ఐడియాతో వచ్చి పిక్చర్‌తో వెళ్లండి
చిన్న సినిమాలు తీయాలని, నటించాలని, టెక్నీషియన్స్ కావాలని స్వప్నిస్తున్నారా? మీ కలలను నిజం చేస్తోంది ఆక్టోపస్ స్టూడియోస్. నాలుగేళ్లుగా ధియేటర్ లవర్స్‌కి, షార్ట్‌ఫిల్మ్ మేకర్స్‌కు గైడ్‌గా వ్యవహరిస్తూ.. మంచి ఆలోచనతో వచ్చిన వారిని సక్సెస్‌ఫుల్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అయ్యే వరకూ కంటిన్యూయస్ సపోర్ట్ ఇస్తోంది.
ఆక్టోపస్ స్టూడియోస్ ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్‌లు 16వ స్క్రీనింగ్ శుక్రవారం జరిగింది. ‘ద డార్క్ అండ్ బ్యూటిఫుల్’ (డీఐబీ) ఫొటోసిరీస్ ద్వారా ఆక్టోపస్ స్టుడియో బృందం శుక్రవారం సాయంత్రం లామకాన్‌లో ఫిలింల గురించి ‘షార్ట్ ఈవెనింగ్’ ఏర్పాటు చేశారు. తమ స్టుడియో సహాయ సహకారాలతో రూపొందిన అవార్డ్ విన్నింగ్ చిత్రాలు హేపీ బర్త్‌డే, గుత్తి-ద రిడిల్ ప్రదర్శించారు.
ఆదర్శ్ బాలకృష్ణ, రవి కిరణ్ రాజు, నిజం పరి, అభిరూప్ బసు, సుదీప్ కుమార్ టి.జి, సామిక్, వాలి తదితరులు తాము రూపొందించిన షార్ట్ ఫిలింస్ సంగతులను అభిమానులతో ముచ్చటించారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన మొత్తం 86 చిత్రాల నుంచి ఎంపిక చేసిన ఏడు చిత్రాలను ప్రదర్శించినట్లు ఆక్టోపస్ నిర్వాహకుడు రాహుల్ తెలిపారు.
కాస్త టచ్‌లో ఉంటుంది..
షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించాలనుకునే వారికి తగిన వాతావరణం కల్పించడం, స్క్రిప్ట్‌కు ముందు-తర్వాత, ప్రొడక్షన్ టీ, నటీనటుల ఎంపిక, పోటీలకు పంపే విధానం, ప్రదర్శించే వేదికలను సూచించడం తదితర అంశాలపై తమ స్వానుభవాలను రాహుల్ వివరించారు. ఏదైనా ఇతివృత్తాన్ని షార్ట్ ఫిల్మ్‌గా రూపొందించాలని భావించేవారు తమ ఆలోచనను ఆక్టోపస్ స్టుడియోకు పంపాలని, ఏ వాణిజ్య సంస్థలకూ సంబంధం లేని నిపుణుల బృందం వీటిని పరిశీలించి తగు సూచనలతో, సహకారంతో, షార్ట్ ఫిల్మ్ రూపొందేవరకూ వెబ్‌సైట్ (www. octopusstudios.in/ shortfilms.php)ద్వారా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుందని వివరించారు. ఎమోషనల్, పబ్లిక్ రిలేషన్స్, వివాహేతర సంబంధాలు, మనసుకు నచ్చిన చాయ్ గురించి తీసిన షార్ట్‌ఫిల్మ్‌ల తయారీ నేపథ్యాన్ని వివరించారు.