
ఆ రోజు భలే మంచి రోజు
‘భలే మంచి రోజు.. పసందైన రోజు.. వసంతాలు పూసే నేటి రోజు’... ఈ పాట వినపడగానే మనకు గుర్తొచ్చే చిత్రం ‘జరిగిన కథ’. సూపర్‌స్టార్ కృష్ణ, జగ్గయ్య, కాంచన నటించిన ఈ చిత్రంలోని పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే! ఇప్పుడా పాట గురించి ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. ఈ సూపర్ హిట్ సాంగ్ టైటిల్ వచ్చేట్లుగా కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు నటించిన చిత్రం ‘భలే మంచి రోజు’. వామిక హీరోయిన్‌గా నటించారు.
70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్యని ద ర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్‌కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇటీవల మహేశ్‌బాబు చేతుల మీదుగా విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
ఆయనతో విడుదలను చేయించడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ వచ్చింది. దీంతో సినిమా బిజినెస్‌కు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఒక్క రోజులో జరిగే కథనంతో ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో నిర్మించాం. ఆ రోజు ఎందుకు మంచి రోజు అయ్యింది? అనేది ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శామ్‌దత్, సంగీతం: సన్నీ యమ్.ఆర్.