలాండ్‌లో జరిగిన ఘర్షణ, హింస నుంచి బతికి బయటపడ్డ మహిళలు ఇలా ఉప్పును తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్హెక్ జిల్లాలోని మాతిక్రూ గ్రామంలోని ఆడవాళ్లకు ఇదే ప్రధాన ఆర్థిక వనరు. కొండ మీద నుంచి చిన్న చిన్న పాయలుగా పారుతున్న నీటిని వెదురు బుంగలు, క్యాన్లలో పట్టుకొని కడవల్లో పోసి కాస్తారు. నీరంతా మరిగి మరిగి... ఆవిరై అడుగున ఉప్పు తయారవుతుంది. వీటిని అచ్చులుగా చేసి (తాటి బెల్లంలా) చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో అమ్ముతారు. డబ్బుతోపాటు ఆరోగ్యం అనీ చెప్తారు దీన్ని తయారు చేసే స్త్రీలు. మరుగుతున్న ఈ నీటి ఆవిరిని పీల్చుకోవడం వల్ల జలుబు, దగ్గు, కొన్ని శ్వాసకోశ వ్యాధులూ నయమయ్యాయని అంటారు. అంతేకాదు, ఈ ఉప్పు కూడా ఆరోగ్యకరమే అని చెప్తారు. ఉప్పు తయారీతో అల్లుకుని ఉన్న ఆ మహిళల జీవన విధానాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
ట్రేడింగ్ చైల్డ్‌హుడ్
ఛత్తీస్‌గఢ్‌లోని బరిమా గ్రామం. ఊళ్లో చాలా మంది పిల్లలు బాలకార్మికులే. పశువులు కాస్తూ, పొలాల్లో పనిచేస్తూ కనిపిస్తారు. వాళ్లందరి ఇంటర్వ్యూలతో ఆ ఊరి చిత్రాన్ని చూపించిన సినిమా ఇది. పేదరికం, వాటికి కారణమైన దేశ సామాజిక, రాజకీయ స్థితిగతులను పరోక్షంగా ప్రశ్నించిన ఈ ఫిల్మ్ పెద్దల బాధ్యతను గుర్తుచేస్తుంది.
సమ్‌ఝౌతా..
సమ్‌ఝౌతా .. అంటే ఒప్పందం. ఎవరితో.. శవాలతో! అవును. ఇది ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ స్త్రీల జీవన చిత్రం. స్థానిక మీడియా చూసినా.. చదివినా.. బుందేల్‌ఖండ్‌లో ఒక్క నేర వార్త కూడా కనిపించదు. అసలక్కడ క్రైమ్ రేటే ఉండదు. మరి శవాలతో సమ్‌ఝౌతా ఏంటీ? అదే సినిమా! వరకట్నం వేధింపులు, వాటివల్ల ఆత్మహత్యలు, ఈవ్‌టీజింగ్‌లు, రేప్‌లు, హత్యలు.. ఏం జరిగినా బాధితుల తరపు కుటుంబ సభ్యులను పిలిచి నేరస్తుల కుటుంబ సభ్యులతో సమ్‌ఝౌతా కుదిరిస్తారు గ్రామ సర్పంచ్‌లు, పెద్దలు వగైరా! అవును, ఖాప్ పంచాయత్‌లే. నేరం ఎంత పెద్దదయినా సరే.. సమ్‌ఝౌతానే శరణ్యం. ఫిర్యాదులు నమోదు అవడానికి వీల్లేదు. విచారణ పేరుతో పోలీసులు ఆ ఊళ్లలోకి అడుగు పెట్టడానికి ఆస్కారం లేదు. అందుకే క్రైమ్ రిపోర్ట్‌లో... పోలీసుల వైపు కెమెరా పెడితే.. ‘‘ఫిర్యాదు రాదు.. ఎఫ్‌ఐఆర్ నమోదు కాదు. ఫిర్యాదు వస్తే... తప్పకుండా న్యాయం చేస్తాం’’ అంటారు. ఇదే సమ్‌ఝౌతా! చూస్తున్న వాళ్లకు షాక్. ‘సభ్య’ సమాజానికీ అశనిపాతం. ఇవన్నీ తీసినవి ఫిల్మ్‌మేకింగ్‌లో మాస్టర్స్ కాదు. కష్టాల బడిలో ఆరితేరిన వాళ్లు. ఆ డాక్యుమెంటరీల్లో వాళ్లు అనుభవించిన సమస్యలున్నాయి. అందుకే అవి మనసును తడి చేస్తాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించిన మహిళా రైతుల గురించి చెప్పుకోవాలి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర్లోని పస్తాపూర్‌కు చెందిన వాళ్లు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మ ఇంకా కొందరు మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందినవాళ్లు. తమలా సమస్యల సవాళ్లతో జీవితంలో నెగ్గుతున్న వాళ్లు.. వాళ్ల కోణంలో.. వాళ్లు చూసిన సమాజాన్ని కెమెరాలో బంధించి.. డాక్యుమెంటరీలుగా.. షార్ట్‌ఫిల్మ్స్‌గా తీస్తే.. ఎందరికో స్ఫూర్తిగా ఉంటుందని ఈ బాధ్యతను చేపట్టారు. దూరదర్శన్ తొలితరం ప్రొడ్యూసర్లలో ఒకరైన మహిళ.. జై చండీరాం. ఆమె జ్ఞాపకార్థం ‘జై చండీరాం మెమోరియల్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో 2017లో ప్రారంభించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుతున్నారు. ఇది రెండవ యేడాది.
ఈ ఇద్దరూ బాల్యపు హక్కులు, ప్రత్యేకతలు, జ్ఞాపకాలు లేకుండా పెరిగారు. ‘రెలు’ కూడా వాళ్లకు అందమైన ఊహ. ఇప్పుడు ఫ్లయిట్‌లో ఈ ఫెస్టివల్‌కు వచ్చారు. ఆ మాటను మెరిసే కళ్లతో చెప్తారు.
చిన నర్సమ్మ, లక్ష్మమ్మకు .. వాళ్ల నాయకత్వంలోని ఇతర మహిళలకూ చదువురాదు. అయితేనేం బతుకు తెలిసిన జ్ఞానవంతులు. అందుకే షూటింగ్‌కి చెందిన హై యాంగిల్, లో యాంగిల్, ఐ లెవెల్ షాట్స్ వంటి సాంకేతిక భాషకు ప్రత్యామ్నాయంగా వీళ్లు కొత్తపరిభాషను ఏర్పాటు చేసుకున్నారు. గాయ్‌దోళ్ల షాట్, పటేల్ షాట్, సంఘం షాట్‌గా! వాటిని కాయిన్ చేసుకోవడానికి వారి ప్రాంతపు సంస్కృతి, సామాజిక పరిస్థితులే ప్రేరణ, కారణం. దొరతనానికి బానిసలు, ఆర్థికలేమి, నిర్వాసితులుగా వాళ్లు పడ్డ కష్టాలు, అనుభవించిన బాధల్లోంచి పుట్టిన పదాలు అవి. పటేల్ అంటే దొర.. ఎప్పుడూ తన ఎదుట నేల మీద కూర్చుని ఉన్న కూలీలతో కిందకు చూసే మాట్లాడ్తాడు కాబట్టి లో యాంగిల్ షాట్‌ను తమకు అర్థమయ్యేలా పటేల్ షాట్ అని పిలుచుకుంటున్నారు. హై యాంగిల్ షాట్ గాయ్‌దోళ్ల షాట్ ఎందుకు అయింది? గాయ్‌దోళ్లు అంటే వెట్టి కూలీలు. తమ ముందు నిలబడి ఉన్న దొరకు సమాధానం ఇవ్వాలంటే పైకి చూస్తూనే మాట్లాడాలి. ఆ సన్నివేశాన్నే వాళ్లు ఊహించుకుని హై యాంగిల్ షాట్‌కి ఆప్ట్ అయ్యేలా గాయ్‌దోళ్ల షాట్ అని నామకరణం చేసుకున్నారు. సంఘం షాట్.. సంఘం లేదా... సమావేశంలో వాళ్లంతా ఒకచోటే కూర్చుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటారు. ఎవ్వరూ తల ఎత్తాల్సిన అవసరం లేదు. తలదించాల్సిన అగత్యం లేదు. అందుకే ఐ లెవెల్ షాట్... సంఘం షాట్‌లా అనిపించింది వాళ్లకు. ఇది వాళ్లు కల్పించుకున్న స్పృహ.. తెచ్చుకున్న అవగాహన. దక్కన్ రేడియోతో తెలుగు రాష్ట్రాల్లో తొలి కమ్యూనిటీ రేడియోను, వీడియో కెమెరా ఆపరేటింగ్‌తో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్‌నూ తీస్తున్నారు. తమను చూసి నొసటితో వెక్కిరించిన నోళ్లకు తమ చేతలతో మర్యాద నేర్పుతున్నారు.
లక్ష్మణ్ మూడి..
‘ట్రేడింగ్ చైల్డ్‌హుడ్’ దర్శకుడు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న పెంచి పెద్ద చేశాడు. లక్ష్మణ్ కూడా ఒకప్పుడు బాలకార్మికుడే. తొమ్మిదో తరగతి వరకు చదివి ఆపేశాడు. పెద్దవాళ్లకు తెలియకుండా.. తెలిసిన పెద్దలను ఒప్పిస్తూ ఈ డాక్యుమెంటరీ తీశాడు. బాగా చదువుకోవాలనేది లక్ష్మణ్ ఆశయం.
థెనిలో..
‘సాల్ట్ ఇన్ మై విలేజ్’ డాక్యుమెంటరీ దర్శకురాలు. పదో తరగతితో చదువు ఆపేసింది ఆర్థిక స్తోమత లేక. ఆమె చేనేత కార్మికురాలు కూడా. ఇప్పటికే నాలుగు షార్ట్‌ఫిల్మ్స్ తీసింది. స్క్రీనింగ్ కోసం పలు ప్రాంతాలకు వెళ్లింది. ‘‘మంచి ఫిల్మ్ మేకర్ కావాలనుకుంటున్నా’’ అంటుంది.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment