- ప్రతి వారం లఘు చిత్రాల ప్రదర్శన, ప్రోత్సాహం
- వెండితెరకు ఆర్టిస్టులను పరిచయం చేస్తూ నగరంలోని రవీంద్రభారతి వేదికగా ఆవిష్కృతం
- చిన్న సినిమాలకు గుర్తింపునిచ్చే అద్భుత వేదిక
- ఎనిమిది ఏళ్లుగా కళారంగానికి సేవలందిస్తూ..
సినిమా.. సినిమా.. అంటూ జీవితాన్ని సైతం అంకితం చేసి ఈ రంగంలో రాణించడానికి, వెండి తెరపైన తమకంటూ ప్రత్యేకంగా ఓ పేజీ రాసుకోవాలని తపించే, పరితపించే సినిమా ప్రేమికులెందరో. విభిన్న కళల సమాహారం సినిమా. కథకుడు, దర్శకుడితో మొదలై.. నటీనటులు, ప్లేబ్యాక్ సింగర్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ, ఆర్ట్, వీఎఫ్‌ఎక్స్, డబ్బింగ్.. ఇలా విభిన్న కళాకారుల సమిష్టి కృషి సినిమా. ఈ వేదికపై తమ పేరును చూసుకోవాలన్నా, వారి చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలన్నా ఎక్కడో సాయం అందాలి.
ఇప్పుడిప్పుడే సినీ రంగం వైపు అడుగులేస్తున్న ఔత్సాహికుల కళాత్మకతను, సృజనాత్మకతను గుర్తించే వారుండాలి..?! సినిమానే లక్ష్యంగా లఘుచిత్రాలు రూపొందిస్తూ, బిగ్ స్క్రీన్ కోసం ప్రయత్నిస్తున్న సినీపిపాసులను ఆదరించే ప్రోత్సాహం అవసరం.. ఇలాంటి వారందరినీ సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది ‘సినివారం’. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నగరం నడిబొడ్డున కొలువుదీరిన రవీంధ్రభారతి వేదికగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న ‘సినివారం’ ఈ తరం సినీ ప్రేమికులకు స్వర్గధామం. ఉత్తమ షార్ట్ ఫిలింస్ నిర్మించే వారిని గుర్తించి వారి ప్రయాణానికి రెడ్ కార్పెట్ వేస్తోంది రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ‘సినివారం’.
– సాక్షి, సిటీబ్యూరో
వినీలాకాశంలాంటి సినీ ప్రపంచంలోకి అడుగులేసిన యువతరానికి గుర్తింపునివ్వాలనే లక్ష్యంతో 2016 నవంబర్ నెలలో పురుడుపోసుకుంది ‘సినీవారం’. సృజనాత్మకత ఉండి, సినిమాపై ప్రేమతో మొదటి ప్రయత్నంగా లఘు చిత్రాలు రూపొందిస్తున్న తెలంగాణ యువత ఎందరో. వారందరికీ ఒక అవకాశంతో పాటు, సినిమా రంగానికి వారి సృజనాత్మకతను తెలియజేసేది ఆ షార్ట్‌ఫిల్మ్ మాత్రమే. అనంతరం దానిపై సినీ రంగ ప్రముఖులతో చర్చిస్తుంది ఈ సినీవారం. ఇందులో భాగంగా ఈ ఎనిమిదేళ్లలో కొన్ని వందల లఘు చిత్రాలు ఈ తెరపై ప్రదర్శితమయ్యాయి. వీటిని రూపొందించిన సినీ ప్రేమికులకు నేరుగా అవకాశాలు లభించాయి. నూతన తెలంగాణలో సినీ ప్రేమికులకు ఇదొక
అవకాశాల పుష్పక విమానం.
నైపుణ్యాలను గుర్తించి.. లోపాలను సవరిస్తూ..
తెలంగాణకు సినిమా కొత్త కాదు. ఆ రోజుల్లోనే బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న మొదటి తరం సినీ రంగ ప్రముఖులు.. పైడి జయరాజ్. ఆయన గౌరవార్థం రవీంద్రభారతిలోని థియేటర్‌కు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అని నామకరణం చేశారు. ఈ థియేటర్‌లోనే ఈ తరం యువకులు తీసిన లఘు చిత్రాలను క్రమం తప్పకుండా ప్రతి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్.. ఇలా తెలంగాణలోని విభిన్న ప్రాంతాల్లో యువతరం తీసిన షార్ట్ ఫిల్మŠస్, డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శించి వారికి ఒక గుర్తింపునిస్తోంది రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ. ఈ ప్రయత్నంలో వారి నైపుణ్యాలను, లోపాలను ఇదే వేదికపై తెలియజేసేలా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, సినీ ప్రముఖులు, నిపుణులు, ప్రముఖ సినీ విమర్శకులతో చర్చా గోష్టిని నిర్వహిస్తున్నారు. అనంతరం వారికి సినిమా అవకాశాలు లభించేలా ఒక దారిని చూపిస్తోంది.
మహామహులంతా ఇక్కడి నుంచే..
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి హిట్ చిత్రాలతో ఫేమస్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్, మెయిల్ సినిమాతో చిన్న సినిమాకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చిన ఉదయ్ గుర్రాల, దొరసాని ఫేం కేవీఆర్ మహేంద్ర వంటి ఈ తరం సినీ దిగ్గజాలు తమ మొదటి సినీ ప్రయత్నాలను ఈ సినీవారం వేదికగానే ప్రదర్శించారు. ఇలా దర్శకులు, నటులు, సినీ రచయితలతో పాటు సిని పరిశ్రమకు అవసరమయ్యే విలువైన ముడిసరుకు కొంతమేర ఈ సినీవారం వేదికగా సమకూరుతోంది. ఇక్కడ ప్రదర్శించే లఘుచిత్రాలు ప్రధానంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ పోరాటాలు, యధార్థగాథలతో పాటు నేటి మోడ్రన్ కమర్షియల్ సినిమాల నాణ్యతను పరిచయం చేస్తున్నాయి.
క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్...
పదేళ్ల కృషికి నిదర్శనం ఇది.. ప్రస్తుత సినిమాల్లో తెలంగాణ నేపథ్యమున్న కళాకారులు, కథలు, సినిమాలు, టెక్నీషియన్‌లు వారి విజయాలు..!! ఈ లక్ష్యం నిర్దేశించుకునే 2016లో ‘సినివారం’ను ప్రారంభించాం. గతంలో ముంబైలోని బాలివుడ్ కమర్షియల్ సినిమాలకు కేంద్రం. కానీ అక్కడి మరాఠీ సినిమాలు కూడా వాటి ప్రత్యేకతను, ప్రాధాన్యతను, ప్రశస్తిని కొనసాగించాయి. అలాగే హైదరాబాద్‌లోనూ తెలుగు సినిమా సైతం తన వైవిధ్యాన్ని, విశిష్టతను ప్రదర్శించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయత్నానికి నాంది పలికాం.
ఇందులో భాగంగా కళ, నైపుణ్యాలు, సృజనాత్మకత ఉండి, అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు అద్భుత వేదికను నిర్మించాం. ఈ సినివారం వేదికగా ఇప్పటి వరకూ దాదాపు 27 మంది ఈ తరం దర్శకులు పరిచయమయ్యారు. అంతేకాకుండా 24 క్రాఫ్టŠస్‌కు చెందిన నిపుణులు గుర్తింపును, అవకాశాలను పొందారు. ఇలాంటి ఔత్సాహికుల కోసం ఇక్కడ వారి షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనతో పాటు వర్క్‌షాప్‌లు, శిక్షణా తరగతులు, అవగాహనా సదస్సులు, ఇంటరాక్టివ్ సెషన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అందించే సేవలన్నీ ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవలే సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) ప్రాధాన్యత పైన వర్క్‌షాప్ నిర్వహించాం. సినిమా రంగంలోని అధునాతన మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం.భవిష్యత్‌లోనూ ఈ తరం సినిమా ప్రేమికులకు మరిన్ని అవకాశాలను భాషా సాంస్కృతిక శాఖ అందిస్తుంది.
– మామిడి హరిక్రిష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment