హృదయ నగరం
వెరైటీ డ్రెస్సింగ్.. డిఫరెంట్ లుక్స్.. కిక్కిచ్చే డైలాగ్స్.. వెరసి సంపూ! ఉరఫ్ సంపూర్ణేష్ బాబు!! పొట్టి చిత్రాల ప్రపంచంలో రికార్డు లైక్స్ సంపాదించిన ఈ బుల్లోడు.. వెండితెరపై ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చిన్నతనంలో సిటీకి చుట్టపుచూపుగా వచ్చిన నాడే ఈ భాగ్యనగరంపై మనసు పారేసుకున్నాడు. అడుగడుగునా థియేటర్స్ ఉన్న ఒకప్పటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే మనోడికి ప్రాణం. ఇప్పుడన్ని థియేటర్లు లేకపోయినా.. తన హృదయం ఎప్పుడూ ఐ లవ్ హైదరాబాద్ అంటుందని చెబుతాడు.
- శిరీష చల్లపల్లి
నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. నాపై వాటి ప్రభావమే ఎక్కువగా ఉండేది. మా ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మా బంధువులు ఉండేవారు. దీంతో మా ఫ్యామిలీ సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలే సినిమాలు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్లం. అప్పట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సూపర్‌గా ఉండేది. ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు ఆ థియేటర్లన్నీ మాల్స్‌లా మారిపోతున్నాయి. అప్పటి క్రాస్ రోడ్స్ మళ్లీ తీసుకురాలేం. కానీ, అక్కడి బావర్చి బిర్యాని టేస్ట్ మాత్రం ఇప్పటికీ మారలేదు.
పెద్దమ్మ తల్లో..
సాయంత్రం వేళలో ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాయి. కాస్త చీకటి పడ్డాక బిర్లా టెంపుల్‌కు వెళ్లి.. పై నుంచి లైట్ల వెలుతురులో మిరుమిట్లు గొలిపే సిటీని చూస్తే భలేగా ఉంటుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడికి తరచూ వెళ్తుంటాను. నా వరకైతే పెద్దమ్మతల్లి పవర్‌ఫుల్ దేవత. ఇలా కోరుకోగానే.. అలా తీర్చేస్తుంది.
గోల్కొండ చూడ పోత..
గోల్కొండ వెళ్తే ఫుల్ రిఫ్రెష్‌మెంట్ దొరుకుతుంది. కోట విశేషాలు గైడ్లు చెబుతుంటే.. ఐస్‌క్రీమ్ తింటూ అవి వింటుంటే ఆ మజాయే వేరు. ఇక రంజాన్ నెలలో చార్మినార్ అందాలు చూడాల్సిందే. అక్కడ షాపింగ్ సరదాగా ఉంటుంది. మక్కామసీద్ ముందుండే పావురాలు..ఎంతో హాయినిస్తాయి.
టేస్టీ సిటీ
సిటీలో ఒక్కో చోట ఒక్కో రుచి ఫేమస్. పూర్ణ టిఫిన్ సెంటర్లో దోశ అదుర్స్. ఉలవచారు రెస్టారెంట్‌లో చేపల పులుసు, బిర్యానీ అంటే చాలా ఇష్టం. అమీర్‌పేట చందనాబ్రదర్స్ బయట స్వీట్‌కార్న్, ఐస్‌క్రీమ్ అండ్ సోన్‌పాపిడి ఎంతో రుచిగా ఉంటాయి.
అవి చూడగానే చిన్నపిల్లాణ్ని అయిపోతాను. బేగంపేట లైఫ్‌స్టైల్ పక్కన ఉన్న ఫ్రాంకీ రెస్టారెంట్‌లో పనీర్ టిక్కా భలే ఇష్టం. సిటీవాసులు ఎంజాయ్‌మెంట్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఇక్కడే ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. నేను ఓషన్ పార్క్ వెళ్లానంటే ఓ పట్టాన బయటకు రాను.
కల్చర్ నేర్పింది..
హైదరాబాదీతో మాట్లాడుతుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. హైదరాబాదీలు మనస్ఫూర్తిగా మాట్లాడుతారు. ఇక్కడి జనాలు సిటీ కల్చర్‌లో పుట్టి పెరిగినా.. కొత్తగా వచ్చిన వారితో ఫ్రెండ్లీగా ఉంటారు. నేను సిటీ కల్చర్ వాళ్ల నుంచే నేర్చుకున్నాను.