అత్యాధునిక, పరిశోధనల ఆధారిత ఉన్నత విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం
21వ శతాబ్దంలో భారత్ కీలకపాత్ర..
2047 నాటికి వికసిత్ భారత్
పరిశోధన, నవీన ఆవిష్కరణలకు రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి
బిహార్‌లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ప్రారంభం
రాజ్‌గిర్: అత్యాధునిక, పరిశోధనల ఆధారిత ఉన్నత విద్యా వ్యవస్థతో ప్రపంచంలోనే అతిముఖ్యమైన వైజ్ఞానిక కేంద్రంగా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎల్లప్పుడూ జిజ్ఞాస, ధైర్యసాహసాలు కలిగి ఉండాలని విద్యార్థులకు ఉద్బోధించారు. బిహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 10 రోజుల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చే అవకాశం దక్కడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. విజ్ఞానాన్ని అగి్నకీలలతో కాల్చి బూడిద చెయ్యలేమని, ఇందుకు నలంద విశ్వవిద్యాలయమే ఒక ఉదాహరణ అని చెప్పారు.
21వ శతాబ్దంలో భారత్ కీలక పాత్ర పోషించనుందని, ఆ శతాబ్దం ఆసియాదేనని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పునరుద్ఘాటించారు. విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలే ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్యాలుగా ఎదుగుతాయని, ఇది చరిత్ర చెబుతున్న సత్యం అని పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో మన దేశం ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్య హోదాను అనుభవించిందని గుర్తుచేశారు. అప్పట్లో నలంద, విక్రమశిల వంటి విద్యాసంస్థలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయన్నారు.
గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో మన వర్సిటీలు
భారత్‌ను ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా చిన్నారుల్లో నవీన ఆలోచనలను ప్రోది చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ల ద్వారా కోటి మందికిపైగా బాలలకు అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ప్రయోగాలు మన బాలబాలికల్లో సైన్స్ పట్ల ఉత్సకతను కలిగిస్తున్నాయని చెప్పారు.
పదేళ్ల క్రితం మన దేశంలో కేవలం 100 స్టార్టప్ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.30 లక్షలు దాటేసిందని హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పేటెంట్లు మనకు లభిస్తున్నాయని, రీసెర్చ్ పేపర్ల ప్రచురణలో ముందంజలో ఉన్నామని పేర్కొన్నారు. పరిశోధన, నవీన ఆవిష్కరణలకు మరింత ఊతం ఇవ్వడానికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ప్రకటించామన్నారు.
గత పదేళ్లుగా చూస్తే మన దేశంలో సగటున ప్రతి వారానికొక యూనివర్సిటీని నెలకొల్పినట్లు, ప్రతి పది రోజులకొక ఐటీఐని స్థాపించినట్లు తెలుస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. రెండు రొజులకొక అటల్ టింకరింగ్ ల్యాబ్, ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు ఏర్పాటయ్యాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం 23 ఐఐటీలు, 21 ఐఐఎంలు, 22 ఎయిమ్స్‌లు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మెడికల్ కాలేజీ సంఖ్య రెండింతలు అయ్యిందన్నారు.
నలంద మహా విహార సందర్శన
బిహార్ రాష్ట్రం నలంద జిల్లా రాజ్‌గిర్‌లోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలలో కూడిన నలంద మహా విహారను ప్రధాని మోదీ బుధవారం సందర్శించారు. ఈ కట్టడం విశేషాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ మహా విహార యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది.
మోదీ వేలిపై సిరా గుర్తు ఉందా?
నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ప్రారం¿ోత్సవంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీ ఎడమ చేతిని కొద్దిసేపు పట్టుకొని చూశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన మోదీ చూపుడు వేలిపై సిరా గుర్తు ఇంకా ఉందా? అని పరిశీలించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితీశ్ ఆకస్మిక చర్యకు మోదీ కూడా కొంత ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించారు. అంతేకాదు ఆయన వెనుక ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment