ప్రతి శనివారంషార్ట్‌ఫిల్మ్‌ల ప్రదర్శన సైన్స్ సెంటర్‌లో మినీ థియేటర్ కొత్త దర్శకులకు ప్రోత్సాహం వచ్చే నెలలో ప్రారంభం రవీంద్రభారతి తరహాలో వరంగల్‌లో వేదిక
సాక్షి ప్రతినిధి, వరంగల్: షార్ట్‌ఫిల్మ్ మేకింగ్, సినీరంగంపై ఆసక్తి , సృజనాత్మకత ఉన్న వారు తమ ప్రతిభను చాటుకునేందుకు వరంగల్‌లో వేదిక సిద్ధమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయవంతమైన సినివారం కార్యక్రమాన్ని వరంగల్‌లో ప్రారంభించనున్నారు. తెలుగు మహసభల ప్రారంభోత్సవ సమయానికల్లా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
కొత్త టాలెంట్‌ను వెతికేందుకు..
కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర భాషా, సంస్కృతిక శాఖ సినివారం కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు షార్ట్‌ఫిల్మ్‌లను ప్రదర్శిస్తున్నారు. 2016 నవంబరు 12న ఈ సినీవారం కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకు వందకు పైగా షార్ట్‌ఫిల్మ్‌లను ఇక్కడ ప్రదర్శించారు. వీటిని చూసేందుకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ షార్ట్‌ఫిల్మ్‌లను చూడవచ్చు. ప్రదర్శన అనంతరం వాటిని రూపొందించిన వ్యక్తుల పరిచయం, షార్ట్‌ఫిల్మ్‌కి సంబంధించిన అంశాలపై వివరణ, కొత్త ఆలోచనలను వీక్షకులతో పంచుకోవచ్చు. కొత్త టాలెంట్‌ను వెతికి పట్టుకునేందుకు సినీరంగానికి చెందిన ప్రముఖులు ఈ షార్ట్‌ఫిల్మ్‌లు చూసేందుకు వస్తున్నారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో దీన్ని వరంగల్‌కు తీసుకువచ్చేందుకు రాష్ట్ర భాషా, సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సుముఖంగా ఉన్నారు.
వరంగల్‌లో
హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్ గుర్తింపు పొందింది. హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ సినీవారం కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అధికారులు అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించారు. హంటర్‌రోడ్డులోని రీజనల్ సైన్స్ సెంటర్‌లో ఉన్న మినీ ఆడిటోరియాన్ని ఎంపి క చేశారు. షార్ట్‌ఫిల్మ్ ప్రదర్శించేందుకు, తిలకించేం దుకు వీలుగా ఇందులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సంబంధి త శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా రు. సాధ్యమైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం నాటికి వరంగల్‌లో సినీవారం కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్‌లో పర్యాటక ప్రాంతాలు, చారిత్రక నేపథ్యం, ఎంజీఎం ఆస్పత్రి ఈ మూడు అంశాలపై షార్ట్‌ఫిల్మ్ పోటీలు పెట్టనున్నారు.
చక్కని వేదిక..
కొంత కాలంగా వరంగల్ నుంచి అనేక మంది కొత్త తరం దర్శకులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. అనేక మంది సినిమా, టీవీ రంగాల్లో రాణిస్తున్నారు. వెలుగులోకి రాకుండా తమ ప్రయత్నాలను కొనసాగించేవారు ఎందరో ఉన్నారు. వీడియో కెమెరాలు, నాణ్యతతో వీడియో తీసే మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ కారణంగా ఎడిటింగ్, మిక్సింగ్ వంటి ఎన్నో సేవలు సులభంగా లభిస్తుండడంతో షార్ట్ ఫిల్మ్ తీసేవారి సంఖ్య పెరుగుతోంది. వరంగల్ కేంద్రంగా దాదాపు 40 బృందాలు రెగ్యులర్‌గా షార్ట్‌ఫిల్మ్ తీస్తున్నారు. ప్రస్తుతం వీరందరూ యూట్యూబ్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా మలుచుకుని ప్రతిభను చాటుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో షార్ట్‌ఫిల్మ్‌లు ఇందులో అప్‌లోడ్ అవుతుండడంతో గుర్తింపు సాధించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో సినీ, టీవీ రంగాలకు సంబంధించిన ప్రధాన వేదికల్లో ప్రదర్శన చేసేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న ప్రతిభా వంతులకు సినీవారం కార్యక్రమం చక్కని వేదిక కానుంది.
Comments
Please login to add a commentAdd a comment