తెలుగు సినిమా వెయ్యి కోట్ల వసూళ్లతో ముందు ముందుకెళుతోంది. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, కల్కి’ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇలా వసూళ్ల పరంగా ముందుకు వెళుతున్న టాలీవుడ్ కథల పరంగా వెనక్కి వెళుతోంది. అవును... ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పదికి పైగా పీరియాడికల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. 20వ శతాబ్దపు కథలతో రూపొందుతున్న ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.
ఓ వైపు రాజాసాబ్...
మరోవైపు ఫౌజీ యుద్ధానికి సరికొత్త నిర్వచనం ఇవ్వనున్నారు ప్రభాస్. ఇందుకోసం ఈ హీరో దాదాపు 80 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటించనున్నారు. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లోప్రారంభం కానుంది.
కాగా ఈ చిత్రం పోస్టర్‌పై కనిపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’, ‘హైదరాబాద్ చార్మినార్’, ‘ఆపరేషన్ జెడ్’, ‘పవిత్రాణాయ సాధూనాం’ వంటి అంశాలు సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. కొన్ని వాస్తవ ఘటనలకు కొంత కాల్పనికతను జోడించి ఈ సినిమా కథ తయారు చేశారట హను రాఘవపూడి. మాతృభూమి కోసం పోరాడే ఓ యోధుడి నేపథ్యంలో సాగే సినిమా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయం అది. అలాంటప్పుడు ఆ యుద్ధానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు ఓ యోధుడు’’ అంటూ ఈ సినిమా కథ గురించి ఇటీవల పేర్కొన్నారు హను రాఘవపూడి.
జయప్రద, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా 1990 నాటి కథేనని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్‌ను చూపించ నున్నట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధీ కుమార్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ఇటు డ్రాగన్... అటు దేవర
ఎన్టీఆర్‌ను ‘డ్రాగన్’గా మార్చారట ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 8న ఈ సినిమాప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా మారింది. పోస్టర్‌పై 1969, గోల్డెన్ ట్రయాంగిల్, చైనా, భూటాన్, కోల్‌కతా అని పేర్కొంది చిత్రయూనిట్.
దీంతో 1969 నేపథ్యంలోనే ఈ సినిమా కథనం ఉంటుందని, ఆ సమయంలో జరిగిన ఓ వాస్తవ ఘటనకు కల్పిత అంశాలను జోడించి, ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న మరో చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపిస్తారు. రెండు భాగాలుగా ‘దేవర’ రిలీజ్ కానుంది. తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది.
పెద్ది!
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో అన్నదమ్ముల్లా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కొంచెం బరువు పెరగాలనుకుంటున్నారు. రా అండ్ రస్టిక్‌గా ఆయన లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.
రాయలసీమ నేపథ్యంలో...
హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ హిట్ మూవీగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్, రాహుల్‌ల కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. రాయలసీమ నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగే కథగా ఈ చిత్రం రానుంది. ఈ పీరియాడికల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని, ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే విజయ్ హీరోగా రవికిరణ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.
అసాధారణ ప్రయాణం
ఓ సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణ ఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ఇది. 1980 నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా ఉంటుంది. ఇందులో ఓ బ్యాంక్ క్యాషియర్‌గా దుల్కర్ సల్మాన్ కనిపిస్తారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది.
క.. సస్పెన్స్
కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడికల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ డ్రామా ‘క’. దర్శకత్వ ద్వయం సుజిత్– సందీప్ తెరకెక్కిస్తున్నారు. కృష్ణగిరి పట్టణం, అక్కడ ఉన్న ఓ పోస్ట్‌మేన్, అతని జీవితంలోని మిస్టరీ ఎపిసోడ్ అంశాల నేపథ్యంలో ‘క’ సినిమా కథనం ఉంటుంది. చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘క’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నాయి.
బచ్చల మల్లి
‘బచ్చల మల్లి’గా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. ఆయన టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ఓ ఊరి చుట్టూ ఉంటుందని తెలిసింది. ఇందులో ట్రాక్టర్ డ్రైవర్ మల్లి పాత్రలో కనిపిస్తారు ‘అల్లరి’ నరేశ్. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
ఎదురు చూపు
ఓప్రాంతం ఒకతని కోసం ఎదురు చూస్తోంది. అతని పేరు సాయి దుర్గాతేజ్. 1940 నేపథ్యంలో సాగే ఓ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌లో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. ‘హను–మాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్‌రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాలు పడుతున్న ఓప్రాంత వాసుల జీవితాలు ఓ వ్యక్తి రాకతో ఎలా మారతాయి? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
24 సంవత్సరాలు
హీరో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో గ్యాంబ్లింగ్ అంశాలతో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. 1958 నుంచి 1982... అంటే ఇరవై నాలుగు సంవత్సరాల టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుంది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment