విచిత్రం
మంచి చెడుల విచక్షణ, బాధ్యతారాహిత్యం, బ్యాచులర్ లైఫ్ కామెడీ, పాజిటివ్ ఆటిట్యూడ్... నిత్యం ఎదురయ్యేవే. కానీ జీవితంలో జనం నిశితంగా పరిశీలించని అంశాలను దృశ్యకావ్యంగా మలిచారు ప్రసాద్. ఓ ప్రైవేటు సంస్థలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తూనే... ప్యాషన్‌తో డాక్యుమెంటరీస్‌ను ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఆ షార్ట్‌ఫిల్మ్స్ పరిచయం క్లుప్తంగా....
నరత్వ: తన వరకూ వస్తే గానీ మంచి చెడుల గురించి ఆలోచించనితత్వం గురించి ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ప్రసాద్ ఆర్ భట్టు. ఎంతటి అఘాయిత్యానికైనా వెనుకాడని ఓ వీధి రౌడీ... తన అన్న కూతురు అంటే మాత్రం పంచప్రాణాలు ఇస్తాడు. జీవితంలో తను చేస్తున్న దారుణాల గురించి ఏనాడూ ఆలోచించని ఆ వ్యక్తి... ఆ చిన్నారి కొన్ని రోజుల పాటు తనతో మాట్లాడకపోవటం, అన్నం తినకపోవటం బాధ కలిగిస్తుంది. పాప మౌనానికి కారణం తెలుసుకుని పశ్చాత్తాప పడతాడు. తన దుర్మార్గాలనుంచి బయటపడతాడు.
ఏ డే ఇన్ ఎంప్లాయీస్ లైఫ్
తెల్లవారి లేచింది మొదలు, ప్రతి ఒక్కరి జీవితంలో పరుగులకు కారణం ఉద్యోగం. అయితే ఉద్యోగ బాధ్యతను నిర్వహిస్తున్న సమయంలో ఎన్ని బాధ్యతారహిత పనులు చేస్తుంటామో ఎప్పుడూ మనని మనం గమనించుకోము. తోటి వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించటం నుంచి, వాష్‌రూమ్‌లో ట్యాప్ కట్టేయక పోవడం వరకూ మన బాధ్యత కానట్లుగానే వుంటాం. ఈ చిన్న విషయాలు నేరాలు కావు. కానీ విస్మరించాల్సినవీ కావు. ఇలాంటి అంశాలనే కూర్చి బాధ్యతను గుర్తుచేసే ప్రయత్నం చేశారు.
కీ: బ్యాచులర్ లైఫ్‌లో జరిగిన ఒక చిన్న కామెడీ సంఘటన. విషయం పూర్తిగా వినకపోవటం వల్ల, ఫ్రెండ్ రమ్మన్న చోటుకి కాకుండా వేరే రూమ్‌కి వెళ్లిన అబ్బాయి గతి ఏమైంది? అనేది ఈ షార్ట్‌ఫిలిం కథ. సరదాగా సాగే ఈ షార్ట్‌ఫిలిం బ్యాచ్‌లర్స్ రూం కీని ఎక్కడ దాస్తారనే సీక్రెట్‌ని రివీల్ చేస్తుంది. చివరిదాకా చూస్తే కాస్త నవ్విస్తుంది కూడా.
హోప్: ఉద్యోగవేటలో వున్న ఇద్దరు అబ్బాయిల గురించి సాగే కథ. అందులో ఒకరు ఆశావాది, మరొకరు నిరాశపరుడు. రెండు ఇంటర్వ్యూలకే విసుగెత్తి ఒకరు ఉద్యోగ ప్రయత్నాలు మానేస్తే, జాబ్ సాధించేదాకా ప్రయత్నం సాగించాలని మరొకరు యత్నిస్తారు. హోప్‌కి ఒక పాజిటివ్ యాంగిల్ ఇస్తుందీ చిత్రం.
ఐకమత్యం: వేరు చేసే ఆలోచనలు, కలత నిండిన మనసులు ఐకమత్యాన్ని కూల్చేస్తాయి. దేశ సమైక్యతను చిన్నాభిన్నం చేస్తాయి. ఇంతటి గంభీరమైన విషయాన్ని చాలా సింపుల్‌గా చూపించారు దర్శకులు ప్రసాద్.
ఆసక్తితోనే...
‘నారాయణ మూర్తి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక సినిమా తియ్యడానికి తాను పడిన తపన, కష్టం గురించి చెప్పారు. ఆయన మాటలు నన్ను చాలా ఇన్‌స్పైర్ చేశాయి. ఏ బ్యాక్‌గ్రౌండ్, సపోర్ట్, ట్రెయినింగ్ లేకపోయినా షార్ట్ మూవీస్ అయినా తియ్యాలని అనుకున్నాను. అలా ఇప్పటికి 10 సినిమాలకు పైగా తీసాను. కరీంనగర్ జిల్లా రామగుండం దగ్గర చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నాకు ఫిలింమేకర్స్ ఎవరూ తెలియదు. అనుభవం కూడా లేదు. కేవలం ఆసక్తితో, ఫ్రెండ్స్ సహకారంతో జీరో బడ్జెట్‌లో సినిమాలు తీస్తున్నా’.
- ప్రసాద్, షార్ట్‌ఫిలిం డెరైక్టర్
show time
ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు.
వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’
పాఠకులకు పరిచయుం చేస్తాం. మెరుుల్ టు
sakshicityplus@gmail.com