సందేశమే చిత్రం
సమాజంలో ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య. అవగాహ లేక కొన్ని... ఆలోచన లేక కొన్ని... ప్రశ్నించేవారు లేక మరికొన్ని... సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. వీటిపై పోరాడాలనుకున్నాడు రాజశేఖర్‌రెడ్డి దొడ్డ. కానీ... తానొక్కడే ఎంత వరకు మార్పు తేగలడు! అందుకు తనముందున్న మార్గం దృశ్యమే అనుకున్నాడు. తద్వారానే కొంత మందినైనా ప్రభావితం చేయగలుగుతామనే ఆలోచన అతనిది. ఇంజనీరింగ్ పూర్తి చేసి నగరంలోని ప్రాసెస్ వీవర్ కంపెనీలో అసోసియేట్ డెవలపర్‌గా స్థిరపడ్డ రాజశేఖర్... సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్‌కు శ్రీకారం చుట్టాడు. ‘ఐయామ్ ఇండియన్ ప్రొడక్షన్స్’ను రెండేళ్ల కిందట నెలకొల్పి... దాని ద్వారా వీటిని చిత్రీకరించాడు. స్నేహితుడు శివనాగేంద్రతో పాటు మరో ముగ్గురు కలసి దీన్ని నడిపిస్తున్నారు. రాజశేఖర్ దర్శకత్వం, కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలో తీసిన మూడు చిత్రాల గురించి...
- వీఎస్
జీవించు...
సమస్యల్లో ఉన్నవారు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఓదార్చేవారు చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నా.. ఓ బలహీన క్షణంలో ఇలా నిర్ణయం తీసుకుంటున్నారు. సమస్యతో ఒత్తిడికి గురికాకుండా... ధైర్యంగా ఆ క్షణాన్ని అధిగమించాలనే సందేశాన్నిచ్చే చిత్రం ‘జీవించు’. శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదనే మార్గదర్శనం అందించేలా తీసిన ఈ లఘు చిత్రం నిడివి 12.4 నిమిషాలు.
అధ్యక్ష
‘ఇంకెంత కాలం ఇలా’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ వినూత్న కథనంతో సాగుతుంది. ప్రేమించిన అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేసే సమయంలో గొడవ జరుగుతుంది. అంతా అబ్బాయిదే తప్పంటారు. కొడతారు. మరో సన్నివేశంలో ఓ అమ్మాయి తనను ప్రేమించమని అబ్బాయి వెంట పడుతుంటుంది. ‘నాకు పెళ్లి కుదిరింది. వదిలెయ్’ అని చెప్పినా... అబ్బాయినే వచ్చి కొడతారు. అసలు విషయం తెలుసుకోకుండా... విచక్షణ మరిచి స్పందించవద్దనే కాన్సెప్ట్ ‘అధ్యక్ష’. ఎవరు తప్పు చేసినా అది తప్పే అనే చక్కని సందేశం ఇస్తుందీ ఫిల్మ్. ఇలాంటి విషయాల్లో ఆడవారే కాదు... మగవారూ బాధపడుతున్నారనేది రాజశేఖర్ అభిప్రాయం.
లాస్ట్ నైట్
బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్ కోసం కారులో బయలు దేరిన నలుగురు ఫ్రెండ్స్ మద్యం సేవిస్తుంటారు. నైట్ షిఫ్ట్‌లో ఆఫీసుకు వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బైక్‌ను ఢీకొడతారు. కిందపడిన ఉద్యోగిని పట్టించుకోకుండా నవ్వుకుంటూ వెళ్లిపోతారా ఫ్రెండ్స్. తరువాత బర్త్‌డే స్పాట్‌కు చేరుకుంటారు. పాప కేక్ కట్ చేస్తుండగా ఓ అనాథ వచ్చి ఆకలేస్తుంది, ఏమైనా పెట్టండంటాడు. ఆ కుర్రాళ్లు కోపంగా అతడి ముఖానికి కేక్ పులిమి తోసేస్తారు. చివరకు వారూ తినక, అనాథకూ పెట్టక కేక్ వేస్టయిపోతుంది. కానీ ఆ పాప తన వద్ద ఉన్న చాక్లెట్లు, బిస్కెట్లు అనాథకు ఇస్తుంది. షర్ట్ పోయిన ఆ పిల్లాడికి రగ్గు కప్పుతుంది. ఇది చూసిన ఆ కుర్రాళ్లు సిగ్గుతో తలదించుకుంటారు. పాప చేసిన పని తామెందుకు చేయలేకపోయామని ఫీలవుతారు. పార్టీల్లో మునిగితేలుతున్న యువత మానవత్వాన్ని మరిచిపోతుందనే విషయాన్ని చక్కగా చెబుతుందీ చిత్రం.
show time
ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు.
వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెయిల్ టు
sakshicityplus@gmail.com