షార్ట్‌ఫిల్మ్ సీడీలు ఆవిష్కరిస్తున్న తండ్రి చంద్రపాల్, కూతురు శాంతినిరీక్షణ
నాన్న అభిరుచి.. కూతురు ఆసక్తి వెరసి సందేశాత్మక లఘుచిత్రాలుగా వస్తున్నాయి. సమాజంలోని అంశాలను ఇతివృత్తాలుగా తీసుకుని తక్కువ నిడివితో లఘుచిత్రాలు నిర్మిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు గోదావరిఖనికి చెందిన తండ్రీకూతుళ్లు. తండ్రి దర్శకత్వం వహిస్తూ, నటిస్తుండగా.. కూతురు మొబైల్ కెమెరాలో చిత్రీకరిస్తూ.. సంగీతాన్ని సమకూర్చుతోంది. సామాజికాంశాలే తనకు ప్రేరణ అంటున్న తండ్రి.. నాన్న ఆసక్తికి తోడుగా నిలుస్తున్న కూతురు గురించి తెలుసుకుందాం..
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిచౌరస్తా సమీపంలో నివసిస్తున్న సింగరేణి ఉద్యోగి, స్మైల్‌ప్లీజ్ లాఫింగ్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి పోతుల చంద్రపాల్ సింగరేణి సంస్థ ఆర్జీ–3లోని ఓసీపీలో డ్రాగ్‌లైన్ ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు శాంతినిరీక్షణ. నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్ పేరిట తండ్రి, కూతురు సందేశాత్మక లఘుచిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌కు చంద్రపాల్ కూతురు కెమెరా, సంగీతం అందించి తండ్రి ఆలోచనలను వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు లఘుచిత్రాలు, ఆరు డాక్యుమెంటరీలు, ఐదు టెలీఫిల్మ్‌లు తీశారు. టెలిఫిల్మ్‌లు మినహా మిగతావన్నీ కేవలం స్మార్ట్‌ఫోన్ ద్వారానే చిత్రీకరించడం గమనార్హం.
స్మార్ట్‌ఫోన్‌తో చిత్రీకరణ
బీఎస్సీ నర్సింగ్ చదివిన శాంతినిరీక్షణ.. తండ్రి ఆలోచనలను స్మార్ట్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా సంగీతం సమకూర్చుతున్నారు. పెద్ద కెమెరాలు, రీ–రికార్డింగ్ స్టూడియోలు వినియోగించకుండానే... కేవలం తండ్రి వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌తోనే షూటింగ్, డబ్బింగ్, రీ–రికార్డింగ్ చేస్తూ.. నాలుగు నిమిషాల నిడివి గల షార్ట్‌ఫిల్మ్‌లను రూపొందిస్తున్నారు. టెలీఫిల్మ్‌లను మాత్రం మూవీ డిజిటల్ కెమెరాతో వెంకటస్వామి, మహబూబ్, లక్ష్మణ్ అనే కెమెరామెన్‌లు తీశారు. లఘుచిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు తనే నటిస్తున్నారు చంద్రపాల్.
నిర్మించిన చిత్రాలు
♦ లఘుచిత్రాలు: ‘ఒంటరివాడు, ఆధార్‌కార్డ్, కనబడుట లేదు’
♦ డాక్యుమెంటరీలు: ‘ఓమానవా, మరణమా? శిరస్త్రాణమా?, హెల్మెట్, నీరు–కన్నీరు, సుజలాం–సుఫలాం, చేతిశుభ్రతే ఆరోగ్య భద్రత’
♦ టెలీఫిల్మ్‌లు: ‘మార్గదర్శి, ఖాందాన్, దీర్ఘాయుష్మాన్‌భవః, ఓ తండ్రి చివరి లేఖ, ఓ తండ్రి డైరీలో చివరి పేజీ,’
ప్రదర్శనలు– అవార్డులు
♦ గతేడాది జూలై 8న రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక మండలి నిర్వహించిన ప్రదర్శనలో ‘మార్గదర్శి’ టెలీఫిల్మ్‌ను ప్రదర్శించారు.
♦ 2011లో సింగరేణి సంస్థ సీఎండీ నర్సింగారావు చేతుల మీదుగా ‘మార్గదర్శి’ టెలీఫిల్మ్‌కు ఉత్తమ అవార్డు అందుకున్నారు.
♦ ఈ ఏడాది జనవరిలో నాగ్‌పూర్‌లో జరిగిన కోలిండియాస్థాయి పోటీల్లో చంద్రపాల్ చేసిన ‘హాస్యాభినయం’ ప్రదర్శనకు కాంస్య పతకం వచ్చింది.
♦ 2009 డిసెంబర్‌లో జయశంకర్ భూపాలపల్లిలో ‘హాస్యాభినయం’ ప్రదర్శనకు సింగరేణి సంస్థ సీఎండీ నర్సింహారావు చేతుల మీదుగా ‘ఉత్తమ కళారూపం’ అవార్డు అందుకున్నారు.
♦ త్వరలో ‘తిరగబడ్డ మమకారం’ అనే టెలీఫిల్మ్‌ను నిర్మిస్తున్నట్లు చంద్రపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment