సాక్షి, హైదరాబాద్ : ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వాటిని ఛేదించటం పోలీస్ శాఖకు అంతే కష్టతరంగా మారింది. అందుకే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హైదరాబాద్ పోలీస్ శాఖ నడుం బిగించింది. సెలబ్రిటీలతో చెప్పిస్తే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న ఆలోచనతో ఐదు షార్ట్ ఫిల్మ్‌లను విడుదల చేసింది.
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, విజయదేవర కొండలతో లఘు చిత్రాల ద్వారా ప్రచారం ప్రారంభించింది. మ్యాట్రీమోనియల్ మోసాలపై తీసిన లఘు చిత్రానికి విజయ్, అపరిచితులతో ఆన్ లైన్ ఛాటింగ్.. వ్యక్తిగత విషయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్టీఆర్‌తో సందేశం ఇప్పించింది పోలీస్ శాఖ. ఇక ఆన్ లైన్ జాబ్‌ల పేరిట మోసం చేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండంటూ రాజమౌళి ద్వారా మెసేజ్ చెప్పించారు.
వీటితోపాటు మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు సంబంధించిన అంశాలపై యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తో ఓ లఘు చిత్రం.. మరో లఘు చిత్రాలను కూడా విడుదల చేశారు. ప్రసాద్ ఫిల్మ్ లాబ్స్ లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీవీ శ్రీనివాస రావు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్ విభాగం) స్వాతి లక్రా, నిర్మాత దిల్ రాజు, నటి సుప్రియ తదితరులు పాల్గొన్నారు. వీటిని థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment