
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. పేద వాడి నుంచి వీఐపీల వరకు స్వామి దర్శనం కోసం చాలా దూరం నుంచి వెళ్తుంటారు. అయితే, ప్రత్యేక దర్శన టిక్కెట్ల పేరుతో తనను మోసం చేశారని సినీ నటి పేర్కొన్నారు. స్వామిని దర్శించుకునేందుకు కొందరు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు కొంటే.. మరికొందరు సిఫార్సు లేఖలతో తిరుమల చేరుకుంటారు. ఇంకొందరు సరైన అవగాహన లేకుండా శ్రీవారి దర్శనం, సేవ, లడ్డూలు, గదుల కోసం దళారులను నమ్మి మోసపోతున్నారు. గతంలో ఏడాదికి 50-60 వరకు కేసులు నమోదవుతుండగా.. కేవలం ఈ రెండు నెలల్లోనే 30కి పైగా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించిన ప్రముఖ నటి 'రూపిణి'ని తిరుమల దర్శనం పేరుతో ఒకరు మోసం చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ముంబైలో కుటుంబంతో సెటిల్ అయిపోయారు. అయితే, ప్రతి ఏడాది ఆమె కుటుంబంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన శరవణన్ అనే వ్యక్తి ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి రూపిణిని సంప్రదించాడు. అందుకు గాను అతనికి రూ. 1.5 లక్షలు ఆమె బదిలీ చేశారు. అయితే, ప్రత్యేక దర్శనం టికెట్లు అతను పంపకపోవడంతో గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఆపై అతను ఫోన్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని రూపిణి గ్రహించారు. తనను మోసం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

1980ల చివరలో తమిళ సినిమా రంగంలో ప్రముఖ నటిగా రూపిణి రాణించారు. రజనీకాంత్‌తో కలిసి మనితన్ చిత్రంలో హీరోయిన్‌గా నటించించారు. ఒంటరి పోరాటం, గాండీవం వంటి తెలుగు సినిమాల్లో కూడా ఆమె కీలకపాత్రలలో నటించారు. మైఖేల్ మదన కామ రాజన్,విచిత్ర సోదరులు వంటి చిత్రాలలో కమల్ హాసన్‌తో నటించారు. 1995లో మోహన్ కుమార్‌తో వివాహం తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. ముంబైలో బాగా చదువుకున్న కుటుంబంలో జన్మించిన రూపిణి డాక్టర్ విద్యను పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment