చిత్రమైన నిశ్శబ్ద లఘు చిత్రం!
ఆ మధ్య కమల్‌హాసన్‌తో కలసి తమిళంలో ‘ఉన్నై పోల్ ఒరువన్’, తెలుగులో ‘ఈనాడు’ చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు చక్రి తోలేటి గుర్తున్నాడా? హిందీ హిట్ ‘ఎ వెడ్నెస్ డే’ను అలా రెండు భాషల్లో రీమేక్ చేసిన చక్రి చిన్నప్పుడు ‘సాగర సంగమం’ చిత్రంలో ఓ బుజ్జి కెమేరా పట్టుకొని, ‘‘భంగిమ’’ అంటూ తిరిగిన బాల నటుడు. పెద్దయ్యాక, దర్శకుడయ్యాడు. తాజాగా చక్రి ‘అన్‌రీడ్’ అనే మాటలు లేని ఓ సెలైంట్ లఘు చిత్రం రూపొందించాడు. దీన్ని బ్లాక్ అండ్ వైట్‌లో, కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండే కెమేరాతో చిత్రీకరించారు. వీధుల్లో తిరుగుతూ, తిండి కోసం కష్టపడే ఓ అబ్బాయికి ఓ రోజు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలే ఈ చిత్రం. పాతకాలం పద్ధతుల్లో లాగా కెమేరా కదలకుండా స్థిరంగా ఉంటే, నటీనటులే ఫ్రేములోకి వస్తూ వెళుతూ ఉండేలా చిత్రీకరణ జరపడం కొత్త అనుభవమని చక్రి అన్నారు.
మనసుకు హత్తుకుపోయే కథతో లఘు చిత్రాలు తీయమంటూ సీగ్రామ్స్ సంస్థ ప్రసిద్ధ దర్శకులు అనురాగ్ కాశ్యప్, సుధీర్ మిశ్రా లాంటి వారితో పాటు చక్రిని కోరింది. అందులో భాగంగా చక్రి ఈ చిత్రం తీశారు. దీని చిత్రీకరణ కోసం మామూలు సినీ కళాకారులను కాకుండా, బస్తీలలోని వ్యక్తులను చక్రి ఎంచుకున్నారు. మూకీ చిత్రాల రోజుల్లో లాగా ఇందులోనూ సన్నివేశాల మధ్యలో సంభాషణల టైటిల్ కార్డులు వస్తూ, అప్పటి చిత్రాలను గుర్తుకు తెస్తుంటాయి. ‘బాక్సాఫీస్ లెక్కల ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా చిత్రీకరించే సౌకర్యం లఘు చిత్రాలకు ఉందని, ఇది మనసు పెట్టి చేసిన ప్రయత్నం అని’ చక్రి తోలేటి అన్నారు. ‘యు’ ట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ‘అన్‌రీడ్’ లఘు చిత్రం వీక్షకుల మనసుల్ని కూడా ఆకట్టుకుంటే చక్రికి అంతకంటే ఏం కావాలి!