Short films
-
సినివారం.. లఘు చిత్రాల సమాహారం..
సినిమా.. సినిమా.. అంటూ జీవితాన్ని సైతం అంకితం చేసి ఈ రంగంలో రాణించడానికి, వెండి తెరపైన తమకంటూ ప్రత్యేకంగా ఓ పేజీ రాసుకోవాలని తపించే, పరితపించే సినిమా ప్రేమికులెందరో. విభిన్న కళల సమాహారం సినిమా. కథకుడు, దర్శకుడితో మొదలై.. నటీనటులు, ప్లేబ్యాక్ సింగర్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ, ఆర్ట్, వీఎఫ్ఎక్స్, డబ్బింగ్.. ఇలా విభిన్న కళాకారుల సమిష్టి కృషి సినిమా. ఈ వేదికపై తమ పేరును చూసుకోవాలన్నా, వారి చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలన్నా ఎక్కడో సాయం అందాలి.ఇప్పుడిప్పుడే సినీ రంగం వైపు అడుగులేస్తున్న ఔత్సాహికుల కళాత్మకతను, సృజనాత్మకతను గుర్తించే వారుండాలి..?! సినిమానే లక్ష్యంగా లఘుచిత్రాలు రూపొందిస్తూ, బిగ్ స్క్రీన్ కోసం ప్రయత్నిస్తున్న సినీపిపాసులను ఆదరించే ప్రోత్సాహం అవసరం.. ఇలాంటి వారందరినీ సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది ‘సినివారం’. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నగరం నడిబొడ్డున కొలువుదీరిన రవీంధ్రభారతి వేదికగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న ‘సినివారం’ ఈ తరం సినీ ప్రేమికులకు స్వర్గధామం. ఉత్తమ షార్ట్ ఫిలింస్ నిర్మించే వారిని గుర్తించి వారి ప్రయాణానికి రెడ్ కార్పెట్ వేస్తోంది రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ‘సినివారం’. – సాక్షి, సిటీబ్యూరోవినీలాకాశంలాంటి సినీ ప్రపంచంలోకి అడుగులేసిన యువతరానికి గుర్తింపునివ్వాలనే లక్ష్యంతో 2016 నవంబర్ నెలలో పురుడుపోసుకుంది ‘సినీవారం’. సృజనాత్మకత ఉండి, సినిమాపై ప్రేమతో మొదటి ప్రయత్నంగా లఘు చిత్రాలు రూపొందిస్తున్న తెలంగాణ యువత ఎందరో. వారందరికీ ఒక అవకాశంతో పాటు, సినిమా రంగానికి వారి సృజనాత్మకతను తెలియజేసేది ఆ షార్ట్‌ఫిల్మ్ మాత్రమే. అనంతరం దానిపై సినీ రంగ ప్రముఖులతో చర్చిస్తుంది ఈ సినీవారం. ఇందులో భాగంగా ఈ ఎనిమిదేళ్లలో కొన్ని వందల లఘు చిత్రాలు ఈ తెరపై ప్రదర్శితమయ్యాయి. వీటిని రూపొందించిన సినీ ప్రేమికులకు నేరుగా అవకాశాలు లభించాయి. నూతన తెలంగాణలో సినీ ప్రేమికులకు ఇదొక అవకాశాల పుష్పక విమానం. నైపుణ్యాలను గుర్తించి.. లోపాలను సవరిస్తూ.. తెలంగాణకు సినిమా కొత్త కాదు. ఆ రోజుల్లోనే బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న మొదటి తరం సినీ రంగ ప్రముఖులు.. పైడి జయరాజ్. ఆయన గౌరవార్థం రవీంద్రభారతిలోని థియేటర్‌కు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అని నామకరణం చేశారు. ఈ థియేటర్లోనే ఈ తరం యువకులు తీసిన లఘు చిత్రాలను క్రమం తప్పకుండా ప్రతి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్.. ఇలా తెలంగాణలోని విభిన్న ప్రాంతాల్లో యువతరం తీసిన షార్ట్ ఫిల్మŠస్, డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శించి వారికి ఒక గుర్తింపునిస్తోంది రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ. ఈ ప్రయత్నంలో వారి నైపుణ్యాలను, లోపాలను ఇదే వేదికపై తెలియజేసేలా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, సినీ ప్రముఖులు, నిపుణులు, ప్రముఖ సినీ విమర్శకులతో చర్చా గోష్టిని నిర్వహిస్తున్నారు. అనంతరం వారికి సినిమా అవకాశాలు లభించేలా ఒక దారిని చూపిస్తోంది.మహామహులంతా ఇక్కడి నుంచే.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి హిట్ చిత్రాలతో ఫేమస్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్, మెయిల్ సినిమాతో చిన్న సినిమాకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చిన ఉదయ్ గుర్రాల, దొరసాని ఫేం కేవీఆర్ మహేంద్ర వంటి ఈ తరం సినీ దిగ్గజాలు తమ మొదటి సినీ ప్రయత్నాలను ఈ సినీవారం వేదికగానే ప్రదర్శించారు. ఇలా దర్శకులు, నటులు, సినీ రచయితలతో పాటు సిని పరిశ్రమకు అవసరమయ్యే విలువైన ముడిసరుకు కొంతమేర ఈ సినీవారం వేదికగా సమకూరుతోంది. ఇక్కడ ప్రదర్శించే లఘుచిత్రాలు ప్రధానంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ పోరాటాలు, యధార్థగాథలతో పాటు నేటి మోడ్రన్ కమర్షియల్ సినిమాల నాణ్యతను పరిచయం చేస్తున్నాయి. క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్... పదేళ్ల కృషికి నిదర్శనం ఇది.. ప్రస్తుత సినిమాల్లో తెలంగాణ నేపథ్యమున్న కళాకారులు, కథలు, సినిమాలు, టెక్నీషియన్లు వారి విజయాలు..!! ఈ లక్ష్యం నిర్దేశించుకునే 2016లో ‘సినివారం’ను ప్రారంభించాం. గతంలో ముంబైలోని బాలివుడ్ కమర్షియల్ సినిమాలకు కేంద్రం. కానీ అక్కడి మరాఠీ సినిమాలు కూడా వాటి ప్రత్యేకతను, ప్రాధాన్యతను, ప్రశస్తిని కొనసాగించాయి. అలాగే హైదరాబాద్‌లోనూ తెలుగు సినిమా సైతం తన వైవిధ్యాన్ని, విశిష్టతను ప్రదర్శించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయత్నానికి నాంది పలికాం. ఇందులో భాగంగా కళ, నైపుణ్యాలు, సృజనాత్మకత ఉండి, అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు అద్భుత వేదికను నిర్మించాం. ఈ సినివారం వేదికగా ఇప్పటి వరకూ దాదాపు 27 మంది ఈ తరం దర్శకులు పరిచయమయ్యారు. అంతేకాకుండా 24 క్రాఫ్టŠస్కు చెందిన నిపుణులు గుర్తింపును, అవకాశాలను పొందారు. ఇలాంటి ఔత్సాహికుల కోసం ఇక్కడ వారి షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనతో పాటు వర్క్‌షాప్‌లు, శిక్షణా తరగతులు, అవగాహనా సదస్సులు, ఇంటరాక్టివ్ సెషన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అందించే సేవలన్నీ ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవలే సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) ప్రాధాన్యత పైన వర్క్‌షాప్ నిర్వహించాం. సినిమా రంగంలోని అధునాతన మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం.భవిష్యత్‌లోనూ ఈ తరం సినిమా ప్రేమికులకు మరిన్ని అవకాశాలను భాషా సాంస్కృతిక శాఖ అందిస్తుంది. – మామిడి హరిక్రిష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు -
లఘు చిత్రాలతో ‘నల్సా’ పథకాలు ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: సినిమా అనేది ఒక బలమైన మాధ్యమమని, పోక్సో, సైబర్ క్రైమ్, దాంపత్య వివాదాలు తదితర అంశాలపై తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) రూపొందించిన లఘు చిత్రాలతో న్యాయ పథకాలు ప్రజలకు మరింత చేరువవుతాయని హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అభిప్రాయపడ్డారు. పేదలతోపాటు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ఈ సంస్థ అందిస్తున్న న్యాయ, ఇతర సేవలు లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయన్నారు. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన 10 లఘు చిత్రాలను బంజారాహిల్స్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, టీఎస్ఎల్ఎస్ఏ పాట్రన్–ఇన్–చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువురాని వారికి కూడా పథకాలు తెలిసేలా ఈ చిత్రాలు ఉన్నాయని దర్శకుడు సాయిప్రసాద్‌ను అభినందించారు. సినిమాలతో ఎక్కువ మంది ప్రభావితం అవుతారని, అందుకే నల్సా పథకాలపై లఘు చిత్రాలను రూపొందించామని టీఎస్ఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్ కోషి తెలిపారు. ఉచిత, సమర్థ న్యాయ సేవలను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు సులువుగా చేరువ చేస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ పథకాలు చేరాలన్నదే తమ లక్ష్యమని టీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రాలను ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వీక్షించేలా పలు భాషల్లోకి అనువదించనున్నట్లు దర్శకుడు సాయిప్రసాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీత కథ, అంకురం, సంకల్పం, ప్రేరణ, వల, ముందడుగు, నాంది, గెలుపు, జోజో పాపాయితోపాటు టీఎస్ఎల్ఎస్ఏ ఇతర సేవల లఘుచిత్రాలను ప్రదర్శించారు. -
కొత్తవాళ్లతో సినిమా పెద్ద బాధ్యత
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ప్రారంభించాం. ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’’ అన్నారు నిహారిక కొణిదెల. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రం శుక్రవారంప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. యదు వంశీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నేను, నా సతీమణి జయలక్ష్మి నిర్మాతలుగా పరిచయమవుతున్నాం’’ అన్నారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మన్యం రమేశ్. -
ఇన్ఫినిటమ్ అంటేనే ఒక వైబ్రేషన్...యూత్ కలల డెస్టినేషన్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫినిటమ్ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. యువత కలల సాధనకు వారధిగా నిలుస్తోంది. అరుదైన యుత్ ఐకాన్స్ కు ఇన్ఫినిటమ్ అడ్డగా నిలుస్తోంది. ఇన్ఫినిటమ్ ఈవెంట్ అదరహో అనే స్థాయిలో సాగింది. స్పూర్తిని నింపేలా ఈవెంట్ సంథింగ్ స్పెషల్‌గా నిలిచింది. యువతలో స్పూర్తిని నింపే ఎంతో మంది ఒకే వేదిక మీదకు ఇన్ఫినిటమ్ తీసుకొచ్చింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సాధించిన విజయం అద్భుతం. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు సినిమా రంగంలో అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య సంస్థలను పరిచయం చేసింది. తమ లక్ష్యం ఏంటో ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. సెలబ్రెటీస్ సందడి.. ప్రముఖుల బ్లెస్సింగ్ నడుమ పండుగ వాతావరణంలో ఈవెంట్ సినీ ఎంట్రీ గ్రాండ్ లాంచ్ చేసింది. ఇన్ఫినిటమ్ ఈవెంట్‌కు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తరలి వచ్చారు. ఏషియన్ గ్రూప్ జాహ్నవి నారంగ్, ఎమ్మెల్యే రఘనందన్ రావు ఇన్ఫినిటమ్కి విషెస్ చెప్పారు. ఏషియన్ మూవీతో టై అప్ అయిన ఇన్ఫినిటమ్ జయ క్రిష్ణ ముకుంద మురారీ తొలి మూవీ టైటిల్ ను ఆవిష్కరించారు. ఇక ఈవెంట్ కలర్ ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్ గా గ్రాండ్ ఫీస్ట్ గా నిలిచింది. ఎంతో మంది యువ కళాకరులను ఈ వేదిక ద్వారా పరిచయం చేసింది. ఇన్ఫినిటమ్ కోర్సులను ఈవెంట్ లో ఆవిష్కరించారు. యూఎస్ లో ఇన్ఫినిటమ్ ఆపరేషన్స్ ను ఇదే ముహూర్తంగా అధికారికంగా లాంఛ్ చేసారు. ట్రిపుల్ ఆర్ మూవీ ఫేం రాహుల్ సిప్లిగంజ్, బేబీ ఫేం వైష్ణవి చైతన్యను సత్కరించారు. ఇన్ఫినిటమ్ పిక్చర్స్ సభికుల హర్షధ్వానాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేసారు. 2023 ఇన్ఫినిటమ్ వైటీ క్యాలెండర్ ను ప్రకటించారు. స్టూడెంట్ వెబ్ సిరీస్ లిరికల్ సాంగ్ రిలిజ్ చేశారు. ఇదే సమయంలో ఇన్ఫినిటమ్ ఏషియన్ భాగస్వామ్యంతో కొనసాగనున్న ప్రణాళికలు..ప్రకటనలను ఈవెంట్ లో ప్రకటించి ఆసక్తిని పెంచారు. యువ కళాకారుల అభిరుచులకు ఇన్ఫినిటమ్ మార్గదర్శకత్వం వహిస్తోంది. వారి అభిరుచులకు అనుగుణంగా ఎదిగేందుకు వేదికగా నిలుస్తోంది. వారు సక్సెస్ అవ్వటంలో రోల్ మోడల్ గా ఖ్యాతి దక్కించు కుంది. ఇలాంటి ప్రతిభ.. సమర్ధతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఇన్ఫినిటమ్ను గెస్టులు మనస్పూర్తిగా అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో సక్సెస్ లకు చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు. -
రైల్వే భద్రతపై లఘు చిత్రాలతో అవగాహన
సాక్షి, హైదరాబాద్: రైల్వేభద్రతపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రైలు ప్రమాదాల నియంత్రణ, ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లఘు చిత్రాల ద్వారా అవగాహన కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గురువారం ఇక్కడ డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన స్టేట్ లెవల్ సెక్యూరిటీ కమిటీ ఫర్ రైల్వేస్ (ఎస్ఎల్ఎస్సీఆర్) సమావేశం నిర్వహించారు. రైల్వే అడిషనల్ డీజీపీ బి.శశిధర్‌రెడ్డి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ రాజారామ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవీ.. ►రైల్వే ట్రాక్‌లపై మరణాలు, రైళ్లలో మానవ అక్రమ రవాణా, రైళ్లలో చోరీల కట్టడి, కదులుతున్న రైళ్లపై రాళ్ల దాడుల నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ►రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివాసం ఉండే ప్రజలకు రైల్వే ట్రాక్‌లపై పాటించాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లు, రైళ్లలో మొబైల్ చోరీలు వంటి అంశాల్లో జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా లఘు చిత్రాల నిర్మాణం ►రైళ్లో మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా మత్తు పదార్థాల రవాణా ముఠాలపై చట్టపరమైన చర్యలు, రైలు టికెట్ బుకింగ్‌లో అక్రమాల కట్టడికి చర్యలు ►రైల్వే ట్రాక్‌లు, ప్లాట్‌ఫాంలపై ప్రమాదాలతోపాటు మృతుల గణాంకాలు వెల్లడిస్తూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -
సినిమాలకు ఎల్బీ శ్రీరాం ఎందుకు దూరమయ్యారు?.. కారణం ఇదే
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): నాకు నచ్చనిది ఏదైనా వదులుకుంటా.. నచ్చిన చోటే సంతృప్తిగా జీవిస్తా.. పదేళ్ల పాటు సినీ నటుడిగా ఎన్నో హాస్య, సందేశాత్మక చిత్రాల్లో నటించా.. అక్కడ మంచి క్యారెక్టర్లు చేసి సంతృప్తి చెందా.. హాస్య నటుడి నుంచి బయటపడాలనే సినిమాలకు స్వస్తి చెప్పి సామాజిక సందేశాలిచ్చే లఘు చిత్రాల రూపకల్పన, నిర్మాణాలపైనే దృష్టి పెట్టానని సినీ, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, ఎల్బీ హార్ట్ ఫిలిం మేకర్ ఎల్బీ శ్రీరామ్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్ భవనంలో ఆయన విలేకర్లతో శనివారం రాత్రి మాట్లాడారు. అమలాపురంలో అమర గాయకుడు శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్మించిన ఘంటసాల విగ్రహాన్ని ఎల్బీ శ్రీరామ్ ఆదివారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఈ లోగా ఆయన తన మనోగతాన్ని విలేకర్ల సమావేశంలో ఆవిష్కరించారు. తమ సొంతూరు కోనసీమలోని అయినవిల్లి మండలం నేదునూరు అగ్రహారం అని ఆయన తెలిపారు. ఏడుగురు అన్నదమ్ముల్లో ఒకడైన తాను 23 ఏళ్ల కిందట సినీ అవకాశాలను అన్వేషించుకుంటూ సినీ పరిశ్రమకు వెళ్లానని శ్రీరామ్ చెప్పారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆరిస్ట్‌గా తనను చిత్ర పరిశ్రమ గుర్తించిందన్నారు. ఈ ఒరవడిలోనే ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రంలో నటన ద్వారా పరిశ్రమ తనలో కొత్త నటుడిని చూసిందని శ్రీరామ్ వివరించారు. ఇప్పటి వరకూ 500 చిత్రాల్లో నటించానని పేర్కొన్నారు. ఆరేళ్లుగా పరిశ్రమకు దూరంగా... ఆరేళ్ల నుంచి తాను పావుగంట సమయంలో సందేశాత్మకతను అందించే లఘు చిత్రాల నిర్మాణంపై దృష్టి పెట్టానని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నానన్నారు. హాస్య నటుడి ముద్ర నుంచి బయట పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ ఆరేళ్లలో 60 లఘు చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించానని అన్నారు. ప్రతి లఘు చిత్రంలోనూ సమాజానికి ఎన్నో సందేశాత్మక కథాంశాలు అందించానన్న సంతృప్తి ఉందన్నారు. ఇదే ఉత్సాహం, సంతృప్తితో మరి కొన్నేళ్లు సమాజానికి పనికి వచ్చే లఘు చిత్రాలు నిర్మిస్తానని శ్రీరామ్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తానున్న సమయంలో దాదాపు 40 మంది హాస్య నటులు ఉండేవారని, అందులో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నానని వివరించారు. ఇప్పుడు సమాజ హితం కోసం లఘు చిత్రాలు నిర్మిస్తున్నానని అన్నారు. వుడయార్ శిల్పకళాధామం అత్యద్భుతం కొత్తపేట: వుడయార్ శిల్పకళాధామం అత్యద్భుతం.. శిల్పాలకు ప్రాణం పోసినట్టు ఈ ప్రాంగణంలో విగ్రహాలు జీవకళతో ఉట్టిపడుతున్నాయంటూ ప్రముఖ సినీ హాస్య, క్యారెక్టర్ ఆర్టిస్టు, సినీ నాటక రచయిత, దర్శకుడు ఎల్బీ శ్రీరామ్ అన్నారు. సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ రూపొందించగా ఆ విగ్రహాన్ని అమలాపురంలో నెలకొల్పారు. దానిని ఆదివారం ఎల్బీ శ్రీరామ్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. అమలాపురం వెళుతూ శ్రీరామ్ మార్గం మధ్యలో కొత్తపేటలో వుడయార్ శిల్పకళాధామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిల్పి రాజ్‌కుమార్ మలిచిన విగ్రహాలు రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పగా చూశానన్నా రు. ఈ శిల్పి గురించి విన్నానని, ఎప్పటి నుంచో ఈ శిల్పకళాధామాన్ని సందర్శించాలనే కోరిక ఇప్పటికి నెరవేరిందన్నారు. ఈ ప్రాంగణంలో విగ్రహాలు కళాఖ ండాలని, అన్నీ జీవకళ ఉట్టిపడుతున్నాయంటూ వుడయార్ శిల్పకళా నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం ఎల్బీ శ్రీరామ్‌ను శిల్పి రాజ్‌కుమార్ శాలువా, పూలమాల, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. చదవండి: టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా : హీరోయిన్ -
రివర్స్ గేర్‌లో వచ్చి.. స్టార్స్ అయ్యారు
హీరో కావాలంటే ఏం కావాలి ? టాలెంట్. ఎవరినడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. మరి…ఒక్క టాలెంట్ ఉంటే సరిపోతుందా ? ఈ ప్రశ్నకు మాత్రం వెంటనే జవాబు రాదు.నిజమే కదా…నెపోటిజం నుంచి మొదలుపెడితే సవాలక్ష అడ్డంకులను అధిగమించాలి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, గాడ్ ఫాదర్లు లేకుండా, కేవలం టాలెంట్ పెట్టుకుని వెండితెర మీద వెలిగిపోవడం అంత తేలికేం కాదు. ఆఫీస్‌ల చుట్టూ తిరగాలి. ఇండస్ట్రీలో వాళ్లనీ, వీళ్లనీ ఇంప్రెస్ చేయాలి. గంటల పాటు స్టూడియోల ముందు, షూటింగ్ స్పాట్ల ముందు వెయిట్ చేయాలి. అయినా ప్రతిఫలం ఉంటుందో, ఉండదో క్లారిటీ ఉండదు. మరేం చేయాలి ? ఇంకేముంది. రివర్స్ గేర్ వేయాలి. టైమ్ వేస్ట్ చేయకుండా…షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టడమే. ముందు ప్రేక్షకులకు దగ్గర కావడమే. వాళ్ల మెప్పు పొందితే…ఇండస్ట్రీ నుంచే పిలుపొస్తుంది. వీళ్లు రివర్స్ గేర్‌లో వచ్చారు. ముందు ప్రేక్షకుల మెప్పు పొందేశారు. ఆ తర్వాత సినిమా చాన్సులు సంపాదించారు. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ కలిగించిన సంచలనం టాలీవుడ్ దాటి బాలీవుడ్ దాక వెళ్లిపోయింది. మరి దానికి ముందు విజయ్ దేవరకొండ ఏంటి అనగానే పెళ్లి చూపులు సినిమా గుర్తొస్తుంది. దానికి ముందు అని మళ్లీ ప్రశ్నిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్విలా అన్న ఆన్సర్ వినిపిస్తుంది. కానీ…షార్ట్ ఫిల్మ్స్‌తోనే ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు విజయ్. 2011లో కొంచెం టచ్‌లో ఉంటా అనే షార్ట్ షార్ట్ ఫిల్మ్ మొదలైన ప్రయాణం…అతన్ని టాలీవుడ్ స్టార్‌ని చేసింది. (చదవండి: తరుణ్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రివిక్రమ్) సుహాస్.. కలర్ ఫోటో మూవీ హీరో. కథానాయకుడు అంటే ఇలానే ఉండాలి అన్న అడ్డుగోడ లను బద్దలుకొట్టిన హీరో. షార్ట్ ఫిల్మ్స్‌తోనే ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. తన నటించిన చాలా షార్ట్ ఫిల్మ్స్ సోషల్ మీడియాలో హిట్ అయ్యాయి. షార్ట్ ఫిల్మ్స్‌తో క్లిక్ అయ్యాడు. ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు నుంచి హీరో ఫ్రెండ్‌గా సుహాస్ జర్నీ వేగంగానే సాగింది. ప్రతి రోజు పండుగ, మజిలీ చిత్రాల్లో ముఖ్య పాత్రలతో ప్రేక్షకులకు మరింతగా దగ్గరైయ్యాడు. హీరో ఫ్రెండ్‌గా ఇటు కామెడీని పండిస్తూ, అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉనికిని చాటు కుంటోన్న సుహాస్‌ని…కలర్ ఫోటో హీరో చేసేసింది. ఇండస్ట్రీకి కొత్త స్టార్ దొరికేశాడు. ఆరు పాట లు, ఐదు ఫైట్స్ తరహా మూస సినిమాలని బ్రేక్ చేయాలని ప్రయ త్నించే దర్శకులకు సుహాస్ ఇప్పుడు బిగ్ స్టార్. నవీన్ పొలిశెట్టి. ముంబై బేస్డ్ కామెడీ కంపెనీ ఏఐబీ(A.I.B)లో చాలా వీడియోలు చేశారు. అందులో ఇంజినీరింగ్ గురించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చేసిన వీడియో… సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నేషనల్ వైడ్ నవీన్ పొలిశెట్టికి పావులారిటీ తెచ్చింది. నిజానికి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నుంచి అనేక సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ వచ్చా డు నవీన్. కానీ…A.I.B వీడియోస్ క్లిక్ అయ్యేదాకా పెద్దగా సినీ అవకాశాలు రాలేదు. ఇంజినీరింగ్ వీడియో క్లిక్ అయిన తర్వాత…హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్ ఇచ్చాడు నవీన్. ఆ తర్వాత జాతిరత్నాలు లాంటి మరో హిట్ మూవీతో స్టార్ అయిపోయాడు. -
తెలంగాణలో నూకలంపాడు గ్రామానికి జాతీయ అవార్డు.. ఏం చేశారంటే?
ఏన్కూరు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలానికి చెందిన నూకలంపాడు గ్రామం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రూపొందించిన లఘుచిత్రం (షార్ట్ ఫిలిం) జాతీయ స్థాయిలో రెండో బహుమతి గెలుచుకుంది. ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయ స్వచ్ఛతా దివస్ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ ఇంజం శేషయ్య అవార్డు అందకోనున్నారు. ఏటా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఫేస్–2లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ విభాగంలో గ్రామపంచాయతీల్లో మరుగుదొడ్ల వాడకం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, తదితర అంశాలపై జాతీయ స్థాయిలో లఘుచిత్రాల పోటీలు నిర్వహిస్తారు. గత ఏడాది జిల్లాలోని ముదిగొండ మండలం పమ్మి పంచాయితీ ఎంపికైంది. ఈ ఏడాది ఏన్కూరు మండలం నూకలంపాడు పంచాయతీ ఎంపిక కావడం విశేషం. అందరి సహకారంతో.. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి వెనుక సర్పంచ్ ఇంజం శేషయ్య ప్రధాన పాత్ర పోషించారు. గ్రామంలోని ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించి గ్రామాభివృద్ధి వైపు నడిపించారు. ఇప్పటికే గ్రామంలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, వాడకం జరుగుతుండగా, వ్యక్తిగత పరిశుభ్రత, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నారు. తడి చెత్తను ఎరువుగా మార్చడం, పొడి చెత్తను విక్రయిస్తుండడంతో పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. అలాగే, గ్రామంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలుచేస్తున్నారు. ఇలా గ్రామాభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న పనులతో రూపొందించిన లఘుచిత్రం జాతీయ స్థాయిలోనే రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు ఉపసర్పంచ్.. ఇప్పుడు సర్పంచ్ నూకలంపాడు గ్రామపంచాయితీలో 1,260 మంది జనాభా, 950 మంది ఓటర్లు ఉన్నారు. ఏజెన్సీ మండలం అయినందున ఎస్టీ అభ్యర్థిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలి. కానీ ఎస్టీలు లేకపోవడంతో ఎనిమిది వార్డులకు గాను నాలుగు వార్డులకే ఎన్నిక నిర్వహిస్తారు. గత ఎన్నికలో నాలుగు వార్డులకు గాను మూడు వార్డులు గెలిచిన పార్టీ అభ్యర్థిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకోగా, ఆయనే సర్పంచ్‌గా విధులు నిర్వర్తించారు. ఇక 2019 ఎన్నికల్లో నాలుగు వార్డులకు రెండు పార్టీల అభ్యర్థులు రెండేసి వార్డులు గెలుచుకున్నారు. ఈ మేరకు లాటరీ పద్ధతిలో సర్పంచ్‌ను ఎన్నుకోగా ఇంజం శేషయ్యకు అవకాశం దక్కింది. గతంలో ఉపసర్పంచ్‌గా అనుభవం ఉండడంతో ఇంజం శేషయ్య గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయడమే కాక సొంత ఖర్చుతో గ్రామంలో బోర్లు, రహదారులు, కాల్వ రోడ్డుకు గ్రావెల్ తోలకం చేపట్టారు. ఇంకా వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, రోడ్ల వెంట మొక్కలు నాటించడంతో గ్రామం పచ్చగా కళకళలాడుతోంది. అందరూ ఆదర్శంగా తీసుకోవాలి జాతీయస్థాయిలో ఉత్తమ లఘుచిత్రం అవార్డు సాధించిన నూకలంపాడు గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యారాములు సూచించారు. నూకలంపాడు గ్రామాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన సర్పంచ్ ఇంజం శేషయ్య – స్వరూప దంపతులను సత్కరించి మాట్లాడారు. కొన్నేళ్లుగా గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కితాబిచ్చారు. కలెక్టర్ అభినందనలు.. ఇక, జాతీయ స్థాయి షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో రెండో స్థానం దక్కించుకున్న నూకలంపాడు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ అభినందించారు. ఈమేరకు సర్పంచ్ శేషయ్య, పాలకవర్గం, సిబ్బందిని ఆయన శుక్రవారం సన్మానించి మాట్లాడారు. మిగతా గ్రామాల పాలకవర్గాలు స్ఫూర్తిగా తీసుకుని అవార్డులు సాధించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత, డీఆర్డీఓ విద్యాచందన, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాపై బాధ్యత పెరిగింది నూకలంపాడు సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాను. గతంలో జిల్లాస్థాయి అవార్డులు వచ్చినా, ఇప్పుడు జాతీయస్థాయిలో పేరు రావడం ఆనందంగా ఉంది. ఈ అవార్డుతో మాపై ఇంకా బాధ్యత పెరిగినట్లయింది. ఎమ్మెల్యే కేటాయించనున్న నిధులతో డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతాం. –ఇంజం శేషయ్య, సర్పంచ్ -
PVR Raja: షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డే లక్ష్యం
విజయనగరం టౌన్: చిన్నప్పటి నుంచి చిత్రరంగంలో అడుగుపెట్టాలనే ఆకాంక్షే ఆ యువకుడిని షార్ట్ ఫిలిమ్స్‌లో ఉన్నతశిఖరాలు అధిరోహించేలా చేసింది. ఏ కాంటెస్ట్‌లో పాల్గొన్నా గెలుపొందిన మొదటి మూడు చిత్రాలు ఆయన రచన, సంగీత దర్శకత్వం చేసినవే కావడం విశేషం. ఇప్పటివరకూ షార్ట్ ఫిలి మ్స్‌లో వందలాది అవార్డులు అందుకున్న విజయనగరం యువకుడు పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్రాజా) ఎప్పటికైనా షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డ్ తీసుకోవడమే లక్ష్యమని చెబుతున్నాడు. విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్ రాజా) సత్యవతి, చంద్రశేఖర్ రాజుల తొలిసంతానం. బీఏ వరకూ మహారాజా కళాశాలలో చదివి, సంగీతం పట్ల మక్కువతో మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో గాత్రం, వయోలిన్, భరతనాట్యం, వీణ తదితర అంశాలలో తర్ఫీదు పొందాడు. షాలోమ్స్ మ్యూజిక్ సెంటర్లో గిటార్ తదితర ఇన్‌స్ట్రుమెంట్స్‌పై సాధన చేశాడు. రచనలు చేయడం అలవాటు. 2012 నుంచి ఇప్పటివరకూ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల భాషల్లో సుమారు 250కి పైగా లఘుచిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 2017లో ఒకే ఏడాదిలో ఆయన సంగీతం సమకర్చిన లఘుచిత్రాలకు వరుసగా ఏడుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. 2007లో చెన్నైలో ఏఆర్ రెహమాన్ నిర్వహించిన హూ.లలల్లా మ్యూజిక్ బ్యాండ్హంట్లో షాలోమ్ తరఫున టాప్ 18లో నిలిచాడు. తానా ఇంటర్నేషనల్ తెలుగు ఫిలిం ఫెస్టివల్–2017 అవార్డు దక్కింది. 2020లో రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ ఓటీటీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో తొమ్మిదివేల చిత్రాలలో పీవీఆర్ సంగీత దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు టాప్ 18లో నిలిచాయి. టాప్ 5లో నిలిచిన రెండు చిత్రాలు ఉత్తమ చిత్రాల అవార్డులు సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా 2020లో సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్‌లో ఎంఆర్ ప్రొడక్షన్స్ అంతరార్థం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. షార్ట్ ఫిలిం మాస్ట్రోగా పేరు సంపాదించుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్ధ వైష్ణో మీడియా నిర్మించిన ఆర్య–3 లఘుచిత్రంతో పీవీఆర్ రాజా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో విటమిన్ షీ ఓటీటీ చిత్రానికి సంగీత దర్శకత్వం అందించాడు. ప్రముఖ డ్యాన్సర్ యశ్వంత్ మాస్టర్ తొలివీడియో ఆల్బం దిల్ అంత అదిరే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఎల్బీ శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో పదికి పైగా లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సంగీతం పట్ల మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేశాను. బేగంపేటలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రద్ధ స్కూల్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ పాఠశాలలో పిల్లలకు సంగీతం నేర్పించడం మరిచిపోలేని అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయేలా చిత్రాలను తీస్తాను. సంగీతంలో నేను రచించే పుస్తకం ప్రతి ఇంట్లో ఉండే పెద్ద బాలశిక్షలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. – పెనుమత్స వెంకటరామరాజు (పీవీఆర్ రాజా), సంగీత దర్శకుడు, విజయనగరం -
ఎంటర్టైన్మెంట్ కావాలా? లంచ్ టైంలో ఇవి చూసేయండిలా!
సినిమాలు చూడాలంటే ఇంట్రస్ట్ ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగ్గట్లుగా కొంత సమయం కూడా కావాలి. రెండు, మూడు గంటలు ఓపికగా కూర్చోవాలి. అంత టైం దొరకాలంటే అది వీకెండో, హాలీడేనో అయి ఉండాలి. మరి ఆఫీస్‌లోనో లేదంటే కాలేజీలోనూ ఏదైనా సినిమా చూడాలంటే.. వారికోసం షార్ట్ ఫిలింస్ ఉండనే ఉన్నాయి. యూట్యూబ్‌లోనే కాదు ఓటీటీలోనూ లఘుచిత్రాలను అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో హాట్‌స్టార్‌లో కేవలం లంచ్ టైంలో చూసేయగలిగే షార్ట్ ఫిలింస్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ► మరాఠా మందిర్ సినిమా ► ఔచ్ ► దేవి ► అధీన్ ► ది స్కూల్ బ్యాగ్ ► టెరీర్ ► చట్నీ చదవండి: సిరిని అర్థం చేసుకోవడం కష్టం, తనకు ఎవరూ సాయం చేయలేదు ప్రముఖ సీరియల్ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో! -
World Earth Day 2022: వరల్డ్ ఎర్త్ డే.. పక్షులకు సేనాపతి
పక్షుల కోసం ఒక సైన్యం ఉంటుందా? అదీ మహిళా సైన్యం. ఉంటుంది. అస్సాంలో ఉంది. అక్కడి అరుదైన కొంగలు అంతరించిపోతున్నాయని గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమ బర్మన్. ఈ సైన్యం కొంగలను రక్షిస్తుంది. ఈ నేల, ఆకాశం, జీవజాలం ఎంత విలువైనవో చైతన్యపరుస్తుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ఎర్త్ డే సందర్భంగా ‘వన్ ఫర్ చేంజ్’ పేరుతో మన దేశంలో పర్యావరణ మార్పుకోసం విశేషంగా కృషి చేసిన పది మందిపై షార్ట్ ఫిల్మ్స్ ప్రసారం చేయనుంది. వారిలో ఒకరు పూర్ణిమ బర్మన్. ఆమె పరిచయం. ఈ భూమిని అందరూ ఉపయోగించుకుంటారు. కొందరే భూమి కోసం తిరిగి పని చేస్తారు. మనల్ని కాపాడే భూమిని కాపాడటానికి జీవితాన్ని అంకితం చేసే వాళ్ల వల్లే మనం ఈ మాత్రం గాలిని పీల్చి, ఈ మాత్రం రుతువులను అనుభవిస్తున్నాం. అడవులని చూస్తున్నాం. కలుషితం కాని నదుల ప్రవాహంలో పాదాలు ముంచగలుగుతున్నాం. పిట్టలు, పొదలు మనవే అనుకుంటున్నాం. వీటి కాపలాకు ఉన్నది ఎవరు? పూర్ణిమ బర్మన్ ఒకరు. స్టూడెంట్ నుంచి యాక్టివిస్టుగా పూర్ణిమ దేవి బర్మన్‌ది గౌహటి. వైల్డ్‌లైఫ్ బయాలజీని ముఖ్యాంశంగా తీసుకుని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. 2007లో గ్రేటర్ అడ్జటంట్ స్టార్క్స్(పారిశుద్ధ్య కొంగలు) మీద పిహెచ్డి చేయడానికి కామరూప జిల్లాలోని దాదర గ్రామానికి వెళ్లింది. ఒకప్పుడు ఆగ్నేయాసియా లో ఉండే ఆ కొంగలు అంతరించిపోయే స్థితికి వచ్చి కేవలం అస్సాం, బిహార్లలో కనిపిస్తున్నాయి. ఇవి పారిశుద్ధ్య కొంగలు. అంటే మృతకళేబరాలను తిని శుభ్రం చేస్తాయి. పర్యావరణ వృత్తంలో వీటి పాత్ర కీలకం. ఐదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. చూడ్డానికి అందంగా ఉండవు. చెట్ల పైన గూళ్లు పెడతాయి. తేమ అడవులు వీటికి ఇష్టమైనా ఆ అడవుల స్థానంలో ఊళ్లు వెలుస్తూ రావడం వల్ల ఇవి గ్రామాల్లోనే చెట్ల మీద గూళ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. అయితే పూర్ణిమ వచ్చేంత వరకూ పరిస్థితి వేరుగా ఉండేది. వీటిని గ్రామస్తులు బతకనిచ్చేవారు కాదు. ఇవి గూళ్లు పెట్టిన చెట్లను నరికేసేవారు. దాంతో అవి దిక్కులేనివి అయ్యేవి. అప్పుడే పూర్ణిమ ఆ గ్రామానికి వెళ్లింది. పీహెచ్‌డి ఏం చేసుకోవాలి? పూర్ణిమ వెళ్లేసరికి ఒక గ్రామంలో ఈ పారిశుద్ధ్య కొంగల గూళ్లు ఉన్న చెట్లను కూల్చేస్తున్నారు. అక్కడ ఆ కొంగలను ‘హార్గిల్లా’ అంటారు. ‘ఎందుకు కూలగొడుతున్నారు?’ అని పూర్ణిమ పోట్లాటకు వెళ్లింది. అప్పుడు వాళ్లు చెప్పిన జవాబు ఏమిటంటే– పెంట దిబ్బల మీద మృతకళేబరాలను తాను తిని పిల్లల కోసం కొంత ముక్కున పట్టి తెస్తుంది తల్లి. అలా తెచ్చేప్పుడు ఇళ్ల ముంగిళ్లలో డాబాల మీద కొంత జారి పడుతుంటుంది. అది నీçచుకంపు. పైగా దీని ఆకారం బాగుండదు కనుక దుశ్శకునంగా భావించేవారు. అందుకని వాటిని రాళ్లతో కొట్టి తరిమేస్తారు. ‘అదంతా విన్న తర్వాత జనాన్ని ముందు మార్చాలి... అదే అసలైన పిహెచ్డి అనుకున్నాను’ అంటుంది పూర్ణిమ. ఇక పిహెచ్‌డిని పక్కన పెట్టి హార్గిల్లాల సంరక్షణకు సంకల్పించుకుంది. విప్పారిన రెక్కలు 2007లో మొత్తం వెతగ్గా 27 హాగ్రిల్లా గూళ్లు కనిపించాయి పూర్ణిమకు. ఇవాళ 200 గూళ్లుగా అవి కళకళలాడుతున్నాయి. ఒక పక్షిజాతికి ఆ విధంగా పూర్ణిమ జీవం పోసింది. అందుకే ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. చైతన్యం కలిగించి సరిగ్గా పని చేయాలేగాని ఈ భూమిని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకొస్తారని ఈ ఉదంతం చెబుతోంది. పక్షులు వాలే చెట్టు ఉంటే భూమి బతికి ఉన్నట్టు అర్థం. భూమిని బతికించుదాం. హార్గిల్లా ఆర్మీ ఊళ్లలో మగవారు పనికిపోతారు. ఇళ్లలో ఉండేది... చెట్ల ౖపైన ఉండే కొంగలను కనిపెట్టుకోవాల్సింది స్త్రీలే అని గ్రహించింది పూర్ణిమ. హార్గిల్లాలు దుశ్శకునం కాదని– బా» ర్ చక్రవర్తి ఆ కొంగలు సంచరించే చోట నాగమణి దొరుకుతుందని నమ్మేవాడని చెప్పింది. ఊరు శుభ్రంగా ఉండాలంటే రోగాలు రాకుండా ఈ కొంగలే చేయగలవని చైతన్యం తెచ్చింది. ‘అరణ్యక్’ పేరుతో గౌహతిలో ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ కింద దాదర, పచర్సా గ్రామాల్లోని 400 మంది స్త్రీలతో హార్గిల్లా ఆర్మీని తయారు చేసింది. తను ఆ ఆర్మీకి సేనానిగా మారింది. వీరి పని ఈ కొంగలను సంరక్షించడమే. అయితే వీరు బతికేది ఎలా? అందుకని మగ్గం పనిలో ఉపాధి కల్పించింది. ఆ మగ్గం వస్త్రాల మీద కూడా హాగ్రిల్లా కొంగల బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఆ చీరలు బాగా అమ్ముడుపోతున్నాయి. -
Karimnagar: సిల్వర్ స్క్రీన్‌పై కరీంనగర్ వెలుగులు
ఒక్కచాన్స్.. ఒకేఒక్క చాన్స్ అంటూ వీళ్లు క్రిష్ణానగర్ చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు.. సినిమాల్లో అవకాశం కోసం ఏళ్లకేళ్లు ఎదురుచూడలేదు. చేస్తున్న పనిని, అన్నం పెడుతున్న ఊరును వదిలిపెట్టలేదు. ఉన్నచోటు నుంచే తమ ప్రతిభను ప్రదర్శించారు. అవకాశాన్ని.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. యూట్యూబ్‌లో సొంతంగా ఒక వేదికను ఏర్పాటుచేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. షార్ట్‌ఫిల్మ్‌లు, ప్రయివేటు ఆల్బంల ద్వారా తమ టాలెంటును మొదట ప్రజలు గుర్తించేలా కష్టపడ్డారు. ఆ కష్టమే ఇప్పుడు వారిని స్టార్లను చేసింది. అనతికాలంలోనే సినిమాల్లో, పెద్దపెద్ద రియాలిటీషోల్లో అవకాశం వచ్చేలా చేసింది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై ఉమ్మడి కరీంనగర్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మై విలేజ్ షో ద్వారా ఫేమ్ అయిన బిగ్‌బాస్ గంగవ్వ, అనిల్ జీల సినిమాల్లో బిజీగా మారారు. మరికొందరు యాక్టర్లు, సింగర్లు, డైరెక్టర్లు పలు సినిమాల్లో ప్రతిభ చూపి స్టార్.. స్టార్.. సూపర్‌స్టార్ అనిపించుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా రంగుల ప్రపంచంలో ప్రస్థానం ప్రారంభించి వెండితెరపై వెలుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ కళాకారులపై ‘సాక్షి’ వీకెండ్ స్పెషల్..!!] పేరు: గంగవ్వ యూట్యూబ్ చానల్ మై విలేజ్ షో షార్ట్‌ఫిల్మ్: 120కి పైగా సినిమాలు: 4 ‘ఇస్మార్ట్’ గంగవ్వ మల్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్‌షో గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే. బడిముఖం చూడని గంగవ్వ కష్టాల కడలిని ఈదింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. కల్మషం లేని ఆమె మనసు.. ఆరు పదుల వయసులో ప్రపంచానికి స్టార్‌గా పరిచయం చేశాయి. ఇదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ ప్రారంభించిన మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ గంగవ్వ జీవితాన్ని మార్చివేసింది. 120కిపైగా వీడియోల్లో, నాలుగు పెద్ద సినిమాల్లో నటించింది. ఓ రియాలిటీ షోతో మరింత ఫేమస్ అ యిన గంగవ్వ.. ఇల్లు కట్టుకోవాలనే తనకలను నెరవేర్చుకుంది. జీవితమంతా.. ముళ్లబాటే గంగవ్వ జీవితమంతా ముళ్లబాటలోనే సాగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బీడీలు చేస్తూ తమ్ముళ్లకు ఆసరాగా నిలిచింది.ఐదేళ్లలో బాల్య వివాహం జరిగింది. అత్తాగారిల్లే జీవితమైంది.భర్త గంగయ్య పదిహేనేళ్లపాటు గల్ఫ్ వెళ్లాడు. ఐదేళ్లపాటు దుబాయ్ నుంచి కబురు లేకపోవడంతో ఉన్నాడో లేడో కూడా తెలియని వేదనతో గడిపింది. మరో పదేళ్లు గల్ఫ్ వెళ్లినా నయాపైసా పంపలేదు. ఇక్కడి నుంచే అప్పుచేసి, పైసలు పంపిస్తే ఇంటికి తిరిగివచ్చాడు. కలోగంజో తాగి, పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి, రాత్రి బీడీలు చేస్తూ పిల్లలను పెద్ద చేసింది. ఆరుపదుల వయసులో.. గంగవ్వకు మై విలేజ్ షో మరో జన్మనిచ్చింది. అవ్వలోని సహజ నటిని మై విలేజ్ షో దర్శకుడు శ్రీరాం శ్రీకాంత్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంటర్నెట్ కష్టాలు అనే షార్ట్‌ఫిల్మ్‌తో యూ ట్యూబ్‌లో అడుగుపెట్టి.. సుమారు 120కిపైగా లఘుచిత్రాల్లో నటించింది. సినీ నటులుసైతం గంగవ్వతో సెల్ఫీకోసం ఎదురుచూసేలా ఎదిగింది. గంగవ్వ సహజ నటనను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, రాజరాజచోర, లవ్‌స్టోరీలో తనేంటో నిరూపించుకుంది. రెండు టీవీ రియాలిటీషోల్లో అదరగొట్టింది. గంగవ్వ మాట తీరు..ఆప్యాయత..కల్మ షం లేని తన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ఏ అవసరం ఉన్నా ఇప్పటికీ ప్యాసింజర్ ఆటోల్లో వెళ్తుండడం ఆమె నిరాడంబరతకు నిదర్శనం. ‘చిన్నప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్లతోనే గడిపిన. పొద్దంతా వ్యవసాయ పనికి వెళ్లివచ్చి, బీడీలు చేసేదాన్ని. సదువు అసలే రాదు. ఎక్కడెక్కడి నుండో నా దగ్గరికి అచ్చి.. సెల్ఫీలు దిగుతున్నరు. ఇంటికాడ ఉంటే శ్రీకాంత్ అచ్చి, నేను చెప్పినట్టు చేత్తవా గంగవ్వ అని, షూటింగ్ మొదలు పెట్టిండు. ఇంట్ల టీవీ కూడా లేదు. సినిమాలో నటిస్తా అని అనుకోలేదు. ఇప్పటికి నాలుగు సినిమాలు విడుదల ఐనయ్. ఇంకా వేరే సినిమాలో నటిస్తున్న.. ఇప్పుడు కూడా ఊటీలో షూటింగ్లో ఉన్న.. నాకు తెలిసింది ఒక్కటే. నా పని నేను సేత్త’ అని గంగవ్వ చెప్పుకొచ్చింది. పేరు: రాదండి సదయ్య యూట్యూబ్ చానల్ సదన్న కామెడీ షార్ట్‌ఫిల్మ్‌లు: 200కి పైగా సినిమాలు: 10 ఆర్ఎస్ నందా.. కామెడీకి ఫిదా విద్యానగర్(కరీంనగర్): ఆర్ఎస్ నంద.. యూట్యూబ్ ప్రపంచానికి పరిచయం కాకముందే ఇతని కామెడీ షార్ట్‌ఫిల్మ్‌లను సిడీల రూపంలో అభిమానులు వీక్షించేవారు. రెండు వందలకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లు తీసిన ఆర్ఎస్ నందకు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నటన అంటే ప్రాణం ఓదెల మండలం కనగర్తికి చెందిన రాదండి సదయ్యకు చిన్నతనం నుంచే నటన అంటే ప్రాణం. పదేళ్ల వయసులోనే బుర్రకథలు చెప్పేందుకు ఆసక్తి చూపేవాడు. 2007నుంచే లఘుచిత్రాలు తీయడం ప్రారంభిచాడు. యూట్యూబ్ హవా ప్రారంభం కావడంతో 2013లో కోడెం సంతోశ్‌తో కలిసి ‘సదన్న కామెడీ’ చానెల్ ద్వారా ‘గుట్టల్లో గుసగుస’తో యూట్యూబ్‌లో తొలి అడుగువేశాడు. ఇప్పటివరకు దాదా పు 200కు పైగా విలేజ్ కామెడీ షార్ట్ఫిలిమ్స్ చేశాడు. కామెడీ స్టార్‌గా దేశవిదేశాల్లో గుర్తింపు సాధించాడు. సినిమా అవకాశాలు కూడా రావడంతో బతుకమ్మ, నానీ బుజ్జి బంగారం, తుపాకీ రాముడు, సంత, చిన్ని గుండెల్లో ఎన్ని ఆశలో, నేనేసరోజన, గున్నమామిడి కొమ్మ మీద తదితర 10కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మరిన్ని సినిమాల్లోనూ బిజీగా ఉన్నట్లు తెలిపాడు. పేరు: అనిల్ జీల యూట్యూబ్ చానల్: మై విలేజ్ షో షార్ట్‌ఫిల్మ్‌లు: 200 కి పైగా సినిమాలు: 5 క్రేజీహీరో.. అనిల్ మల్యాల(చొప్పదండి): ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా సేవచేసేందుకు లంబాడిపల్లి వెళ్లి.. యూట్యూబర్‌గా తనలోని ప్రతిభకు పదును పెట్టుకుని.. ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించి, యువతకు క్రేజీ హీరోగా మారాడు అనిల్ జీల. ఉపాధ్యాయుడిగా విద్యాబుద్ధులు బోధిసూ్తనే తన ఆలోచనలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ.. సహచరుడు, మై విలేజ్ షో వ్యవస్థాపకుడు శ్రీరాం శ్రీకాంత్‌తో జట్టుకట్టాడు. మై విలేజ్ షోలో నటిస్తూ.. తనలో దాగిఉన్న ప్రతిభను చాటుకున్నాడు. స్వయంగా వ్లాగ్ నిర్వహిస్తూ ఏకంగా 7లక్షల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తూనే.. యూత్ ఐకాన్‌గా నిలిచాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన నిర్మల–మల్లేశం కొడుకు అనిల్ జీల. టీటీసీ చేసేటప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా లంబాడిపల్లికి వచ్చాడు. అప్పుడే శ్రీరాం శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. జమ్మికుంటలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఐదేళ్లక్రితం వేసవిసెలవుల్లో లంబాడిపల్లికి వచ్చిన అనిల్ జీల శ్రీకాంత్ దర్శకత్వంతో పాటు ఇతర లఘుచిత్రాలు సుమారు 200లకుపైగా నటించారు. కికీ చాలెంజ్ తన జీవితాన్ని మలుపు తిప్పగా, రైతు పడుతున్న కష్టాల వీడియోతో అనిల్‌కు ఫాలోయింగ్ పెరిగింది. ఏడు లక్షల ఫాలోవర్స్.. మై విలేజ్ షో వీడియోలతోపాటు తన వ్యక్తిగత జీవిత విశేషాలను అప్లోడ్ చేసేందుకు అనిల్ జీల వ్లాగ్ ప్రారంభించాడు. షూటింగ్లో.. ఇంట్లో.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ విశేషాలు తెలిసేలా వ్లాగ్‌లో పెడుతుండడంతో ప్రస్తుతం అనిల్‌కు 7లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. యూట్యూబ్ వీడియోల్లో నటిసూ్తనే సినిమాల్లో చాన్స్ కొట్టేశాడు అనిల్. ఇతడి సహజమైన నటనతో నేటియువతకు హీరోగా మారాడు. అనిల్ నటనకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్‌తోపాటు, ఎస్ఆర్ కల్యాణ మంటపం సినిమాలు ఇప్పటికే రిలీజ్ కాగా, దర్శకుడు నవీన్ బేతిగంటి తీస్తున్న ‘రామన్న యూత్’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. మై విలేజ్ షో తీస్తున్న ఓ వెబ్సిరీస్లోసైతం నటిస్తున్నాడు. పాటల మాంత్రికుడు మల్లిక్ గొల్లపల్లి(ధర్మపురి): పల్లెపదాలు ఆయన పాటలకు ప్రాణాలు. తాను రాసే పాటలోని ప్రతీ అక్షరం గ్రామీణ జీవన సుమధురం. మట్టిమనుషుల మధ్య బాధలు, బంధుత్వాలను జానపదాలుగా మలిచి చిత్రీకరిస్తూ.. జానపద ఆణిముత్యంగా రాణిస్తున్నాడు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన ఎస్వీ మల్లిక్‌తేజ. ఎస్వీ మ్యూజిక్ చానల్ ద్వారా 150కి ప్రయివేటు పాటలు రాసి, పాడిన, వీక్షకులకు అందించగా.. ఆరులక్షల మంది పాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు మల్లిక్‌తేజ. ఇటీవల వచ్చిన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. చిన్నతనం నుంచే.. మల్లిక్‌తేజ డిగ్రీవరకు చదివాడు. చిన్నతనం నుంచి అమ్మమ్మవాళ్ల ఊర్లో పెరిగాడు. తాత మ్యాకల వెంకయ్యతో గొర్రెలు మేపేందుకు వెళ్లి జానపదాలు నేర్చుకున్నాడు. ఆ పాటలనే స్కూళ్లో పాడేవాడు. ఇంటర్‌లోనే పాటలు రాయడం, పాడడం ప్రారంభించాడు. అప్పుడే జగిత్యాలకు వచ్చిన సుద్దాల అశోక్‌తేజ మల్లిక్పాటకు ముగ్దుడయ్యాడు. మల్లిక్‌ను హైదరాబాద్ పిలిపించుకుని మెలకువలు నేర్పించాడు. తరువాత యూట్యూబ్‌లో ఎస్వీ మ్యూజిక్ చానల్‌ను ప్రారంభించాడు. 2018 జనవరిలో తీసిన ‘నేనొస్తాబావ’ పాటకు 3కోట్లవ్యూస్ను సాధించాడు. ‘మదనాసుందారి’ పాట అత్యంత ప్రేక్షక ఆదరణ సాధించింది. ఎస్వీ మ్యూజిక్ చానల్ద్వారా 150కి పైగా ప్రయివేటు పాటలు చిత్రీకరించాడు. ఆరులక్షల పాలోవర్స్ ఉన్నారు. సినిమాల్లో అవకాశం రావడంతో 2019 ఏప్రిల్‌లో విడుదలైన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. కన్నడంలో భన్నదకనుసు, రంగిన దునియాకు మ్యూజిక్ డైరెక్టరుగా పరేషాన్ సినిమాలో పాట పాడాడు. పాటే రమేశ్ ప్రాణం గొల్లపల్లి(ధర్మపురి): యక్షగానం నుంచి పుట్టిన జానపద కళాకారుడు గడ్డం రమేశ్. జగిత్యాల జిల్లా చిన్నాపూర్కు చెందిన రమేశ్ తండ్రి అనంతం యక్షగానం చేస్తుండేవాడు. తండ్రిని అనుకరిస్తూ రమేశ్ తాను చదువుతున్న పాఠశాల వేదికపై యక్షగానం ప్రదర్శిస్తుండేవాడు. తరువాత జానపద పాటలు పాడిన రమేశ్ స్థానికంగా పేరు సంపాదించాడు. 2002లో రమేశ్ ప్రతిభను గుర్తించిన ధర్మపురి సీఐ హోంగార్డుగా ఉద్యోగం కల్పించాడు. పోలీసు కళాబృందంతో కలిసి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రజలను చైతనం చేస్తున్నాడు. 2011లో రేలారెరేలా కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు. తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో యూట్యూబ్‌లో గడ్డం మ్యూజిక్ చానల్ ప్రారంభించాడు. ‘నీలమ్మ నిమ్మసుక్క రాయిడు సోలో’ పాట మంచి గుర్తింపు పొందింది. ‘అత్తకొడుకా.. ముద్దల మారెల్లయ్య’ పాట 37లక్షల వ్యూస్ దాటింది. రమేశ్ ప్రతిభను జగిత్యాల జిల్లాకు చెందిన డైరెక్టర్ రాజ్నరేంద్ర, నిర్మాత గుగ్గిల్ల శివ ప్రసాద్ గుర్తించి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఇలా సింగర్‌గా సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. అంచెలంచెలుగా.. ఇల్లందకుంట(హుజురాబాద్): ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఆ కుర్రాడికి సిని మాలంటే పిచ్చి. చూసిన ప్రతీ సినిమాను ‘అక్కడ ఆ సీన్ ఉండాల్సింది కాదు.. అక్కడ ఆ ఫైట్ ఇలా తీయాల్సి ఉండే’ అంటూ స్నేహితులతో పంచుకునేవాడు. అలా సినిమాలపై అతడికి ఉన్న ఆసక్తి డైరెక్టర్‌గా కావాలని సంకల్పిచింది. మొదట్లో అవకాశం రాకపోవడంతో యూట్యూబ్ ద్వారా లఘుచిత్రాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు జమ్మికుంటకు చెందిన సూర్యతేజ. తన ప్రతిభను గుర్తించిన చాలా మంది నిర్మాతలు డైరెక్టరుగా అవకాశం కల్పించారు. గుంటూరుకు చెందిన రాములు– శ్రీదేవి కుటుంబం 20ఏళ్ల క్రితమే కరీంనగర్‌కు వచ్చింది. రాములు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వంటమనిషిగా చేసేవాడు. వీరికొడుకు సూర్యతేజకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. స్నేహితులు తమాషాగా సినిమా పిచ్చోడు అంటూ ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. అవకాశం కోసం తిరిగితే ఎవరూ ఆదరించలేదు. సినిమారంగంపై ఉన్న మక్కువతో సొంతంగా కెమెరా కొనుక్కుని లఘుచిత్రాలు తీయడం ప్రారంభించాడు. పోలీసు డిపార్టుమెంటు చేస్తున్న సేవలపై 500కు పైగా లఘుచిత్రాలు తీశాడు. 2013లో తీసిన దేశం కోసం లఘుచిత్రం పేరుతెచ్చి పెట్టింది. తరువాత దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేశాడు. ఆనంద్‌సాయి, ఈశ్వర్, పైడిరమేతో పాటు పెద్దదర్శకుల వద్ద సలహాలు తీసుకుని సొంతంగా సినిమాలు చేస్తున్నాడు. 2019లో షైన్పిక్చర్స్ బ్యానర్‌పై తీసిన ‘తలచినదే జరిగిందా’ సినిమా సూర్యకు గుర్తింపునిచ్చింది. వెండితెరపై మరెందరో.. విద్యానగర్(కరీంనగర్): కళలు, కళాకారులకు వేదికైన కరీంనగర్ నుంచి చాలామంది వెండితెరపై సైతం వెలుగుతున్నారు. కరీంనగర్‌లోని మార్కెండేయకాలనీకి చెందిన జి.రాధిక ఇంటర్‌నుంచే నటనలో పేరు సాధించింది. భర్త ప్రోత్సాహంతో లఘుచిత్రాల్లో నటించడం ప్రారంభించింది. తక్కువ సమయంలో పేరు సంపాదించి, సహజనటిగా వెలుగొందుతోంది. ఇప్పటి వరకు 700కు పైగా షార్ట్‌ఫిల్మ్‌లతో పాటు దొరసాని, విరాటపర్వం, భిక్ష, గల్లీగ్యాంగ్, స్కైలాబ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సితార బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమాలో కీరోల్ చేస్తోంది. గోదావరిఖనికి చెందిన ఏదుల స్వప్న 250 లఘుచిత్రాల్లో నటించింది. గల్లీగ్యాంగ్, పరేషాన్, నువ్వునేను ఒక్కటైతే, బతుకంతాబ్రహ్మచారి, బిచ్చగాడా మజాకా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బైరాన్‌పల్లి సినిమాలో నటిస్తోంది. వేములవాడకు చెందిన గోలి శివరామ్‌రెడ్డి నాటకాల్లో నటిస్తారు. 15 షార్ట్‌ఫిల్మ్‌లు చేశారు. పరేషాన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇటీవల నటించిన తుపాకులగూడెం సినిమా విడుదలకు సిద్ధమైంది. -
తెరపైకి వర్చువల్ ఆడియో సినిమాలు
సాక్షి, హైదరాబాద్: అందరికీ వినోదం పంచే ‘సినిమా’ కాలానుగుణంగా తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంది. నాటి బ్లాక్ అండ్ వైట్, మూకీ సినిమాలు మొదలు ప్రస్తుత త్రీడీ, యానిమేటెడ్ మూవీస్ వరకు కొత్తదనాన్ని, నూతన సాంకేతికతను తనలో కలుపుకుంటూనే ఉంది. సినిమాని కేరీర్‌గా ఎంచుకునే యువతరం పెరగడంతో షార్ట్‌ఫిల్మ్ హవా కూడా పెరిగింది. పొట్టి ఫ్లాట్‌ఫార్మ్‌పై తమదైన ముద్ర వేయాలనే తపనతో యువత కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అదే క్రమంలో వినూత్న వర్చువల్ ఆడియో ఫిల్మ్ తెరపైకి వచ్చింది. ప్రయోగాలకు వెనుకంజ వేయని నగర యువతను తన వైపు ఆకర్షిస్తోంది.. ఈ తరహా ఫిల్మ్‌లపై దృష్టి పెట్టేందుకు లాక్డౌన్ టైమ్ వారికి ఉపయోగపడింది. వర్చువల్ ఆడియో ఫిల్మ్ అంటే.. వినడానికి కొత్తగా ఉన్న వర్చువల్ ఆడియో ఫిల్మ్ నిజానికి వినడం మాత్రమే చేయగలం. ఈ చిత్రం.. చూసేందుకు మాత్రం వినూత్నంగా ఉంటుంది. అందరికీ తెలిసిన షార్ట్ ఫిల్మŠస్ అంటే ఆర్టిస్ట్‌లు, క్యాస్టూమ్స్, లొకేషన్స్, పాటలు, ఫైట్లు..! ఇవి లేకుండా ఏ సినిమానీ ఊహించుకోలేరు. కానీ వర్చువల్ ఆడియో ఫిల్మ్‌లో ఇవేవి కనపడవు. కానీ వినపడతాయి. ఈ షార్ట్ ఫిల్మ్‌లో ప్రత్యేకతే అది. ఒక సన్నివేశాన్ని, సందర్భాన్ని తెరపైన కనపడకుండా కేవలం మాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్తోనే కళ్లకు కట్టినట్టు కథ చూపించడం, వినిపించడం దీనిలో విశేషం. ఫిల్మ్ ఫెస్టివల్‌కి ‘డార్క్’ మూవీ.. ‘ఎ డేట్ ఇన్ ద డార్క్’ పేరుతో నగరవాసి సింగార మోహన్ ఒక వర్చువల్ ఆడియో ఫిల్మ్‌ని రూపొందించారు. ఆద్యంతం చీకటిలోనే నడిచే సున్నితమైన ప్రేమకథ ఇది. సినిమా దర్శకుడిగా మారాలనే ఆశయంతో వచ్చిన మోహన్ మొదటి ప్రయత్నంగా ఈ షార్ట్ మూవీని రూపొందించాడు. దర్శకుడిగా నిరూపించుకోవాలంటే విభిన్నమైన సినిమాని చేయాలన్న ఆలోచనతో ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమాకి సోషల్ మీడియాలో మంచి ఆదరణ అభించింది. ఇప్పటి వరకు 6 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి ఎంపిక కాగా అందులో రెండింటిలో ఫైనల్ లిస్ట్‌లో కొనసాగుతుంది. తక్కువ ఖర్చుతో ప్రయోగం.. కనపడకుండా కేవలం వినపడటం ద్వారా ఓ చిత్రాన్ని పొయెటిక్‌గా రూపొందించడం. అంత సులభం కానప్పటికీ హత్తుకునే కథా, కథనం సన్నివేశాన్ని మాటలతోనే ఆసక్తి రేకించే పనితనం అన్నింటికీ మించి మానసిక స్పందనలను ప్రభావితం చేయగల నేర్పరితనంఉంటే ఈ చిత్రం ‘చెవుల్ని’ కట్టి పడేస్తుంది. ఈ మూవీలో నటీనటుల మాటలు, వారి చుట్టూ ఉన్న పరిసరాల్లోని సౌండ్స్ మాత్రమే ఉంటాయి. వీటి ద్వారానే జరుగుతున్న సన్నివేశాన్ని కనపడకుండా చూపించగలగాలి. ఒక సీన్ నుంచి ప్రేక్షకుడి ధ్యాస మరల్చకుండా తీయగలగాలి. అతితక్కువ ఖర్చుతో ఈ సినిమా తీసే అవకాశం ఉంది. మేకప్,కాస్టూమ్స్, ట్రావెలింగ్ తదితర ఖర్చులేమి ఉండవు. ఈ విధమైన సినిమాలు ఇంతకు ముందు తీసిన సందర్భాలు చాలా అరుదు. సినిమాలో కొత్తదనం కోరుకునే కొందరు దర్శకులు మాత్రం వీటికి సై అంటున్నారు. రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు.. ఈ షార్ట్‌ఫిల్మ్ గురుంచి మోహన్ మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ లవ్ స్టోరీస్ తీయాలని ఇష్టం. అందుకే స్వచ్ఛమైన ప్రేమ కథతో ఈ సినిమా తీశాను. కంటికి కనపడకుండా ఒక అనుభూతిని ప్రేక్షకుడికి అందించాలంటే స్క్రిప్ట్ ఎంతో ముఖ్యం. దాన్ని అనుకున్నట్టుగా తీయడం చాలా కష్టం. మన దగ్గర అతి తక్కువ మంది ఈ విధమైన సినిమాలు తీశారు. వర్చువల్ ఆడియో ద్వారా దేశంలోనే మొదటి సారిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన ‘డైలాగ్ ఇన్ ద డార్క్’ నా సినిమాకు ప్రేరణ. 11 నిమిషాల సినిమా నిర్మించడానికి దాదాపు 40 రోజులు శ్రమించామన్నారు. పాటకు డిజిటిల్ ప్లాట్‌ఫామ్ సాక్షి, హైదరాబాద్: మనమంతా.. మనసంతా.. ఆన్‌లైన్‌పైనే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పండుగైనా, పబ్బమైనా, ఆటలైనా, పోటీలైనా.. ఆన్‌లైన్‌ను ఆశ్రయించాల్సిందే. కరోనా తనతో పాటు డిజిటల్ వాడకాన్ని కూడా బాగా వ్యాప్తిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే క్రమంలో పాటల పోటీలను కూడా డిజిటల్ పంథాలో తొలిసారిగా తెలుగు డిజిటల్ ఐడల్ పోటీలను నిర్వహిస్తోంది సిటీకి చెందిన టెంపుల్ బెల్ ఈవెంట్స్. ఈ పోటీ నిర్వాహకులు కౌశిక్ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. దివంగత గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం టీవీ తెర వేదికగా ఎందరో గాయనీ గాయకులను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం మనకు తెలియంది కాదు. ఆయన స్ఫూర్తితో ఎన్నో పాటల పోటీలకు బీజం పడింది. ఓ ఏడెనిమిది నెలల క్రితం వరకూ మనకు టీవీ షోల రూపంలోగానీ, బయట గానీ అనునిత్యం ఎక్కడో ఒకచోట పాటల పోటీలు జరుగుతూనే ఉండేవి. అయితే కరోనా కారణంగా అన్నింటితో పాటు అవీ అరకొరగానే మారిపోయాయి. ఆన్లైన్ కార్యకలపాలు తప్పనిసరిగా మారిన ప్రస్తుత పరిస్థితి వల్ల డిజిటల్ వేదికను ఉపయోగించుకుని పాటల పోటీ నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నచ్చిన తానా అధ్యక్షులు జె.తళ్లూరి కూడా నిర్వహణలో చేయి కలిపారు. సాంగు భళా.. పోటీ ఇలా.. ఈ పోటీల పోస్టర్‌ను ఆగస్టు 11న సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా పోటీదారుల రిజిస్టర్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 550 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాల నుంచి కూడా పోటీదారులు ఉన్నారు. వీరి నుంచి వడపోత అనంతరం 30 మందిని ఎంపిక చేశాం. తొలి రౌండ్లో ఈ 30 మంది పాల్గొంటారు. అదేవిధంగా 9 మంది క్వార్టర్ ఫైనల్స్‌కి, ఐదుగురు సెమీఫైనల్స్‌కి సెలక్టవుతారు. తుది పోటీకి ముగ్గురు మాత్రమే అర్హత పొందుతారు. ఈ పోటీలో ప్రతి దశా పూర్తిగా వర్చువల్‌గానే జరుగుతుంది. సాంగు భళా.. పోటీ ఇలా.. ఈ పోటీల పోస్టర్‌ను ఆగస్టు 11న సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా పోటీదారుల రిజిస్టర్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 550 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి దేశాల నుంచి కూడా పోటీదారులు ఉన్నారు. వీరి నుంచి వడపోత అనంతరం 30 మందిని ఎంపిక చేశాం. తొలి రౌండ్లో ఈ 30 మంది పాల్గొంటారు. అదేవిధంగా 9 మంది క్వార్టర్ ఫైనల్స్‌కి, ఐదుగురు సెమీఫైనల్స్‌కి సెలక్టవుతారు. తుది పోటీకి ముగ్గురు మాత్రమే అర్హత పొందుతారు. ఈ పోటీలో ప్రతి దశా పూర్తిగా వర్చువల్‌గానే జరుగుతుంది. -
వృత్తి కాంపౌండర్.. ప్రవృత్తి యాక్టర్
కలలు కనండి.. నిజం చేసుకోండి అన్నారు అబ్దుల్ కలాం.. నేటి యువత అదే చేస్తున్నారు.. సినిమాల్లోకి వెళ్లాలనుకున్న వారికి కలను నిజం చేసుకునేందుకు ‘షార్ట్’కట్ ఎంచుకున్నారు. షార్ట్‌ఫిల్మ్ మేకింగ్ ద్వారా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.. అయితే చిన్న సినిమా అని అదేదో ఆషామాషీ విషయం అనుకోకండి.. కేవలం 15 నిమిషాల నిడివిలో రెండున్నరగంటల సినిమా చూపించాలి.. లైక్‌లు కొట్టించాలి.. ఈ విషయంలో పాలుకొల్లు డైరెక్టర్లు ప్రేక్షకుల నాడిపట్టారనే చెప్పవచ్చు.. దాసరి, కోడి రామకృష్ణ వారసత్వం కదా! ఆ మాత్రం విషయం ఉంటాది మరి. పాలకొల్లు అర్బన్: పాలకొల్లు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు ఐదు నుంచి 15 నిమిషాల నిడివితో లఘు చిత్రాన్ని నిర్మించి వారి ప్రతిభను చాటుకుంటున్నారు. సినిమాల్లో అవకాశం దక్కించుకుంటున్నారు. పట్టణానికి చెందిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అలాగే చాన్స్ కొట్టారు. హీరో రాజశేఖర్‌తో ఆయన కల్కి సినిమా తీసి తన టాలెంట్ నిరూపించుకున్నారు. ప్రస్తుతం పాలకొల్లు కేంద్రంగా 20 మంది ఔత్సాహిక దర్శకులు ఉన్నారు. వీరిలో సుమారు 10 మంది కంటిన్యూగా ఒకటి తర్వాత ఒకటి షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. పాలకొల్లు కేంద్రంగా మూడు సంవత్సరాలుగా లఘు చిత్రాల నిర్మాణం ఎక్కువగా సాగుతోంది. గోదావరి నదీ ప్రాంతాలతో పాటు, పేరుపాలెం బీచ్, రిసార్ట్సు, సుందరమైన ఆలయ గోపురాలు, పచ్చని వరి పొలాలు, జలజలా పారే పిల్ల కాలువలే వీరి లొకేషన్లు. అలాగే పాలకొల్లులో కొంతకాలంగా క్షీరపురి అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పేరుతో పోటీలు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు ఔత్సాహికులు. అలాగే కాకినాడ, విశాఖపట్టణం, హైదరాబాద్, విజయవాడ, భీమవరం, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తుండటంతో యువత పట్టుదలతో హిట్ కొట్టాలని కృషి చేస్తున్నారు. లఘు చిత్రంలో ఓ సన్నివేషంలో ఆర్ఎంపీ వైద్యుడు చిర్ల శ్రీనివాసరెడ్డి తదితరులు, లఘుచిత్రం చిత్రీకరణలో నటుడు అంబటి పెదవెంకట్రాజు వృత్తి కాంపౌండర్.. ప్రవృత్తి యాక్టర్ తనకు పాలకొల్లు గద్దర్‌గా పేరుందని నటుడు అంబటి పెద వెంకట్రాజు తెలిపాడు. స్వతహాగా తాను గాయకుడ్నినని, ఆర్కెస్ట్రాతో పాటు ఆధ్యాత్మిక గీతాలు పాడుతుంటానని చెప్పాడు. వృత్తిరీత్యా పాలకొల్లులోని డా.నెక్కంటి నరేంద్ర గారి ఎముకల ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నానని, ఇప్పటివరకు 29 లఘుచిత్రాల్లో నటించానని చెప్పాడు. పలు చిత్రాలకు అవార్డులు అందుకున్నట్టు తెలిపాడు. ఎందుకే ప్రేమ.. ఈ చిత్రంలోని యువకుడి పేరు కానుకొలను శ్రీరామ్ (పవన్). పాలకొల్లులో 15 ఏళ్లుగా పండ్లవ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్లుగా లఘుచిత్రాలపై మోజు పెంచుకున్నాడు. తనే స్వయంగా స్టోరీ రాసుకుని, డైరెక్ట్ చేస్తూ నటిస్తూ విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. ఎందుకే ప్రేమ (ప్రేమకథా చిత్రం), మాయ(హర్రర్ మూవీ), లిక్కర్, నా లైఫ్ కి నేనే హీరో లఘు చిత్రాలను చిత్రీకరించాడు. సినిమాలంటే పిచ్చి డిగ్రీ పూర్తి చేశా. నాకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే చదువు పూర్తికాగానే చెన్నై, కేరళలో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. ప్రస్తుతం లఘు చిత్రాలు నిర్మిస్తున్నా. 11 లఘు చిత్రాలు నిర్మించా. స్త్రీ, ట్రూ లవ్ స్టోరీ, 50 లక్షలు లఘు చిత్రాలకు క్షీరపురి అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డులు లభించాయి. సినిమా రంగంలో స్థిర పడడమే తన లక్ష్యం. –నవీన్ ఏబీ, పాలకొల్లు లఘుచిత్రంలో డబ్బింగ్ చెబుతున్న ఆర్టిస్ట్‌కి సూచనలు చెబుతున్న దర్శకుడు, నిర్మాత నవీన్ ఏబీ 50 లఘు చిత్రాల్లో నటించా.. నేను ఆర్ఎంపీ వైద్యుడ్ని. ఒక వైపు వృత్తి చేసుకుంటూ లఘుచిత్రాల్లో గత ఐదారు సంవత్సరాల నుంచి నటిస్తున్నా. జై భారత్‌లో పిచ్చివాడి వేశానికి అవార్డు వచ్చింది. లఘుచిత్రాల్లో నటించడం ద్వారా, టీవీ సీరియల్, సినిమా అవకాశాలు వచ్చాయి. మౌన రాగాలు సీరియల్ చేశా. హీరో గోపీచంద్ సరసన ఎమ్మెల్యే పాత్ర చేసే అవకాశం వచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల యాక్ట్ చేయలేకపోయాను. –చిర్ల శ్రీనివాసరెడ్డి, పాలకొల్లు టాలెంట్‌ని గుర్తిస్తున్నారు ద మేట్ లఘు చిత్రంలో నటించా. దీన్ని యూ ట్యూబ్‌లో ఆరు లక్షల మంది చూశారు. హలో మాస్టారు, ఆడది... ఆడదాని బ్రతుకు లఘు చిత్రాలు పేరు వచ్చాయి. కడప సేన, దేశానికి రైతే ప్రాణం లఘు చిత్రాలు నటించాను. ఈ రెండు త్వరలో యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయబోతున్నారు.–ఉమాదేవి, ఆర్టిస్ట్ 22 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు టిక్‌టాక్‌లు చేయడం సరదా. ఫేస్బుక్లో పాలకొల్లు పద్దుగా పేరు. 22 వేల మంది టిక్‌టాక్ ఫాలోవర్స్ ఉన్నారు. టీవీ సీరియల్స్, లఘు చిత్రాల్లో నటిస్తున్నా. ఇటీవల దేశానికి రైతే ప్రాణం లఘు చిత్రంలో టీచర్ పాత్ర చేశా. ఔత్సాహిక నటీనటులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. –వడ్లమూడి పద్మ, పాలకొల్లు సినిమా నటి కావాలని.. నేను ప్రస్తుతం పాలకొల్లులో ఓ ప్రయివేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నాకు సినిమా నటి కావాలని కోరిక. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు నేర్చుకుంటున్నా. నా తండ్రి లక్ష్మీపతి హైస్కూల్లో టీచర్. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుగా లఘు చిత్రాల్లోనూ, కవర్ సాంగ్స్‌లో నటిస్తున్నాను. –ముంజులూరి సాయి ప్రకర్ష, పాలకొల్లు డబ్బింగ్ థియేటర్ పెట్టా... పాలకొల్లు కళలకు పెట్టింది పేరు. నేను చదువు పూర్తయిన తర్వాత ముంబయ్‌లో స్టుడియోలో యానిమేషన్ వర్కు సొంతంగా చేసుకునేవాడ్ని. ఇటీవల పాలకొల్లు వచ్చాను. సొంతంగా డబ్బింగ్ థియేటర్ పెట్టాను. నెలకి మూడు నుంచి నాలుగు షార్ట్ ఫిలింలకు డబ్బింగ్ చేస్తున్నా. –బంగారు మణికంఠ, పాలకొల్లు -
యూ'స్టార్స్'.. గంగవ్వకు జై..
యూట్యూబ్ ఛానల్స్‌లో సిటీ యువత హల్చల్ చేస్తోంది. లక్షలు,మిలియన్ మంది వీక్షకుల మదిని దోచేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నారు.. కంటెంట్ కన్నా మిన్నగా డైలాగ్ డెలివరీ,రక్తికట్టించే నటీనటుల హావభావాలు వీక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ప్రాచుర్యం కోసం ఒకప్పుడు సినిమా, టీవీ అవకాశాల వైపు మాత్రమే చూసిన యువత ఇప్పుడు సోషల్ వేదికలనే టార్గెట్ చేస్తోంది.సిటీయువత నిర్వహిస్తున్న కొన్న యూ ట్యూబ్ చానెల్స్ విశేషాలివి... గ్రామీణ నేపథ్యమే..సక్సెస్‌కు సారథ్యం... పండుగల విశిష్టతను చాటుతూ అచ్చమైన తెలంగాణ యాసలో గ్రామీణ నేపథ్యంతో క్రియేటివ్ థింక్స్ ఆకట్టుకుంటోంది. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ‘మాకాడ మహాశివరాత్రి’ లఘుచిత్రం వీక్షకుల్ని మెప్పించింది. గంగమ్మ (నది) చెంతకు వెళ్ళి మట్టితో శివలింగం చేసి అభిషేకం చేయడం, గ్రామంలోనే పూజ చేసేందుకు అవసరమయ్యే వస్తువుల సేకరించడం, ఆ తరువాత జాగరణ వంటి పండుగ విశేషాలతో తెరకెక్కించిన ఈ లఘు చిత్రం నాలుగు రోజుల్లోనే 1.2 మిలియన్ వ్యూస్ అందుకుంది. ⇒ వాలంటైన్స్ డే పురస్కరించుకుని ‘లవ్ దే’ పేరిట అప్లోడ్ చేసిన వీడియో వారం వ్యవధిలోనే 1.4 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. లవర్స్ కాని జంటకు ప్రేమ్దళ్ పేరిట కొందరు యువకులు పెళ్ళి చేయడం, ఆ పెళ్ళి విషయం ఇంట్లో తెలవగా వారు ఏవిధంగాఆ పెళ్ళి తంతు నుంచి బయటపడ్డారో అనేది వీక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ⇒ మాఘమాసం మంట, అష్టాచమ్మా, బరుతుడే, విలేజ్‌లో గండాలు, విలేజ్‌లో శ్రీమంతుడు, సెల్ కల్లు తాగితే, అప్పాలు చేయబోతే, థర్టీఫస్ట్ దావత్, మాకాడ బతుకమ్మ వంటి లఘు చిత్రాలు హిట్స్ కొట్టాయి. వీరు తెరకెక్కించే ప్రతి వీడియోలోనూ గ్రామీణ వాతావరణం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇప్పటివరకు 58 వీడియోల ద్వారా వీక్షకులకు వినోదాన్ని పంచింది. ప్రస్తుతం 1.15 మిలియన్ సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతోంది. గంగవ్వకు జై.. హాస్యపు జడివానలో వీక్షకులను తడిసిముద్దయ్యేలా చేస్తోంది మై విలేజ్ షో అంతేకాదు కొత్త సినిమాలకు ప్రమోషన్‌కు అడ్డాగా కూడా ఇది అవతరించింది. ఇందులో గంగవ్వ నటన ఎనలేని ఆదరణ పొందింది. నకిలీ పోలీసులు ఏవిధంగా దండుకుంటున్నారు, ఆర్టీఏ కార్యాలయం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తప్పుడు చలాన్లను ఇళ్ళకు పంపించి ఏవిధంగా తమ అకౌంట్లో డబ్బును జమ చేయించుకుంటున్నారు?ఇలాంటివి హాస్య నేపథ్యంగా చూపించిన తీరు హాట్సాఫ్ అనిపించుకుంది. ‘విలేజీలో డ్రంక్ అండ్ డ్రైవ్’ పేరిట అప్లోడ్ చేసిన ఈ వీడియో 4.2 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. ఇదే కోవలో ‘చేపల దొంగలు’ వీడియోకు 5.3 మిలియన్ వ్యూస్ వచ్చి చేరాయి. 31 దావత్ ప్లాన్ చేస్తే, విలేజ్ సమ్మర్ ప్రాబ్లమ్స్, దొంగల భయం, పిసినారి రాజు, విలేజ్‌లో దీపావళి, అమెరికా సోకు, ఇస్మార్ట్ గంగవ్వ, కరోనా కలకలం, విజయ్ పెండ్లి గోసలు, విలేజ్ పబ్ వంటి కామెడీ వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్‌ను మూటగట్టుకున్నాయి. అలాగే బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు సినిమా ప్రమోషన్ కోసం చేసిన వీడియో సైతం హల్చల్ చేసింది. 2019లో యూట్యూబ్ తెర పైకి వచ్చిన మై విలేజ్ షో ఛానల్లో ఇప్పటివరకు 193 వీడియోలు వినోదాన్ని పంచాయి. 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతుంది. దంచికొడుతున్న దేత్తడి.. ‘దేత్తడి’ ఛానల్ మోస్ట్ పాపులర్ అయ్యింది. ఇందులో హారిక అలేఖ్య నటన కుర్రకారుకు క్రేజీగా మారింది. 2018 ఏప్రిల్‌లో యూట్యూబ్‌లోకి ప్రవేశించిన ఈ ఛానల్ ఇప్పటికే 1 మిలియన్ పైచిలుకు సబ్‌స్క్రైబర్స్‌ను సొంతం చేసుకుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు కామెడీని జోడించి తెరకెక్కించే తీరు వీక్షకులకు దగ్గర చేసింది. మెడికల్ షాప్‌కు వచ్చే వారి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు మెడికల్ దుకాణం పేరిట తీసిన షార్ట్ వీడియో రెండు నెలల్లోనే 1 మిలియన్ వ్యూవర్స్‌ను మూటగట్టుకుంది. దేత్తడి ఛానల్స్ ద్వారా ఇప్పటివరకు అప్లోడ్ చేసిన 94 వీడియోలు యూట్యూబ్ లవర్స్ మదిని దోచేశాయనే చెప్పాలి. సినీనటుడు సుశాంత్ సైతం హారికతో జతకట్టి ‘పెళ్ళి గోల’ షార్ట్‌ఫిల్మ్‌లో వినోదాల జల్లులు కురిపించారు. -
సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్
సాక్షి, భువనగిరి(నల్గొండ) : సినీ హీరో కావాలనే లక్ష్యంతో ఓ యువకుడు విభిన్న పాత్రలు పోషిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని లఘుచిత్రాల్లో సైడ్హీరోగా నటించి అనంతరం హీరోగా నటించాడు. ప్రస్తుతం టీవీ సీరియల్లో విభిన్నపాత్రలు పోషిస్తున్నాడు. భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన సుర్పంగ రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు గణేష్. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలనే సంకల్పంతో ఆదిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఎప్పటికైనా సినిమాలో హీరోగా నటించాలనే కోరిక అతడిలో కలిగింది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు. ఈక్రమంలోనే యాదగిరిగుట్టకు చెందిన లఘుచిత్ర దర్శకుడు రాజు గణేష్‌లో ఉన్న నటన ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా లఘుచిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం టీవీ సీరియల్లో సైతం నటిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో.. గణేష్ ప్రారంభంలో రియల్ లవ్ నెవర్ డై, ల్యాజిక్ ఆఫ్ లైవ్ డిషిసన్, రెండు లఘు చిత్రాల్లో నటించాడు. ఈచిత్రా లు 2013లో విడుదలయ్యాయి. వీటితోపాటు బర్త్‌డే బాయ్ చిత్రం కూడా నటించాడు. ఆ తర్వాత వదిలేసి వెళ్తున్నా, సైలెంట్ లవ్ స్టోరీ, కాలేజీ పొరగాళ్లు, శాంతాభాయ్, నాకు నీనే తోపు తురుము, తను క్లాస్మెంట్ వంటి చిన్న సినిమాల్లో విభిన్న పాత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇందిరానో కంప్రమైజ్ సినిమాలో నటిస్తున్నాడు. వీటితోపాటు బంగారు పంజారం, మనస్సు మమత వంటి టీవీ సీరియల్లలో నటించాడు. సినీ హీరో కావాలన్నదే నా కోరిక అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. లఘుచిత్రంతో ప్రారంభమైన నా చిన్న సినిమాల వరకు తీసుకువచ్చాను. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నాను. పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే తప్పనిసరిగా నటిస్తా. జీవితంలో హీరోగా ఒక సినిమాలో నటించాలని నా కోరిక. – గణేష్, నటుడు -
షార్ట్.. ఓకే
బిజీబిజీ లైఫ్‌లో.. రెండున్నర గంటల సినిమా అంటే కష్టం..అంతసేపు థియేటర్లో కూర్చొనే ఓపిక ఎవరికీ ఉండటం లేదు.. ఏదైనా, షార్ట్‌కట్‌లో సింపుల్‌గా చెబితేనే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.. అందుకే ప్రస్తుతం షార్ట్ ఫిల్ముల హవా కొనసాగుతోంది.. చిన్న చిత్రాలైనా.. పెద్ద సందేశాలతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.. మన జిల్లాలో గోదావరి పరిసరాల్లోని యువత ఇటువంటి షార్ట్ ఫిలింలు తీసి హిట్టు టాక్ సొంతం చేసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా..–కొవ్వూరు రూరల్ సినిమాలను తలదన్నే ఇతివృత్తాలతో జిల్లాలోని యువత షార్ట్ ఫిలింలు రూపొందిస్తున్నారు. సమాజానికి మంచి సందేశాలను అందిస్తున్నారు. చిత్ర నిర్మాణంపై ఉన్న ఆసక్తితో పలువురు యువకులు ఒక బృందంగా ఏర్పడి నిర్మించిన షార్ట్ ఫిలింలు ఆలోచింపజేస్తున్నాయి. తమ పాకెట్ మనీతో చిన్ని చిత్రాలను రూపొందించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. వీరికి అవసరమైన సహాయం అందిస్తే పెద్ద చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని లఘు చిత్రాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నేడు కొందరు యువత చెడు మార్గంలో పయనిస్తుంటే.. తమకొచ్చిన చిన్న పాటి ఆలోచనలను చిత్రాలు రూపొందిస్తూ తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. పబ్జి ప్రభావం షార్ట్ ఫిలింలో ఓ సన్నివేశం చుట్టుపక్కల సంఘటనలేఇతివృత్తాలు సమాజంలో తమ చుట్టూ జరిగే యదార్థ సంఘటనలనే ఇతి వృత్తాలుగా యువత కథాంశాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ, బంధాలు, బం«ధుత్వాలు, స్నేహం వాటికి ఉన్న విలువలను ప్రస్పుటంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం యువత తెరకెక్కిస్తున్న చిత్రాల్లో మనం సమాజానికి ఏమి చేయగలం అనే ఆంశాలను చూపిస్తున్నారు. మానవ విలువలను చాటిచెబుతున్నారు. దీంతో అవి యూట్యూబ్‌లో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమే యువతలోనే ఉన్న ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు ప్రొత్సాహం తోడైతే వారు సినీ దర్శకులుగా, నటి నటులుగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారి ద్వారా మంచి సందేశాత్మక చిత్రాలు సమాజానికి అందుతాయి. సెల్ఫోన్లు,చిన్న కెమెరాలతోనే షూటింగ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ సెల్ఫోన్లలోనే యువత షార్ట్ ఫిలింలు రూపొందిస్తున్నారు. నటనపై ఆసక్తి ఉన్న వారు, దర్శకత్వం చేయగలిగిన యువకులు కలిసి ఒక బృందంగా ఏర్పడి ఈ లఘు చిత్రాలు రూపొందిస్తున్నారు. ఒకరు స్నేహమేరా జీవితం అంటే, మరొకరు కుటుంబ వ్యవస్థను మించింది లేదని, ఇంకొకరు కులాల కుంపట్ల వల్ల సమాజం దెబ్బతింటుందని, రాజకీయ వ్యవస్థ మారాలంటూ పలు సందేశాలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. అయితే కొందరు ఔత్సాహికులు ప్రతిఫలం ఆశించకుండా పెట్టుబడికి ముందుకు రావడంతో ఖర్చు వెనుకాడకుండా మంచి కెమెరాలు, డ్రోన్లతో షూటింగ్ జరపడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిర్మాతలు కావలెను షార్ట్ ఫిలిం నిర్మించాలన్నా తమకు చాలా ఖర్చు అవుతోందని కొందరు యువత వాపోతున్నారు. ఆసక్తి కొలదీ నటీనటులు, దర్శకుడు ఉన్నా పెట్టుబడి పెద్ద సమస్యగా మారుతోంది. నిర్మాణం పూర్తైన దానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్, కెమెరా వంటివి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఆసక్తి ఉన్నా మధ్యలోనే వదిలేస్తున్నారు. అయితే తాజాగా నెట్లో పలు రకాల యాప్‌లు అందుబాటులోకి రావడంతో వాటి ద్వారానే ఎడిటింగ్, డబ్బింగ్ వంటి ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే వాటిలో అంతగా క్వాలిటీ లేకపోవడంతో మంచి సందేశం ఉన్నా ఆంతగా ఆదరణ నోచుకోవడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులేనిలొకేషన్లు కొవ్వూరు పరిసరాల్లో పలు ప్రాంతాలు షూటింగ్‌కు అనువుగా ఉండటంతో షార్ట్ ఫిలింల నిర్మాణం జోరందుకుంటుంది. ముఖ్యంగా కొవ్వూరు గోష్పాదక్షేత్రం, కుమారదేవం, వాడపల్లితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పెద్ద పెద్ద దర్శకులు చిత్రాలను నిర్మించడంతో, ఆ ప్రభావం ఈ ప్రాంత యువతపై పడిందని చెప్పవచ్చు. ఎక్కువగా కొవ్వూరు నుంచి పోలవరం వరకూ పెద్ద చిత్రాల షూటింగ్ జరుగుతోంది. వీటి ప్రేరణతోనే లఘ చిత్రాలను తీస్తున్నామని ఈ ప్రాంత యువత చెబుతున్నారు. ఎన్నో కథలు ఉన్నాయి షార్ట్ ఫిలింలు నిర్మించడానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో కథలు ఉన్నాయి. ఒక్కో షార్ట్ ఫిలిం నిర్మించాలంటే అతి తక్కువగా రూ.20 వేల నుంచి 50 వేల వరకూ అవుతుంది. అయితే పెట్టుబడి లేకపోవడంతో మాకు అందుబాటులో ఉన్న వాటితోనే నిర్మిస్తున్నాం. మాలాంటి యువతకు ఫిలిం మేకింగ్‌తో ఉచితంగా శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం లభిస్తే మంచి సందేశాలు ఉన్న షార్ట్ ఫిలింలు నిర్మించ గలుగుతాం. –పి. భరత్‌కుమార్, షార్ట్ ఫిలిం డైరెక్టర్, కొవ్వూరు సొంత ఖర్చుతోనే నిర్మాణం సినిమాలపై ఉన్న ఆసక్తితో సొంత ఖర్చుతోనే షార్ట్ ఫిలింలు నిర్మిస్తున్నాం. సమాజానికి మంచి సందేశం ఇవ్వడంతో పాటు, మాలో ఉన్న ప్రతిభను భయపెట్టేందుకు అవి ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. అయితే రానురాను షార్ట్ ఫిలింల నిర్మాణంలో ఖర్చు పెరుగుతుంది.–బి. ప్రసాద్, కొవ్వూరు నటనపై ఆసక్తి ఉంది నటించాలన్న ఆసక్తి ఉంది. అందుకే షార్ట్ ఫిలింలో నటిస్తున్నాను. చిన్ననాటి స్నేహితులమందరం కలిసి షార్ట్ ఫిలింలు నిర్మించి, నటిస్తున్నాం. మంచి సందేశం ఉన్న చిత్రాలను నిర్మించాలన్నదే లక్ష్యంగా ఉన్నాం. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తే మరిన్ని చిత్రాలు తీయవచ్చు–కొత్తమాసు వినయ్‌కుమార్ మార్పు కోసమే లఘు చిత్రాలు సమాజంలో ఎంతో కొంత మార్పు తేవాలన్న ఉద్దేశంతో షార్ట్ ఫిలింలు తీస్తున్నా. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో “్ఙమార్పు’’ అనే పేరుతో ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై సందేశాన్ని ఇచ్చాను. అయితే షార్ట్ ఫిలింలు తీసే వారికి ప్రభుత్వం సహాయం చేస్తే మంచి చిత్రాలు అందించవచ్చు. –ఎన్ఎస్వీఎస్ఎం సాయి పవన్ కృష్ణ -
మనం చూడని మనదేశం
చూడాలి.. తెలుసుకోవాలి.. వెలుగులోకి తేవాలి..స్ఫూర్తి చెందాలి.మనకు ఉన్నవన్నీ సవాళ్లే అనుకుంటే వీళ్ల జీవితాలు చూడాలి.. మనకు కనపడని దేశం ఇది..ఈ నెల పన్నెండున తెలంగాణ, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో జరిగిన ‘జై చండీరాం మెమోరియల్ సెకండ్ నేషనల్ కమ్యూనిటీ మీడియా ఫెస్టివల్’లో ప్రదర్శించిన డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్‌లో మనం చూడని.. మనకు తెలియని దేశం కనిపించింది. మచ్చుకు మూడు.. సాల్ట్ ఇన్ మై విలేజ్ సముద్రపు నీటితోనే కాదు.. కొండవారగా పారే నీటితోనూ ఉప్పు తయారవుతుంది. అదే నాగాలాండ్ కథ.. సాల్ట్ ఇన్ మై విలేజ్. 1960ల్లో నాగాలాండ్‌లో జరిగిన ఘర్షణ, హింస నుంచి బతికి బయటపడ్డ మహిళలు ఇలా ఉప్పును తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్హెక్ జిల్లాలోని మాతిక్రూ గ్రామంలోని ఆడవాళ్లకు ఇదే ప్రధాన ఆర్థిక వనరు. కొండ మీద నుంచి చిన్న చిన్న పాయలుగా పారుతున్న నీటిని వెదురు బుంగలు, క్యాన్లలో పట్టుకొని కడవల్లో పోసి కాస్తారు. నీరంతా మరిగి మరిగి... ఆవిరై అడుగున ఉప్పు తయారవుతుంది. వీటిని అచ్చులుగా చేసి (తాటి బెల్లంలా) చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో అమ్ముతారు. డబ్బుతోపాటు ఆరోగ్యం అనీ చెప్తారు దీన్ని తయారు చేసే స్త్రీలు. మరుగుతున్న ఈ నీటి ఆవిరిని పీల్చుకోవడం వల్ల జలుబు, దగ్గు, కొన్ని శ్వాసకోశ వ్యాధులూ నయమయ్యాయని అంటారు. అంతేకాదు, ఈ ఉప్పు కూడా ఆరోగ్యకరమే అని చెప్తారు. ఉప్పు తయారీతో అల్లుకుని ఉన్న ఆ మహిళల జీవన విధానాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ట్రేడింగ్ చైల్డ్‌హుడ్ ఛత్తీస్‌గఢ్‌లోని బరిమా గ్రామం. ఊళ్లో చాలా మంది పిల్లలు బాలకార్మికులే. పశువులు కాస్తూ, పొలాల్లో పనిచేస్తూ కనిపిస్తారు. వాళ్లందరి ఇంటర్వ్యూలతో ఆ ఊరి చిత్రాన్ని చూపించిన సినిమా ఇది. పేదరికం, వాటికి కారణమైన దేశ సామాజిక, రాజకీయ స్థితిగతులను పరోక్షంగా ప్రశ్నించిన ఈ ఫిల్మ్ పెద్దల బాధ్యతను గుర్తుచేస్తుంది. సమ్ఝౌతా.. సమ్ఝౌతా .. అంటే ఒప్పందం. ఎవరితో.. శవాలతో! అవును. ఇది ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ స్త్రీల జీవన చిత్రం. స్థానిక మీడియా చూసినా.. చదివినా.. బుందేల్‌ఖండ్‌లో ఒక్క నేర వార్త కూడా కనిపించదు. అసలక్కడ క్రైమ్ రేటే ఉండదు. మరి శవాలతో సమ్ఝౌతా ఏంటీ? అదే సినిమా! వరకట్నం వేధింపులు, వాటివల్ల ఆత్మహత్యలు, ఈవ్‌టీజింగ్‌లు, రేప్‌లు, హత్యలు.. ఏం జరిగినా బాధితుల తరపు కుటుంబ సభ్యులను పిలిచి నేరస్తుల కుటుంబ సభ్యులతో సమ్ఝౌతా కుదిరిస్తారు గ్రామ సర్పంచ్‌లు, పెద్దలు వగైరా! అవును, ఖాప్ పంచాయత్లే. నేరం ఎంత పెద్దదయినా సరే.. సమ్ఝౌతానే శరణ్యం. ఫిర్యాదులు నమోదు అవడానికి వీల్లేదు. విచారణ పేరుతో పోలీసులు ఆ ఊళ్లలోకి అడుగు పెట్టడానికి ఆస్కారం లేదు. అందుకే క్రైమ్ రిపోర్ట్‌లో... పోలీసుల వైపు కెమెరా పెడితే.. ‘‘ఫిర్యాదు రాదు.. ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఫిర్యాదు వస్తే... తప్పకుండా న్యాయం చేస్తాం’’ అంటారు. ఇదే సమ్ఝౌతా! చూస్తున్న వాళ్లకు షాక్. ‘సభ్య’ సమాజానికీ అశనిపాతం. ఇవన్నీ తీసినవి ఫిల్మ్‌మేకింగ్‌లో మాస్టర్స్ కాదు. కష్టాల బడిలో ఆరితేరిన వాళ్లు. ఆ డాక్యుమెంటరీల్లో వాళ్లు అనుభవించిన సమస్యలున్నాయి. అందుకే అవి మనసును తడి చేస్తాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించిన మహిళా రైతుల గురించి చెప్పుకోవాలి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర్లోని పస్తాపూర్‌కు చెందిన వాళ్లు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మ ఇంకా కొందరు మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందినవాళ్లు. తమలా సమస్యల సవాళ్లతో జీవితంలో నెగ్గుతున్న వాళ్లు.. వాళ్ల కోణంలో.. వాళ్లు చూసిన సమాజాన్ని కెమెరాలో బంధించి.. డాక్యుమెంటరీలుగా.. షార్ట్ఫిల్మ్స్గా తీస్తే.. ఎందరికో స్ఫూర్తిగా ఉంటుందని ఈ బాధ్యతను చేపట్టారు. దూరదర్శన్ తొలితరం ప్రొడ్యూసర్లలో ఒకరైన మహిళ.. జై చండీరాం. ఆమె జ్ఞాపకార్థం ‘జై చండీరాం మెమోరియల్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో 2017లో ప్రారంభించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుతున్నారు. ఇది రెండవ యేడాది. ఈ ఇద్దరూ బాల్యపు హక్కులు, ప్రత్యేకతలు, జ్ఞాపకాలు లేకుండా పెరిగారు. ‘రెలు’ కూడా వాళ్లకు అందమైన ఊహ. ఇప్పుడు ఫ్లయిట్లో ఈ ఫెస్టివల్‌కు వచ్చారు. ఆ మాటను మెరిసే కళ్లతో చెప్తారు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మకు .. వాళ్ల నాయకత్వంలోని ఇతర మహిళలకూ చదువురాదు. అయితేనేం బతుకు తెలిసిన జ్ఞానవంతులు. అందుకే షూటింగ్‌కి చెందిన హై యాంగిల్, లో యాంగిల్, ఐ లెవెల్ షాట్స్ వంటి సాంకేతిక భాషకు ప్రత్యామ్నాయంగా వీళ్లు కొత్తపరిభాషను ఏర్పాటు చేసుకున్నారు. గాయ్దోళ్ల షాట్, పటేల్ షాట్, సంఘం షాట్‌గా! వాటిని కాయిన్ చేసుకోవడానికి వారి ప్రాంతపు సంస్కృతి, సామాజిక పరిస్థితులే ప్రేరణ, కారణం. దొరతనానికి బానిసలు, ఆర్థికలేమి, నిర్వాసితులుగా వాళ్లు పడ్డ కష్టాలు, అనుభవించిన బాధల్లోంచి పుట్టిన పదాలు అవి. పటేల్ అంటే దొర.. ఎప్పుడూ తన ఎదుట నేల మీద కూర్చుని ఉన్న కూలీలతో కిందకు చూసే మాట్లాడ్తాడు కాబట్టి లో యాంగిల్ షాట్‌ను తమకు అర్థమయ్యేలా పటేల్ షాట్ అని పిలుచుకుంటున్నారు. హై యాంగిల్ షాట్ గాయ్దోళ్ల షాట్ ఎందుకు అయింది? గాయ్దోళ్లు అంటే వెట్టి కూలీలు. తమ ముందు నిలబడి ఉన్న దొరకు సమాధానం ఇవ్వాలంటే పైకి చూస్తూనే మాట్లాడాలి. ఆ సన్నివేశాన్నే వాళ్లు ఊహించుకుని హై యాంగిల్ షాట్‌కి ఆప్ట్ అయ్యేలా గాయ్దోళ్ల షాట్ అని నామకరణం చేసుకున్నారు. సంఘం షాట్.. సంఘం లేదా... సమావేశంలో వాళ్లంతా ఒకచోటే కూర్చుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటారు. ఎవ్వరూ తల ఎత్తాల్సిన అవసరం లేదు. తలదించాల్సిన అగత్యం లేదు. అందుకే ఐ లెవెల్ షాట్... సంఘం షాట్లా అనిపించింది వాళ్లకు. ఇది వాళ్లు కల్పించుకున్న స్పృహ.. తెచ్చుకున్న అవగాహన. దక్కన్ రేడియోతో తెలుగు రాష్ట్రాల్లో తొలి కమ్యూనిటీ రేడియోను, వీడియో కెమెరా ఆపరేటింగ్‌తో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్నూ తీస్తున్నారు. తమను చూసి నొసటితో వెక్కిరించిన నోళ్లకు తమ చేతలతో మర్యాద నేర్పుతున్నారు. లక్ష్మణ్ మూడి.. ‘ట్రేడింగ్ చైల్డ్‌హుడ్’ దర్శకుడు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న పెంచి పెద్ద చేశాడు. లక్ష్మణ్ కూడా ఒకప్పుడు బాలకార్మికుడే. తొమ్మిదో తరగతి వరకు చదివి ఆపేశాడు. పెద్దవాళ్లకు తెలియకుండా.. తెలిసిన పెద్దలను ఒప్పిస్తూ ఈ డాక్యుమెంటరీ తీశాడు. బాగా చదువుకోవాలనేది లక్ష్మణ్ ఆశయం. థెనిలో.. ‘సాల్ట్ ఇన్ మై విలేజ్’ డాక్యుమెంటరీ దర్శకురాలు. పదో తరగతితో చదువు ఆపేసింది ఆర్థిక స్తోమత లేక. ఆమె చేనేత కార్మికురాలు కూడా. ఇప్పటికే నాలుగు షార్ట్‌ఫిల్మ్స్ తీసింది. స్క్రీనింగ్ కోసం పలు ప్రాంతాలకు వెళ్లింది. ‘‘మంచి ఫిల్మ్ మేకర్ కావాలనుకుంటున్నా’’ అంటుంది. – సరస్వతి రమ -
లఘుచిత్రాల సినిమాటోగ్రాఫర్
జూబ్లీహిల్స్: చిట్టీలు వేసి డబ్బులు జమ చేసి చిన్న 5డీ కెమెరాను కొనుగోలు చేసిన సుధాకర్... షార్ట్ఫిలిమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్నాడు. యూసుఫ్‌గూడ వెంకటగిరిలో నివసించే సుధాకర్ ఇప్పటికే వందలాది ఫార్ట్ఫిలిమ్స్ను తెరకెక్కించాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుధాకర్‌కు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ. తండ్రి కొనిచ్చిన చిన్న కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా సెల్ఫోన్లలో అత్యుత్తమ నాణ్యతతో కెమెరాలు రావడంతో... ఫోన్లోనే షార్ట్ఫిలిమ్స్ చిత్రీకరించి శెభాష్ అనిపించుకున్నాడు. 150కి పైగా షార్ట్ఫిలిమ్స్... నాలుగైదేళ్లుగా షార్ట్ఫిలిమ్స్ ట్రెండ్ పెరగడంతో ఫొటోగ్రఫీని ఉపాధిగా మార్చుకున్నాడు సుధాకర్. షార్ట్ఫిలిమ్ మేకింగ్‌లో పట్టు సాధించి ఇప్పటి వరకు దాదాపు 150కి పైగా లఘుచిత్రాలకు కెమెరామెన్‌గా పని చేశాడు. త్వరలో విడుదల కానున్న ‘రహస్యం’ సినిమాకు పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. మరో రెండు సినిమాలకు అవకాశాలు వచ్చాయి. ఈ రంగంలో పలు ప్రైవేట్ సంస్థల అవార్డులు అందుకున్నాడు. సుధాకర్ తెరకెక్కించిన హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ ,శ్వాసనువ్వే, రుధిరం తదితర లఘు చిత్రాలకు మంచి పేరొచ్చింది. వర్మ స్ఫూర్తితో.. తిలక్ దగ్గర ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను. ‘మా ఊరి వంట’ కార్యక్రమానికి అసిస్టెంట్‌గా పని చేశాను. రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో చిట్టీలు వేసి డబ్బులు జమ చేసుకొని 5డీ కెమెరా కొనుగోలు చేశాను. షార్ట్ఫిలిమ్స్కు పనిచేస్తూ పేరు సంపాదించాను. మంచి సినిమాటోగ్రాఫర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను.– సుధాకర్ -
సందేశం..లక్ష్యం
పినపాక ఖమ్మం : అల్లరిచిల్లరిగా తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా..సమాజానికి ఏదైనా సం దేశం ఇవ్వాలనే లక్ష్యంతో షార్ట్‌ఫిల్మ్‌లు రూ పొందిస్తూ.. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం, సీతంపేట గ్రామాలకు చెందిన సుమారు 20 మంది యువకులు ఆకట్టుకున్నారు. వీరంతా ఓ బృందం గా ఏర్పడి..లఘు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. సమాజంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలనే ధ్యేయంతో భిన్నంగా ఆలోచిస్తూ..శెభాష్ అనిపించుకుంటున్నారు. ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన పులివర్తి పెద్దాచారి, సీతంపేటకు చెందిన ఆర్.రాజశేఖర్‌లు టీం లీడర్లుగా ఉంటూ మరో 20మంది యువకులతో ప్రత్యేకం గా బృందాన్ని ఏర్పరుచుకుని..తొలినాళ్లలో కేవ లం కామెడీ అంశాలను ఆధారంగా చేసుకొని షార్ట్‌ఫిల్మ్‌లు తీశారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న పరిసరాలను, పొలాలను, పాఠశాలలను, రైతుల నే ఇతివృత్తంగా చేసుకుని చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆర్ఎస్ క్రియేషన్స్ పేరుతో 25షార్ట్‌ఫిల్మ్‌లు చిత్రీకరించే వరకు వీరి ప్రయాణం సాగింది. రైతులకు పెట్టుబడి ధరలు రావాలని, పంటల సాగుకు ప్రోత్సాహమివ్వాలని, ఊర్లను బాగు చేయాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని, సర్కారు బడులను ప్రోత్సహించాలని..సందేశమిచ్చేలా షార్ట్‌ఫిల్మ్‌లు తీశారు. యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేస్తుం డడంతో వేలామంది వీక్షకులు వాటిని చూశారు. ఈ లఘుచిత్రాలన్నీ సెల్‌ఫోన్ ద్వారానే తీశామని ఆనందంగా అంటున్నారు. వీడియో కెమెరా కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదని, మొబైల్లోనే ఎడిటింగ్ ప్రక్రియను కూడా పూర్తిచేస్తున్నామని వివరించారు. దాతలు సహకరించాలి.. సమాజంలో ప్రజలను చైతన్యపరిచేందుకు షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మిస్తున్నాం. ముందుగా ఐదుగురితో మొదలైన మా ప్రయాణం ఇప్పుడు 20 మందికి చేరుకుంది. ఆర్థిక పరిస్థితి చాలక..వీడియో కెమెరా కొనలేదు. సెల్‌ఫోన్‌తోనే చిత్రాలు నిర్మిస్తున్నాం. దాతలు సహకరిస్తే సమాజంలో సమస్యల పరిష్కారానికి, మార్పు కోసం మా వంతుగా కృషి చేస్తాం. –పి.పెద్దాచారి, ఏడూళ్లబయ్యారం, పినపాక మండలం యూట్యూబ్‌లో చూడండి.. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కృషి చేస్తున్న మా యువకులకు చెందిన ఆర్ఎస్ క్రియేషన్స్ పేరిట ఉన్న యూబ్యూబ్ చానెల్‌ను ప్రజలు ఆదరిస్తున్నారు. మరింతగా ఆదరిస్తే మాకు వచ్చే పాయింట్ల మూలంగా మరింత ఉత్సాహంగా షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మిస్తాం. – ఆర్.రాజశేఖర్, సీతంపేట, పినపాక మండలం -
స్టోరీ.. స్క్రీన్‌ప్లే.. డైరెక్షన్.. అన్నీ వారే..
సుజిత్.. ఒకప్పుడు షార్ట్ ఫిలిం మేకర్.. సినీ ప్రపంచంలో అడుగుపెట్టాలనుకున్న అతనిలో ఓ షార్ట్ ఫిలిం ఆత్మవిశ్వాసాన్ని నింపింది.. ప్రస్తుతం రూ.300 కోట్లతో ప్రభాస్ హీరోగా నిర్మి స్తున్న ‘సాహో’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను చేసేలా చేసింది. సుజిత్ ఎక్కడ అవకాశాల కోసం వెదకలేదు. తనకు తాను అవకాశాలను సృష్టించుకున్నాడు.. అవకా«శాన్ని అందిపుచ్చుకున్నాడు.. తన సినీ ప్రస్థానాన్ని సిల్వర్‌స్క్రీన్ వైపు నడిపించాడు.. ఫన్ బకెట్.. యూట్యూబ్‌లో అత్యంత హిట్ కొట్టిన నవ్వుల షార్ట్ ఫిలిం.. ఇందులో కనిపించే యువకులంతా ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు.. వారు అవకాశాల కోసం ఎదురుచూడలేదు.. కాళ్లు అరిగేలా తిరగలేదు.. కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీల్లోనే తమ ఆశయానికి నారు పోశారు. అదే ఫన్ బకెట్‌గా నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో నటించిన మిల్క్ మహేష్ తదితర నటులకు సినీ అవకాశాలను కల్పించింది. అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రామ్ కట్రూకు సినిమాలంటే ప్యాషన్. ఇక్కడికొచ్చిన అతనికి సినిమా తీయడానికి కొంత ఇబ్బంది ఎదురైంది. తన ప్రతిభను చూపడానికి సినిమా ఒకటే అవకా«శం కాదు.. అందుకే.. తనలాంటి ఆలోచనలు ఉన్న ఒక టీంతో ఆయన కలిశాడు. అంతే.. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తనకు తాను రాసుకున్నారు.. కృష్ణానగర్, గచ్చిబౌలి, మసీదు బండ ప్రాంతాల్లో ‘ప్రక్షాళన’ పేరుతో ఒక షార్ట్ ఫిలింను తెరకెక్కించాడు.. ఇది 16 ఫిలిం ఫెస్టివల్స్‌లో నామినేట్ అయ్యింది. ప్రతిభ ఒకరి సొత్తు కాదని కృష్ణానగర్ అడ్డాగా నిరూపితమైంది. బంజారాహిల్స్: సినిమాల్లో అవకాశాలు నేరుగా ఎవరికీ రావు. అదృష్టం ఉంటే తప్ప. ఇప్పుడు అదృష్టం ఉండాల్సిన పనిలేదు. ప్రతిభ ఉండి, పట్టుదల ఉంటే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అందుకే.. కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లో ప్రతి రోజు ఔత్సాహిక యువకులు షార్ట్ ఫిలింల రూపకల్పనతో బిజీగా ఉంటున్నారు. కృష్ణనగర్‌లో ఉండేటువంటి పార్కులు, బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు ఇలా అన్ని ప్రాంతాలు వీరికి లోకేషన్లుగా మారుతున్నాయి. అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో నివసించే చాలా మంది ఔత్సాహిక కళాకారులు తమను తాము నిరూపించుకొంనేందుకు ఈ లఘుచిత్రాల బాట పడుతున్నారు. ఇందుకు కృష్ణానగర్ ప్రాంతమే అడ్డాగా నిలుస్తోంది. ముడి సరుకులు అవే.. సమాజంలోని చిన్నచిన్న సంఘటనలే కథకు ముడి సరుకులుగా మారుతున్నాయి. ఇక ప్రతిభ ఉన్నవారు, ఉత్సాహం ఉన్నవారు వారికి వారే కథను రాసుకుంటున్నారు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చేస్తున్నారు. యాక్షన్ దగ్గరి నుంచి మొదలుకొని ప్యాకప్ వరకు అంతా వారే చూసుకుంటున్నారు. మరికొందరు ఏకంగా ముందడుగు వేసి హీరోలుగా తమను తాము నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 10 నిమిషాల నుంచి అరగంట నిడివి ఉండేటువంటి షార్ట్ ఫిలింలు ఇప్పుడు యూట్యూబ్‌లో హిట్ కొడుతున్నాయి. మహాతల్లి, ఫ్రస్టేషన్ ఉమెన్లాంటి స్వీయ కార్యక్రమాలతోపాటు ఫన్‌బకెట్, మై విలేజ్ షో, దేత్తడి, పక్కింటి కుర్రాడు ఇలాంటి షోలన్నీ ఇప్పుడు పెద్ద పాపులర్‌గా మారాయి. ఇంతెందుకు నిన్నామొన్నటి వరకు కృష్ణానగర్ వీధుల్లో తిరిగి జబర్దస్త్ టీంలో చేసి మహేష్ ఏకంగా ‘రంగస్థలం’ సినిమాలో రాంచరణ్ తేజ పక్కన చాన్స్ కొట్టాడు. కృష్ణానగర్ వీధుల్లో లఘు చిత్రాల చిత్రీకరణ అన్నీ ఇక్కడే.. లఘుచిత్రాలు చేయడమంటే కేవలం నటించడమే కాదు.. పాత్రకు తగిన విధంగా గెటప్ వేస్తున్నారు. భాష, యాస, మేకప్, దుస్తులు ఇలా అన్నింటిని సమకూర్చుకుంటున్నారు. ఇక వీటన్నింటికీ కృష్ణానగర్ ప్రాంతమే అడ్డా. కెమెరాలు ఇక్కడే అద్దెకు లభిస్తాయి. చిన్న కెమెరాల నుంచి మొదలుకొని పెద్ద కెమెరాల వరకు ఇక్కడ అద్దెకు ఇస్తారు. దుస్తులు, విగ్గులు, వివిధ వేషధారణలకు తగిన ఉత్పత్తులు ఇలా అన్నీ కృష్ణానగర్ అడ్డాలోనే లభిస్తాయి. అందుకే.. ఒకప్పుడు కేవలం అవకాశాల కోసం ఏర్పడిన కృష్ణానగర్ నేడు అవకాశాలు సృష్టించుకొనే డిజిటల్ స్థాయి వైపు తీసుకెళ్తోంది. ఆలోచనలే కాదు.. కృష్ణానగరూ మారుతోంది. షార్ట్ ఫిలిం నుంచిఫీచర్ ఫిలింకు.. సినిమాల్లో అవకాశం కోసం చాలా రోజులు కష్టపడ్డాం. కృష్ణానగర్ వీధులన్నింటినీ పరిచయం చేసుకున్నాం. అవకాశాలు అంత సులువుగా రాలేదు. చివరికి ప్రక్షాళన పేరుతో చేసిన షార్ట్ ఫిలిం చేశాం. అది ప్రపంచ స్థాయిలో ఆకర్షించింది. అంతే.. చాలా మంది పెద్ద డైరెక్టర్లు భుజం తట్టారు. కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు. – భరత్‌రాజు, నటుడు షార్ట్‌ఫిలింలో పాత్ర కోసం క్యాస్టూమ్స్ అద్దెకు తీసుకుంటూ.. అవకాశాలను సృష్టించుకొన్నాం.. ఫన్బకెట్లో దాదాపు 90 ఎపిసోడ్లు చేశాను. అదంతా కృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకొనే వాళ్లం. అలా నా వీడియో చూసి మొదటిసారి దర్శకులు తేజ అవకాశం నేనే రాజు నేనే మంత్రి సినిమాలో అవకాశం కల్పించారు. ఇప్పటికీ 16 సినిమాల్లో అవకాశం వచ్చింది. పట్టుదల ఉంటే మనమే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చేసుకోవడమే కాదు.. నటించి మనల్ని మనం నిరూపించుకోవచ్చు. – మహేష్ విట్టా, నటుడు, ఫన్ బకెట్ ఫేం -
వెండి తెరపై అనుభవ పాఠాలు
హన్మకొండ చౌరస్తా : మారుమూల గిరిజన తండాలో పుట్టిన వారిద్దరు.. సమాజంలో కొనసాగుతున్న వివక్షను చిన్ననాటి నుంచే స్వయంగా ఎదుర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా చిన్నచూపు చూడడం భరించలేకపోయారు. ఈ క్రమంలో వివక్షపై పోరాటం చేయాలని ఆ ఇద్దరు యువకులు నిర్ణయించుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో ఒకరు రాజకీయాల్లోకి అడుగిడితే, మరొకరు వైద్యుడయ్యారు. వారు చేస్తున్న వృత్తితో ఆర్థికంగా స్థిరపడ్డారు. అయితే వారు చిన్నతనంలో ఎదుర్కొన్న వివక్షను నిర్మూలించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలోని తండాకు చెందిన ఎన్.సారయ్యనాయక్.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పీజీ పూర్తి చేశారు. సమాజంలో నిమ్న కులాలపై వివక్ష కొనసాగడంపై చలించిపోయారు. తండావాసుల సహకారంతో 2001లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తండావాసులకు విద్య, వైద్యం కోసం శ్రమించారు. మరొకరు ఆనంద్.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి తండావాసి. మిర్యాలగూడలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఆయుర్వేద కళాశాలలో వైద్యవిద్య చదవివారు. ప్రస్తుతం ఢిల్లీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సమాజంలో దళిత, గిరిజనులు, బాలికలపై కొనసాగుతున్న వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నారు. అందుకు సినీ తెరను వేదికగా ఎంచుకున్నాడు. అనుకోకుండా 2010లో ఒక వేదికపై సారయ్యనాయక్, ఆనంద్‌లు పరిచయమయ్యారు. వారు మూడు లఘుచిత్రాలు, రెండు సినిమాలు నిర్మించారు. ప్రముఖుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. చిరుతేజ్‌సింగ్‌పై లఘుచిత్రం జ్ఞాపకశక్తిలో గిన్నిస్ రికార్డు సాధించిన వరంగల్ నగరానికి చెందిన ఎనిమిదేళ్ల చిరుతేజ్‌సింగ్‌పై రూపొందించిన లఘుచిత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చిరుతేజ్‌సింగ్ కేవలం ఒక నిమిషంలో 81 దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పగలగడం అతడి ప్రతిభ. ‘హార్మోన్స్’ చిత్రానికి అవార్డులు.. బంజార మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై 2011లో నిర్మించిన హార్మోన్స్ చిత్రం 2012లో రాష్ట్రవ్యాప్తంగా 60 థియేటర్లలో విడుదలైంది. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మొదలు ఢిల్లీ వరకు ఈ సినిమా ప్రముఖులచే ప్రశంసలు, అవార్డులను అందుకుంది. సామాజిక దృక్పథతో విద్య, వైద్యం, వ్యవసాయం అంశాలపై తెరకెక్కించిన ఈ చిత్రంలో తెలంగాణ యువతకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నటనలో కొత్తైనా సామాజిక అంశం కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కేయూ మాజీ వీసీ గోపాల్‌రెడ్డి, రిటైర్డ్ ఐజీ.జగన్నాథరావు తదితరులు నటించడం విశేషం. అంతేకాకుండా బాలికల విద్యా హక్కు చట్టం, అంటరానితనం, దళిత గిరిజనులపై వివక్ష’ తదితర అంశాలపై రూపొందించిన లఘుచిత్రాలు మేధావులను సైతం ఆలోచింపజేశాయి. వివక్షను తరిమికొట్టడమే లక్ష్యం స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ దళిత, గిరిజనులపై వివక్ష, దాడులు జరుగుతుండడం బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో దళిత, గిరిజనుల్లో చైతన్యం నింపి, రాజ్యాంగ హక్కులను అందించడమే మా లక్ష్యం. అందుకు సినీ తెరను వేదికగా మలుచుకున్నాం. ప్రజలపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది. – సారయ్యనాయక్, సినీ నిర్మాత మెరుగైన విద్య, వైద్యం అందినప్పుడే అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు నగరాల్లోని మురికివాడల్లో నివసించే వారిలో అత్యధిక శాతం దళితులు, గిరిజనులే ఉన్నారు. వీరందరికీ మెరుగైన విద్య, వైద్యం అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందితుంది. ఆ దిశగా గిరిజనుడిగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నా. – ఆనంద్, సినీ దర్శకుడు -
వరంగల్ ఒక అద్భుతం : ఎల్బీ శ్రీరామ్
సాక్షి, వరంగల్ రూరల్ : వరంగల్ ఒక అద్భుతమని, తెలుగు వారు తమ ప్రాంతాలకు వెళ్లాలంటే ఓరుగల్లు దాటాల్సిందేనని నటుడు, రచయిత ఎల్బీ శ్రీరాం అన్నారు. షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చిన ఆయనను సోమవారం సాక్షి పలకరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... వరంగల్‌కు అనేక సందర్భాల్లో వచ్చాను. షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం రావడం ఇదే మొదటి సారి. చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని. 17 సంవత్సరాల పాటు నాటికలు రచించి నటించాను. రిహార్సల్‌కు కోసం వరంగల్, నిజామాబాద్ వెళ్లేవాడిని. తెలుగువాళ్లు హైదారాబాద్ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్లాలన్నా, తిరుగుప్రయాణమైనా వరంగల్ దాటాల్సిందే. గేట్ వే ఆఫ్ తెలు గు పీపుల్‌గా ఓరుగల్లుకు సుస్థిర స్థానం ఉంది. వారం రోజులు.. మూడు షార్ట్ ఫిల్మ్‌లు షార్ట్ ఫిలిం తీసేందుకు 24 విభాగాలతో కూడిన టీంతో వచ్చాను. కథకు అనువైన ప్రాంతాలను ఎంచుకుని షూట్ చేస్తున్నప్పుడు పొందే అనుభూతే వేరు. వారం రోజుల్లో మూడు షార్ట్ ఫిల్మ్‌లు పూర్తి చేయాలి. ఈ మూడు సినిమాలకు కథలు వరంగల్‌కు చెందిన రచయిత రామచంద్రమౌళి అందించారు. వరంగల్, హన్మకొండలలో ఉన్న ప్రాంతాలన్నింటినీ తిప్పి చూపించారు. ఆయన రాసిన కథలు ఆయా ఏరియాలతో పెనవేసుకుని ఉన్నాయి. నేను ఒక రచయితగా రామచంద్రమౌళి రచనలను ఎంతగానో ఇష్టపడుతాను. షార్ట్ ఫిలిం షూట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన రచనలు షూట్ చేయాలనుకున్నాను. మీరు సహకరిస్తే చేస్తా అని చెప్పాను. రామచంద్రమౌళి మరోమాట చెప్పకుండానే అంగీకరించాడు. అన్ని లోకేషన్లు వరంగల్‌లో ఉన్నాయని చెప్పారు. వర్ధన్నపేట సర్పంచ్ గాడిపెల్లి రాజేశ్వర్ రావు, కాజీపేట తిరుమలయ్య, మెరుగు సాంబయ్య, చిప్ప వెంకటేశ్వర్లు, డాక్టర్ మురళీకృష్ణ ఎంతగానో సహకరిస్తున్నారు. కోటల అందాలు.. వరంగల్‌లో ఉన్న వేయిస్థంభాల దేవాలయం, ఖిలావరంగల్, రామప్ప, లక్నవరం ఇలా అన్నీ అద్భుతాలే. వరంగల్‌లో ఏ వీధికి వెళ్లినా మగ్గాలు కన్పిస్తుంటాయి. కాకతీయ కోట, రామప్ప గుడి ఎలా చరిత్రను నిలబెడుతున్నాయో చేనేత కార్మికులు సైతం వాళ్ల వృత్తిని నమ్ముకుని చరిత్రలో నిలిచిపోతారు. గూగుల్ మాయ.. ఇప్పటి తరం యువకులు ఏది కావాలన్న గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నారు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు. అలాంటిది నేటి యువత గూగుల్‌కు దాసోహం కావడం బాధేస్తుంది. ప్రస్తుతం మానవ విలువలు హరించుకుపోతున్నాయి. మంచి సందేశంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే షార్ట్ ఫిల్మ్‌లు తీయాలని నిర్ణయానికి వచ్చా. సంప్రదాయాలకు పెద్దపీట.. మన సంస్కృతి, సంప్రదాయాలు ముందు తరం వాళ్లకు అందించే ప్రయత్నంలో భాగంగానే షార్ట్ ఫిల్మ్‌లు తీస్తున్న. ఇప్పటి వరకు 20 షార్ట్ ఫిల్మ్‌లు తీశాను. ఇతరులు తీసిన 10 షార్ట్ ఫిల్మ్‌లలో నటించాను. డోలు అనే షార్ట్ ఫిల్మ్‌కు నంది అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు తీసిన షార్ట్ ఫిల్మ్‌లను యూట్యూబ్‌లో రెండున్నలక్షలకు పైగా ప్రేక్షకులు వీక్షించారు. 500 సినిమాల్లో నటన.. ఇప్పటి వరకు 500 సినిమాల్లో నటించాను. ఛత్రపతి, చాలా బాగుంది, స్టాలిన్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, సొంత ఊరు, సరైనోడు లాంటి సిని మాలు నాకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వపరంగా నాలుగు నంది అవార్డులు వచ్చాయి. 40 సినిమాలకు డైలాగులు రాశాను. -
షార్ట్‌గా.. షార్ప్‌గా..
తూర్పు గోదావరి, రాయవరం (మండపేట): ఏదో సాధించాలనే తపన..పదిమందిలో ఒకరిగా నిలవాలనే పట్టుదల.. వీటికి తోడు నిరంతర కృషి ఎవరినైనా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. తాను రాసిన కథలు, దర్శకత్వం ద్వారా పసలపూడికి గుర్తింపు తీసుకుని వచ్చిన సినీ దర్శకుడు ‘వంశీ’ బాటలో నడుస్తున్నాడు మరో యువకుడు. కెమెరామన్‌గా, దర్శకుడిగా షార్ట్ ఫిల్మస్ చేస్తూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తున్న ఆయన రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ఉత్తమ తృతీయ బహుమతిని గెల్చుకుంది. తృతీయ బహుమతి గెల్చుకున్న‘చేంజ్ ఫర్ ఎడ్యుకేషన్’.. సోషల్ మీడియా ఫర్ సొసైటీ(ఎస్ఎంఎస్) నేటి చదువులు అనే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో షార్ట్ ఫిల్మ్స్ పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 73 లఘుచిత్రాలు పోటీలో పాల్గొనగా, 11 చివరి పోటీకి నిలిచాయి. వీటిని వీక్షించిన కమిటీ రాయవరం మండలం పసలపూడికి చెందిన లఘు చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘చేంజ్ ఫర్ ఎడ్యుకేషన్’ షార్ట్ ఫిల్మ్ తృతీయ బహుమతిని గెల్చుకొంది. సీని దర్శకుడు వీఎన్ ఆదిత్య న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. కాన్వెంట్ చదువుల పేరుతో బాల్యాన్ని పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్న చదువులు, నేటి చదువుల్లో రావాల్సిన మార్పులపై ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన చేంజ్ ఫర్ ఎడ్యుకేషన్ షార్ట్ ఫిల్మ్ న్యాయ నిర్ణేతలను ఆలోచింపజేసింది. కెమెరామెన్, దర్శకుడిగా.. 2012 నుంచి ఇప్పటి వరకు కృష్ణారెడ్డి కెమెరామెన్‌గా, దర్శకుడిగా తనదైన శైలిలో లఘుచిత్రాలను రూపొందించాడు. సామాజిక ఇతివృత్తాలను ప్రధానంగా తీసుకుని ఇప్పటి వరకు 25 లఘుచిత్రాలకు కెమెరామెన్‌గా, దర్శకుడిగా పనిచేశాడు. స్నేహం గొప్పదనాన్ని తెలియజేసేలా ‘నేనెందుకు’ అనే లఘుచిత్రంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. యువత ఖాళీగా ఉండకూడదంటూ ‘టైమ్ వేస్ట్ చెయ్యొద్దు’ అనే లఘుచిత్రంతో పాటు ప్రేమ పేరుతో జీవితాలను పాడు చేసుకోవద్దంటూ ‘గాల్లో ప్రేమ కథలు’, సమాజం కోసం పోరాడాలంటూ ‘భీష్మ’, నిజమైన ప్రేమ గొప్పదనాన్ని తెలియజేసే ‘ట్రు లవ్’ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చవద్దంటూ ‘శిల్పి’ తదితర 25 లఘుచిత్రాలను కృష్ణారెడ్డి రూపొందించారు. సినీ దర్శకుడిగా రాణించడమే లక్ష్యం.. సినీ దర్శకుడిగా రాణించడమే తన లక్ష్యం. నాలో ఉన్న ఆలోచనలకు పదును పెట్టుకుంటూ.. కెమెరామన్‌గా, దర్శకుడిగా షార్ట్ ఫిల్మŠస్ రూపొందిస్తున్నాను. సమాజానికి సందేశాన్నిచ్చే మరిన్ని లఘు చిత్రాలను రూపొందిస్తాను. చేంజ్ ఫర్ ఎడ్యుకేషన్ తృతీయ బహుమతి గెల్చుకోవడం సంతోషాన్నిచ్చింది. నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. చేంజ్ ఫర్ ఎడ్యుకేషన్ షార్ట్ ఫిల్మ్‌కు నిర్మాతగా కేశవ సూర్య(రాజోలు), రచయితగా కుమార్(కుతుకులూరు), సహ దర్శకుడిగా మురుగదాస్(నెలపర్తిపాడు), కో–డైరెక్టర్‌గా ఆర్కే(జి.మామిడాడ), కార్య నిర్వాహక దర్శకుడిగా కర్రి రామారెడ్డి సహకారం అందించారు. – ఎస్వీ కృష్ణారెడ్డి, షార్ట్ ఫిల్మŠస్ దర్శకుడు, పసలపూడి, రాయవరం మండలం -
ఇద్దరూ.. ఇద్దరే!
నాన్న అభిరుచి.. కూతురు ఆసక్తి వెరసి సందేశాత్మక లఘుచిత్రాలుగా వస్తున్నాయి. సమాజంలోని అంశాలను ఇతివృత్తాలుగా తీసుకుని తక్కువ నిడివితో లఘుచిత్రాలు నిర్మిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు గోదావరిఖనికి చెందిన తండ్రీకూతుళ్లు. తండ్రి దర్శకత్వం వహిస్తూ, నటిస్తుండగా.. కూతురు మొబైల్ కెమెరాలో చిత్రీకరిస్తూ.. సంగీతాన్ని సమకూర్చుతోంది. సామాజికాంశాలే తనకు ప్రేరణ అంటున్న తండ్రి.. నాన్న ఆసక్తికి తోడుగా నిలుస్తున్న కూతురు గురించి తెలుసుకుందాం.. కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిచౌరస్తా సమీపంలో నివసిస్తున్న సింగరేణి ఉద్యోగి, స్మైల్‌ప్లీజ్ లాఫింగ్క్లబ్ ప్రధాన కార్యదర్శి పోతుల చంద్రపాల్ సింగరేణి సంస్థ ఆర్జీ–3లోని ఓసీపీలో డ్రాగ్‌లైన్ ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు శాంతినిరీక్షణ. నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్ పేరిట తండ్రి, కూతురు సందేశాత్మక లఘుచిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌కు చంద్రపాల్ కూతురు కెమెరా, సంగీతం అందించి తండ్రి ఆలోచనలను వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు లఘుచిత్రాలు, ఆరు డాక్యుమెంటరీలు, ఐదు టెలీఫిల్మ్‌లు తీశారు. టెలిఫిల్మ్‌లు మినహా మిగతావన్నీ కేవలం స్మార్ట్‌ఫోన్ ద్వారానే చిత్రీకరించడం గమనార్హం. స్మార్ట్‌ఫోన్‌తో చిత్రీకరణ బీఎస్సీ నర్సింగ్ చదివిన శాంతినిరీక్షణ.. తండ్రి ఆలోచనలను స్మార్ట్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా సంగీతం సమకూర్చుతున్నారు. పెద్ద కెమెరాలు, రీ–రికార్డింగ్ స్టూడియోలు వినియోగించకుండానే... కేవలం తండ్రి వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌తోనే షూటింగ్, డబ్బింగ్, రీ–రికార్డింగ్ చేస్తూ.. నాలుగు నిమిషాల నిడివి గల షార్ట్‌ఫిల్మ్‌లను రూపొందిస్తున్నారు. టెలీఫిల్మ్‌లను మాత్రం మూవీ డిజిటల్ కెమెరాతో వెంకటస్వామి, మహబూబ్, లక్ష్మణ్ అనే కెమెరామెన్లు తీశారు. లఘుచిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు తనే నటిస్తున్నారు చంద్రపాల్. నిర్మించిన చిత్రాలు ♦ లఘుచిత్రాలు: ‘ఒంటరివాడు, ఆధార్‌కార్డ్, కనబడుట లేదు’ ♦ డాక్యుమెంటరీలు: ‘ఓమానవా, మరణమా? శిరస్త్రాణమా?, హెల్మెట్, నీరు–కన్నీరు, సుజలాం–సుఫలాం, చేతిశుభ్రతే ఆరోగ్య భద్రత’ ♦ టెలీఫిల్మ్‌లు: ‘మార్గదర్శి, ఖాందాన్, దీర్ఘాయుష్మాన్భవః, ఓ తండ్రి చివరి లేఖ, ఓ తండ్రి డైరీలో చివరి పేజీ,’ ప్రదర్శనలు– అవార్డులు ♦ గతేడాది జూలై 8న రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక మండలి నిర్వహించిన ప్రదర్శనలో ‘మార్గదర్శి’ టెలీఫిల్మ్‌ను ప్రదర్శించారు. ♦ 2011లో సింగరేణి సంస్థ సీఎండీ నర్సింగారావు చేతుల మీదుగా ‘మార్గదర్శి’ టెలీఫిల్మ్కు ఉత్తమ అవార్డు అందుకున్నారు. ♦ ఈ ఏడాది జనవరిలో నాగ్‌పూర్‌లో జరిగిన కోలిండియాస్థాయి పోటీల్లో చంద్రపాల్ చేసిన ‘హాస్యాభినయం’ ప్రదర్శనకు కాంస్య పతకం వచ్చింది. ♦ 2009 డిసెంబర్లో జయశంకర్ భూపాలపల్లిలో ‘హాస్యాభినయం’ ప్రదర్శనకు సింగరేణి సంస్థ సీఎండీ నర్సింహారావు చేతుల మీదుగా ‘ఉత్తమ కళారూపం’ అవార్డు అందుకున్నారు. ♦ త్వరలో ‘తిరగబడ్డ మమకారం’ అనే టెలీఫిల్మ్‌ను నిర్మిస్తున్నట్లు చంద్రపాల్ తెలిపారు.