
పెద్ద దర్శకులు కూడా ఊహించలేకపోయారు!
‘‘ఈ చిత్రకథకు ఎస్టాబ్లిష్‌డ్ హీరోలు, విలన్లు, కమెడియన్లు అవసరం లేదు. రెగ్యులర్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సస్పెన్స్, కామెడీతో సాగే మంచి కమర్షియల్ మూవీ. సక్సెస్‌పరంగా ఇప్పటివరకూ ఏ సినిమాకీ కలగనంత నమ్మకం ఈ సినిమాతో కలిగింది’’ అని సుధీర్‌బాబు అన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సుధీర్‌బాబు, వామిక జంటగా విజయ్‌కుమార్, శశిధర్ నిర్మించిన ‘భలే మంచి రోజు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మనోభావాలు...
► ఈ చిత్రనిర్మాతలు విజయ్, శశి నా కాలేజ్‌మేట్స్, అలాగే రూమ్మేట్స్ కూడా. కృష్ణగారికి విజయ్ పెద్ద ఫ్యాన్. ఆయన డైలాగ్స్ అప్పజెబుతుండేవాడు. హీరోగా నన్ను బాగా ప్రమోట్ చేయడం కోసమే వాళ్ళు ఈ సినిమా తీశారు. బడ్జెట్ ఎక్కువ పెట్టొద్దన్నప్పటికీ రాజీపడలేదు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నిటిలోకీ ఇదే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ.
► శ్రీరామ్ ఆదిత్య చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూశాను. కేవలం కుర్చీలు, బల్లలు, ఫ్యాన్స్‌తో తను తీసిన ఓ థ్రిల్లర్ నాకు చాలా నచ్చింది. అందుకే తన దర్శకత్వంలో చేయాలనుకున్నాను.
► ఈ చిత్రకథను ఎంత పెద్ద దర్శకుల దగ్గర చెప్పినా, తర్వాతి సీన్ ఏమిటనేది ఊహించలేకపోయారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగే కథ ఇది. బెంజ్ షోరూమ్‌లో పని చేసే అబ్బాయి పాత్ర నాది. ఇంట్లో నుంచి బయటకెళ్లిన ఆ అబ్బాయి ఎలాంటి వ్యక్తులను కలుస్తాడు? తర్వాత జరిగే పరిణామాలేంటి? అనేది ఆసక్తిగా ఉంటుంది.
► హీరోను కాకముందు నేను, యూవీ క్రియేషన్స్ వంశీ, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన విజయ్‌తో కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లం. హీరో ప్రభాస్‌కి వంశీ మంచి స్నేహితుడనే విషయం తెలిసిందే. వంశీ ద్వారా ప్రభాస్‌తో ఈ సినిమా గురించి చెప్పాం. పూర్తి సినిమా చూడలేదు కానీ, ప్రభాస్ దాదాపు చూసినట్లే. మహేశ్‌బాబు ఇంకా చూడలేదు. ‘ఈ సినిమా తర్వాత సుధీర్ స్టార్ హీరో అవుతాడు’ అని మహేశ్ అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నా మీద తనకంత నమ్మకం.
► ప్రస్తుతం హిందీలో ‘భాగీ’ అనే సినిమాలో విలన్‌గా చేస్తున్నాను. హీరోగా ఇప్పటివరకూ చేయనంత స్ట్రాంగ్ రోల్ అది. చెప్పాలంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కు ప్రిపేర్ అయినట్లుగా ఈ సినిమా కోసం చాలా శ్రద్ధగా ప్రిపేర్ అయ్యాను.